ఆ నోటి వెంట ఒక ప్రవాహంలా వెలువడే మాటలు. అందుకు అనుగుణంగా గాంభీర్యం. హావభావాలు... సందర్భోచితంగా సామెతలు, ఉదాహరణలు... అసెంబ్లీలో ఆయన మాట్లాడుతున్నప్పుడు సభ దృష్టంతా ఆయనమీదే. ఘాటైన పదజాలంతో సూటిగా విమర్శలు ఎక్కుపెట్టగలరు. అంతే స్థాయిలో మాటల వివాదాల్లోకి వెళ్లగలరు. రెచ్చగొట్టే ప్రసంగాలు, వివాదాస్పద అంశాలు అక్బరుద్దీన్ ప్రత్యేకత. వివాదాల్లో కూడా సందర్భోచితంగానే తలదూర్చుతారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు వేడెక్కుతున్న తరుణంగా "రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరున్నా మాముందు తలవంచాల్సిందే... '' అంటూ కేడర్ ను రెచ్చగొచ్చగలరు. వివాదాస్పద కామెంట్లతో తరచూ వార్తల్లో నిలిచే అక్బరుద్దీన్ ఓవైసీ... 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు విజయం సాధించారు. ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తిహాద్ అల్ ముస్లిమీన్ (ఎంఐఎం) పార్టీ తరపున చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాలో ఎంబీబీఎస్ రెండవ సంవత్సరంలోనే ఆపేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తన సోదరుడు అసదుద్దీన్ ఓవైసీతో కలసి ఎంఐఎం పార్టీని నడిపిస్తున్నారు. డిసెంబర్ 22, 2012న అదిలాబాద్‌లో జరిగిన ఓ సభలో హిందూ దేవుళ్లు, దేవతల మీద చేసిన వ్యాఖ్యలు వివాదాస్సదమయ్యాయి. తమను పోలీసులు అడ్డుకోకుండా కేవలం 15 నిమిషాల సమయమిస్తే బిలియన్ హిందువులకు తమ పవర్ ఏంటో చూపిస్తానంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, తర్వాత వాటిపైన కేసులను ఎదుర్కొనడం సాధారణంగా మారింది. ఒకానొక కేసులో సమన్లకు సమాధానం ఇవ్వడంలో అక్బరుద్దీన్ విఫలం కావడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. 40 రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు.
వివాదాస్పద వ్యాఖ్యలు పక్కనపెడితే... అసెంబ్లీలో చేసే వాడివేడి ప్రసంగాలతో అక్భర్ అందరి దృష్టినీ ఆకర్షిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఒక సందర్భంగా అక్బర్ చెప్పిన పిట్టకథ నవ్వులు పూయించడమే కాకుండా సోషల్ మీడియాలో ఇప్పటికీ చెక్కర్లుకొడుతోంది. ""దర్బారులో ఒక గాయకుడు తన పాటలతో నవాబును ఆనందింపజేస్తాడు. పాటను మెచ్చిన నవాబ్ వాహ్‌వా... అతడికి ముత్యాలు ఇవ్వండి. అన్నాడు. దాంతో ఆనందపడిన గాయకుడు మరో పాట పాడడంతో సంతోషపడిన నవాబు అతనికి ఈసారి మణులు మాణిక్యాలు ఇవ్వండి అని అంటాడు. ఆ గాయకుడు ఇంకా సంతోషంగా ఇంకో పాట పాడగా... వజ్ర వైడుర్యాలు... భూములు.... నగలు... నజరానాగా ఇవ్వండని చెబుతాడు. ఆ గాయకుడు చాల సంతోషపడి, ఇంటికి వెళ్లి జరిగినదంతా చెప్పుకున్నాడు. అయితే ఎన్ని రోజులైనా నవాబు ప్రకటించిన బహుమతులు రాకపోవడంతో అతడు నవాబ్ దగ్గరకు వెళ్లి " జహాపనా ! మీరు ఇస్తామన్న ముత్యాలు, మణులు, మాణిక్యాలు, భూములు వగైరా ఏవీ కూడా నాకింతవరకు అందలేదని విన్నవించుకుంటాడు. అందుకు నవాబ్ ఇందులో ఇచ్చిపుచ్చుకోవడం ఏముంది. పాటలు పాడి మమ్మల్ని ఆనందింపజేశావు... అందుకు ప్రతిగా బహుమతులను ప్రకటించి నేను మిమ్మల్ని ఆనందింపజేశాను'' అని నవాబు నుంచి సమాధానం రావడంతో బిత్తరపోవడం గాయకుడు వంతవుతుంది. కేసీఆర్ ప్రకటించిన హామీల గురించి ప్రస్తావిస్తూ అక్బరుద్దీన్ చెప్పిన ఈ పిట్టకథ అప్పట్లో సభలో నవ్వులు పూయించింది.
నేపథ్యం :
జననం : జూన్ 14, 1970
పుట్టిన స్థలం : హైదరాబాద్
తల్లిదండ్రులు : సుల్తాన్ సలాఉద్దీన్ ఓవైసీ, నజీమా బేగం
భార్య : సబీనా ఫర్జానా (1995 నుంచి)
చదువు : పదవ తరగతి వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సెయింట్ మేరీస్ కళాశాలలో ఇంటర్మీడియట్, గుల్బర్గాలో ఎమ్‌బీబిఎస్ రెండవ సంవత్సరంలో మానేశారు.
వృత్తి : రాజకీయం, ఓవైసీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్
పార్టీ : ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తిహాద్ అల్ ముస్లిమిన్
కుటుంబీకులు : అసదుద్దీన్ ఓవైసీ (సోదరుడు), బుర్హనుద్దీన్ ఓవైసీ (సోదరుడు)
ప్రస్తుత పదవి : ఎమ్మెల్యే
పి. సృజన్ రావ్
Comments
Please login to add a commentAdd a comment