ఎర్రజెండా నీడన చల్లని రంగన్న  | Julakanti Ranga Reddy A Committed CPM Leader | Sakshi
Sakshi News home page

ఎర్రజెండా నీడన చల్లని రంగన్న 

Published Fri, Nov 30 2018 4:30 PM | Last Updated on Sat, Dec 1 2018 10:02 AM

Julakanti Ranga Reddy A Committed CPM Leader - Sakshi

జూలకంటి రంగారెడ్డి అంటే మిర్యాలగూడ ప్రజలకు బొత్తిగా అలవాటు లేని పేరు. వారిని ఆప్యాయంగా చూసుకునే రంగన్నగానే పరిచయం. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఎర్ర జెండా నీడన పేదల కన్నీళ్లను తూడుస్తూ వెళుతున్న నేత జూలకంటి రంగారెడ్డి. తన తండ్రి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమ స్పూర్తిని తీసుకుని ఎత్తిన ఎర్ర జెండాను నేటి వరకు మోస్తూనే ఉన్నాడు. కరుడుగట్టిన సీపీఎం నాయకుడు. తండ్రి చిన్నతనంలోనే చనిపోతే కుటుంబ భారాన్ని చూసుకుంటూనే, కష్టాలలో ఉన్న పేదల పక్షాన పోరాడారు. తన కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం, చిన్న చిన్న వ్యాపారాలు చూసుకుంటూనే రాజకీయాల వైపు అడుగులు వేశారు. పేదల కోసం పోరాడే క్రమంలో ఎన్నోఅవమానాలు, మరెన్నో ఒత్తిడులు, బెదిరింపులు.. అంతకు మించి కేసులు, కోర్టుల చుట్టు ప్రదక్షణలు... వేటికి బయపడని రంగన్న తను నమ్మిన సిద్ధాంతం వైపే అడుగులు వేశారు. రాష్ట్రంలో కమ్యూనిస్ట్‌లందరూ ఎవరి దారి వారు చూసుకుని వెళ్తుంటే తను మాత్రం ' సంపద అందరికి చేరాలన్నా, పేద, ధనిక వర్గాలు లేని సమసమాజ నిర్మాణం జరగాలన్నా మార్క్సిస్ట్‌ సిద్ధాంతాలతోనే సాధ్యమవుతుందని, పార్టీలో ఉండే వ్యక్తులు బలహీనులు కావచ్చు కానీ పార్టీ సిద్ధాంతాలు ఎప్పటికీ బలహీనం కావని నమ్మి' పోరాట పంథానే కొనసాగిస్తున్నారు.

1978 లో మొదటిసారి కమ్యూనిస్ట్‌ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. అక్కడి నుంచి యువజన సంఘ నాయకునిగా, సీఐటీయూ (కార్మిక సంఘం) సభ్యులుగా, నల్గొండ జిల్లా కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్నారు. తన 40 ఏళ్ల ప్రజా ఉద్యమంలో పేదల విద్య, వైద్యం కోసం ఎనలేని కృషి చేశారు. తాను ఎమ్యెల్యేగా పనిచేస్తూ మిర్యాలగూడ నియోజకవర్గానికి నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ ద్యారా సాగునీరు అందించేందుకు ఆమరణ నిరాహర దీక్ష చేసి బీడు భూములకు కృష్ణమ్మ నీటిని మలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో సీఎం సహయ నిధి చెక్కులను రాష్ట్రంలోనే అత్యదికంగా మిర్యాలగూడకు తీసుకెళ్లిన ఘనత ఆయన సొంతం. 2009 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం సీపీఎం పార్టీ తుడుచిపెట్టుకుపోయిన తను మాత్రం మిర్యాలగూడలో గెలిచారు.

కుటుంబ నేపథ్యం : 

తండ్రి : జూలకంటి కాశిరెడ్డి 
పుట్టిన తేదీ : అక్టోబర్‌ 24, 1958
ఊరు : కొత్తగూడ (గ్రామం), తిప్పర్తి మండలం, నల్గొండ జిల్లా
భార్య : సుజాత (ఒక కుమారుడు ఒక కుమార్తె)
కుటుంబం : ఇద్దరు సోదరులు, ముగ్గురు సోదరిలు
వృత్తి : వ్యవసాయం 
చదువు : స్కూల్‌ విద్య

రాజకీయ నేపథ్యం :

- 1994 లో మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం
- 2004 లో రెండంసారి ఎమ్మెల్యేగా గెలిచారు
- 2009 లో తిరునగరి గంగాధర్ ‌(కాంగ్రెస్‌) పై గెలిచారు
- ఆగస్ట్‌ 31, 2015 - సీపీఎం నల్గొండ జిల్లా కార్యదర్శిగా నియామకం
- జూన్‌ 26, 2018 - ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌ల ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు గృహ నిర్భంధం
- ప్రస్తుతం సీపీఎం తరఫున మరోసారి మిర్యాలగూడ ప్రజలముందు నిలబడ్డారు.

- విష్ణువర్ధన్ రెడ్డి.మల్లెల (ఎస్ఎస్ జే)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement