నాలుగో తరగతిలో ఓ తెలుగు మాస్టారు తెలుగుపద్యాలు చెప్తూ వాటిలో ఒక పద్యాన్ని మర్నాడు అప్పచెప్పినవారికి ఓ నోటుబుక్కును బహుమతిగా ఇస్తామని ఆయన ప్రకటించారు. అందులో ఓ పిల్లగాడు లేచి 'సార్... ఆ పద్యాన్ని ఓ పదిసార్లు చదివి ఇప్పుడే చూడకుండా అప్పగిస్తా ' అని విన్నవించుకున్నాడు. ' ఇప్పుడే అంటే నీతో కాదు లేరా ' అని అన్నారు. అయినా పట్టువదలని ఆ విద్యార్థి ఆ పద్యాన్ని గుక్కతిప్పుకోకుండా అప్పగించారు. దాంతో ' నీ నాలుక మీద సరస్వతిదేవి గట్టిగా కూసుంది. మాటలతోనే బతుకుతవ్ పోరా ' అని ఆ ఉపాధ్యాయుడు దీవించాడు. 40 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఆ గురువుగారు అప్పుడే ఊహించినట్లున్నారు.
విమర్శల వెంటే వివాదాలు !
కల్వకుంట్ల చంద్రశేఖరరావు... ఐఏఎస్ కావాలని కన్న కల... కేసీఆర్ ఇంటర్ చదివేప్పుడే పెళ్లి చేసుకోవడం, ఇతర వ్యాపకాలతో అది కలగానే మిగిలింది. 1999లో చంద్రబాబునాయుడు రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కేసీఆర్ కు మంత్రి పదకి దక్కి ఉంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉండేవో ఊహించలేం. 1999 వరుకు రవాణా శాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ శాసనపభ డిప్యూటీ స్పీకర్ పదవిని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ చంద్రబాబుకు బహిరంగ లేఖ రాయడం పెద్ద సంచలనమే సృష్టించింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని అసెంబ్లీకి, పార్లమెంటుకు పోటీ చేయడం, అప్పటి వరకు వ్యక్తిగత సహాయకునిగా ఉన్న తన మేనల్లుడు టి.హరీశ్‌రావుకు మంత్రి పదవి ఇవ్వడం, అసెంబ్లీకి రాజీనామా చేసి మేనల్లుడ్ని గెలిపించుకోవడం ,తెలంగాణ జాగరణ సేవ పేరిట సాయుధ శిక్షణ, సోనియాను ఎన్నోసార్లు పొగిడిన నోటితోనే తీవ్ర విమర్శలు, పార్టీలో నెంబర్ టూగా ఉన్న నరేంద్రను సంజాయిషీ నోటీసు కూడా లేకుండా బహిష్కంచడం , నిజాంను ఆకాశానికి ఎత్తేయడం... వంటి చర్యలు ఆయన్నిఎప్పుడూ వార్తలలో ఉంచాయి. 'తన మాట నడవకపోతే పులిచింతలలో రక్తం పారుతుందనీ, కనుసైగ చేస్తే తెలంగాణ అగ్ని గుండం అవుతుంది' వంటి వ్యాఖ్యలు కేసీఆర్‌పై రాజకీయ దాడికి కారణమయ్యాయి. టక్కెట్ల పంపిణీలో అవినీతి, బంధుప్రీతి చాలవా అధికమని, పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వం బలపడకుండా జాగ్రత్తపడతారంటూ ఆయనపై ప్రత్యర్థులు తరచూ విమర్శిస్తుంటారు.
పుస్తకప్రియుడు
కేసీఆర్‌కు ఘంటసాల పాటలంటే ప్రాణం, ఆ పాటలు విని మంచిమూడ్‌లో వాటిని ఎదుటివారికి వినిపించడమంటే ఆయనకు ఇష్టం ,అమితాబ్ సినిమాలంటే ఎంతో ఆసక్తి . ఓల్గా నుంచి గంగ వరకు పుస్తకాలన్ని ఎన్నిసార్లు చదివారో ఆయనకే గుర్తు లేదు.దూర ప్రయాణాల్లో కారు డ్రైవింగ్ చేయడం ఆయనకో సరదా,సాహిత్య పుస్తకాలు విపరీతంగా చదువుతారు. పుస్తక ప్రియులతో గంటల తరబడి చర్చల్లో గడుపుతారు. నిత్వం అన్ని పేపర్లు చదవనిదే తర్వాత పనిలోకి వెళ్లరు.గల్లీ రాజకీయం నుంచి ఢిల్లీ రాజకీయాల వరకు ఆసక్తిగా తెలుకుంటారు.
మార్కెంటింగ్‌లో దిట్ట!
తన వ్యక్తిగత బలాలు ,బలహీనతలేమిటో ఆయనకూ తెలుసు.బలహీనతలపై విమర్శలు చేసినా పట్టించుకోరు, పైగా' మీ అంచనాలకు అనుగుణంగా నేను నడవాలని కోరుకుంటే అది నా తప్పు కాదు . నా వ్వూహాలు నాకుంటాయి.ఎప్పుడేం చేయాలో ఎక్కడేం మాట్లాడాలో నా ఎత్తుగడలు నాకుంటాయి. మీరు కోరుకున్నట్లు నేను ఉండాలనుకోవడం, అలా ఉండటం లేదని విమర్శలు చేయడం ఎట్లా సమంజసం ' అంటూ ఎదురు ప్రశ్నిస్తారు. బలహీనతలను కప్పిపుచ్చుకుని, బలాలను మార్కెట్ చేసుకోవడం ఆయనకు ఎంతగా తెలుసంటే 2009 ఎన్నికలలో తన శక్తికి మించి కాంగ్రెస్ నుంచి స్థానాలు (9 పార్లమెంట్, 42 అసెంబ్లీ స్థానాలతో పాటు మరో 14 స్థానాల్లో వామపక్షలపై పోటీ చేశారు. అందులో 5 లోక్ సభ - 26 అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలిచుకున్నారు) తీసుకున్నారు.
పని పూర్తిచేసే వాక్చాతుర్యం
'ఉచిత కరెంటు ఎవరిక్కావాలి . పంట పండితే మన కళ్లం కాడికొచ్చిన గంగెడ్లోళ్లకు చాటెడు ఒడ్లుపెట్టినంత కాదు,మనం కడుతున్న కురెంటు బిల్లు '... అంటూ 1999లో రవాణా శాఖ మంత్రిగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. 2004 ఎన్నకలకు మాట మార్చారు. 'ఉచిత కరెంటు మన హక్కు తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న కరెంటు మనకు ఇవ్వకపోవడం ఎంత పెద్ద అన్యాయం'... అంటూ అయిదేళ్ల క్రితం వాదించడం ప్రారంభించారు. అదీ ఆయన వాక్చాతుర్యం. అవును అప్పుడు అన్లేదు. ఇప్పుడు తెలిసింది అంటున్న తప్పేముంది? అనగలగడంలోనూ చాతుర్యం కలవాడు. తెలంగాణ ఉద్యమం విషయంలో ఆయన చెప్పిందే అది. మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించిన చంద్రబాబును ఆహ్వానం లేకుండా ఇంటికి చాయ్‌కు రప్పించుకున్న ఘనుడు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తానన్నా ఒకనాడు కేసీఆర్‌కు అవకాశం ఇవ్వలేదు. అదే చంద్రబాబును పొత్తులు, సీట్ల సర్దుబాటు పేరిట బురిడీ కొట్టించి విజయం సాధించారు. రాష్ట్ర మంత్రి పదవి రాకపోయినా ఏకంగా కేంద్రమంత్రి పదవినే సొంతం చేసుకున్నారు. తానే రాష్ట్రంలో ఆరుగురిని మంత్రులుగా కూడా చేశారు. టీడీపీ నుంచి తనను బయటపడేలా చేసిన చంద్రబాబును తన చుట్టూ ఎన్నికల పొత్తు కోసం తిరిగేటట్టు చేయడంకూడా కేసీఆర్ సాధించిన విజయంగా చెబుతారు. రాష్ట్రం విడిపోయింది. సీను మారిపోయింది. కేసీఆర్ మారిపోయాడు. థూ మీ బతుకు చెడ... చంద్రబాబు పొత్తేంటని కేసీఆర్ ఇప్పుడు దుమ్మెత్తి పోస్తుంటే ఎదుటివాళ్లు బిత్తరపోవల్సిందే.
పరిశీలన, అధ్యయనం ఆయన బలం.
ప్రతి చిన్న అంశంపై పరిశీలన ,క్లిష్ట సమస్యలపై లోతనై అధ్యయనం ఆయన ప్రత్యేకత . ఇష్టం లేనివారితో భేటీకి ఆయన మొహమాటానికైనా ఒప్పుకోరు. ' ప్రజల ఆకాంక్షలను ,రాజకీయ నాయకుల ప్రయోజనాలతో ముడిపెట్టి రాజకీయాలను నడిపే ప్రతిభాశాలి కేసీఆర్ అన్నది అతని సన్నిహితుడైన ఓ విశ్లేషకుడి వ్యాఖ్య. దీర్ఘకాలిక వ్యూహాలపై ఆయనకు నమ్మకం లేదు. తాత్కాలిక రాజకీయ ఎత్తుగడలకే ప్రాధాన్యమిచ్చి పార్టీని అదే దిశగా నడిపిస్తున్నారు. సభలు, సమావేశాలు, ట్రెండ్‌ల ద్వారానే ఉద్యమాన్నిసంఘటితం చేమడంలో చాలా వెనకబడిపోయారు. అనేక నియోజకవర్గాలలో ఇప్పటకీ మండల కమిటీలు వేయలేదు.
పరిపాలనలో
ఇంకా తొమ్మిది నెలలు అధికారంలో ఉండటానికి అవకాశాలున్నప్పటికీ అసెంబ్లీని రద్దు చేసి ప్రజలనే కాదు... మంత్రులు, పార్టీ నాయకులను విస్మయపరిచారు. కేసీఆర్ మొదటి నుంచి మంచి వ్యూహకర్త అనే అంటారు. భవిష్యత్తు జాతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకొనే ఈ ఎత్తుగడ వేశారన్నది రాజకీయ విశ్లేషకుల అంచనాలు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వ్యూహంలో భాగమైతే గడిచిన నాలుగేళ్ల పాలనలో కేసీఆర్ మంచిచెడులను రెండింటినీ మూట గట్టుకున్నారు. ముఖ్యమంత్రి సచివాలయం రాకుండా గడీ పాలన కొనసాగిస్తున్నారని విమర్శలు మూటకట్టుకుంటే. పలు సంక్షేమ కార్యక్రమాలను ఆయా వర్గాలతో ఆయనను శభాష్ అనిపించుకున్నరు. 2014 ఎన్నికలకు ముందు ఉన్న రాజకీయ వాతావరణం అధికారంలోకి వస్తామన్న విషయంలో కేసీఆర్ కు సైతం అనుమానాలుండొచ్చు. ప్రజలు విలక్షణమైన తీర్పు... కేసీఆర్ పేరును చరిత్రలో నిలిచేలా చేసింది. అయితే, అధికారంలోకి రాగానే ఇతర పార్టీల వారిని ఆకర్షించడం, చేసిన వాగ్ధానాలు కొన్ని నెరవేరకపోవడం, బంధుప్రీతి వంటి ఆయనను వెంటాడుతున్న విమర్శలను లెక్కచేయకపోవడం కేసీఆర్ కు ఎళ్లప్పుడు మైనస్ పాయింట్స్ గానే మిగిలిపోతాయని ఆయన శ్రేయోభిలాషులే చెబుతుంటారు.
వ్యక్తితం...
కుంటుంబంలోని 11 మందిలో ఒకరు. ఒక అన్నా, తొమ్మిది మంది అక్కాచెల్లెళ్లు. 1954 ఫిబ్రవరి ,17న చింతమడక (సిద్దిపేట)లో జన్మించిన కేసీఆర్‌కు ఒక కుమారుడు, ఒక కూతురు. కుమార్తె కవిత పుట్టిన తర్వాతే రాజకీయాల్లో కలిసొచ్చిందని గట్టి నమ్మకం. కొడుకు (కేటీఆర్) తొట్టిలప్పుడు (1975లో) ఇంటికి కూడా వెళ్లలేదు. కుంటుంబ సభ్యులతో తక్కువగా గడుపుతారు. 'గొప్పవాళ్లందరూ కుటుంబానికి ద్రోహులే ' అని సమర్థించుకుంటారు కూడా.
Comments
Please login to add a commentAdd a comment