Leader Profile
-
ఎర్రజెండా నీడన చల్లని రంగన్న
జూలకంటి రంగారెడ్డి అంటే మిర్యాలగూడ ప్రజలకు బొత్తిగా అలవాటు లేని పేరు. వారిని ఆప్యాయంగా చూసుకునే రంగన్నగానే పరిచయం. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఎర్ర జెండా నీడన పేదల కన్నీళ్లను తూడుస్తూ వెళుతున్న నేత జూలకంటి రంగారెడ్డి. తన తండ్రి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమ స్పూర్తిని తీసుకుని ఎత్తిన ఎర్ర జెండాను నేటి వరకు మోస్తూనే ఉన్నాడు. కరుడుగట్టిన సీపీఎం నాయకుడు. తండ్రి చిన్నతనంలోనే చనిపోతే కుటుంబ భారాన్ని చూసుకుంటూనే, కష్టాలలో ఉన్న పేదల పక్షాన పోరాడారు. తన కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం, చిన్న చిన్న వ్యాపారాలు చూసుకుంటూనే రాజకీయాల వైపు అడుగులు వేశారు. పేదల కోసం పోరాడే క్రమంలో ఎన్నోఅవమానాలు, మరెన్నో ఒత్తిడులు, బెదిరింపులు.. అంతకు మించి కేసులు, కోర్టుల చుట్టు ప్రదక్షణలు... వేటికి బయపడని రంగన్న తను నమ్మిన సిద్ధాంతం వైపే అడుగులు వేశారు. రాష్ట్రంలో కమ్యూనిస్ట్లందరూ ఎవరి దారి వారు చూసుకుని వెళ్తుంటే తను మాత్రం ' సంపద అందరికి చేరాలన్నా, పేద, ధనిక వర్గాలు లేని సమసమాజ నిర్మాణం జరగాలన్నా మార్క్సిస్ట్ సిద్ధాంతాలతోనే సాధ్యమవుతుందని, పార్టీలో ఉండే వ్యక్తులు బలహీనులు కావచ్చు కానీ పార్టీ సిద్ధాంతాలు ఎప్పటికీ బలహీనం కావని నమ్మి' పోరాట పంథానే కొనసాగిస్తున్నారు. 1978 లో మొదటిసారి కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. అక్కడి నుంచి యువజన సంఘ నాయకునిగా, సీఐటీయూ (కార్మిక సంఘం) సభ్యులుగా, నల్గొండ జిల్లా కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్నారు. తన 40 ఏళ్ల ప్రజా ఉద్యమంలో పేదల విద్య, వైద్యం కోసం ఎనలేని కృషి చేశారు. తాను ఎమ్యెల్యేగా పనిచేస్తూ మిర్యాలగూడ నియోజకవర్గానికి నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్యారా సాగునీరు అందించేందుకు ఆమరణ నిరాహర దీక్ష చేసి బీడు భూములకు కృష్ణమ్మ నీటిని మలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో సీఎం సహయ నిధి చెక్కులను రాష్ట్రంలోనే అత్యదికంగా మిర్యాలగూడకు తీసుకెళ్లిన ఘనత ఆయన సొంతం. 2009 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం సీపీఎం పార్టీ తుడుచిపెట్టుకుపోయిన తను మాత్రం మిర్యాలగూడలో గెలిచారు. కుటుంబ నేపథ్యం : తండ్రి : జూలకంటి కాశిరెడ్డి పుట్టిన తేదీ : అక్టోబర్ 24, 1958 ఊరు : కొత్తగూడ (గ్రామం), తిప్పర్తి మండలం, నల్గొండ జిల్లా భార్య : సుజాత (ఒక కుమారుడు ఒక కుమార్తె) కుటుంబం : ఇద్దరు సోదరులు, ముగ్గురు సోదరిలు వృత్తి : వ్యవసాయం చదువు : స్కూల్ విద్య రాజకీయ నేపథ్యం : - 1994 లో మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం - 2004 లో రెండంసారి ఎమ్మెల్యేగా గెలిచారు - 2009 లో తిరునగరి గంగాధర్ (కాంగ్రెస్) పై గెలిచారు - ఆగస్ట్ 31, 2015 - సీపీఎం నల్గొండ జిల్లా కార్యదర్శిగా నియామకం - జూన్ 26, 2018 - ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు గృహ నిర్భంధం - ప్రస్తుతం సీపీఎం తరఫున మరోసారి మిర్యాలగూడ ప్రజలముందు నిలబడ్డారు. - విష్ణువర్ధన్ రెడ్డి.మల్లెల (ఎస్ఎస్ జే) -
జగిత్యాల జీవన జ్యోతి
భుజంపైన ఎప్పుడూ కండువా లేదా ఒక పంచె, తెల్లటి చొక్కా, పాంటుతో సాదాసీదాగా కనిపించే పౌరుడు. వృత్తి రీత్యా న్యాయవాది. రైతుబిడ్డ. కరీంనగర్ జిల్లాలోనే కాదు... రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నాయకుడు తాటిపర్తి జీవన్ రెడ్డి. వివాదరహితుడు. మృధుస్వభావి. జీవనన్నగా అందరికీ సుపరిచితుడు. అసెంబ్లీలో మాట్లాడినా, బయట మాట్లాడినా... " ఏదైతే ఉందో..." ఊతపదంతో చెప్పే విషయంలో వాడివేడిగా చెబుతున్న విషయంలో పస ఉంటుంది. రాజకీయాల్లో నిబద్దత కలిగిన నేత. ఎన్టీఆర్, నాదెండ్ల భాస్కర రావు, వైఎస్ఆర్ లాంటి ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసినా నిరాడంబర జీవితాన్ని గడుపుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తిత్వం ఆయనది. కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంట ఉండి మరీ కార్యాలయాలకు వెళ్లి పనులు చక్కబెట్టే మంచితనం ఆయన సొంతం. పార్టీ సమావేశాల కన్నా స్థానిక ప్రజల కార్యక్రమాలకు ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అసెంబ్లీ లోపల బయట ఎలాంటి వివాదాలు దరిచేరనివ్వని ఆయన.. ఆగస్టు సంక్షోభంలో నాదెండ్లవైపు నిలబడటం ఆయన రాజకీయ ప్రయాణంలో ఒక బ్రేక్ లా నిలిచిపోయింది. ఆ పరిణామం అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన జీవన్ రెడ్డి ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. వైఎస్ కేబినేట్ లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. జగిత్యాల నుంచి ఇప్పటికే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు ఏడోసారి అసెంబ్లీలో అడుగుపెట్టి రికార్డు సృష్టించాలని భావిస్తున్నారు. కుటుంబ నేపథ్యం : పేరు : తాటిపర్తి జీవన్ రెడ్డి పుట్టిన తేది : 5 జనవరి, 1952 ఊరు : బతికపల్లి, పెగడపల్లి మండలం, జగిత్యాల జిల్లా తల్లి దండ్రులు : లింగమ్మా, రామచంద్రారెడ్డి భార్య : అహల్యాదేవి (ముగ్గురు కుమారులు) చదువు : నిజాం కాలేజీ నుంచి బీఏ, ఉస్మానియా నుంచి ఎల్ ఎల్ బీ (జగిత్యాల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు) రాజకీయ ప్రస్థానం : - 1989 లో మొదటిసారిగా మల్యాల పంచాయతీ సమితి అధ్యక్షునిగా ఎన్నిక - 1983 లో టీడీపీలో చేరిక, జగిత్యాల నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీలో అడుగు, (ఎన్టీఆర్ కేబినేట్ లో ఎక్సైజ్ మంత్రిగా) - 1985 లో ఎమ్మెల్యేగా పోటీ చేసి, టీడీపీ అభ్యర్థి రాజేశంగౌడ్ చేతిలో ఓటమి - 1989 లో కాంగ్రెస్ నుంచి పోటీ గెలుపొంది రెండోసారి అసెంబ్లీకి - 1994 లో అన్యూహ్యంగా తెరపైకి వచ్చిన ఎల్.రమణ టీడీపీ నుంచి బరిలో దిగగా జీవన్‌రెడ్డి ఓటమి - 1996 లో రమణ ఎంపీకి వెళ్లడంతో అదే ఏడాది జగిత్యాల స్థానానికి ఉప ఎన్నికలు జరగ్గా టీడీపీపై జీవన్ భారీ మెజార్టీతో గెలుపు - 1999, 2004 లో జరిగిన ఎన్నికల్లో తిరిగి వరుస విజయాలు - 2006, 2008 లో కరీంనగర్ లోక్‌సభ స్థానానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ ఓటమి - 2009 లో జరిగిన ఎన్నికల్లో ఓటమి - 2014 లో టీఆర్ఎస్ గాలిని ఎదుర్కొని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు - 2014 నుంచి శాసనసభ కాంగ్రెస్ పక్ష ఉపనేతగా కొనసాగారు - వి. కుమారస్వామి (సాక్షి జర్నలిజం స్కూల్) -
బీజేపీ లక్ష్మణుడు
మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన డాక్టర్ కోవా లక్ష్మణ్ పేదల అభ్యున్నతి కోసం పాటుపడే వ్యక్తిత్వం కలవారు. చిన్నప్పటి నుంచి చదువుల్లో ముందంజలో ఉండేవారు. విద్యార్థిగా ఉన్నపుడే తాము ఎదుర్కొంటున్న సమస్యల పట్ల, విద్యా రంగంలో ఉన్న లోపాల పట్ల పోరాడారు. ఉస్మానియా యూనివర్శిటీలోనే ఎమ్మెస్సీ పూర్తి చేసి తర్వాత అదే యూనివర్శిటీ నుంచి జియాలజీలో డాక్టరేట్ అందుకున్నారు. చదివిన చదువుతోనే ఉన్నతమైన ఉద్యోగ అవకాశం వచ్చినప్పటికీ రాజకీయాలంటే తీవ్ర ఆసక్తి ఉండడంతో దానిని వదులుకున్నారు. విద్యార్థి వయసులోనే ఉస్మానియా ఏబీవీపీ ప్యానెల్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. 1980లో బీజేపీ పార్టీలో అడుగుపెట్టి అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థానానికి ఎదిగారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఒకసారి, అధికార ప్రతినిథిగా మూడు సార్లు తమ సేవలను అందించారు. రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా బీజేపీ చేపట్టిన పలు ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు. 1994లో శ్రీనగర్‌లో జాతీయ జెండా ఎగురవేయాలంటూ చేసిన దోడా సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1994లో ముషీరాబాద్ నుంచి మొదటిసారి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓటమిపాలయ్యారు. 1999లో తిరిగి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. బీజేఎల్సీ శాసనసభా పక్షం ఉపనేతగా ఉన్నపుడు ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి, ప్రజా ప్రయోజనాల గురించి లోతైన అంశాలు మాట్లాడేవారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి విస్తృత పర్యటనలు చేశారు. కేవలం మాటలు చెప్పడమేగాక వాటిని పాటించే వ్యక్తిగా ఆయన సుపరిచితుడు. యువకుడిగా ఉన్న రోజుల్లో హైదరాబాద్ లీగుల్లో క్రికెట్, జిల్లా స్థాయిల్లో వాలీబాల్ ఆడారు. పార్టీలో వివిధ స్థాయిలో సేవలు అందించడమే కాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, శాసనసభలో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించారు. ఇప్పుడు మరోసారి ముషీరాబాద్ నుంచి ఎన్నికల బరిలో దిగారు. లక్ష్మణ్ కుమారుడి వివాహంలో గవర్నర్ నరసింహన్ దంపతులు, కేసీఆర్ కుటుంబ నేపథ్యం : పుట్టిన తేదీ : 3 జూలై 1956 పుట్టిన స్థలం : హైదరాబాద్ తల్లిదండ్రులు : రాములు, మంగమ్మ భార్య : ఉమ (ఇద్దరు కుమార్తెలు - శ్వేత, శృతి, ఒక కుమారుడు -రాహుల్) చదువు : ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ ఇష్టమైన ఆటలు : క్రికెట్, వాలీబాల్ సందర్శించిన దేశాలు : సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, నేపాల్, చైనా, దక్షిణ కొరియా, యూఎస్ రాజకీయ ప్రస్థానం : - 1980 భారతీయ జనతా పార్టీలో చేరిక - 1995 - 99 బీజేపీ హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు - 1994 లో కాంగ్రెస్ అభ్యర్థి కోదండరెడ్డి చేతిలో ఓటమి - 1999 లో ముషీరాబాద్ నుంచి అసెంబ్లీకి ఎన్నిక - 2004,09 కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలయ్యారు - 2014 లో రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు - 2016 తెలంగాణ బీజేసీ రాష్ట్ర అధ్యక్షులుగా తిరిగి ఎన్నిక - పి. సృజన్ రావ్ (ఎస్.ఎస్.జే) -
గద్వాల 'అరుణ' పతాకం
రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చినప్పటికీ ఆ రంగంలో అడుగుపెట్టాక తనదైన గుర్తింపును తెచ్చుకున్నారు. తండ్రి, భర్త రాజకీయాల్లో అరితేరినవారే అయినప్పటికీ కాంగ్రెస్ లో తనకంటూ ప్రత్యేకతను నిలుపుకోగలిగారు. గద్వాల సంస్థానం నిజాం పాలనలో రాజకీయంగా ప్రత్యేక స్థానం పొందింది. నియోజకవర్గంగా ఏర్పడినప్పటి నుంచి గద్వాల కోటపై డీకే కుటుంబం తన పట్టును నిలుపుకుంటూ వస్తోంది. అక్కడి నుంచి అరుణ వరుసగా మూడుసార్లు విజయం సాధించి నియోజకవర్గంపై పట్టు సాధించారు. ఆమె మహబూబ్‌నగర్ రాజకీయాలలో ఫైర్‌బ్రాండ్‌గా నిలుస్తున్నారు. ఆమెను అభిమానించే వారు జేజమ్మ అని పిలుచుకుంటారు. ఆమె పుట్టింటి వారు, మెట్టినింటి వారు రాజకీయాలలో ఉన్నప్పటికీ అనేక ఓటముల తర్వాత గెలుపు రుచి చూశారు. పాన్‌గల్ మండలం జెడ్పీటీసీగా మొదటిసారి గెలిచిన ఆమె ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ గద్వాల జిల్లా సాధన కోసం పోరాటం చేసి విజయం సాధించానని చెప్పుకుంటారు. కాంగ్రెస్ లో కీలక నాయకురాలిగా ఎదిగిన అరుణ ఇప్పుడు మరోసారి గద్వాలలో పతాకం ఎగురవేయడానికి తాపత్రయపడుతున్నారు. పేరు : ధర్మవరపు కొట్టం అరుణ తల్లిదండ్రులు : చిట్టెం సుమిత్రమ్మ, నర్సిరెడ్డి, నలుగురు చెల్లెల్లు, ఇద్దరు తమ్ముల్లు పుట్టిన తేదీ : మే 4,1960 కుటుంబం : భర్త భరతసింహా రెడ్డి (మాజీ ఎమ్మెల్యే) ముగ్గురు కుమార్తెలు (స్రవంతి, శ్రుతి, స్నిగ్ధారెడ్డి) పుట్టింది : ధన్వాడ, నారాయణపేట అభిరుచి : కారు నడుపుతూ దూర ప్రయాణాలు చేయడం, సమాజ సేవ చదువు : ఇంటర్మీడియట్ (7వ తరగతి ధన్వాడ, 8వ తరగతి నుంచి మాడపాటి హన్మంతరావు స్కూల్) డీకే అరుణ కుమార్తె సిగ్నారెడ్డి ఎంగెజ్మెంట్లో వైఎస్ జగన్ రాజకీయ నేపథ్యం : -పాన్‌గల్ మండలం జెడ్పీటీసీగా పనిచేశారు. 1996 - మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరపున పోటీచేసి, కాంగ్రెస్ అభ్యర్ధి మల్లికార్జున్ పై ఓడిపోయారు. 1998 - మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓడిపోయారు. 1999 - గద్వాల అసెంబ్లీ నుంచి పోటి చేసి గట్టు భీముడు చేతిలో ఓడిపోయారు 2004 - కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో సమాజ్ వాది పార్టీ నుంచి పోటీ చేసి గట్టు భీముడుపై భారీ మెజారిటీతో గెలుపొందారు 2007 - పిబ్రవరి లో సమాజ్ వాది పార్టీ బహిష్కరించింది 2009 - అల్లుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పై గెలుపు. రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చిన్నతరహ పరిశ్రమలు, చక్కెర, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు 2014 - గద్వాల నుంచి హ్యట్రిక్ విజయాన్ని అందుకున్నారు 2016 - సెప్టెంబర్‌లో ప్రత్యేక జిల్లా సాధన కోసం జములమ్మ ఆలయం నుంచి అలంపూర్ జోగుళాంబ ఆలయం వరకు పాదయాత్ర చేశారు - విష్ణువర్ధన్ రెడ్డి.మల్లెల (ఎస్ఎస్ జే) -
అడ్వకేట్ నుంచి డిప్యూటీ స్పీకర్ దాకా...!!!
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి తొలి డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న పద్మాదేవేందర్ రెడ్డి 2001లో టీఆర్ఎస్లో చేరినప్పటి నుంచి ఆ పార్టీలో చురుకుగా పనిచేస్తున్నారు. వృత్తి రీత్యా న్యాయవాది అయిన పద్మా దేవేందర్ రెడ్డి రాజకీయాల్లో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అడ్వకేట్ గా పనిచేసిన అనుభవం ఆమెకు రాజకీయాల్లో కలిసొచ్చిన అంశం. టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పటకీ ఆమె మాత్రం తన ధైర్యం కోల్పోలేదు. ఆమె పోరాట పటిమ చూసి పార్టీయే దిగివచ్చింది. ఈ ఒక్క విషయం చాలు పద్మా దేవేందర్ రెడ్డి ఏంటో తెలుసుకోవడానికి! విద్యార్థి దశ నుంచే రాజకీయాలంటే ఆసక్తి కనబర్చిన పద్మా దేవేందర్ రెడ్డి రాజకీయాల్లోకి ప్రవేశించిన అనతి కాలంలోనే జెడ్పీటీసీ మెంబర్‌గా గెలిచి తన సత్తా చాటారు. పద్మా దేవేందర్ రెడ్డి చేరికతో బీజేపీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్న ఆమె భర్త కూడా టీఆర్ఎస్లో చేరిపోయారు. పెద్ద కుటుంబంలో జన్మించిన పద్మాదేవేందర్ రెడ్డి బాల్యమంతా ఊర్లోనే సాగింది. చిన్నప్పడు ఎప్పుడూ చదువులో ముందుండేవారు.చదువులో అందరికన్నా ముందుండాలనే పట్టుదలతో ఉండేవారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జన్మించిన పద్మా దేవేందర్ రెడ్డి చదువంతా కరీంనగర్ పట్టణంలోనే సాగింది. ఎల్ ఎల్ బీ పూర్తి కాగానే న్యాయవాద వృత్తి ప్రాక్టీస్ ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో దాదాపు మూడేళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 17 ఏళ్ల ప్రాయంలోనే వివాహం జరిగినప్పటికీ తాను మాత్రం లక్ష్యాన్ని పక్కన పెట్టలేదు. ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని కుంటుంబం నుంచి వచ్చిన పద్మాదేవేందర్ రెడ్డి రాజకీయ నేతగా నిలదొక్కుకోగలిగారంటే అది ఆమె సంకల్ప బలమే అని సన్నిహితులు చెబుతుంటారు. మంత్రివర్గంలో చేరాలని బలమైన ఆకాంక్ష ఉన్నప్పటికీ కేసీఆర్ సూచనల మేరకు డిప్యూటీ స్పీకర్ పదవిని స్వీకరించారు. బాధ్యతలను నిర్వర్తించడంలో కష్టపడే తత్వం పద్మా దేవేందర్ రెడ్డిది. ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఉద్యమంలో భాగంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో కలసి సిద్దిపేట నుంచి వరంగల్ వరకు సైకిల్ యాత్రలో పాల్గొని ఏ విషయంలోను మహిళలు పురుషుల కన్నా తక్కువ కాదని చాటి చెప్పారు. కుటుంబ నేపథ్యం : పేరు : మాధవరెడ్డిగారి పద్మా దేవేందర్ రెడ్డి జన్మస్థలం : ఉమ్మడి కరీంనగర్ జిల్లా పుట్టిన తేదీ : జనవరి6,1969 తల్లిదండ్రులు : విజయా రెడ్డి,భూమి రెడ్డి చదువు : బీ.ఏ ఎల్.ఎల్.బి (ఉస్మానియా యూనివర్సిటీ) వివాహం : 22 పిబ్రవరి,1988 భర్త : ఎం దేవేందర్ రెడ్డి కుటుంబం : కుమారుడు పునీత్ రెడ్డి రాజకీయ నేపథ్యం : ►2001 లో టీఆర్ఎస్ ద్వారా రాజకీయాల్లోకి రంగ ప్రవేశం ►2001 లో మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో రామాయంపేట నుంచి జెడ్పీటీసీగా గెలుపు (జెడ్పీలో పార్టీ ఫ్లోర్ లీడర్ కూడా) ►2004 లో రామాయంపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక ► 2008 ఉప ఎన్నికల్లో ఓటమి (ఉద్యమంలో భాగంగా పదవి రాజీనామా, తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి) ► 2009 లో ఎన్నికల్లో ఓటమి ►2009 లో టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ (కూటమి పొత్తుల్లో భాగంగా టీఆర్ఎస్ అథిష్టానం టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు) ► 2010 లో తిరిగి పార్టీలో చేరిక ► 2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి గెలుపు (మళ్లీ ప్రస్తుత ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ) ►2014-2018 తెలంగాణ తొలి డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. ఎ.రమణా రెడ్డి (ఎస్.ఎస్.జే) -
రాజకీయాల్లో ' గీత ' దాటని నేత
మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహా మహిళ, చట్టసభల్లో ప్రత్యర్థుల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పగలరు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన సంవత్సరమే ఆమె జన్మించినప్పటికీ బాబ్డ్ హేర్ తో ఆధునికంగా అనిపించినా ఎంతో సంప్రదాయం కలిగిన మహిళా నేత. ప్రముఖ నాయకురాలు ఈశ్వరీబాయి కుమార్తె డా.జెట్టి గీతారెడ్డి. చిన్నప్పడు ఆమెకు అమ్మ మాటే వేదం. అందుకే తన తల్లి స్థాపించిన ఆసుపత్రిలో తన భర్తతో కలిసి చాలా రోజులు ప్రసూతి వైద్య నిపుణురాలుగా పనిచేశారు. డా. రామచంద్రారెడ్డిగాతో ప్రేమ వివాహం చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి ఎవరి మీద ఆధారపడకుండా జీవించడం అలవరుచుకున్నారు. రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారు. ఆస్టేలియా, లండన్‌లో పైచదువుల అనంతరం సౌది అరేబియాలో కొంతకాలం పనిచేశారు. మీలాంటి వారు ఇండియాలో గొప్పవైద్యులుగా పనిచేయాలని ఇందిరాగాంధీ పిలుపు మేరకు ఇక్కడకొచ్చి వృత్తిని కొనసాగించారు. రాజీవ్‌గాంధీ సహకారంతో కాంగ్రెస్ పార్టీలోకి రాజకీయ ప్రవేశం చేశారు. కులరహిత సమాజానికి, మహిళల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. కాంగ్రెస్‌కు కంచుకోటలాంటి జహీరాబాద్ నియోజకవర్గాల్లో వరుసగా విజయం సాధించారు. వివిథ శాఖల మంత్రిగా పనిచేసిన మహిళగా గీతారెడ్డి గుర్తింపు పొందారు. కుటుంబ నేపథ్యం : పేరు : డా.జెట్టి గీతారెడ్డి జననం : 1947 జన్మస్ధలం : సికింద్రాబాద్ తల్లిదండ్రులు : ఈశ్వరీబాయ్, లక్మీనారాయణ్ కుటుంబం : 1971 డా. రామచంద్రారెడ్డితో ప్రేమ వివాహం, సంతానం ఒక కుమార్తె (మేఘన) చదువు : ఎంబీబీఎస్, గాంధీ మెడికల్ కాలేజ్, ఎంఆర్సిఓజి లండన్ నేపధ్యం : తల్లి ఈశ్వరీబాయ్ (రిపబ్లికన్ పార్టీ) వైద్యం, సాంఘిక సేవారంగాల్లో అవగాహన వ్యక్తిగత ఇష్టాలు : అభిమాన నేత : ఇందిరా గాంధీ, సోనియా గాంధీ స్పూర్తి ప్రధాత : ఈశ్వరి భాయి (అమ్మ) దైవం : సత్య సాయిబాబా నచ్చేరంగు : నలుపు మినహ అన్నిరంగులు నచ్చిన సినిమా : చివరకు మిగిలేది, మదరిండియా నటీనటులు : సావిత్రి , ఎన్టీఆర్, దిలీప్‌కుమార్ రాజకీయ నేపథ్యం : ► 1986 రాజీవ్‌గాంధీ సహకారంతో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ► 1989 గజ్యేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం ► 1989-94 సాంఘిక సంక్షేమం, సెకండరీ ఎడ్యుకేషన్ మంత్రిగా ► 1994 గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి ► 1995-98 కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ► 1999 గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి ► 2000-04 మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎన్నికల్లో విజయం ► 2004-09 టూరిజం శాఖామంత్రి ► 2009 జహీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం ► 2009-10 సమాచార, సాంస్కృతిక, ఎఫ్డీసీ, పురావస్తు, మ్యూజియమ్స్ & ఆర్కివ్స్, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి ► 2010-14 భారీ పరిశ్రమల శాఖ, చక్కెర, వాణిజ్యం, ఎగుమతులు శాఖల మంత్రి ► 2014 కాంగ్రెస్ పార్టీ నుంచి జహీరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపు ► 2016 తెలంగాణ తొలి మహిళ పిఏసీ చెర్మైన్‌గా భాధ్యతలు ► 2018 కాంగ్రెస్ పార్టీ నుంచి జహీరాబాద్ నియోజకవర్గం పోటీలో ఉన్నారు అవార్డులు ► మహిళా శిరోమణి అవార్డు, యూనిటీ అవార్డు ఫర్ నేషనల్ఇంటిగ్రేషన్ ఫోరం, ఇందిరాగాంధీ సద్భావన అవార్డు, మిలీనియం స్టార్ అవార్డు, బెస్ట్ ఇన్వ్‌స్ట్‌మెంట్ స్టేట్ అవార్డు -కొండి దీపిక ( ఎస్ఎస్జె ) -
కమ్యూనిస్టు కోటలో వెంకన్న
పోరాటాల ఖిల్లా... ఎన్నో ఉద్యమాలకు పురిటిగడ్డ. తెలంగాణలో నల్గొండ జిల్లాకు ఎంతో చరిత్ర ఉంది. అలాంటి జిల్లాలో విద్యార్థి దశ నుంచే నాయకుడిగా ఎదుగుతూ అందరి నోటా వెంకన్నగా పిలిపించుకుంటున్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సొంత పార్టీ నాయకత్వంపైన అయినా సరే చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చెప్పేస్తారు. నల్గొండ రాజకీయాల్లో ఇప్పుడు వెంకన్న తనదైన ముద్రను వేసుకున్నారు. తొలి నుంచి గమనిస్తే విభిన్న రాజకీయాలకు, అందులోనూ కమ్యూనిస్టుల కంచుకోట నల్గొండ నియోజకవర్గంలో నిలదొక్కుకోవడం మామూలు విషయం కాదు. 1994 వరకు కమ్యూనిస్టులదే నల్గొండ నియోజకవర్గం, కానీ 1999 నుంచి పరిస్థితి మారింది. అప్పటినుంచి వరుసగా కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి గెలుస్తూవస్తున్నారు. 1999 నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికే పట్టం కట్టారు. అప్పటి నుంచి ఈ సెగ్మెంట్లో ఆయనదే హావా. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గం ప్రతీ ఓటరుతో సత్సంబంధాలు ఉండటం ఆయనకు తిరుగులేని నాయకుడిగా నిలబెట్టిందని సన్నిహితులు చెబుతుంటారు. వెంకన్న విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉత్సాహాంగా పాల్గొనేవారు. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేయటం ఆయనకు కలిసొచ్చిన అంశం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఐ.టీ మంత్రిగా ఛక్రం తిప్పారు. ప్రస్తుతం ఐదవసారి ఇదే నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రతీక్ ఫౌండేషన్ ఎదిగిన కుమారుడు ప్రమాదంలో మరణించడం వెంకట్ రెడ్డికి జీవితంలో మరిచిపోలేని బాధను విగిల్చింది. అలాంటి బాధను మరెవరూ అనుభవించరాదని ఆ తర్వాత కాలంలో ఆయన కుమారుడు ప్రతీక్ పేరుతో ఫౌండేషన్ స్థాపించారు. 2012 ప్రతీక్ రెడ్డి మరణానంతరం కోమటి రెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాలగా మార్చారు. 3.5 కోట్లను వెచ్చించి బాలికల వొకేష్‌నల్ జూనియర్ కళాశాలను పుననర్నిర్మాన పనులు చేపట్టారు. ఫౌండేషన్ తరఫున ప్రతిఏటా టాపర్స్‌కు బంగారు పతకాలు, నగదు ప్రోత్సాహకాలు, జాబ్ మేళాలు, నిరుద్యోగులకు ఉపాది కల్పన, రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారికి వైద్య, రక్తదాన సేవలనందించటం, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాల నిర్వహణ వంటివి చేపడుతున్నారు. రాజకీయ నేపథ్యం : ► తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర ► తెలంగాణ కోసం 2010 మరియు 2011 అక్టొబర్‌లో రెండుసార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా ► 1999 లో ఎన్నికవ్వగానే ఉదయ సముద్రం ప్రాజెక్టుకు పూనుకున్నారు ► 1999, 2004, 2009, మరియు 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ కేబినేట్ లో ఐటీ మంత్రిగా పనిచేశారు. కుటుంబం నేపథ్యం : నియోజకవర్గం : నల్గొండ అసెంబ్లీ తల్లిదండ్రులు : పాపి రెడ్డి (రైతు) పుట్టిన తేది : 23 మే 1965 బ్రాహ్మాణ వెల్లెమ్లా గ్రామం, నార్కెట్‌పల్లి, నల్గొండ జిల్లా కుటుంబం : ఒక కూతురు, కుమారుడు (2011లో హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో కుమారుడు ప్రతీక్ రెడ్డి చనిపోయాడు) సోదరుడు : కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి, (మాజీ ఎంపీ,ప్రస్తుతం మునుగోడు బరిలో ఉన్నారు) ఉద్యోగం : నల్గొండ ఎమ్మెల్యే నివాసం : నల్గొండ, తెలంగాణ చదువు : 1986 లో బీఈ - సీబీఐటి, హైదరాబాద్. - జీ. రేణుక -
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్
హైదరాబాద్‌లో ఆతిథ్యమిచ్చే అన్ని వేదికల్లో ఆయన మాట్లాడుతారు. ఆంగ్ల భాష పటిమతో అందరిని మెప్పిస్తారు. తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. ఆయనే కల్వకుంట్ల తారక రామారావు. కానీ పాపులర్ అయింది మాత్రం కేటీఆర్. తండ్రి కేసీఆర్ బాటలో నడవాలని ప్రయత్నిస్తుంటారు. అమెరికాలో చేస్తున్న ఉద్యోగం వదిలి తెలంగాణలో తండ్రికి అండగా నిలబడ్డారు. సినీనటుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతో కేసీఆర్ తన కుమారుడికి తారక రామారావు అని నామకరణం చేశారు. ఆయన ఇప్పుడు తెలంగాణలోని యువకులకు రోల్ మోడల్ అయ్యారు. తన మాటలతో పత్యర్థులపై అలవోకగా యుద్ధం చేయగల నేర్పరి. ప్రత్యర్థులపై సందర్భోచితంగా విమర్శలు సంధించడంలో దిట్ట. వాక్చాతుర్యమే కాదు.. హావభావాల ప్రదర్శించడంలోనూ తండ్రిని పోలినట్టే ఉంటుంది. పరిపాలనలో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ యాపిల్, ఐకియా, ఉబర్ లాంటి పేరున్న అంతర్జాతీయ సంస్థలను హైదరాబాద్‌కు వచ్చేలా చేసీ పెట్టుబడులను పట్టుకొస్తున్న బిజినెస్ మ్యాన్‌గా మారిపోయారు. తెలుగులోనే కాకుండా ఆంగ్లంలోనూ అనర్గళంగా మాట్లాడగలరు. వేదికలపైనుంచి మాట్లాడటమే కాకుండా అవతలి వారిని మెప్పించగల నేర్పరి. నేరుగా కలుసుకోవడానికి వచ్చే వారికి అందుబాటులో ఉండరేనే విమర్శ ఉన్నప్పటికి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పొలిటిషన్. అమెరికాలొ ఉద్యోగం చేస్తున్న సమయంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రత్యేక తెలంగాణ కోసం జరుగుతున్న ఆందోళనలు, ఆ బాటలో తండ్రి కేసీఆర్ నిమగ్నమైన సందర్భం... ఆయనను ఉద్యోగం చేయనివ్వలేదు. ఆ పరిస్థితులే కేటీఆర్‌ని 2005లో భారత్‌కు రప్పించాయని చెబుతుంటారు. యూపీఏ ప్రభుత్వానికి రాజీనామా చేయడంతో పాటు ఉపఎన్నికలను ఎదుర్కొనాల్సిన పరిస్థితుల్లో తండ్రికి మద్దతుగా నిలిచి అనుకోకుండా రాజకీయ అరంగ్రేటం చేశారు. 2009లో సిరిసిల్లా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో శాసనసభకు ఎన్నికయ్యారు. 2014 లో రెండోసారి గెలిచి కేసిఆర్ ప్రభుత్వంలో సమాచార సాంకేతిక (ఐటీ), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, టెక్ట్సైల్స్ మరియు ఎన్నారై ఎఫైర్స్ మంత్రిగా పనిచేశారు పేరు : కల్వకుంట్ల తారక రామరావు పుట్టిన తేది : 1976, జూలై 24 రాజకీయ పార్టి : తెలంగాణ రాష్ట్ర సమితి తల్లి తండ్రులు : శోభ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) భార్య : శైలిమ, కొడుకు - హిమాన్షు, కూతురు - మహాలక్ష్మి సోదరి : కవిత (నిజామాబాద్ ఎంపీ) చదువు : ► గుంటూరు విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ ► నిజాం కాలేజీలో బీఎస్సీ మైక్రోబయాలజీ ► పుణె యూనివర్సిటీ నుంచి బయోటెక్నాలజీలో ఎమ్మెస్సీ ► న్యూయార్క్ సిటీ యూనివర్సిటీ నుంచి మార్కెటింగ్, ఈ-కామర్స్‌లో ఎంబీఏ ఉద్యోగం : లాజిస్టిక్ కంపెనీ ఇంట్రాలో తొలుత పార్ట్ టైమ్ ఉద్యోగం, తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యారు. సౌత్ ఏషియా రీజినల్ డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. రాజకీయ నేపథ్యం : ► 2009 లో సిరిసిల్లా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి స్వల్ప ఆధిక్యంతో ఎమ్మెల్యేగా విజయం. ►2014లో ఎమ్మెల్యేగా ఎన్నిక, తండ్రి కేసీఆర్ కేబినేట్ లో తొలుత ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి, జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం పంచాయతీరాజ్ మార్చి మున్సిపల్ వ్యవహారాల శాఖ బాధ్యతలు చేపట్టడం. ఆవార్డులు : ఇన్స్పిరేషనల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్, రిడ్జ్ స్కోచ్ చాలెంజర్ ఆఫ్ ది ఇయర్, ఐటీ మినిష్టర్ ఆఫ్ ది ఇయర్ - ఆర్ స్నేహలత (సాక్షి, జర్నలిజం స్కూల్) -
అణగారిన వర్గాల ఆశాకిరణం
పెద్ద ఆసామి కుటుంబంలో పుట్టినా పేద, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా. వెనుకబడిన తరగతుల కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న నాయకుడు. తండ్రి నుంచి దానగుణం, పోరాట భావజాలం, తల్లి నుంచి మొక్కవోని ధైర్యం, సేవాగుణాన్ని ఆర్జించిన వ్యక్తి. బీసీ హక్కులు సాధన కోసం సుమారు ఎనిమిది వేలకు పైగా ఉద్యమాలు, సభలు, సమావేశాలు నిర్వహించిన ఉద్యమనాయకుడు. నమ్మిన సిద్ధాంతం కోసం నిబద్ధతతో పనిచేస్తున్న నాయకుడే ర్యాగ కృష్ణయ్య .ఎమ్మెల్యే అయినా ఇప్పటికీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అద్యక్షుడు పనిచేయడమే ఆయనకు ఇష్టం. చాలా మంది ఆయనను బీసీ కృష్ణయ్య అని కూడా పిలుస్తుంటారు. ఎన్నో ఉద్యమాలు చేసినా ఒక్క అవాంచనీయ సంఘటన కూడా జరగకుండా చూసిన ఉద్యమ నాయకుడు. ఉద్యమ సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. 'అవమానాలను మానంగా మర్చుకున్నా, అపజయాలను జయాలుగా మార్చుకున్నా, విజయాలనే లక్ష్యంగా మార్చుకున్న విజయ సాధకుడిని నేను' అని అంటారాయన. అందుకే ఉద్యమాలు చేసే యువతకు మార్గనిర్దేశకుడు. తన విజయాలను చూసి గర్వపడుతున్నానని చెప్పుకుంటారు. చిన్న చిన్న ఉద్యమనాయకులకు స్పూర్తినిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్టీరామారావు పార్టీ పెట్టినప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిగెలుపొందాక మంత్రి పదవి ఇస్తామని చెప్పినా తన ఆశయం కోసం ఆ ప్రతిపాదనను వదులుకున్నారు. అందరి ముఖ్యమంత్రుల మన్ననలు పొందారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి ఇష్టమైన ఉద్యమ నాయకుల్లో కృష్ణయ్య ఒకరు. 'వ్యక్తిగతమైన అంశాలకి ప్రాధాన్యత ఇవ్వరు' అని దివంగతనేత ప్రశంసలను అందుకున్నారు. రాజకీయ నాయకుడిని కాదు ఉద్యమ నేతను అని ఇప్పటికీ చెప్పుకునే వ్యక్తి. తను టీడీపీలో ఉన్నప్పటికీ బీసీలకు అన్యాయం చేస్తే సహించేది లేదంటూ ఆ పార్టీకి ఎదురొడ్డిన నాయకుడు. బీసీలకు 50 శాతం రాజ్యాదికారం దక్కడమే తన లక్ష్యంగా ప్రకటించుకున్నారు. ఉద్యమ జీవితం : ► 1972 లో బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ విద్యార్ధి యూనియన్ సంఘానికి అద్యక్షుడు ► 1973 లో డిగ్రీ చదివే రోజుల్లో ఉస్మానియా విద్యార్ధి సంఘం నాయకుడిగా పనిచేశారు ► 1977 -1987 వరకు రాప్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్ధుల హక్కుల సంఘానికి అద్యక్షుడు ► 1980 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల్లో రిజర్వేషన్లు కోసం పోరాటం ► 1996 మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల కోసం పోరాటం ► 1989 నుంచి 1993 వరకు సర్పంచ్ ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల కోసం ఉద్యమం... ఫలితంగా బీసీలకు రిజర్వేషన్ల సౌకర్యం ► 1990 లో మండల కమిషన్ సిఫారసులను అమలు చేయాలని కోరుతూ రాష్ట్రంలో ఆందోళనలు ఉద్యమ ఫలితాలు : ► కృష్ణయ్య పోరాట ఫలితంగా వెనుకబడిన తరగతులు, తెగల సంక్షేమానికి సంబంధించి దాదాపు రెండు వేలకుపైగా జీవోలు జారీ ► ప్రభుత్వాలు అనేక సంక్షేమ భవనాల నిర్మాణాలు... రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేలకు పైగా బీసీ వసతి గృహాలు ఏర్పాటు ► సర్పంచ్ల చెక్ పవర్ కోసం పోరాటం ► సుదీర్ఘ పోరాట ఫలితంగానే పంచాయతీ ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల అమలు నేపథ్యం : పుట్టిన తేది : 13 సెప్టెంబర్ 1954 జన్మస్థలం : రంగారెడ్డి జిల్లాలోని రాళ్లగడుపల్లి తల్లిదండ్రులు : అడివప్ప, రాములమ్మ (పుట్టిన 12 ఏళ్లకే తల్లి చనిపోయింది) కుటుంబం : భార్య శభరీదేవి, కుమారుడు రుషి అరుణ్ (ఎంబీబీఎస్), కుమార్తె రాణి శ్వేతాదేవి (ఎంటెక్) విద్యార్హతలు : బీకాం., ఎల్ఎల్బీ, ఎంఏ, ఎంఫిల్ (ఉస్మానియా యూనివర్సిటీ) పత్రికలు : బీసీ గర్జన పత్రికకు సంపాదకులుగా పనిచేశారు ప్రస్తుతం : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిరుద్యోగుల సంఘర్షన సంఘానికి అద్యక్షుడు రాజకీయ నేపధ్యం : 2014 లో ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక ► ప్రస్తుతం మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పక్షాన పోటీలో ఉన్నారు - అఖిల్ (ఎస్ ఎస్ జే) -
పార్టీ ఆఫీసులోనే చదువు
నుదిటిపై బొట్టు. ఎప్పుడు చూసినా కనిపించే గడ్డం. తెలుపు లేదా కాషాయ వర్ణం కుర్తా... తో కనిపించే కుర్రాడే గంగాపురం కిషన్ రెడ్డి. ఎంతో సింపుల్ గా కనిపించే ఆయనను పార్టీలో అంతా కిషన్ అని పిలుస్తుంటారు. ఎదుటివారిని చిరునవ్వుతో పలకరించడం ఆయన నైజం. విలక్షణ శైలి. నిజాయితీగా బతకాలన్నదే ఆయన లక్ష్యం. జయప్రకాశ్ నారాయణ, స్వామి వివేకానంద ఆయనకు స్పూర్తి. పార్టీతో సుదీర్ఘ అనుభవం... అనుబంధం ఉన్న కిషన్ పార్టీ ఆటుపోట్లను ఎదుర్కొన్నవారే. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టడానికి ముందు అమెరికా ప్రభుత్వం దాదాపు తొమ్మిదేళ్ల పాటు వీసా ఇవ్వడానికి నిరాకరించింది. అయితే, అంతకుముందు 1994 లో ఆయన అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్ (ఏసీవైపీఎల్) కార్యక్రమంలో భాగంగా మోదీ అమెరికా పర్యటించారు. ఆ బృందంలో మోదీతో పాటు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అసెంబ్లీలో బీజేపీ పక్ష నేతగా అధికార పక్షంపై ధ్వజమెత్తేవారు. నియోజకవర్గం కేడర్ కు నిత్యం అందుబాటులో ఉండే నాయకుడు. పార్టీ కార్యాలయంలో పనిచేస్తూనే చదువుకొనసాగించారు. యువమోర్చాలో కీలక పాత్ర పోషించారు. బీజేపీ యువమోర్చా అధ్యక్షునిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదంపై సదస్సు నిర్వహించడం, 60 దేశాల నుంచి వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. పార్టీ అగ్రనేతలు వాజ్‌పేయి, అద్వానీలతో పాటు జాతీయస్థాయిలోని ఎంతో మంత్రి అగ్రనేతలతో పరిచయమున్న నేత. రెండుసార్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, బీజేపీ శాసనసభా పక్ష నేతగా వ్యవహరించారు. పేరు : గంగాపురం కిషన్‌రెడ్డి పుట్టిన తేది : 15 మే 1964 ఊరు : తిమ్మాపూరి గ్రామం, కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లా తల్లితండ్రులు : అండాలమ్మ, స్వామిరెడ్డి చదువు : సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ బాలానగర్‌లో టూల్ ఇంజనీరింగ్ డిప్లమో చదివారు. కుటుంబం : భార్య కావ్య, కుమారుడు తన్మయి, కుమార్తె వైష్ణవి ఆహార్యం : కుర్తా, పైజామా (తెలుపు రంగు అయితే ఇష్టం ) హాబీలు : టీవీ చూడడం, వార్తా పత్రికలు చదవడం వృత్తి : క్యాడిలా ఫార్మా సంస్థకు నగరంలో డిస్ట్రిబ్యూటర్ ముద్దు పేర్లు : బీజేపీ అగ్రనేతలంతా ముద్దుగా కిషన్ అని పిలుస్తారు రాజకీయాలకు రాక ముందు : బీజేపీలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ పార్టీ కార్యాలయంలో ఉంటూనే విద్యాభ్యాసం కొనసాగించారు రాజకీయ నేపధ్యం : ► ఇరవైతొమ్మిదేళ్ల కిందట అంటే 1980 లో బీజేపీ ఆవిర్భావం నుంచి చురుకైన కార్యకర్తగా పనిచేస్తున్నారు ► 2004 లో హిమాయత్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా అరంగేట్రం ► 2009, 2014 లో అంబర్‌పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక ► ఇష్టమైన ఆహారం : ఆన్నం, పెరుగు, సాంబారు - అఖిల్ (ఎస్ ఎస్ జే) -
పార్టీలో ఆయనే ట్రబుల్ షూటర్
తన్నీరు హరీష్‌రావు. తెలంగాణ రాజకీయాల్లో ఆయన గురించి తెలియనివారుండరు. పార్టీలో ఆయనను అందరూ ట్రబుల్ షూటర్ గా పిలుస్తారు. తండ్రి తన్నీరు సత్యనారాయణరావు వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగి. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి స్వగ్రామం. పాలిటెక్నిక్ డిప్లమో చదివేందుకు హైదరాబాద్ వచ్చారు. మేనమామ కేసీఆర్ ఇంట్లోనే ఉండేవారు. ఆయనకు రాజకీయ కార్యకలాపాల్లో చేయూతనందించేవారు. వ్యక్తిగత సహాయకుడిగా ఉంటూ నమ్మకాన్ని, అభిమానాన్ని సంపాదించుకున్నారు. అదే సమయంలో తన మిత్రులతో కలిసి చిట్‌ఫండ్స్, హోటల్ వ్యాపారాల్లోనూ భాగస్వామిగా ఉండేవారు. కష్టపడేతత్వమే ఆయన బలం ప్రజలు ఏమాలోచిస్తున్నారు, వారి ఆశలకనుగుణంగా మనమేం చేయొచ్చు, ఆ క్రమంలో ఏ అడుగువేయాలి, దానికి ఉపయోగపడే శక్తిసామర్థ్యాలు ఎవరి దగ్గర ఉన్నాయని అంచనా వేయడంలో హరీష్‌రావు దిట్ట. పనిపై అంచనా వచ్చిన తర్వాత లక్ష్యం చేరడానికి రేయింబవళ్లు కష్టపడేతత్వం ఆయనను విజేతగా నిలిపింది. అనుకున్న పని పూర్తయ్యేవరకు ఎన్ని గంటలైనా, ఎంత మందితోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా విసుగు, విరామం లేకుండా డీల్ చేయగలగడం హరీష్‌రావు ప్రధానబలం. ట్రబుల్ షూటర్. మన మాటలు వింటూనే మరో విషయం గురించి మనసులో ప్రణాళిక రచించడం ఆయన ప్రత్యేకత. కొత్త విషయం చెబుతున్నపుడు ఆసక్తిగా వినడం, తెలియని విషయాలపై అవగాహన పెంచుకోవడం ఆయనకు అలవాటు. రాజకీయ నాయకుడికి ప్రధానంగా ఉండాల్సిన అర్హత ప్రసంగం. 16 మంది శాసనసభ్యులు రాజీనామా చేసిన సందర్భంగా శాసనసభల్లో హరీష్‌రావు చేసిన ప్రసంగం గురించి కేసీఆర్ మాట్లాడుతూ హరీష్ ప్రసంగం నన్నే ముగ్ధుడ్ని చేసింది. తెలంగాణకు జరిగిన అన్యాయం, కాంగ్రెస్ చేసిన మోసం ప్రజలకూ అర్ధమైంది అని పొగిడారు. అద్భుతమైన వక్తగా పేరుగాంచిన కేసీఆర్ అందించిన ప్రశంస హరీష్ ప్రతిభకు నిదర్శనం. విమర్శలూ ఉన్నాయి.. అవసరం తీరిన తర్యాత హరీష్‌రావు ఎవరినీ పట్టించుకోరని పార్టీ నాయకులు, ఆయన సన్నిహితులు చెబుతుంటారు . అవసరమున్నప్పుడు ఎన్నిసార్లయినా ఫోన్లు చేస్తారని, అయితే ఆయన సాయం కోసం ఫోన్లు చేస్తే స్పందించరన్న విమర్శ సన్నిహితుల నుంచే వినిపిస్తుంది. కేసీఆర్ రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ చాలా చురుకైన పాత్రను నిర్వహించారు. 1999 ఎన్నికల తర్వాత కేసీఆర్‌కు మంత్రి పదవి రానపుడు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో తన వ్యాపారాల విస్తరణపైనే హరీష్‌రావు దృష్టి కేంద్రికరించారని టీఆర్ఎస్ ముఖ్యులు చెప్పుకుంటారు. హరీష్‌రావు పార్టీలోని కొందరితో కలిసి సొంత గ్రూపును కాపాడుకుంటుంటారన్న మాట కూడా వినిపిస్తుంటుంది. హరీష్‌లో అందుకు తగిన శక్తిసామర్థ్యాలున్నాయని కూడా పార్టీ నాయకులు అంగీకరిస్తారు. మనో సిద్దిపేట కేసీఆర్ రాజకీయ ప్రస్థానానికి ఆలంబనగా ఉన్న సిద్దిపేట నియోజకవర్గమే హరీషరావుకు వేదికైంది. సిద్దిపేట నియోజకవర్గానికి మూడుసార్లు ఉప ఎన్నికలు జరిగితే ఒకసారి కేసీఆర్, రెండుసార్లు హరీష్‌రావు ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో పోటీ చేసినపుడు కేసీఆర్ కంటే హరీషరావుకు ఎక్కువ మెజారిటీ వచ్చింది. 2004లో కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా, కరీంనగర్ ఎంపీగా ఎన్నికయ్యారు. సిద్దిపేటకు కేసీఆర్ రాజీనామా చేసి హరీష్‌రావును మంత్రిగా చేసి సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆ తరువాత ఉప ఎన్నికల్లో కూడా హరీష్‌రావుకే అధిక మెజారిటీ వచ్చింది. ప్రస్తుత ఎన్నికల గురించి ఎవరు లెక్కలేసుకున్నా టీఆర్ఎస్ గెలిచే మొదటి సీటు అంటే సిద్ధపేట అనే చెబుతారు. నేపథ్యం : జననం : జూన్ 3,1972 పుట్టిన స్థలం : కరీంనగర్ జిల్లా, బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామం తల్లిదండ్రులు : లక్ష్మీబాయ్, సత్యనారాయణరావు కుటుంబం : భార్య శ్రీనితారావు, కుమారుడు ఆర్చిస్మన్, కుమార్తె వైష్ణవి చదువు : కరీంనగర్ వాణినికేతన్ పాఠశాలలో ప్రాథమిక విద్య, కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ (బీఏ) రాజకీయ నేపధ్యం : ► సిద్ధిపేట నియోజకవర్గం నుంచి వరుసగా (2004, 2008, 2010 ఉప ఎన్నికల్లో 2009, 2014 సాధారణ ఎన్నికల్లో) ఎన్నిక. ► తెలంగాణ తొలి నీటి పారుదల శాఖ మంత్రి గా పనిచేశారు ► వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో యువజన శాఖ మంత్రిగా పనిచేశారు - కె అఖిల్ -
కాకలు తీరిన కాంగ్రెస్ యోధుడు
అవతలివారితో తప్ప ఆయనలో కన్ఫూజన్ ఉండదు. చెప్పాల్సింది విడమరిచి చెప్పేస్తారు. అజానుబాహుడు. ఆజాతశత్రువు... రాజకీయాల్లో పెద్దాయన. ఆయన వద్ద కంటెంట్‌కు కొదవలేదు. ఎదైన విషయం చెప్పల్సివచ్చినా, వ్యవహారం తేల్చుకోలేకపోయినా పార్టీ ఆయనకే మైక్ ఇస్తుంది. అటూ, ఇటూ తేల్చకుండా వెరైటిగా చెప్పడంలో ఆయన ఎక్స్పర్ట్. అర్థం చేసుకోవాలంటే తల కిందులుగా తపస్సు చేయాల్సిందేనని మీడియా ప్రతినిధులు చెబుతుంటారు. అదే విషయాన్ని ఆయన్ని అడిగితే అందులో కన్ఫూజన్ ఏమీ లేదంటూ మళ్లీ చెబుతారు. నిండుకుండలా తొణక్కుండా ఉండటం ఆయనకే సాధ్యం. ఉద్యమ సమయంలో ఆయన వైఖరే కాస్తో, కూస్తో కాంగ్రెస్‌కి కలిసి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసిన రికార్డ్ ఆయన సొంతం. వైరం లేకుండా ఉండి, లౌక్యంగా వ్యవహారం నడిపే జానారెడ్డికి పోటీ లేదు.నల్గొండలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. కాకలు తీరిన కాంగ్రెస్ యోధుడు. పార్టీ వారితోనే కాదు... పౌరహాక్కుల నేతలతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. జేఏసీ ఏర్పాటులో కీలకపాత్ర, ఇప్పటికీ కాంగ్రెస్‌కు పెద్ద దిక్కయ్యాడు. ఒక్క1994లో తప్ప వరుసగా ఎమ్యెల్యేగా గెలిచిన రికార్డు ఆయనది. చలకుర్తి నియోజకవర్గం ఆయన కంచుకోట. కమ్యూనిస్టు కోటలో కాంగ్రెస్ నేతగా ఎదిగారు. దివంగత కాసు బ్రహ్మానంద రెడ్డి రికార్డునూ బ్రెక్ చేశారు. వైఎస్ హాయంలో హోం శాఖలను నిర్వహించారు. తెలంగాణలో కీలక నేతగా ఎదిగిన జానారెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారినా జానారెడ్డి ఏ మాత్రం తన ప్రాభవాన్ని ప్రభావాన్ని కోల్పోలేదు. పూర్తి పేరు : కుందూరు జానా రెడ్డి తండ్రి : కే. వీరా రెడ్డి పుట్టిన తేది : 20 జూన్ 1946 స్వగ్రామం : అనుముల గ్రామం, (చలకుర్తి) నాగార్జున్ సాగర్, నల్గొండ కుటుంబం : భార్య సుమతీ సంతానం : రఘవీర్ రెడ్డి, జయ వీర్ రెడ్డి చదువు : హెచ్ ఎస్సీ అలవాట్లు : పున్తకాలు చదవటం నేపథ్యం : ఉపాధ్యయుడిగా మొదలు పెట్టిన ప్రస్థానం, ఎక్కువ కాలం మంత్రిగా ఆల్ టైం రికార్డు సొంతం చేసుకున్నారు.1973లో మొదలైన రాజకీయ ప్రస్థానం, మఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మినహా అన్ని పదవులు చేపట్టారు. ►1983 లో తొలిసారి ఇండిపెండెంట్‌గా గెలిచారు ►1985 లొ చలకుర్తి నియోజకవర్గం టీడీపీ తరపున గెలిచారు ► 1988 లో మంత్రివర్గం రద్దుతో ఎన్టీఆర్‌తో విభేదించి 'తెలుగు మహానాడు'పేరుతో పార్టీని స్థాపించాడు.తరువాత రాజీవ్‌గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో విలీనం చెశారు. ► 1994 లో తప్ప వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు ► 2004 లో హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ► 2009-2014 వరకు పంచాయితీ గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు - జీ. రేణుక -
హైదరా 'బాద్ షా' అక్బరుద్దీన్
ఆ నోటి వెంట ఒక ప్రవాహంలా వెలువడే మాటలు. అందుకు అనుగుణంగా గాంభీర్యం. హావభావాలు... సందర్భోచితంగా సామెతలు, ఉదాహరణలు... అసెంబ్లీలో ఆయన మాట్లాడుతున్నప్పుడు సభ దృష్టంతా ఆయనమీదే. ఘాటైన పదజాలంతో సూటిగా విమర్శలు ఎక్కుపెట్టగలరు. అంతే స్థాయిలో మాటల వివాదాల్లోకి వెళ్లగలరు. రెచ్చగొట్టే ప్రసంగాలు, వివాదాస్పద అంశాలు అక్బరుద్దీన్ ప్రత్యేకత. వివాదాల్లో కూడా సందర్భోచితంగానే తలదూర్చుతారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు వేడెక్కుతున్న తరుణంగా "రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరున్నా మాముందు తలవంచాల్సిందే... '' అంటూ కేడర్ ను రెచ్చగొచ్చగలరు. వివాదాస్పద కామెంట్లతో తరచూ వార్తల్లో నిలిచే అక్బరుద్దీన్ ఓవైసీ... 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు విజయం సాధించారు. ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తిహాద్ అల్ ముస్లిమీన్ (ఎంఐఎం) పార్టీ తరపున చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాలో ఎంబీబీఎస్ రెండవ సంవత్సరంలోనే ఆపేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తన సోదరుడు అసదుద్దీన్ ఓవైసీతో కలసి ఎంఐఎం పార్టీని నడిపిస్తున్నారు. డిసెంబర్ 22, 2012న అదిలాబాద్‌లో జరిగిన ఓ సభలో హిందూ దేవుళ్లు, దేవతల మీద చేసిన వ్యాఖ్యలు వివాదాస్సదమయ్యాయి. తమను పోలీసులు అడ్డుకోకుండా కేవలం 15 నిమిషాల సమయమిస్తే బిలియన్ హిందువులకు తమ పవర్ ఏంటో చూపిస్తానంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, తర్వాత వాటిపైన కేసులను ఎదుర్కొనడం సాధారణంగా మారింది. ఒకానొక కేసులో సమన్లకు సమాధానం ఇవ్వడంలో అక్బరుద్దీన్ విఫలం కావడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. 40 రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. వివాదాస్పద వ్యాఖ్యలు పక్కనపెడితే... అసెంబ్లీలో చేసే వాడివేడి ప్రసంగాలతో అక్భర్ అందరి దృష్టినీ ఆకర్షిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఒక సందర్భంగా అక్బర్ చెప్పిన పిట్టకథ నవ్వులు పూయించడమే కాకుండా సోషల్ మీడియాలో ఇప్పటికీ చెక్కర్లుకొడుతోంది. ""దర్బారులో ఒక గాయకుడు తన పాటలతో నవాబును ఆనందింపజేస్తాడు. పాటను మెచ్చిన నవాబ్ వాహ్వా... అతడికి ముత్యాలు ఇవ్వండి. అన్నాడు. దాంతో ఆనందపడిన గాయకుడు మరో పాట పాడడంతో సంతోషపడిన నవాబు అతనికి ఈసారి మణులు మాణిక్యాలు ఇవ్వండి అని అంటాడు. ఆ గాయకుడు ఇంకా సంతోషంగా ఇంకో పాట పాడగా... వజ్ర వైడుర్యాలు... భూములు.... నగలు... నజరానాగా ఇవ్వండని చెబుతాడు. ఆ గాయకుడు చాల సంతోషపడి, ఇంటికి వెళ్లి జరిగినదంతా చెప్పుకున్నాడు. అయితే ఎన్ని రోజులైనా నవాబు ప్రకటించిన బహుమతులు రాకపోవడంతో అతడు నవాబ్ దగ్గరకు వెళ్లి " జహాపనా ! మీరు ఇస్తామన్న ముత్యాలు, మణులు, మాణిక్యాలు, భూములు వగైరా ఏవీ కూడా నాకింతవరకు అందలేదని విన్నవించుకుంటాడు. అందుకు నవాబ్ ఇందులో ఇచ్చిపుచ్చుకోవడం ఏముంది. పాటలు పాడి మమ్మల్ని ఆనందింపజేశావు... అందుకు ప్రతిగా బహుమతులను ప్రకటించి నేను మిమ్మల్ని ఆనందింపజేశాను'' అని నవాబు నుంచి సమాధానం రావడంతో బిత్తరపోవడం గాయకుడు వంతవుతుంది. కేసీఆర్ ప్రకటించిన హామీల గురించి ప్రస్తావిస్తూ అక్బరుద్దీన్ చెప్పిన ఈ పిట్టకథ అప్పట్లో సభలో నవ్వులు పూయించింది. నేపథ్యం : జననం : జూన్ 14, 1970 పుట్టిన స్థలం : హైదరాబాద్ తల్లిదండ్రులు : సుల్తాన్ సలాఉద్దీన్ ఓవైసీ, నజీమా బేగం భార్య : సబీనా ఫర్జానా (1995 నుంచి) చదువు : పదవ తరగతి వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సెయింట్ మేరీస్ కళాశాలలో ఇంటర్మీడియట్, గుల్బర్గాలో ఎమ్‌బీబిఎస్ రెండవ సంవత్సరంలో మానేశారు. వృత్తి : రాజకీయం, ఓవైసీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ పార్టీ : ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తిహాద్ అల్ ముస్లిమిన్ కుటుంబీకులు : అసదుద్దీన్ ఓవైసీ (సోదరుడు), బుర్హనుద్దీన్ ఓవైసీ (సోదరుడు) ప్రస్తుత పదవి : ఎమ్మెల్యే పి. సృజన్ రావ్ -
స్థానికులకు అండగా కొండా
మాటల తూటాలు పేల్చగలరు. మనిషి చూడటానికి సున్నితంగా ఉన్నా, ప్రజల అన్యాయాలను ఎదురించడానికి ఎంత కష్టమైనా ఎదురించగల నారి. తన భర్త వలనే రాజకీయాల్లోకి అడుగుపెట్టినా, ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాణిరుద్రమదేవిని ఓరుగల్లులో తెలియనివారు ఎలా ఉండరో అలాగే కొండా సురేఖ పేరు కూడా తెలియనివారుండరు. ప్రత్యర్ధుల విమర్శలకు , ప్రశ్నలకు ధీటుగా సమాధానం చెప్పగల ధీర వనిత. మహిళగా రాజకీయాల్లో రాణించినప్పటికీ సాగిన ప్రయాణంలో అనేక ఆటుపోటులు తప్పలేదు. ఆడపడుచులుగా అండదండగా కొండా కుటుంబం ఎప్పుడూ ఉంటుందని అందులో తనదైన ముద్ర వేసుకోగలిగారు. చిన్నప్పటి నుంచి ఆటలలో, చదువులో నంబర్ వన్‌గా ఉంటూ కాలేజీలో తన సీనియర్ కొండా మురళిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. భర్తకి తోడుగా ఉంటూ ఒక మంచి గృహిణిగా పేరు తెచ్చుకున్నారు. కొండా దంపతులు అంటే వరంగల్ సూపర్ స్పెషల్ జోడి అని అంటుంటారు. తన లాగే తన కూతురిని పెంచారు. తన తర్వాత తన కూతురిని రాజకీయ వారసురాలుగా ప్రకటించారు. నేపథ్యం : తల్లిదండ్రులు : తుమ్మ చంద్రమౌళి, తుమ్మ రాద పుట్టిన తేదీ : 19 ఆగస్టు 1965 జన్మస్థలం : వరంగల్ జిల్లా ఊకల్ గ్రామం కుటుంబం : తండ్రి ప్రభుత్వ ఉద్యోగి వైవాహిక జీవితం : ఎమ్మెల్సీ కొండా మురళితో ప్రేమవివాహం. వీరికి ఒక కుమార్తె శ్రీమతి సుస్మిత పటేల్. చదువు : ఎల్పీ కాలేజీ నుంచి బీఏ డిగ్రీ వృత్తి : శాసనసభ్యురాలు, పరకాల అసెంబ్లీ నియోజకవర్గం. నివాసము : వంచనగిరి రాజకీయ జీవితం : ►1955లో మండల పరిషత్ కు ఎన్నికయ్యారు ►1996లో ఆమె ఆంధ్రప్రదేశ్ పి.సి.సి సభ్యురాలిగా నియమింపబడ్డారు ► 1999 లో ఆమె శాయంపేట నియోజకవర్గం నుండి శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు ►1999 లో ఆమె కాంగ్రెస్ లెసిస్లేచర్ పార్టీ కోశాధికారిగానూ మహిళ మరియు శిశు సంక్షేమశాఖ సభ్యురాలిగా, ఆరోగ్య మరియు ప్రాథమిక విద్య కమిటీ సభ్యురాలిగా పనిచేశారు ► 2000లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యురాలిగా నియమింపబడ్డారు. ► 2004లో శాయంపేట శాసనసభ్యురాలిగా ఎన్నిక ► కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ► 2005లో ఆమె మ్యునిసిపల్ కార్పొరేషన్ కు ఎక్స్ అఫీసియో సభ్యురాలిగా ► 2009 లో పరకాల శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యురాలిగా ► జూలై 4, 2011 న తన శాసనసభ్యత్వానికి రాజీనామా ► జూన్ 12,2012 న జరిగిన ఉప ఎన్నికలలో పరకాల అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ తరపున పోటీ ► జూలై 2013 న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ► టీఆర్ఎస్ లో చేరిక, వరంగల్ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి శాసన సభ్యురాలిగా ఎన్నిక ► తిరిగి కాంగ్రెస్‌లో చేరిక - ప్రస్తుత ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో.... - కొండి దీపిక -
ఆమె రాష్ట్రానికి హోం మినిస్టర్
భర్త ఆకస్మిక మరణం ఆమెను ఊహించని దారిలోకి నెట్టింది. రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో శరవేగంగా ఎదిగిన యువ నాయకుడు పట్లోళ్ల ఇంద్రారెడ్డి. ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయన భార్య సబిత రాజకీయాల్లోకి రావలసి వచ్చింది. నలుగురిని పలకరిస్తూ అప్పటివరకు ఒక గృహిణిగా ఎంతగానో ఆదరణ పొందిన ఆమెకు ఇంద్రారెడ్డి మరణంతో కోలుకోలేని దెబ్బతగిలింది. గృహిణి పాత్ర నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె అసలు రాణిస్తారా? అన్న సందేహం ఆరోజుల్లో చాలా మందికే వచ్చింది. అయితే అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. 2000 సంవత్సరంలో ఇంద్రారెడ్డి మరణించడంతో చేవెళ్ల నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించి రాజకీయ ప్రవేశం చేశారు. అప్పటి నుంచి ఆమె నియోజకవర్గం ప్రజలతో మమేకమయ్యారు. ఆ తర్వాత 2004 లో జరిగిన ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. రాజశేఖరరెడ్డి హయాంలో తొలిసారి రాష్ట్ర మంత్రిగా పని చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన అవకాశంతో ఆమె ఏకంగా హోం శాఖ మంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో భర్త ఇంద్రారెడ్డి హోం శాఖ నిర్వహించగా, వైఎస్ హయాంలో సబిత సైతం హోం శాఖ నిర్వహించడం విశేషం. 2008 లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో చేవెళ్ల ఎస్సీ రిజర్వుడ్ గా మారడంతో 2009 లో ఆమె మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సాహసోపేతమైన తన పాదయాత్రను చేవెళ్ల నుంచే ప్రారంభించారు. ఒక చెల్లిగా సబితపైన చూపిన అభిమానంతో వైఎస్ ఏ కార్యక్రమం చేపట్టినా చెల్లెమ్మె చేవెళ్ల నుంచి ప్రారంభించడం కూడా సబిత రాజకీయ కీర్తి మరింత పెరిగింది. ఈ కారణంగానే ఆమెకు చేవెళ్ల చెల్లెమ్మగా కూడా పేరొచ్చింది. 2014 ఓటమిని చవిచూసిన సబితా ఇంద్రారెడ్డి ఈసారి మహేశ్వరం నుంచి మళ్లీ బరిలో నిలిచారు. ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. కుటుంబ నేపథ్యం : భర్త : పి. ఇంద్రారెడ్డి (1954 - 2000) పుట్టిన తేదీ : 5 మే 1963 కుటుంబం : ముగ్గురు కుమారులు స్వస్థలం : కౌకుంట్ల గ్రామం, చేవెళ్ల జిల్లా నేపథ్యం : ఎన్టీ రామారవు కేబినేట్లో మంత్రిగా పని చేసిన ఇంద్రారెడ్డిని సబిత వివాహమాడారు విద్య : బీఎస్సీ రాజకీయ జీవితం : - 2000 చేవెళ్ల ఉపఎన్నిక విజయం సాధించి రాజకీయ రంగ ప్రవేశం - 2004 నుంచి 2009 చేవెళ్ల నుంచి ఎమ్మెల్యేగా - 2009 నుంచి 2014 మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా - పి సృజన్ రావు (ఎస్ ఎస్ జె) -
కాంగ్రెస్ " రే " వంతు
తెలుగు రాష్ట్ర రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు రేవంత్ రెడ్డిది. అంతులేని ఆత్మవిశ్వాసానికి, మొక్కవోని పోరాట పటిమకు, మడమ తిప్పని పౌరుషానికి ఒక రూపం అంటూ ఇస్తే దాని పేరే రేవంత్ రెడ్డి. ఆయన మాటల్లో ఆత్మవిశ్వాసం తొనికిసలాడుతోంది. రాజకీయాలలో పోలికకు దొరకని నేపథ్యం అతనిది. తాను నిజమని నమ్మిన విషయాన్ని రుజువు చేయడానికి ఏ స్థాయిలోనైనా వెనుకాడరు. ఎంతటి వారితోనైనా పోరాడగల సామర్థ్యం అతనది. ఆయనలోని ఈ తత్వమే అతి తక్కువ రాజకీయ కాలంలోనే ఎన్నో వివాదాలను, కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది. వివాహమయ్యేంత వరకు చెప్పుకోదగ్గ రాజకీయ జీవితం ఏమిలేదు. అయితే ఒక ప్రజానాయకుడిగా ఎదగాలన్న కోరిక మాత్రం స్కూల్ రోజుల నుంచే ఉండేది. ఈ కారణాల చేత స్నేహితుల బృందాలను ఏర్పాటు చేసుకుని, వారి ద్వారా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని ప్రయత్నం చేస్తుండేవారు. ఆర్ట్స్‌లో పట్టభద్రుడైన తర్వాత తన మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. రాజకీయ ప్రవేశం కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డితో బంధుత్వం ఉన్నా దానిని ఏనాడు వాడుకోలేదు. మొదట మిడ్జిల్ మండలంలో జెడ్పిటిసీకి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఆ రోజు మండల నేత ఇంత తొందర్లోనే రాష్ట్రస్థాయి నేతగా ఎదుగుతారని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. ఏడాది తిరగక ముందే స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎన్నికలలో మళ్లీ ఇండిపెండెంట్‌గానే పోటీ చేసి, శాసనమండలిలో అడుగుపెట్టారు. అప్పటి అధికార పార్టీలో చేరే అవకాశం ఉన్నా ఆయన మాత్రం ప్రతిపక్షమైన టీడీపీలో చేరి 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్లారు.టీడీపీలో అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ప్రధాన ఆరోపణలు కొడంగల్ నియోజకవర్గంలో నీళ్లు, రోడ్లు సరిగా లేకపోయిన రేవంత్ రెడ్డి పట్టించుకోడనే పేరుంది. ఆయన టీవీ ప్రచారానికి, వివాదాలకు ఇచ్చే ప్రాధాన్యత నియోజకవర్గ అభివృద్ధికి ఇవ్వడంటారు. ఎప్పుడూ హైదరాబాద్‌లోనే ఉండి, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడనేదిమ ఆయన మీద ఉన్న ప్రధాన ఆరోపణ. ముందు మా నియోజకవర్గ సమస్యలు తీర్చి తర్వాత రాష్ట్ర సమస్యల గురించి ఆలోచించాలని వారు కోరుకుంటున్నారు. పేరు : ఎనుముల రేవంత్‌రెడ్డి తల్లిదండ్రులు : నరసింహ్మరెడ్డి , రామచంద్రమ్మ పుట్టిన తేదీ : నవంబర్ 8, 1969 ఊరు : కొండారెడ్డి పల్లి, వంగూరు(మండలం), నాగర్‌కర్నూల్ (జిల్లా) నేపథ్యం : వ్యవసాయ కుటుంబం. ఆరుగురు అన్నదమ్ములు, ఒక సోదరి కుటుంబం : మే 7,1992 గీతతో వివాహం, కూతురు నైమిష రెడ్డి చదువు : డిగ్రీ లో బి ఎ, ఎ.వి.కాలేజ్, ఉస్మానియా యూనివర్శిటీ. ఎల్ఎల్బీ వ్యాపారాలు, ఇతర కార్యకలాపాలు : రియల్ ఎస్టేట్, ప్రింటింగ్ ప్రెస్ రాజకీయ జీవితం స్కూల్ రోజుల్లోనే స్టూడెంట్ యూనియన్ లో పనిచేసేవారు. కాలేజీలో ఎబీవీపీ తరపున పనిచేసేవారు. 2006 - స్వతంత్ర అభ్యర్థిగా మిడ్జిల్ మండలం నుంచి జెడ్పిటీసీ గా ఎన్నికయ్యారు. 2007-09 - స్వతంత్ర అభ్యర్థిగా స్థానిక సంస్థల కోటాలో ఎమ్యెల్సీ గా ఎన్నికయ్యారు. 2008 - టీడీపీలో చేరిక 2009 - కొడంగల్‌లో రాజకీయాలలో 6సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఉన్న గురునాథ్‌రెడ్డి పై ఎమ్మెల్యేగా పోటీ చేసిన మొదటిసారే గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2014 - గురునాథ్‌రెడ్డి పై మరోసారి విజయదుందుభి మోగించారు. అక్టోబర్ 25, 2017 - తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సెప్టెంబర్ 20,2018 - టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం ఇతర పదవులు ►టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేశారు. ► తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం ప్రెసిడెంట్ ► టీటీడీపీ ప్లోర్ లీడర్ ►జాతీయ హకీ ఫెడరేషన్(ఐహెచ్ఎఫ్), వైస్ ప్రెసిడెంట్ ► జాతీయ హకీ ఫెడరేషన్(ఐహెచ్ఎఫ్), ప్రెసిడెంట్ కేసులు : మే 31,2015 లో ఓటుకు నోటు కేసు, కేసీఆర్‌పై ఆరోపణల కేసును కలుపుకుని మొత్తం 36 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆస్తులు : రూ.1,74,97,421 స్థిర ఆస్తులు, రూ.2,02,69,000 చర ఆస్తులు ఆయన భార్య పేరుపై 9.44,64,000 కోట్లు (మార్కెట్ విలువ) - విష్ణువర్ధన్ రెడ్డి.మల్లెల (ఎస్ ఎస్ జె) -
కాంగ్రెస్ స్వాడ్రన్ లీడర్
దశాబ్దాలుగా వామపక్షాలకు కంచుకోటలా ఉన్న హుజుర్ నగర్ నేడు కాంగ్రెస్‌కు కంచుకోటగా మారింది. నల్గొండ జిల్లాలో ఎక్కువ శాతం జనాభా వ్యాపారాలు సాగించేవారితో పాటు, ఆంధ్రప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన వారితో రాజకీయ చైతన్యం కలిగిన హుజూర్ నగర్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న నాయకుడే, నేడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడిగా ఎదిగారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మొదటి నుంచి పార్టీకి విధేయుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ కష్ట కాలంలోనూ పార్టీకి అనేక సేవలందించిన ఘనత సొంతం చేసుకున్నారు. అందుకేనేమో అధిష్టానం ప్రత్యేకంగా ఒక పదవిని సృష్టించి పీసీసీ చైర్మన్‌గా నియమించింది. ఎయిర్ ఫోర్స్ లో స్క్వాడ్రన్ లీడర్‌గా పనిచేసిన ఆయన కీలకమైన నేటి తెలంగాణ ఎన్నికల్లో పార్టీ స్క్వాడ్రన్ లీడర్‌గా కాంగ్రెస్ విమానాన్ని నడుపుతున్నారు. చదువు : ► బీఎస్సీ (నేషనల్ డిఫెన్స్ అకాడమీ) 1981, ► వెపన్స్ ఎంప్లాయిమెంట్ కోర్స్ (కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ ఫేర్) 1985 ► భారత వాయు సేనలో మిగ్ 21 మరియు మిగ్ 23 యుద్ధ విమానాలను నడిపిన అనుభవం ►పాక్, చైనా సరిహద్దులుగా ఉన్న సియాచిన్ లాంటి కీలక ప్రాంతాల్లో పనిచేసి "గ్యాలంట్రీ" అవార్డు గ్రహిత ► 1990లో రాష్ట్రపతి సెక్యురిటీ వ్యవహారాలు చూసే ఏడీసీగా పనిచేయడం రాజకీయ ప్రవేశం : ► 1994లో ఉద్యోగానికి రాజీనామా చేసిన తరువాత రాజకీయారంగేట్రం చేశారు. ► 1994లో కోదాడ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ► 1999లో కోదాడ నుంచే అతని విజయదుంధుబి మోగించి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ► 1999 మరియు 2004ల్లో కోదాడ నుంచి ఎమ్మెల్యేగా విజయం, ►2009 లో భార్య పద్మావతిని కోదాడ నుంచి ఎన్నికల బరిలో దింపి తాను హుజూర్ నగర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ► 2009, 2014 ఇలా వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత ►2015 నుంచి తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్‌గా నియమితులయ్యారు. ► శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌గా, ప్రభుత్వరంగ సంస్థల కమిటీ చైర్మన్ గా, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పేరు : ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తల్లి దండ్రులు : ఎన్ పురుషొత్తమ్ రెడ్డి, ఉషా దేవి ఊరు : తాటిపాముల గ్రామం, తిరుమలగిరి మండలం, సూర్యపేట. పుట్టినతేది : 20 జూన్ 1962 (వయస్సు : 56) కుటుంబం : ఎన్ పద్మావతి (కోదాడ మాజీ ఎమ్మేల్యే) చదువు : బీఎస్సీ పట్టా, మాజీ పైలట్ నటన : సినిమారంగం - టెర్రర్ సినిమాలో సీఎం పాత్ర పోషించారు. రియల్ టైం పొలిటిషియన్‌గా కనిపిస్తారు. నచ్చిన మాట : "భారత దేశానికి యుద్ధం చేసిన నాకు భయమెందుకు..? 24 గంటలు నిస్వార్థంగా, నిజాయితీగా రాజకీయాలు చేసే నేను భయపడతానా!" - జీ రేణుక -
పేరుకి తగ్గట్టే బంగారుకొండ
రాజకీయ వాసన కూడా పట్టని కుటుంబం నుంచి వచ్చి, సీటీ బస్పు కిటికీలోంచి అసెంబ్లీని చూసిన వ్యక్తి అదే అసెంబ్లీలో అదికూడా తెలంగాణ తొలి స్పీకర్ అవుతాడని ఊహించి ఉండరు సిరికొండ మధుసూధనాచారి. సమాజమే దేవాలయం పేద మానవుడే దేవుడు అన్న ఎన్టీఆర్ నినాదం నచ్చి మొదటిసారి తెలుగుదేశం ద్వారా వెలుగులోకి వచ్చారు. హిందీ, ఉర్దూ భాషల్లో మాట్లాడగల సిరికొండ రాజకీయాల్లో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. టీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి కేసీఆర్ బాటలోనే పయనించాడు. స్పీకర్ గా మొదట్లో తడబడ్డా చివరకు తొలితెలంగాణ సభాపతిగా రాణించారు. చిన్నప్పుడు గోలీలు, కర్రాబిల్లా, కబడ్డీ... ఇలా కనబడ్డ ఆటలన్నీ ఆడూతూ, మార్కులు తక్కువ వస్తే నాన్నచేతి కంసాలి గొట్టంతో దెబ్బలు తిని పెరిగిన మనిషి. సొంత ఊరిలో అమ్మనాన్నల విగ్రహాలు స్థాపించి వారిపై గల ప్రేమను తెలిపిన కూమారుడు. అంతే కాకుండా 3 ఎకరాల మేర వారి పేరుతో హరితహారంను ఏర్పాటు. ప్రతి చెట్టుకీ ఒక పేరు. కుటుంబం సభ్యుల మెత్తం 91 మంది ఫ్లెక్సీలు. తరానికి ఒక శిలా ఫలకాలు... ఏడాదికొకసారి కుటుంబంతో హరితహారం సందర్శించే సాధారణ జీవితం గడిపే వ్యక్తి. చుట్టుపక్కల రెండు మూడు గ్రామాల్లో తండ్రికి ఉన్న గ్రామాల్లో మంచి పేరుని చెడగొట్టకుండా ఉండాలని తనవంత కొన్ని ప్రయత్నాలు చేసిన సిరికొండ. 1970 ప్రాంతంలోనే మానాన్న పెద్ద ఆర్థికవేత్తని, అప్పట్లో రోజు వారి ఖర్చు 10 అయితే 12 సంపాదించే వరకు అన్నం తినడని గొప్పగా చెప్పుకునేవారని, 1980 కాలంలోనే 5 మందిని చదివించాడు అంటే మా నాన్న చాలా గొప్పవారని సిరికొండ తన తండ్రి గురించి చెప్పుకుంటుంటారు. పేరు : సిరికొండ మధుసూధనాచారి తల్లిదండ్రులు : వెంకటలక్ష్మీ, వెంకటనర్సయ్య పుట్టిన తేదీ : సెప్టెంబర్ 26, 1956 ఊరు : వరంగల్ జిల్లా పరకాల మండలం నర్సక్కపల్లి గ్రామం నేపథ్యం : విశ్వ బ్రాహ్మాణ, కుంటుంబం, 4 అన్నదమ్ముళ్లు, 4 అక్కచెల్లెళ్లు కుటుంబం : ఇంటర్ మీడియట్ చదివేటప్పుడే బంధువుల అమ్మాయి ఉమాదేవితో పెళ్లి. సంతానం ముగ్గురు అబ్బాయిలు చదువు : ప్రాథమిక విద్య వరంగల్ ♦ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్‌లో పట్టా పొందారు, ♦ఎంఏ కాకతీయ యూనివర్పీటీలో, లా, పర్సనల్ డెవలప్మెంట్ కోర్సులు వృత్తి : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో తొలి స్పీకర్ రాజకీయ జీవితం : ► 1982 లో ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయ ప్రవేశం. తక్కువ సమయంలోనే పార్టీలో కీలకనేతగా ఎదిగారు. 1983లో కొంతకాలం టీడీపీ కార్యదర్శిగా ఉన్నారు. ► 1985 - 89 వరకు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ సభ్యుడు ►1988- 89లో ఫిలిం బోర్డు సెన్సార్ బోర్డు సభ్యుడు ► 1993 లో వరంగల్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు ► 1994 లో సాయంపేట ఎమ్మెల్యేగా గెలుపు ► 1996 లో అన్నా టీడీపీ పార్టీలో చేరిక ►1999 లో సాయంపేట బరిలో ఓటమి. దీంతో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు ► 2001లో టీఆర్ఎస్ పార్టీలో చేరిక ► 2002 లో పొలిట్ బ్యూరోలో సభ్యుడుగా, భూపాలపల్లి ఉద్యమ కమిటీ ఇన్‌చార్జీగా నియమితులవడం ► 2009 లో మహాకూటమి అభ్యర్థిగా భూపాలపల్లి ఎన్నికల్లో ఓటమి ►2014 భూపాలపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వ బీఫ్ చీఫ్ గండ్ర వెంకటరమణ రెడ్డి పై విజయం సాధించారు. హాబీ : కవితలు రాయడం ఆసక్తి. 20 ఏళ్ల వయసు నుంచి కవితలు రాయడం మెదలుపెట్టారు. ఎన్టీఆర్, కేసీఆర్ పై కవితలు రాశారు. - దానవీరశూరకర్ణ సినిమా అంటే ఇష్టం - కొండి దీపిక -
హక్కుల పోరాటయోధుడు
హక్కుల పోరాటయోధుడు ఆయన మట్టి పరిమళాలు తెలిసిన వారే. స్వాతంత్య్రానంతరం తొలి తరం ప్రతినిధి. కొద్దిపాటి భూమితో గంపెడు సంసారాన్ని ఈదే నిరుపేద రైతు కుటుంబంలో పుట్టారు. ఆర్థిక, సామాజిక వెనుకుబాటుతనాన్ని చవిచూశాడు. కష్టపడి చదువుకున్నాడు. ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో సామాజికశాస్త్ర ఆచార్యులుగా ఎదిగారు. పాతికేళ్ల క్రితమే దళితుల మీద అగ్రవర్ణాల దాడిని చూసి చలించిపోయి, తన పేరు చివరన ఉన్న కులాధిపత్య చిహ్నాన్ని తొలగించుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రత్యక్ష సాక్షి. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ గా ప్రొఫెసర్ కోదండరాం పేరు తెలియనివారుండరు. తెలంగాణ ఉద్యమ ఎజెండాతో మొదలై ప్రస్తుత రాజకీయ ఉద్యమం వరకు సాగిన యాత్రలో ఆయన ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకోవడం, విరమించుకోవడం రెండూ జరిగిపోయాయి. అయితే, ఆ విరమణకు కారణంగా ఆయన లక్ష్యసాధన ప్రధాన అంశంగా చెబుతారు. పేరు : ముద్దసాని కోదండరాం తల్లిదండ్రులు : జనార్దన్‌రెడ్డి, వెంకటమ్మ పుట్టిన తేదీ : సెప్టెంబర్ 5, 1955 ఊరు : ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల సమీపంలోని జోగాపూర్. తండ్రి కరీంనగర్ జిల్లా మానకొండూరు నుంచి వచ్చి స్థిరపడ్డారు. నేపథ్యం : తండ్రి వ్యవసాయదారు. అయిదుగురు అక్కచెల్లెళ్లు, ఒక తమ్ముడు కుటుంబం : 1983 లో నిజామాబాద్‌కు చెందిన సుశీలతో వివాహం. అమె డిగ్రీ వరకు చదివారు. గృహిణిగా ఉన్నారు. కూతురు మైత్రి, కుమారుడు చేతన్ ఇంజనీరింగ్ పూర్తిచేసి అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసి ఉద్యోగాల్లో చేరారు. చదువు : ప్రాథమిక విద్య వరంగల్ ► డిగ్రీ వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ► ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ► ఎంఫిల్ (చైనా అధ్యయనం) జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ ► పీహెచ్‌డి (తెలంగాణ మారుతున్న ఆధిపత్య సంబంధాలు) హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ► వృత్తి : రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు ► 1981 నుంచి పదేళ్లు నిజాం కాలేజి ► 1991 నుంచి పదేళ్లు కోఠి ఉమెన్స్ కళాశాల ► 2001 నుంచి మూడేళ్లు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ఆచార్యుడిగా, సికింద్రాబాద్ పీజీ కాలేజీలో ఆచార్యుడిగా పనిచేశారు. రచనలు 1) మూడు దశాబ్దాల ‘నక్సల్బరీ ఉద్యమం - గమ్యం గమనం’ సంపుటిలో ఒక వ్యాసం 2) ‘తెలంగాణ ముచ్చట’ వ్యాస సంపుటి 3) ‘స్వేచ్చ’ పత్రికకు 1984 నుంచి 1998 వరకు సంపాదకుడు 4) వివిధ పత్రికలకు 25 పైగా వ్యాసాలు ఉద్యమ నేపథ్యం : పాతికేళ్ల ఉద్యమ జీవితం ► తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ సమితి కన్వీనరు. ► తెలంగాణ జన సమితి (టీజేఎస్) పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు, దానికి కన్వీనర్ గా కొనసాగుతున్నారు. ► కమ్యూనిస్టు, హేతువాది, పౌర హక్కుల ఉద్యమకారుడు. నెల జీతంలో సగానికిపైగా పేద విద్యార్థుల ఫీజులకు కేటాయిస్తారు. ► గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం, వారి ఆకలిదప్పులు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వంతో పోరాటం విద్యార్ధి దశలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమం ► 1981 లో ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల వేదిక(ఏసీసీఎల్సీ) సభ్యుడు ► 1985 లో కాంచేడులో దళితులపై దమన కాండకు చలించి కులాన్ని సూచించే విధంగా ఉన్న ‘రెడ్డి’ని తన పేరులోంచి తొలగించారు. ►‘1983-99 ఏసీసీఎల్సీ నగర్ కమిటీలో ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ►1999 లో బాలగోపాల్, జీవన్ కుమార్‌లతో కలిసి మానవ హక్కుల పై పోరాటం ►1989 నుంచి తెలంగాణ వెనుకబాటుతనంపై పోరాటం ► 1998-99 లో రాష్ట్రంలో ఆత్మహత్యలు, ఆకలిచావులు, కరువు, ఆదివాసీల ఆహార సమస్యపై ఆధ్యయనం ► 2001-04 మద్య తెలంగాణ ఐక్య వేదిక ద్వారా ఉద్యమం ► 2004 లో తెలంగాణ విద్యావంతుల వేదిక ఏర్పాటు, అధ్యక్ష బాధ్యతలు ► 2018 లో తెలంగాణ జన సమితి ఏర్పాటు అధికారిక బాధ్యతలు : 2002లో ఆహార హక్కు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన కమిషన్‌కు రాష్ట్ర సలహాదారుగా విధులు -
మాటల మాంత్రికుడు
నాలుగో తరగతిలో ఓ తెలుగు మాస్టారు తెలుగుపద్యాలు చెప్తూ వాటిలో ఒక పద్యాన్ని మర్నాడు అప్పచెప్పినవారికి ఓ నోటుబుక్కును బహుమతిగా ఇస్తామని ఆయన ప్రకటించారు. అందులో ఓ పిల్లగాడు లేచి 'సార్... ఆ పద్యాన్ని ఓ పదిసార్లు చదివి ఇప్పుడే చూడకుండా అప్పగిస్తా ' అని విన్నవించుకున్నాడు. ' ఇప్పుడే అంటే నీతో కాదు లేరా ' అని అన్నారు. అయినా పట్టువదలని ఆ విద్యార్థి ఆ పద్యాన్ని గుక్కతిప్పుకోకుండా అప్పగించారు. దాంతో ' నీ నాలుక మీద సరస్వతిదేవి గట్టిగా కూసుంది. మాటలతోనే బతుకుతవ్ పోరా ' అని ఆ ఉపాధ్యాయుడు దీవించాడు. 40 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఆ గురువుగారు అప్పుడే ఊహించినట్లున్నారు. విమర్శల వెంటే వివాదాలు ! కల్వకుంట్ల చంద్రశేఖరరావు... ఐఏఎస్ కావాలని కన్న కల... కేసీఆర్ ఇంటర్ చదివేప్పుడే పెళ్లి చేసుకోవడం, ఇతర వ్యాపకాలతో అది కలగానే మిగిలింది. 1999లో చంద్రబాబునాయుడు రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కేసీఆర్ కు మంత్రి పదకి దక్కి ఉంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉండేవో ఊహించలేం. 1999 వరుకు రవాణా శాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ శాసనపభ డిప్యూటీ స్పీకర్ పదవిని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ చంద్రబాబుకు బహిరంగ లేఖ రాయడం పెద్ద సంచలనమే సృష్టించింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని అసెంబ్లీకి, పార్లమెంటుకు పోటీ చేయడం, అప్పటి వరకు వ్యక్తిగత సహాయకునిగా ఉన్న తన మేనల్లుడు టి.హరీశ్‌రావుకు మంత్రి పదవి ఇవ్వడం, అసెంబ్లీకి రాజీనామా చేసి మేనల్లుడ్ని గెలిపించుకోవడం ,తెలంగాణ జాగరణ సేవ పేరిట సాయుధ శిక్షణ, సోనియాను ఎన్నోసార్లు పొగిడిన నోటితోనే తీవ్ర విమర్శలు, పార్టీలో నెంబర్ టూగా ఉన్న నరేంద్రను సంజాయిషీ నోటీసు కూడా లేకుండా బహిష్కంచడం , నిజాంను ఆకాశానికి ఎత్తేయడం... వంటి చర్యలు ఆయన్నిఎప్పుడూ వార్తలలో ఉంచాయి. 'తన మాట నడవకపోతే పులిచింతలలో రక్తం పారుతుందనీ, కనుసైగ చేస్తే తెలంగాణ అగ్ని గుండం అవుతుంది' వంటి వ్యాఖ్యలు కేసీఆర్‌పై రాజకీయ దాడికి కారణమయ్యాయి. టక్కెట్ల పంపిణీలో అవినీతి, బంధుప్రీతి చాలవా అధికమని, పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వం బలపడకుండా జాగ్రత్తపడతారంటూ ఆయనపై ప్రత్యర్థులు తరచూ విమర్శిస్తుంటారు. పుస్తకప్రియుడు కేసీఆర్‌కు ఘంటసాల పాటలంటే ప్రాణం, ఆ పాటలు విని మంచిమూడ్‌లో వాటిని ఎదుటివారికి వినిపించడమంటే ఆయనకు ఇష్టం ,అమితాబ్ సినిమాలంటే ఎంతో ఆసక్తి . ఓల్గా నుంచి గంగ వరకు పుస్తకాలన్ని ఎన్నిసార్లు చదివారో ఆయనకే గుర్తు లేదు.దూర ప్రయాణాల్లో కారు డ్రైవింగ్ చేయడం ఆయనకో సరదా,సాహిత్య పుస్తకాలు విపరీతంగా చదువుతారు. పుస్తక ప్రియులతో గంటల తరబడి చర్చల్లో గడుపుతారు. నిత్వం అన్ని పేపర్లు చదవనిదే తర్వాత పనిలోకి వెళ్లరు.గల్లీ రాజకీయం నుంచి ఢిల్లీ రాజకీయాల వరకు ఆసక్తిగా తెలుకుంటారు. మార్కెంటింగ్‌లో దిట్ట! తన వ్యక్తిగత బలాలు ,బలహీనతలేమిటో ఆయనకూ తెలుసు.బలహీనతలపై విమర్శలు చేసినా పట్టించుకోరు, పైగా' మీ అంచనాలకు అనుగుణంగా నేను నడవాలని కోరుకుంటే అది నా తప్పు కాదు . నా వ్వూహాలు నాకుంటాయి.ఎప్పుడేం చేయాలో ఎక్కడేం మాట్లాడాలో నా ఎత్తుగడలు నాకుంటాయి. మీరు కోరుకున్నట్లు నేను ఉండాలనుకోవడం, అలా ఉండటం లేదని విమర్శలు చేయడం ఎట్లా సమంజసం ' అంటూ ఎదురు ప్రశ్నిస్తారు. బలహీనతలను కప్పిపుచ్చుకుని, బలాలను మార్కెట్ చేసుకోవడం ఆయనకు ఎంతగా తెలుసంటే 2009 ఎన్నికలలో తన శక్తికి మించి కాంగ్రెస్ నుంచి స్థానాలు (9 పార్లమెంట్, 42 అసెంబ్లీ స్థానాలతో పాటు మరో 14 స్థానాల్లో వామపక్షలపై పోటీ చేశారు. అందులో 5 లోక్ సభ - 26 అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలిచుకున్నారు) తీసుకున్నారు. పని పూర్తిచేసే వాక్చాతుర్యం 'ఉచిత కరెంటు ఎవరిక్కావాలి . పంట పండితే మన కళ్లం కాడికొచ్చిన గంగెడ్లోళ్లకు చాటెడు ఒడ్లుపెట్టినంత కాదు,మనం కడుతున్న కురెంటు బిల్లు '... అంటూ 1999లో రవాణా శాఖ మంత్రిగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. 2004 ఎన్నకలకు మాట మార్చారు. 'ఉచిత కరెంటు మన హక్కు తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న కరెంటు మనకు ఇవ్వకపోవడం ఎంత పెద్ద అన్యాయం'... అంటూ అయిదేళ్ల క్రితం వాదించడం ప్రారంభించారు. అదీ ఆయన వాక్చాతుర్యం. అవును అప్పుడు అన్లేదు. ఇప్పుడు తెలిసింది అంటున్న తప్పేముంది? అనగలగడంలోనూ చాతుర్యం కలవాడు. తెలంగాణ ఉద్యమం విషయంలో ఆయన చెప్పిందే అది. మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించిన చంద్రబాబును ఆహ్వానం లేకుండా ఇంటికి చాయ్‌కు రప్పించుకున్న ఘనుడు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తానన్నా ఒకనాడు కేసీఆర్‌కు అవకాశం ఇవ్వలేదు. అదే చంద్రబాబును పొత్తులు, సీట్ల సర్దుబాటు పేరిట బురిడీ కొట్టించి విజయం సాధించారు. రాష్ట్ర మంత్రి పదవి రాకపోయినా ఏకంగా కేంద్రమంత్రి పదవినే సొంతం చేసుకున్నారు. తానే రాష్ట్రంలో ఆరుగురిని మంత్రులుగా కూడా చేశారు. టీడీపీ నుంచి తనను బయటపడేలా చేసిన చంద్రబాబును తన చుట్టూ ఎన్నికల పొత్తు కోసం తిరిగేటట్టు చేయడంకూడా కేసీఆర్ సాధించిన విజయంగా చెబుతారు. రాష్ట్రం విడిపోయింది. సీను మారిపోయింది. కేసీఆర్ మారిపోయాడు. థూ మీ బతుకు చెడ... చంద్రబాబు పొత్తేంటని కేసీఆర్ ఇప్పుడు దుమ్మెత్తి పోస్తుంటే ఎదుటివాళ్లు బిత్తరపోవల్సిందే. పరిశీలన, అధ్యయనం ఆయన బలం. ప్రతి చిన్న అంశంపై పరిశీలన ,క్లిష్ట సమస్యలపై లోతనై అధ్యయనం ఆయన ప్రత్యేకత . ఇష్టం లేనివారితో భేటీకి ఆయన మొహమాటానికైనా ఒప్పుకోరు. ' ప్రజల ఆకాంక్షలను ,రాజకీయ నాయకుల ప్రయోజనాలతో ముడిపెట్టి రాజకీయాలను నడిపే ప్రతిభాశాలి కేసీఆర్ అన్నది అతని సన్నిహితుడైన ఓ విశ్లేషకుడి వ్యాఖ్య. దీర్ఘకాలిక వ్యూహాలపై ఆయనకు నమ్మకం లేదు. తాత్కాలిక రాజకీయ ఎత్తుగడలకే ప్రాధాన్యమిచ్చి పార్టీని అదే దిశగా నడిపిస్తున్నారు. సభలు, సమావేశాలు, ట్రెండ్ల ద్వారానే ఉద్యమాన్నిసంఘటితం చేమడంలో చాలా వెనకబడిపోయారు. అనేక నియోజకవర్గాలలో ఇప్పటకీ మండల కమిటీలు వేయలేదు. పరిపాలనలో ఇంకా తొమ్మిది నెలలు అధికారంలో ఉండటానికి అవకాశాలున్నప్పటికీ అసెంబ్లీని రద్దు చేసి ప్రజలనే కాదు... మంత్రులు, పార్టీ నాయకులను విస్మయపరిచారు. కేసీఆర్ మొదటి నుంచి మంచి వ్యూహకర్త అనే అంటారు. భవిష్యత్తు జాతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకొనే ఈ ఎత్తుగడ వేశారన్నది రాజకీయ విశ్లేషకుల అంచనాలు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వ్యూహంలో భాగమైతే గడిచిన నాలుగేళ్ల పాలనలో కేసీఆర్ మంచిచెడులను రెండింటినీ మూట గట్టుకున్నారు. ముఖ్యమంత్రి సచివాలయం రాకుండా గడీ పాలన కొనసాగిస్తున్నారని విమర్శలు మూటకట్టుకుంటే. పలు సంక్షేమ కార్యక్రమాలను ఆయా వర్గాలతో ఆయనను శభాష్ అనిపించుకున్నరు. 2014 ఎన్నికలకు ముందు ఉన్న రాజకీయ వాతావరణం అధికారంలోకి వస్తామన్న విషయంలో కేసీఆర్ కు సైతం అనుమానాలుండొచ్చు. ప్రజలు విలక్షణమైన తీర్పు... కేసీఆర్ పేరును చరిత్రలో నిలిచేలా చేసింది. అయితే, అధికారంలోకి రాగానే ఇతర పార్టీల వారిని ఆకర్షించడం, చేసిన వాగ్ధానాలు కొన్ని నెరవేరకపోవడం, బంధుప్రీతి వంటి ఆయనను వెంటాడుతున్న విమర్శలను లెక్కచేయకపోవడం కేసీఆర్ కు ఎళ్లప్పుడు మైనస్ పాయింట్స్ గానే మిగిలిపోతాయని ఆయన శ్రేయోభిలాషులే చెబుతుంటారు. వ్యక్తితం... కుంటుంబంలోని 11 మందిలో ఒకరు. ఒక అన్నా, తొమ్మిది మంది అక్కాచెల్లెళ్లు. 1954 ఫిబ్రవరి ,17న చింతమడక (సిద్దిపేట)లో జన్మించిన కేసీఆర్‌కు ఒక కుమారుడు, ఒక కూతురు. కుమార్తె కవిత పుట్టిన తర్వాతే రాజకీయాల్లో కలిసొచ్చిందని గట్టి నమ్మకం. కొడుకు (కేటీఆర్) తొట్టిలప్పుడు (1975లో) ఇంటికి కూడా వెళ్లలేదు. కుంటుంబ సభ్యులతో తక్కువగా గడుపుతారు. 'గొప్పవాళ్లందరూ కుటుంబానికి ద్రోహులే ' అని సమర్థించుకుంటారు కూడా. -
హుజురా'బాద్షా' ఈటల
ఎప్పుడూ నిలకడగా కనిపిస్తారు. ఆకారానికి తగ్గట్టుగానే మృదు స్వభావి. ఉద్యమ వాగ్దాటి ఉన్నవారు. అందరినీ పలకరిస్తూ కలుపుగోలుగా ఉండే ఆయన రాజకీయ జీవితం ఉద్యమ పోరాటంతో మొదలై తెలంగాణ తొలి ఆర్థిక మంత్రిగా ఘనతకెక్కారు. తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్ ఎదుర్కొన్న ఆటుపోట్లన్నింటిలోనూ ఉన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి అజేయుడిగా నిలుస్తున్నారు. 2001 టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉద్యమ పార్టీలో కొనసాగుతూ మిగులు బడ్జెట్ కలిగిన తెలంగాణ తొలి ప్రభుత్వంలో తొలి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో టీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఉన్న ఈటల తన వాగ్ధాటితో అందరిని ఆకట్టుకున్నారు. పేరు : ఈటల రాజేందర్ జననం : 1964 మార్చి 20 కరీంనగర్ తండ్రి పేరు : ఈటల మల్లయ్య నియోజకవర్గం : హుజురాబాద్ చదువు : బీఎస్సీ (ఉస్మానియా యూనివర్సిటీ) భార్య : ఈటల జమున, కొడుకు : నితిన్, కూతురు : నీతా ఈటల రాజేందర్ కుమారుడు నితిన్ పెళ్లి ఫోటో రాజకీయ జీవితం : టీఆర్ఎస్ సీనియర్ నేత. 2009లో ఆ పార్టీ శాసనసభ పక్ష నేతగా ఉన్న ఈటల రాజేందర్ హుజురాబాద్ లో మూడోసారి(మొత్తంగా 5సార్లు) గెలిచి కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2004, 2008ఉప ఎన్నికలో కమలాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2009లో కమలాపురం నియోజకవర్గం హుస్నాబాద్‌గా మారడంతో ఆయన హుజూరాబాద్ నుంచి పోటీకి దిగుతూ వస్తున్నారు. 2009 సాధారణ ఎన్నికతో పాటు, 2010 ఉప ఎన్నికలల్లోనూ ఆయన గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆయన తన ఎమ్మెల్యే పదవికి రెండు సార్లు రాజీనామా చేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కె.సుదర్శన్‌రెడ్డిపై 57,037 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. వెనకబడినవర్గాలకు చెందిన ఈటల తెలంగాణ ఉద్యమంలోనూ, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలోనూ నిర్విరామంగా కృషి చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా 2008లో రాజీనామా చేసిన 16 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ఒకరిగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా మరోసారి పార్టీ నిర్ణయం మేరకు 2010 ఫిబ్రవరిలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికలో టీడీపీ నేత ముద్దసాని దామోదర రెడ్డిపై ఘన విజయం సాధించారు. - రొడ్డ స్నేహలత (సాక్షి జర్నలిజం స్కూల్)