సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేసి కనీసం 15 మంది ఎమ్మెల్యేలతో సభకు వస్తామని ఎంఐఎంపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ ప్రస్తుతం శాసనసభలో తాము ఏడుగురు ఎమ్మెల్యేలే ఉన్నామనే ప్రస్తావన, ఇతరులు ఎత్తిచూపడం కొంత బాధ కలిగిస్తోందన్నారు.
ఏడుగురు సభ్యులున్న పార్టీకి సభలో గంట సమయం ఎందుకు కేటాయించాలంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. అందువల్ల ఈ విషయమై ఎంఐఎం అధ్యక్షుడితో చర్చిస్తామని, కనీసం 50 సీట్లలో పోటీచేసి 15 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలుపొందే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే తాము రాజకీయంగా బీఆర్‌ఎస్‌తోనే ముందుకు సాగుతామని ప్రకటించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రసంగంలో తనను ఉద్దేశించి ప్రతిపక్ష నేత అని సంబోధించడంపై సభాపతి స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. ప్రతిపక్ష నేత అనేది లేదని ఆ తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వివరణ ఇచ్చారు.
12% రిజర్వేషన్ల హామీ అమలు చేయాలి..
గతంలో హామీ ఇచ్చిన విధంగా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పన దిశగా చర్యలు చేపట్టాలని అక్బరుద్దీన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న కొత్త రిక్రూట్‌మెంట్‌లో 4 శాతం రిజర్వేషన్లు పాటించడం లేదని, రోస్టర్ ప్రకారం 3 శాతమే వర్తింపజేస్తున్నట్లు వస్తున్న వార్తలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాతబస్తీలో రోడ్ల విస్తరణ, మెట్రో రైలు, ఫ్లైఓవర్ల నిర్మాణం వంటి అంశాలపై మంత్రులతో చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్యోగులకు డీఏ 6.8 శాతం చెల్లింపుతోపాటు కొత్త పీఆర్‌సీని ఏర్పాటు చేసి 3 నెలల్లో నివేదిక ఇచ్చేలా చూడాలన్నారు.
రాష్ట్రంలో ద్రవ్యోల్బణం నియంత్రణకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. అక్బరుద్దీన్ సూచనలపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ప్రతిపక్ష నేత అని ప్రస్తావించానే తప్ప తనకు అంత కచ్చితంగా తెలియదన్నారు. పాతబస్తీలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చకు సోమవారం (6న) అసెంబ్లీ ఆవరణలోనే సమావేశం ఏర్పాటుచేస్తామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగులకు ఒక డీఏను ఇటీవల ప్రకటించిందని, పీఆర్‌సీ ఏర్పాటు విషయం ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. ద్రవ్యోల్బణం కట్టడికి దిద్దుబాటు చర్యలు చేపడతామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
చదవండి: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: అసెంబ్లీలో కేటీఆర్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment