సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా, మహమూద్ అలీ మంత్రిగా గురువారం ప్రమాణం చేశారు. వారం రోజుల్లోపే పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరనుంది. అయితే.. ఈసారి ఎవరికి కేబినెట్ బెర్తులు దక్కుతాయనేదానేదే ఆసక్తికరంగా మారింది. గత ప్రభుత్వంలోని నలుగురు మంత్రులు ఈసారి ఓడిపోయారు. వీరి స్థానాల్లో కొత్త వారిని తీసుకోవడం ఖాయం. అయితే.. గతంలో ఉన్నవారిలో ఎందరికి మంత్రి పదవులు ఇస్తారనేదే మాజీల్లో ఉత్కంఠ రేపుతోంది. దీనికితోడు కొత్త వారిలో ఎందరికి, ఎవరెవరికి అవకాశం ఇస్తారనేదానిపై చర్చ జరుగుతోంది. మంత్రులుగా తమ పేరును పరిశీలించాలని పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎంకు విజ్ఞప్తి చేసుకుంటున్నారు. నేరుగా చెప్పకుండా మనసులోని మాటను అధినేతకు తెలిసేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
కేసీఆర్ కసరత్తు
కొత్త జట్టు కూర్పుపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఈ కూర్పు పూర్తయిన తర్వాత.. ఈ నెల 17 లేదా 18 తేదీల్లో మిగిలిన మంత్రుల ప్రమాణస్వీకారం జరగొచ్చని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ముందస్తు ఎన్నికలో టీఆర్‌ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించింది. వీరిలో సీనియర్ ఎమ్మెల్యేలు అందరూ మంత్రి పదవులు ఆశిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు సైతం మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రాజ్యాంగ నియమావళి ప్రకారం తెలంగాణలో సీఎం, మరో 17 మంది మంత్రులు ఉంటారు.
కేసీఆర్, మహమూద్ అలీ గురువారం ప్రమాణం స్వీకారం చేశారు. మరో 16 మందికే కేబినెట్ బెర్త్ దక్కుతుంది. జిల్లాలు, సామాజిక లెక్కల ప్రకారం వీటిని భర్తీ చేయాల్సి ఉంది. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు (కమ్మ), జూపల్లి కృష్ణారావు (వెలమ), అజ్మీరా చందూలాల్ (ఎస్టీ–లంబాడ), పట్నం మహేందర్ రెడ్డి ఓడిపోయారు. అసెంబ్లీలో కేసీఆర్ తర్వాత ఆరుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన డీఎస్ రెడ్యానాయక్ (ఎస్టీ–లంబాడ), ఎర్రబెల్లి దయాకర్‌రావు (వెలమ)లకు కొత్త ప్రభుత్వంలో బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్ భారీ విజయాలను నమోదు చేసుకున్నా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఒక్క స్థానానికే పరిమితమైంది.
ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్‌లో పువ్వాడ అజయ్ కుమార్ (కమ్మ) గెలిచారు. 2014 ఎన్నికల్లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌కు ఒకటే స్థానం వచ్చింది. ఆరు నెలల వరకు ఆ జిల్లా నుంచి ఎవరికీ మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. ఖమ్మం ఉమ్మడి జిల్లాకు మంత్రివర్గంలో స్థానం కల్పించే విషయంలో సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిథ్యం వహిస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరు ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి పదవికి పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
సామాజిక వర్గాల వారిగా..
అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రిగా ఉన్న పట్నం మహేందర్‌రెడ్డి ఎన్నికలలో ఓడిపోయారు. ఈ జిల్లా కోటాలో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి పేర్లను సీఎం పరిశీలిస్తున్నారు. కేసీఆర్ పాత జట్టులో సభ్యులుగా ఉన్న వారిలో మార్పులు చేస్తే గ్రేటర్ హైదరాబాద్ నుంచి కేపీ వివేకానంద (కుత్బుల్లాపూర్), దానం నాగేందర్ (ఖైరతాబాద్)ల పేర్లను పరిశీలించే అవకాశం ఉంది. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి (ఎస్సీ)ని కొనసాగించే విషయంలో మార్పులు జరిగితే రాష్ట్రంలో హరీశ్ రావు తర్వాత రెండో అతిపెద్ద విజయం సాధించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ (మాదిగ)తోపాటు రసమయి బాలకిషన్ (మాదిగ)లలో ఒకరికి మంత్రి పదవి ఖాయమయ్యే అవకాశం ఉంది.
మరోవైపు ఇదే కోటాలో మాల సామాజికవర్గానికి చెందిన కొప్పుల ఈశ్వర్ (మాల), చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్టీ కోటాలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ను ఖరారు చేస్తే మహిళా కోటా సైతం భర్తీ కానుందని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మహిళా మంత్రి కోటాలో పద్మా దేవేందర్ రెడ్డి (మెదక్), గొంగడి సునీత (ఆలేరు) పేర్లను టీఆర్‌ఎస్ అధినేత పరీశీలిస్తున్నారు. కీలకమైన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల భర్తీ పూర్తయ్యాకే మంత్రి పదవుల విషయంలో సీఎం కేసీఆర్ తుది నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రి పదవులకు ప్రాబబుల్స్:
ఆదిలాబాద్: అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, బాల్క సుమన్, అజ్మీర రేఖానాయక్
నిజామాబాద్: పోచారం శ్రీనివాస్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి
కరీంనగర్: కేటీఆర్, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్
మెదక్: హరీశ్‌రావు, సోలిపేట రామలింగారెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి,
హైదరాబాద్: తలసాని శ్రీనివాస్‌యాదవ్, టి.పద్మారావుగౌడ్, దానం నాగేందర్.
రంగారెడ్డి: సీహెచ్ మల్లారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కేపీ వివేకానంద్.
మహబూబ్‌నగర్: సి.లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్.
నల్లగొండ: జి.జగదీశ్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, గొంగడి సునీత.
వరంగల్: కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, డీఎస్ రెడ్యానాయక్, అరూరి రమేశ్, దాస్యం వినయభాస్కర్.
ఖమ్మం: పువ్వాడ అజయ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment