padma devendar reddy
-
మెదక్‌లో గెలుపొంది.. ఉన్నత పదవుల్లోకి..!
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా ఎంతో మందికి మంచి పదవులను అందించి వారిని ఉన్నత స్థానాల్లో నిలబెట్టింది. ప్రముఖులుగా చరిత్రలో లిఖించింది. గతంలో ఇక్కడి నుంచి పోటీచేసి గెలిచిన నాయకులు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఉప సభాపతి లాంటి ఉన్నతమైన పదవులు అలంకరించారు. అలా ఉన్నత పదవులను కైవసం చేసుకున్న వారంతా చరిత్రపుటల్లో నిలిచిపోయారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నేటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోను మెదక్ జిల్లాకు ఆ విధమైన ప్రత్యేక ఏర్పడింది. ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీచేసి విజయం సాధించి దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. పద్మాదేవేందర్‌రెడ్డి.. పద్మాదేవేందర్‌రెడ్డి 2001లో టీఆర్ఎస్ అవిర్భావం నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 2001లో రామాయంపేట జడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2004లో ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. అనంతరం స్వరాష్ట్రం కోసం 2008లో కేసీఆర్ పిలుపు మేరకు తన పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీచేయగా ఓడిపోయారు. ఆ తరువాత 2009లో టికెట్ దక్కక పోవడంతో స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చవిచూశారు. 2014లో మెదక్ ఎమ్మెల్యేగా గెలుపొంది తెలంగాణలో తొలి ఉప సభాపతిగా పనిచేసి చరిత్రలో నిలిచారు. అనంతరం 2018లో సైతం ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా పద్మాదేవేందర్‌రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ 1980లో లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా ఇందిరాగాంధీ(కాంగ్రెస్) నుంచి పోటీచేసి భారీ మెజార్టీతో గెలుపొంది దేశ ప్రధానమంత్రి పదివిని అలంకరించారు. అప్పట్లో ఇందిరాగాంధీకి 3,01,577 ఓట్లు రాగా తన ప్రత్యర్థి జనతాపార్టీకి చెందిన జైపాల్‌రెడ్డికి 82,453 ఓట్లు వచ్చాయి. ఇందిరాగాంధీ 2,19,124 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ముఖ్యమంత్రిగా అంజయ్య.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మెదక్ జిల్లా రామాయంపేట నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన టి.అంజయ్య 1980 అక్టోబర్ నుంచి 1982 ఫిబ్రవరి వరకు 16 నెలల పాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పట్లో చెన్నారెడ్డి సీఎంగా కొనసాగుతున్న సందర్భంగా ఆయనను మార్చి అంజయ్యకు సీఎంగా అవకాశం కల్పించారు. ఆయన అప్పట్లో కేంద్ర మంత్రిగా పనిచేస్తుండగా దానికి రాజీనామా చేసిన ఆయన ఎమ్మెల్యేగా ఎంపిక కాకుండానే సీఎం పదవి చేపట్టారు. రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల్లో ఏదో ఒక చోటు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాలి. ఈ నేపథ్యంలో అప్పటికే రామాయంపేట ఎమ్మెల్యేగా ముత్యంరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండగా టి.అంజయ్య కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో రామాయంపేట స్థానానికి ఎన్నికలు నిర్వహించగా ప్రతిపక్షాలు సైతం నామినేషన్ వేయక పోవడంతో టి.అంజయ్య ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికై సీఎం పదవిని అలంకరించి 16 నెలల పాటు కొనసాగారు. ఉప ముఖ్యమంత్రిగా జగన్నాథరావు మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి పోటీచేసి ఎమ్మెల్యే గెలుపొందిన సీహెచ్ జగన్నాథరావు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఫిబ్రవరి 24 నుంచి సెప్టెంబర్ 20 వరకు సుమారు ఏడు నెలల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇవి కూడా చదవండి: ఐదేళ్లు మీకోసం రక్తం ధారపోస్తా..! : మంత్రి గంగుల కమలాకర్ -
TS Election 2023: 'పద్మా నా బిడ్డ' : సీఎం కేసీఆర్
మెదక్: అభివృద్ధిలో మెదక్ జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతా.. పట్టణం చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మిస్తాం.. రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా మారుస్తాం.. కౌడిపల్లి, రామాయంపేటలో డిగ్రీకళాశాలు ఏర్పాటు చేస్తాం.. టూరిజం అభివృద్ధికి రూ.100 కోట్లతో పాటు పలు వరాలు కురిపించారు సీఎం కేసీఆర్. జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన ప్రగతి శంఖారావం సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా బీఆర్ఎస్ పార్టీ, ఎస్పీ, సమీకృత కలెక్టరేట్ భవనాలను సీఎం ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. మెదక్ పట్టణం చుట్టూ రింగ్‌రోడ్డు ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యను తీరుస్తామన్నారు. రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేస్తానని, కౌడిపల్లికి, రామాయంపేటకు డిగ్రీకళాశాలలను మంజూరు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఏడుపాయల వనదుర్గామాత ఆలయం, పోచారం అభయారణ్యం, పోచారం ప్రాజెక్టు, మెదక్ ఖిల్లా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చి, కొల్చారం మండల కేంద్రంలోని జైనమందిరం తదితర ప్రదేశాల అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తునట్లు వెల్లడించారు. అలాగే మెదక్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున రూ.125 కోట్లను మంజూరు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ వాళ్లు ధరణిని తీసి వేద్దామంటున్నారు. మీరేమంటారని సీఎం ప్రశ్నించడంతో వద్దూ వద్దూ అంటు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పద్మా నా బిడ్డ.. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి నా కూతురులాంటిదని సీఎం కేసీఆర్ అన్నారు. ఎమ్మెల్యే విన్నవించిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని, ప్రగతిలో మెదక్ జిల్లాను మెరిపిస్తామన్నారు. మరి మీరు మాత్రం గతంలో కన్నా అధిక మెజార్టీతో పద్మాదేవేందర్‌రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. దీంతో సభ ప్రాంగణమంతా హర్షధ్వానాలతో మారుమోగింది. -
టీఆర్ఎస్లో పోటాపోటీ.. ప్రజాక్షేత్రంలో బిజీగా నేతలు
సాక్షి, మెదక్: అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న టీఆర్ఎస్ నియోజకవర్గ నేతలు పోటాపోటీ కార్యక్రమాలకు తెరలేపారు. బహిరంగంగా ఎక్కడా విభేదాలు కనబడకున్నా.. అంతర్గతంగా ఎవరికి వారు ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నట్లు చర్చసాగుతోంది. స్థానికంగా జరిగే కార్యక్రమాలకు హాజరవుతూ జనం మధ్యలో ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పటికే మెదక్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరిసుభాష్‌రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునితాలక్ష్మారెడ్డి మధ్య వర్గ విభేదాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ప్రజల మద్దతుకై ఆరాటం ► అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల గడువున్నా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నేతలు ఇప్పటి నుంచే ప్రజల మద్దతును కూడగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ► మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు టికెట్ ఆశిస్తు న్న ముఖ్య నాయకులు ఆయా నియోజకవర్గాల్లో ముమ్మరంగా పర్యటిస్తూ, ఏ చిన్న అవ కాశం ఉన్నా వదులుకోకుండా హాజరవుతున్నారు. ► ఎవరి వర్గాన్ని వారు కాపాడుకుంటూ పోటీపోటీగా అధికార, ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటుండడంతో రాజకీయవర్గాల్లో విస్తృతంగా చర్చ మొదలైంది. మెదక్ నియోజకవర్గంలో.. ► మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి ఇప్పటికే జిల్లా పార్టీ పగ్గాలను సీఎం కేసీఆర్ అప్పగించటంతో నియోజకవర్గంతో పాటు ఇతర ముఖ్య పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ బీజీగా గడుపుతున్నారు. ► ప్రతీ మంగళవారం క్యాంపు కార్యాలయంలో మీ కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పద్మాదేవేందర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదానం, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. ► అవకాశం దొరికినప్పుడల్లా మెదక్ జిల్లాకు రైలు, మెడికల్ కళాశాల మంజూరు తదితర పనులపై ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ► సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి జన్మదినం సందర్భంగా గతేడాది ఆగస్టులో ఆయన వర్గీయులు నియోజకవర్గంలో భారీ ర్యాలీ, కటౌట్లతో హంగామా చేశారు. ► తమ వర్గీయులతో కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందిస్తూ ప్రజల మెప్పు పొందుతున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ సమస్యలపై దృష్టి పెడుతున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో... ► సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునితా లక్ష్మారెడ్డి పోటాపోటీగా పర్యటనలు చేస్తూ, స్థానికంగా ఎక్కువ సమయం ఉండేలా చూసుకుంటున్నారు. ► నర్సాపూర్‌లో మహిళా కమిషన్ చైర్పర్సన్ సు నితా లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలను ఆమె వర్గీయులు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ► మరోవైపు మదన్‌రెడ్డి అనుయాయులు ఆయన పుట్టిన రోజున ఆలయాల్లో పూజలు చేశారు. నర్సాపూర్ నుంచి చాకరిమెట్ల వరకు కాలినడకన వెళ్లి పూజలు నిర్వహించారు. ► మెదక్‌లో పద్మాదేవేందర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డిలు, నర్సాపూర్‌లో మదన్‌రెడ్డి, సునితా లక్ష్మారెడ్డి ఎవరికి వారు ప్రజల్లో ఉంటూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ► ఈ క్రమంలో అధికార పక్షానికి చెందిన ఇద్దరు నేతలు రెండు వర్గాలుగా ఏర్పడడంతో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ రెండు నియోజకవర్గాలు.. ► జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజక వర్గాలు ఉన్నా, మెదక్ మాత్రమే పూర్తిస్థాయి నియోజకవర్గంగా కొనసాగుతోంది. ► మెదక్ నియోజకవర్గంలోని హవేళిఘనాపూర్, రామాయంపేట, పాపన్నపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట మండలాలతో పాటు మెదక్, నర్సాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ► నర్సాపూర్ నియోజక వర్గంలో నర్సాపూర్, శివ్వంపేట, వెల్దూర్తి, కొల్చారం, కౌడిపల్లి, చిలిపిచెడ్, నర్సాపూర్ మున్సిపాలితో పాటు హత్నూర మండలం ఉన్నా, పాలనా సౌలభ్యం కోసం దానిని సంగారెడ్డి జిల్లాలో కలిపారు. ► గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్, మనోహరబాద్లను, దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట, నార్సింగ్ మండలాలను, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పెద్దశంకరంపేట మండలాన్ని, అందోల్ నియోజకవర్గంలోని టేక్మాల్, రేగోడు, అల్లాదుర్గ్, మండలాలను మెదక్ జిల్లాలో కలిపారు. ► ఇటీవల ఏర్పడిన మాసాయిపేట మండలంతో కలిపి జిల్లాలో 21 మండలాలు, 4 మున్సిపాలిటీలు మెదక్ జిల్లాలో కొనసాగుతున్నాయి. (క్లిక్: అధికార పార్టీలో ధిక్కార స్వరం.. ‘కారు’కు ఏమైంది?) -
ఓట్ల పండుగ.. జనం నిండుగ
సాక్షి,మెదక్: మెదక్ నియోజకవర్గంలో గురువారం జరిగిన లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని చోట్ల సాంకేతిక లోపంతో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. 273 పోలింగ్ కేంద్రాల్లో 72.84 శాతం పోలింగ్ జరిగింది. ఇందులో చిన్నశంకరంపేట మండలంలో 75 శాతం పోలింగ్ నమోదై నియోజకవర్గంలోనే ముందంజలో ఉంది. ఇక చిన్నశంకరంపేట మండలంలో 75 శాతం పోలింగ్ కాగా రామాయంపేట మండలంలో 73.76 శాతం, నిజాంపేటలో 69.49 శాతం, పాపన్నపేట మండలంలో 71.46 శాతం, రేగోడ్ మండలంలో 66 శాతం, పెద్దశంకరంపేట మండలంలో 69 శాతం, టేక్మాల్ మండలంలో 68.33 శాతం పోలింగ్ నమోదైంది. మెదక్ మున్సిపాలిటీ: మెదక్ పట్టణంలో గురువారం జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పట్టణంలోని 27 వార్డుల్లో మొత్తం 33 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలనుంచి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటింగ్‌లో యువకులు, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సందర్శించి ఓటింగ్ సరళిన అడిగి తెలుసుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలను ఆకట్టుకునేందుకు బెలూన్ల తోరణాలతో అందంగా ముస్తాబు చేశారు. నవాబుపేటలో మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, ఆయన సతీమణి గాయత్రి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే వైస్‌చైర్మన్ రాగి అశోక్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న యువకులు సెల్పీలు దిగుతూ సందడి చేశారు. శభాష్ పోలీస్ పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుగా నిర్వహించిన పలువురు కానిస్టేబుళ్లు తమ సేవా ధృక్పదాన్ని చూపి పలువురి చేత శభాష్ పోలీస్ అనిపించుకున్నారు. ఓ వైపు విధులు నిర్వహిస్తూనే కేంద్రాలకు వచ్చిన వృద్ధులకు, వికలాంగులను సేవలందించారు. నడవలేని వికలాంగులు, వృద్ధులను ఎత్తుకొని పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లారు. మహిళల కోసం వెయింటింగ్ హల్.. చిన్నశంకరంపేట(మెదక్): ఓటు వేసేందుకు గంటల తరబడి క్యూలో నిలబడాలి. అయితే ఓ గ్రామ సేవకుడి ఐడియా మహిళలకు క్యూౖలో నిలబడె శ్రమను తప్పించింది. మండలంలోని మడూర్‌లోని ఓ పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఏర్పాటుచేశారు. ఓటు వేసేందుకు వచ్చిన వారి కోసం వెయింట్ హాల్ ఏర్పాటుచేశారు. దీంతో ఎండలో వచ్చినవారు వెయింట్ హాల్ కూర్చొని సేదతీరారు. గ్రామ సేవకుడు యాదగిరిని పలువురు అభినందించారు. -
అడ్వకేట్ నుంచి డిప్యూటీ స్పీకర్ దాకా...!!!
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి తొలి డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న పద్మాదేవేందర్ రెడ్డి 2001లో టీఆర్ఎస్లో చేరినప్పటి నుంచి ఆ పార్టీలో చురుకుగా పనిచేస్తున్నారు. వృత్తి రీత్యా న్యాయవాది అయిన పద్మా దేవేందర్ రెడ్డి రాజకీయాల్లో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అడ్వకేట్ గా పనిచేసిన అనుభవం ఆమెకు రాజకీయాల్లో కలిసొచ్చిన అంశం. టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పటకీ ఆమె మాత్రం తన ధైర్యం కోల్పోలేదు. ఆమె పోరాట పటిమ చూసి పార్టీయే దిగివచ్చింది. ఈ ఒక్క విషయం చాలు పద్మా దేవేందర్ రెడ్డి ఏంటో తెలుసుకోవడానికి! విద్యార్థి దశ నుంచే రాజకీయాలంటే ఆసక్తి కనబర్చిన పద్మా దేవేందర్ రెడ్డి రాజకీయాల్లోకి ప్రవేశించిన అనతి కాలంలోనే జెడ్పీటీసీ మెంబర్‌గా గెలిచి తన సత్తా చాటారు. పద్మా దేవేందర్ రెడ్డి చేరికతో బీజేపీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్న ఆమె భర్త కూడా టీఆర్ఎస్లో చేరిపోయారు. పెద్ద కుటుంబంలో జన్మించిన పద్మాదేవేందర్ రెడ్డి బాల్యమంతా ఊర్లోనే సాగింది. చిన్నప్పడు ఎప్పుడూ చదువులో ముందుండేవారు.చదువులో అందరికన్నా ముందుండాలనే పట్టుదలతో ఉండేవారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జన్మించిన పద్మా దేవేందర్ రెడ్డి చదువంతా కరీంనగర్ పట్టణంలోనే సాగింది. ఎల్ ఎల్ బీ పూర్తి కాగానే న్యాయవాద వృత్తి ప్రాక్టీస్ ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో దాదాపు మూడేళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 17 ఏళ్ల ప్రాయంలోనే వివాహం జరిగినప్పటికీ తాను మాత్రం లక్ష్యాన్ని పక్కన పెట్టలేదు. ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని కుంటుంబం నుంచి వచ్చిన పద్మాదేవేందర్ రెడ్డి రాజకీయ నేతగా నిలదొక్కుకోగలిగారంటే అది ఆమె సంకల్ప బలమే అని సన్నిహితులు చెబుతుంటారు. మంత్రివర్గంలో చేరాలని బలమైన ఆకాంక్ష ఉన్నప్పటికీ కేసీఆర్ సూచనల మేరకు డిప్యూటీ స్పీకర్ పదవిని స్వీకరించారు. బాధ్యతలను నిర్వర్తించడంలో కష్టపడే తత్వం పద్మా దేవేందర్ రెడ్డిది. ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఉద్యమంలో భాగంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో కలసి సిద్దిపేట నుంచి వరంగల్ వరకు సైకిల్ యాత్రలో పాల్గొని ఏ విషయంలోను మహిళలు పురుషుల కన్నా తక్కువ కాదని చాటి చెప్పారు. కుటుంబ నేపథ్యం : పేరు : మాధవరెడ్డిగారి పద్మా దేవేందర్ రెడ్డి జన్మస్థలం : ఉమ్మడి కరీంనగర్ జిల్లా పుట్టిన తేదీ : జనవరి6,1969 తల్లిదండ్రులు : విజయా రెడ్డి,భూమి రెడ్డి చదువు : బీ.ఏ ఎల్.ఎల్.బి (ఉస్మానియా యూనివర్సిటీ) వివాహం : 22 పిబ్రవరి,1988 భర్త : ఎం దేవేందర్ రెడ్డి కుటుంబం : కుమారుడు పునీత్ రెడ్డి రాజకీయ నేపథ్యం : ►2001 లో టీఆర్ఎస్ ద్వారా రాజకీయాల్లోకి రంగ ప్రవేశం ►2001 లో మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో రామాయంపేట నుంచి జెడ్పీటీసీగా గెలుపు (జెడ్పీలో పార్టీ ఫ్లోర్ లీడర్ కూడా) ►2004 లో రామాయంపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక ► 2008 ఉప ఎన్నికల్లో ఓటమి (ఉద్యమంలో భాగంగా పదవి రాజీనామా, తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి) ► 2009 లో ఎన్నికల్లో ఓటమి ►2009 లో టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ (కూటమి పొత్తుల్లో భాగంగా టీఆర్ఎస్ అథిష్టానం టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు) ► 2010 లో తిరిగి పార్టీలో చేరిక ► 2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి గెలుపు (మళ్లీ ప్రస్తుత ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ) ►2014-2018 తెలంగాణ తొలి డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. ఎ.రమణా రెడ్డి (ఎస్.ఎస్.జే) -
‘కాళేశ్వరం’తో రాష్ట్రం సస్యశ్యామలం
మహదేవపూర్(వరంగల్): ప్రపంచంలో అత్యంత వేగవంతంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చరిత్రలో నిలిచిపోతారని శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులను శనివారం పద్మాదేవేందర్‌రెడ్డి సందర్శించారు. ఉదయం 9 గంటలకు మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డకు చేరుకోవల్సిన పద్మాదేవేందర్‌రెడ్డి మధ్యాహ్నం 1 గంటకు చేరుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీ పనులను పరిశీలించారు. ఎల్ అండ్ టీ కంపెనీ అధికారులు, ఇంజనీర్లు ఆమెకు ఘనస్వాగతం పలికారు. మేడిగడ్డ బ్యారేజీ డిప్యూటీ ఇంజనీయర్ సురేష్ బ్యారేజీ నిర్మాణ వివరాలను, నీటి ప్రవాహం, రివర్స్ పంపింగ్ సిస్టమ్ ద్వారా గోదావరి, ప్రాణహిత నీటిని తరలించే విధానంపై మ్యాపు ద్వారా వివరించారు. మేడిగడ్డ బ్యారేజీ పనులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం పద్మాదేవేందర్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి రంగంపై దృష్టి సారించలేదని, వలసాంద్రపాలకులు మన నీటిని దోచుకుపోతున్నా..తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు చూస్తూ ఊరుకున్నారని ఆరోపించారు. నిధులు, నీళ్లు, నియామకాల్లో వివక్షకు గురైన తెలంగాణ ప్రజానీకం ఉద్యమసారధి కేసీఆర్ వెంట నడిచి ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన వెంటనే టీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి రంగ నిపుణులతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గోదావరి నీటి వినియోగంపై చర్చించి ‘వ్యాప్కోస్’ సంస్థతో సర్వే చేయించారని అన్నారు. గోదావరిలోని తెలంగాణ వాటా 957 టీఎంసీల నీటిని వాడుకునే విధంగా ప్రణాళికలు తయారు చేసుకుని దాంట్లో భాగంగా మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించి 16 టీఎంసీల నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా ఎగువ ప్రాంతాలకు తరలించాలని ‘కాళేశ్వరం ప్రాజెక్టు’ను ప్రారంభించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో 16 జిల్లాలకు సాగు, తాగునీటి వసతి కలుగుతోందని తెలిపారు. కరువుతో అల్లాడుతున్న మెదక్ జిల్లాకు సింగూర్ జలాలు మాత్రమే ఉండేవని, గత ప్రభుత్వం సింగూరు జలాలను హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు తరలించడంతో పంట భూములన్నీ బీళ్లుగా మారాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో మెదక్ జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగం తరుఫున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఆమె వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీపతి బాపు, నాయకులు సుంకె మధు, లక్ష్మణ్, బాబురావు, మాధవరావు తదితరులు ఉన్నారు. -
సమ్మె విరమించిన రేషన్ డీలర్లు
సాక్షి, హైదరాబాద్ : రేషన్ డీలర్లు సమ్మె విరమించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించడంతో సమ్మె విరమిస్తున్నట్లు రేషన్ డీలర్స్ సంఘం నేత రమేష్ ప్రకటించారు. హైదరాబాద్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఆర్థిక, పౌర సరఫరాల శాఖల మంత్రి ఈటల రాజేందర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపారు. పెండింగ్ బకాయిల విడుదల, కనీస వేతనంపై హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ సమ్మెకు వెళతామని రమేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు మాట్లాడుతూ.. మాకు ముఖ్యమంత్రి న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వాజీర్ ఖాన్ కుటుంబాన్ని అదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. డిప్యూటీ స్పీకర్, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. డీలర్ల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. కాగా సమస్య పరిష్కారానికి కృషి చేసిన డిప్యూటీ స్పీకర్, మంత్రులకు డీలర్లు ధన్యవాదాలు తెలిపారు. -
క్రాప్ కాలనీలఏర్పాటు
పాపన్నపేట(మెదక్): రైతు ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ క్రాప్ కాలనీలు ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. ఏడుపాయల్లో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. దేశంలోని అన్ని వృత్తులు, ఉద్యోగస్తులకు సంఘాలున్నప్పటికీ రైతులకు మాత్రం ఎలాంటి సంఘాలు లేవని తెలిపారు. దీంతో వారు పండించిన పంటలకు దళారులు ధరలను నిర్ణయించే పరిస్థితి ఉందన్నారు. ఈ విషయాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం క్రాప్ కాలనీలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. దీని ద్వారా రైతులు ఎలాంటి పంటలు వేయాలి ? ఏ పంటకు డిమాండ్ ఉంది ? ఎంత పంట పండించాలి ? గిట్టుబాటు ధర ఎంత ఉండాలి ? ఈ విషయాలను క్రాప్ కాలనీల ద్వారా రైతు సమన్వయ సంఘాలు నిర్ణయిస్తాయని తెలిపారు. తెలంగాణలో రైతుల కోసం 24గంటల కరెంట్, సాగునీరు, ఎరువులు, విత్తనాలు ప్రభుత్వమే అందజేస్తుందన్నారు. అనుకున్న ప్రాజెక్టులు పూర్తయితే కోటి ఎకరాల భూమికి సాగునీరు అందుతుందన్నారు. ఈ ఏడాది మే నెల నుంచి పంటల పెట్టుబడికోసం ఎకరాకు రూ.4వేల చొప్పున ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. ఇప్పటికే 2,400 ఏఈఓలను నియమించామన్నారు. 5వేల రైతులకు ఒక ఏఈఓ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏడుపాయల పాలకవర్గ చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి, ఎంపీపీ పవిత్ర, రైతు సమన్వయ సమితి జిల్లా అద్యక్షుడు టి. సోములు, ఏడుపాయల డైరెక్టర్లు దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి నిధులు చిన్నశంకరంపేట(మెదక్): శ్రీ సోమేశ్వర ఆలయ అభివృద్ధికి నిధులు అందించనున్నట్లు డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని మడూర్ మధిర గ్రామమైన వెంకట్రావుపల్లి–కుర్మపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీసోమేశ్వర ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆలయల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. శ్రీసోమేశ్వర ఆలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణం కోసం నిధులు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నరేందర్, లక్ష్మారెడ్డి, రాజు, కుమార్‌గౌడ్, సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు సుధాకర్‌రావు, నాగరాజు, భూపాల్, వెంకటేశం, సత్యనారాయణ, పాల్గొన్నారు. కాగా ఈ ఈ కార్యక్రమాలు శ్రీఅష్టకాల నరసింహరామశర్మ ఆధ్వర్యంలో వేద బ్రాహ్మోణోత్తములచేత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
రాజకీయ జన్మనిచ్చింది కేసీఆర్
మెదక్ మున్సిపాలిటీ: ‘జన్మనిచ్చింది మా తల్లిదండ్రులైతే.. రాజకీయ జన్మనిచ్చింది సీఎం కేసీఆర్’ అని డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం శాసనసభ ఉపసభాపతి జన్మదిన వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను ఆడబిడ్డగా ఆదరించి ఆశీస్సులు అందజేసిన ప్రజలందరికి శిరస్సు వంచి నమస్కారాలు తెలిపారు. ఆమెకు జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే... రాజకీయ జన్మనిచ్చింది సీఎం కేసీఆర్ అని, వారికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా అభివృద్ధి పనులు చేస్తూ పాలన కొనసాగిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ... అన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తానన్నారు. అలాగే భవిష్యత్ తరాలకు అన్ని హంగులతోకూడిన మెదక్ నియోజకవర్గాన్ని అందిస్తానని తెలిపారు. జన్మదిన వేడుకలు ఇలా... ఉదయం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అక్కడ కేక్‌కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తల నడుమ జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు గజమాలతో ఘనంగా సన్మానించారు. పూలవర్షం కురిపించి తమ అభిమానం చాటుకున్నారు. అంతకు ముందు బాణాసాంచా కాల్చి స్వాగతం పలికారు. కౌన్సిలర్ మాయ మల్లేశం తయారు చేయించిన 50 కిలోల కేక్‌ను ఆమె కట్ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి రక్తదానం చేశారు. ఆయనతో పాటు ఈ శిబిరంలో 70మంది వరకు రక్తదానం చేశారు. శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆమెను సన్మానించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నగేశ్, డీఆర్వో రాములు, ఆర్డీఓ మెంచు నగేశ్, నర్సాపూర్ ఆర్డీఓ వెంకటేశ్వర్లు, మెదక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, మెదక్ పట్టణ సీఐ భాస్కర్, రూరల్ సీఐ రామకృష్ణ, ఇరిగేషన్ ఈఈ ఏసయ్య, పంచాయతీరాజ్ ఈఈ, డీఏఓ పరశురాం, స్త్రీశిశు సంక్షేమశాఖ జిల్లా అధికారిణి జ్యోతిపద్మ తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన సంబురాలు.. ఆటోనగర్, ఖాజా ఇంజనీరింగ్ వర్క్షాప్వద్ద, పాత బస్టాండ్ వద్ద, మున్సిపల్ కార్యాలయంలో, జిల్లా గ్రంథాలయ సంస్థలో, జేఎన్ రోడ్డులో మేరు సంఘం ఆధ్వర్యంలో, 3, 4వ వార్డుల్లో, రాందాస్ చౌరస్తాలో, ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో, డాన్ బాస్కో హైస్కూల్లో , హోటల్ చంద్ర భవన్ వద్ద , హోటల్ బావర్చి ఆధ్వర్యంలో, ఎస్టీ బాలికల వసతి గృహంలో అంగరంగ వైభవంగా పద్మాదేవేందర్‌రెడ్డి జన్మదిన వేడకలను నిర్వహించారు. పలు చోట్ల అభిమానులు, కార్యకర్తలు కేక్ కట్ చేశారు. హోటల్ చంద్రభవన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు చీరలను పంచి పెట్టారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అకిరెడ్డి కృష్ణారెడ్డి, ఎంపీపీ లక్ష్మీకిష్టయ్య, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, కౌన్సిలర్లు అనిల్‌కుమార్, రబ్బీన్ దివాకర్, మధుసూదన్‌రావు, చంద్రకళ, విజయలక్ష్మి, గాయత్రి, లక్ష్మి, సులోచన, యశోద, రాధ, కౌన్సిలర్ సోహైల్, కో అప్షన్ సభ్యులు గంగాధర్, సాధిక్, జీవన్‌రావు, కిరణ్‌గౌడ్, టీఎన్జీఓస్ నాయకులు భూపాల్‌రెడ్డి, శ్యాంరావు, జెల్ల సుధాకర్, నరేందర్, సువర్ణ, శివ్వంపేట ఎంపీపీ హరికృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ చల్లా నరేందర్, గడ్డమీది కృష్ణాగౌడ్, వైస్ ఎంపీపీ లలితవిశ్వం, ఫాజిల్, శ్రీకాంత్ తదితరులు వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. చిన్నశంకరం పేటలో హోమం.. చిన్నశంకరంపేట(మెదక్): డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు శనివారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. శ్రీఅనంతపద్మనాభస్వామి గుట్టపై సర్పంచ్ కుమార్‌గౌడ్ అధ్వర్యంలో నిర్వహించిన హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీఅనంతపద్మనాభస్వామి, శివలింగాలకు ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో రామాయంపేట ఏఎంసీ చైర్మన్ గంగా నరేందర్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్‌ను ఆమె కట్‌చేశారు. అనంతరం పేదలకు దుప్పట్లు, చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చేగుంట నుంచి భారీ బైక్ ర్యాలీతో టీఆర్ఎస్ కార్యకర్తలు స్వాగతం పలికారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ చంద్రాగౌడ్, కృపావతి, విజయలక్ష్మి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు, సర్పంచ్‌లు మైనంపల్లి రంగారావు, సాన సత్యనారాయణ, సుధాకర్, సిద్దాగౌడ్, పడాల సిద్దిరాములు, టీఆర్ఎస్ నాయకులు రామ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, వడ్ల శ్రీనివాస్, రమేశ్‌గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాయంపేట సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్ఐ ప్రకాష్‌గౌడ్, తహసీల్దార్ సహదేవ్‌లు బోకేలను శుభాకాంక్షలు తెలిపారు. -
జేసీబీ నడిపి.. సాధారణ కూలీగా డిప్యూటీ స్పీకర్
మెదక్: తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి శుక్రవారం మెదక్ పట్టణంలో పర్యటించారు. మధ్యాహ్నం 12:30 గంటలకు పట్టణంలోని నాయకుని చెరువులో మిషన్ కాకతీయ పనులు ప్రారంభించారు. ఈ పనుల్లో భాగంగా మహిళా నేత పద్మాదేవేందర్ రెడ్డి స్వయంగా జేసీబీ నడిపి పనులకు శ్రీకారం చుట్టడం విశేషం. పలుగు, పార చేతపట్టి సాధారణ కూలీగా మారిపోయి మట్టిని ఎత్తి పోశారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు గంటలవరకు పట్టణంలోని బంగ్లా చెరువు, మల్లంచెరువులను డిప్యూటీ స్పీకర్ పరిశీలించారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కలెక్టరేట్ లో హరితహారంపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మెదక్ పట్టణంలో జరిగిన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. -
కొత్త జిల్లా ఆవిర్భావ ఘడియల కోసం..
ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్నా.. సీఎం కేసీఆర్ చొరవ వల్లే మెదక్ జిల్లా ఏర్పాటు ప్రజలు, రైతుల సంక్షేమానికి పెద్దపీట జిల్లా అభివృద్ధికి ద్విముఖ వ్యూహం టూరిజం సర్క్వూట్, ఎడ్యుకేషనల్ హబ్ కోసం ప్రణాళిక ‘సాక్షి’తో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి సాక్షి ప్రతినిధి మెదక్:మెదక్ జిల్లా ఆవిర్భావ క్షణాల కోసం ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్నానని స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ‘ప్రజల నాలుగు దశాబ్దాల కల నెరవేరనుంది. సీఎం కేసీఆర్ కృషి ఫలితమే మెదక్ ప్రజల కల సాకారమైంది. విజయదశమి, కొత్త జిల్లా ఆవిర్భావంతో ఒకేరోజు రెండు పండుగలు వచ్చాయి’ అని పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం నుంచి మెదక్ జిల్లా మనుగడలోకి రానున్న నేపథ్యంలో కొత్త జిల్లా ఏర్పాటు, భవిష్యత్తు కార్యాచరణపై పద్మాదేవేందర్‌రెడ్డి సోమవారం ‘సాక్షి’తో ముచ్చటించారు. మెదక్ జిల్లాకు చారిత్రక నేపథ్యం... ‘మెదక్ జిల్లాకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. కాకతీయలు పాలనలో మెదక్ వెలుగొందింది. నిజాం పాలనలో సుభాగా ఉన్న ఈ ప్రాంతం ఆ తర్వాత మెదక్ పేరుతో జిల్లాగా ఏర్పాటైంది. ప్రత్యేక తెలంగాణతోపాటు మెదక్ ప్రజలు జిల్లా కేంద్రం కోసం ఉద్యమించారు. నేను కూడా ఉద్యమంలో పాల్గొన్నా. ఎన్నికల సమయంలో మెదక్ జిల్లా ఏర్పాటుపై హామీ ఇచ్చాం. మెదక్ జిల్లాను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ 2014 డిసెంబర్ 17న ప్రకటించారు. ఆ ప్రకటన మేరకు ఇప్పుడు మెదక్ కేంద్రంగా జిల్లాగా మారుతుంది. 20 మండలాలు 8 లక్షల జనాభాతో మెదక్ జిల్లా ఏర్పాటవుతుంది. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం. ఈ వేడుకల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులను భాగస్వాములను చేస్తున్నాం. చిన్నజిల్లాతో అభివృద్ధి పరుగులు.. చిన్న జిల్లా ఏర్పాటుతో పాలనా సౌలభ్యం పెరుగుతుంది. తద్వారా జిల్లా అభివృద్ధి ఊపందుకుంటుంది. మెదక్ జిల్లా అభివృద్ధికి ద్విముఖ వ్యూహంతో ముందుకుసాగుతాం. వ్యవసాయం, పారిశ్రామికరంగాల అభివృద్ధితోపాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటాం. మెదక్ జిల్లాకు అద్భుతమైన వనరులు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ మెదక్ జిల్లాను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపే ప్రయత్నం చేస్తా. వ్యవసాయం, సాగునీటిరంగ, అటవీ అభివృద్ధి, విద్యా, పర్యాటకరంగాల అభివృద్ధిపై దృష్టి సారిస్తాం. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి అ«ధిక ప్రాధాన్యతనిస్తాం. జిల్లాకు ప్రస్తుతం 44వ నంబరు జాతీయ రహదారి ఉంది. భవిష్యత్తులో నర్సాపూర్-బోధన్, బోధన్-హసన్‌పర్తి రహదారులు హైవేగా మారే అవకాశం ఉంది. జాతీయ రహదారులతో జిల్లా అభివృద్ధి పరుగులు తీస్తుంది. జిల్లా అభివృద్ధి కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేస్తాం. ఎడ్యుకేషన్ హబ్, టూరిజం సర్క్యూట్‌గా.. మెదక్ జిల్లా పర్యాటకపరంగా అభివృద్ధి చెందే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఏడుపాయల, మెదక్ ఖిల్లా, చర్చి, పోచారం అభయారణ్యం తదితర ప్రాంతాలను కలుపుతూ టూరిజం సర్క్వూట్గా మార్చేందుకు ప్రణాళిక రూపొందిస్తాం. మెదక్‌కు త్వరలో కేంద్రీయ విద్యాలయం, పీజీ కళాశాలలు రానున్నాయి. మెదక్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తాం. కొత్త జిల్లా అభివృద్ధి చెందేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యం ముఖ్యం. అందరినీ కలుపుకునిపోతూ జిల్లా అభివృద్ధికి పాటుపడతా’మని పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. -
ఆడపిల్లలను రక్షించుకుందాం
సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రధాన్యత ఇస్తుందని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. బతుకమ్మ స్ఫూర్తితో ఆడపిల్లలను రక్షించుకోవాలన్నారు. ప్రెస్‌క్లబ్‌లో బతుకమ్మ పండుగను నిర్వహించడం అభినందనీయమన్నారు. సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్ హైదరాబాద్‌లో శుక్రవారం తొలిసారిగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. సేవ్ గర్ల్ చైల్డ్( ఆడపిల్లలను రక్షిద్దాం) అనే సామాజిక అంశంతో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలు, కళలు భావితరాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మకు పూజలు చేసి, ఆడిపాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మావతి, ఈటల జమున, సుశీల కోదండరామ్, శోభ, వెంకట్ మంతెన, భీమ్ రెడ్డి, గాయనీ మధుప్రియ, ప్రెస్‌క్లబ్ సెక్రటరీ శ్రీగిరి విజయ్‌కుమార్ రెడ్డి, ఈసీ మెంబర్స్ సరస్వతి రమ, యశోద, కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టులను నిర్మించితీరుతాం
అడ్డుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారు ‘సింగూరు’ నీరు జిల్లాకే వినియోగం ‘ఘనపురం’ను పట్టించుకోని నాటి పాలకులు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్: తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులు అడ్డుకుంటే వారికి ప్రజలే బుద్ధిచెబుతారని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. కరువు, కాటకాల నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రాజెక్ట్‌ల నిర్మించి కాల్వల ద్వారా సాగు నీరందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు వాటిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, వారికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఆదివారం ఆమె మెదక్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వందేళ్ల చరిత్ర గల ఘనపురం ప్రాజెక్ట్‌లో ఇప్పటి వరకు కాంగ్రెస్, టీడీపీ నాయకులు తట్టెడు మట్టి తీసిన పాపాన పోలేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక ఇప్పటి వరకు ఎంఎన్, ఎఫ్ఎన్ కెనాల్ సిమెంట్‌లైన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.110 కోట్లు కేటాయించామన్నారు. సింగూరు నీటిని జిల్లాలో సాగునీటికే వాడాలని , హైదరాబాద్ ప్రజల తాగునీటి కోసం గోదావరి, కృష్ణ జలాలను రప్పించడం జరుగుతుందని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిపారు. ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపుతో అదనంగా ఆయకట్టు సాగవుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే కాంగ్రెస్‌పార్టీ నాయకులు ఆ పనులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి సునీతారెడ్డి ఇరిగేషన్ మంత్రిగా ఉండి కూడా ఘనపురం ప్రాజెక్ట్‌ను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆమె వెంట జెడ్పిటీసీ లావణ్యరెడ్డి ఉన్నారు. -
ప్ర‘జల’ సాక్షి
♦ జనం గొంతు తడుపుతున్న ‘సాక్షి’ చలివేంద్రాలు ♦ మారుమూల పల్లెలకు ట్యాంకర్లతో నీటి సరఫరాకు శ్రీకారం (సాక్షి, నెట్వర్క్) ఎక్కడికక్కడ వట్టిపోయిన బోర్లు, నెర్రెలు విచ్చుకున్న నీటి వనరులు, గుక్కెడు నీళ్ల కోసం మైళ్లదూరం వెళ్తున్న జనం.. ప్రస్తుతం తెలంగాణ పల్లె చిత్రమిది. ఇలాంటి ఆపత్కాలంలో సామాజిక బాధ్యతగా, తమ వంతుగా ‘సాక్షి’ ప్రజల కోసం కదిలింది. ఎర్రటి ఎండలో బయటకు వచ్చిన జనం గొంతు తడిపేందుకు నడుంకట్టింది. పట్టణాల్లో చలివేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న కొన్ని పల్లెలు, గిరిజన గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించే సంకల్పంతో ముందుకు సాగుతోంది. అన్ని జిల్లాల్లోనూ చలివేంద్రాలు.. తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న మెదక్ జిల్లా హత్నూర మండలం గుండ్ల మాచనూరుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో నీటి సరఫరాకు రెండు ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. వీటిద్వారా రోజూ లక్ష లీటర్ల నీటిని సరఫరా చేయనున్నారు. ఈ ట్యాంకర్లను కలెక్టర్ రోనాల్డ్ రాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఇటీవల మెదక్‌లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి ప్రారంభించి..ప్రజల దాహార్తిని తీర్చేందుకు ‘సాక్షి’ చూపుతున్న చొరవను కొనియాడారు. మహబూబ్‌నగర్‌లోని తెలంగాణ చౌరస్తాలో మంగళవారం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ రాంకిషన్, డీఎస్పీ కృష్ణమూర్తి, జేపీఎన్సీఈ చైర్మన్ రవికుమార్ ప్రారంభించారు. సోమ, మంగళవారాల్లో జిల్లాలోని షాద్‌నగర్, వనపర్తి, కల్వకుర్తి, అచ్చంపేట, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గ కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటయ్యాయి. అలాగే, నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్, బాన్సువాడ, బోధన్, ఆర్మూరు, ఎల్లారెడ్డి పట్టణాల్లో ‘సాక్షి’ ఏర్పాటు చేసిన చలివేంద్రాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. వరంగల్ జిల్లా మహబూబాబాద్ పట్టణంలో మంగళవారం ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ట్యాంకర్లను ప్రారంభించారు. పట్టణంలో కూరగాయల మార్కెట్లో చలివేంద్రాన్ని మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ ప్రారంభించారు. బచ్చన్నపేటతోపాటు కొడవటూరు, కొన్నె గ్రామాలలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. నృత్యాలతో ‘సాక్షి’ ట్యాంకర్లకు స్వాగతం నీటిని పొదుపు చేస్తామని ప్రతిజ్ఞ కొండలమాటున నీటి కోసం అల్లాడుతున్న గిరిజనం దప్పిక తీరుస్తోంది ‘సాక్షి’. నల్లగొండ జిల్లా అనుముల మండలం ఎల్లాపురం పరిధిలోని చక్కోలం తండాకు మంగళవారం నుంచి ట్యాంకర్ ద్వారా తాగునీరు సరఫరా చేస్తోంది సాక్షి. అనుముల మండల కేంద్రానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తండాకు ట్యాంకర్‌తో ‘సాక్షి’ వెళ్లడంతో గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో ఎదురొచ్చి స్వాగతం పలికారు. తాగునీటిని పొదుపుగా వాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. కరీంనగర్ జిల్లాలోనూ అనేక ప్రాంతాల్లో చలివేంద్రాలు ప్రారంభమయ్యాయి. గోదావరిఖని ఎన్టీపీసీ మేడిపెల్లి సెంటర్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రామగుండం మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లాలోని పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటయ్యూరుు. ఆదిలాబాద్ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని అటవీశాఖ మంత్రి జోగు రామన్న ప్రారంభించారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్‌రావు, బెల్లంపల్లి కొత్తబస్టాండ్‌లో మునిసిపల్ మాజీ చైర్మన్ మత్తమారి సూరిబాబు ప్రారంభించారు. ఖమ్మం జిల్లాలోనూ చలివేంద్రాలు కొనసాగుతున్నాయి. జిల్లా పరిషత్ ఆఫీసు వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లాపరిషత్ చైర్పర్సన్ కవిత ప్రారంభించారు. -
కొద్దిసేపు ప్యానెల్ స్పీకర్‌గా గీతారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే గీతారెడ్డి శనివారం స్పీకర్ స్థానం నుంచి ప్యానెల్ స్పీకర్‌గా కొద్దిసేపు సభను నడిపారు. హెచ్‌సీయూ, ఉస్మానియా యూనివర్సిటీ ఘటనలపై హోంమంత్రి ప్రకటన అనంతరం ఆ అంశంపై చర్చ జరిగింది. అస్వస్థత కారణంగా స్పీకర్ శనివారం అసెంబ్లీకి రాలేదు. దీంతో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి విధులు నిర్వహించారు. ఆమె భోజన విరామానికి వెళ్లగా స్పీకర్ స్థానంలో గీతారెడ్డి ఉండి కొద్దిసేపు సభను నడిపారు. కాగా, తొలుత ప్యానెల్ స్పీకర్‌గా రావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డిని కోరగా తనకంటే సీనియర్ అయిన గీతారెడ్డి పేరును ఆయన సూచించారు. ‘ఆస్థానంలో కూర్చున్న ఎవరైనా సభను ఆర్డర్లో పెట్టాల్సిందే. గీతారెడ్డి కూడా అదేపని చేశారు. ఆ కుర్చీకి ఉన్న పవర్ అది’ అని అసెంబ్లీ అనంతరం పద్మాదేవేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
సభలో కంటతడి పెట్టిన డిప్యూటీ స్పీకర్
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కంటతడి పెట్టారు. సంస్కారం లేనివారు సభను నిర్వహిస్తున్నారంటూ మంగళవారం సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకె అరుణ వ్యాఖ్యలు చేశారు. దీంతో మనస్తాపం చెందిన పద్మా దేవేందర్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు జోక్యం చేసుకుని 'మహిళ పట్ల అనుచిత వ్యాఖ్యలు తగవు.సభాపతిని డిక్టేట్ చేయడం సరికాదని, డీకే అరుణ వెంటనే క్షమాపణ చెప్పాలని' డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే సస్పెండ్ చేయడానికి వెనుకాడేది లేదని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఏపీ శాసనసభలో ఏం జరిగిందో అందరికీ తెలుసు అని, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ మహిళ ఎమ్మెల్యేను ఏడాదిపాటు సభనుంచి సస్పెండ్ చేశారని, అయితే తాము అలాంటి చర్యకు పోదలచుకోలేదని అన్నారు. గతంలో తాము సభలో మాట జారితే తమ నాయకుడు...మంత్రులతో క్షమాపణ చెప్పించారని హరీశ్ రావు గుర్తు చేశారు. అది తమ సంస్కారమని, క్షమాపణ చెబితే కిరీటమేమీ పడిపోదని ఆయన అన్నారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తనపై చేసిన వ్యాఖ్యలకు సభ్యుల విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ సభలో అందరూ హుందాగా వ్యవహరించాలని సూచించారు. సభాపతిపై ప్రతిపక్షానికి గౌరవముందని, సభ్యులు ఆవేశపడినా గతంలో తాము సర్ధుబాటు చేసిన ఘటనలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిపై వాదాపవాదాలు వద్దని అందరూ సమన్వయం పాటించాలని జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై డీకే అరుణ మాట్లాడుతూ... తాను ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. -
మహిళలకు అవకాశాలు ఇవ్వాలి
* మహిళా దినోత్సవంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి * చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ * మహిళలకు రక్షణ, సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రులు * విశిష్ట మహిళలకు పురస్కారాలు ప్రదానం సాక్షి, హైదరాబాద్: ఇన్నాళ్లూ అనుత్పాదక రంగాలకే పరిమితమైన మహిళలు ఇప్పుడిప్పుడే స్వావలంబన సాధిస్తున్నారని... వారు మరింత ముందుకు వచ్చేలా అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలని శాసనసభ ఉపసభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని లలిత కళాతోరణంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ, భాషా సాంస్కృతిక శాఖలు సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని పద్మాదేవేందర్‌రెడ్డి చెప్పారు. ఆ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నా పార్లమెంటులో ఆమోదానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో మంత్రులందరూ సమష్టిగా నిర్వహించే బాధ్యతలను కుటుంబంలో మహిళ ఒంటిచేత్తో నిర్వహిస్తుందని పేర్కొన్నారు. చదువుకున్న స్త్రీ కుటుంబానికి దిక్సూచిలా నిలుస్తుందని, అవకాశాలు ఇస్తే మహిళలు ఐటీలోనే కాదు ఆకాశంలోనూ విహరిస్తారని చెప్పారు. రాష్ట్రంలో మహిళల ఆరోగ్యం, రక్షణ కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపి, ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. ఆ కమిటీ సిఫారసుల మేరకే ‘షీ’ టీమ్‌లు, షీ క్యాబ్‌లు, సఖి వంటి పథకాలను ప్రవేశపెట్టామని తెలిపారు. సీఎం కేసీఆర్ దేశంలోనే తొలిసారిగా మహిళల కష్టాలను తీర్చడం కోసం ఇంటింటికీ తాగునీరందించే ‘మిషన్ భగీరథ’ను చేపట్టడం సాహసోపేత నిర్ణయమని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. పోలీసు ఉద్యోగ నియామకాల్లో తొలిసారిగా మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సాహసం. విజ్ఞానం, ధర్మం, సహనం, ఓపిక తదితరాలకు మహిళలు ప్రతీకగా నిలుస్తారని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వ్యవస్థలో మహిళలదే కీలకపాత్ర అని.. వారి హక్కులు, రక్షణ, గౌరవం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న కార్యక్రమాలను కరీంనగర్ జెడ్పీ చైర్మన్ తుల ఉమ ప్రశంసించారు. మహిళలకు పురస్కారాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన 21మంది మహిళలను సత్కరించారు. లక్ష రూపాయల నగదు, జ్ఞాపికలతో వారిని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి సన్మానించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చెన్నబోయిన కమలమ్మ, రమా మెల్కోటే, బాల థెరీసా, ఎల్లవ్వ, లావణ్య, మన్నెం సరితారెడ్డి, కెప్టెన్ దీప్తి, తారాబాయి. సువర్చల, సురభి వాణీదేవి, సంధ్య, ఆలేరు విజయ, నిఖత్ జరీన్, అఖిలేశ్వరి, ఆవుల సరిత, గోగు శ్యామల, నేనావత్ దేవి, మొగులమ్మ, మంకూబాయి, డాక్టర్ ఫణిశ్రీ సాయి తదితరులు పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గొంగిడి సునీత, కోవ లక్ష్మి, జడ్పీ చైర్పర్సన్లు సునీతా మహేందర్‌రెడ్డి, జి.పద్మ, ప్రభుత్వ సలహాదారు రమణాచారి తదితరులు పాల్గొన్నారు. -
'పురుష దినోత్సవం జరుపుకునేలా చేస్తా'
మహిళలు 'మహిళా దినోత్సవం' జరుపుకుంటున్నట్లే పురుషులు కూడా పురుష దినోత్సవం నిర్వహించుకునేలా చేస్తానని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. ఆ రోజున తమ ఇబ్బందులు, కష్టాలను చర్చించుకునే అవకాశం దక్కేలా కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన 'మహిళా ఉపాధ్యాయ సదస్సు'లో ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడారు. మనం కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే మగవాళ్లంతా చూసి గర్వం అనుకుంటున్నారని... కాలు మీద కాలు వేసుకునేది గర్వంతో కాదు, కాళ్లు నొప్పులతోనేనని సరదాగా చమత్కరించారు. -
ఖేడ్‌లో వేడెక్కుతున్న రాజకీయం
పెరుగుతున్న నేతల మధ్య మాటలవేడి తూటాల్లా పేలుతున్న ప్రసంగాలు నారాయణఖేడ్ : ఉప ఎన్నిక పోరు వేడెక్కింది. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వేడి రగులుతోంది. అన్ని పార్టీల నుంచి రాష్ర్టస్థాయి నేతలు నారాయణఖేడ్ బాట పట్టారు. పోలింగ్‌కు వారం రోజుల సమయమే ఉండడంతో అన్ని పార్టీల నాయకులూ ఖేడ్‌లో మకాం పెట్టారు. ఈనెల 13న పోలింగ్ జరగనుంది. 11తో ప్రచార పర్వం ముగుస్తుంది. ఇప్పటివరకు హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేసిన నాయకులు ఆ ఎన్నికలు ముగియడంతో ఖేడ్ ఉప ఎన్నికలో సత్తా చాటేందుకు ఖేడ్ పట్టణంలో అడ్డా బిటాయించారు. అన్ని పార్టీల నాయకులు నారాయణఖేడ్ చేరుకొని ప్రచార వాగ్బాణాలు సంధిస్తున్నారు. జోరుమీదున్న కారు.. ఎమ్మెల్యే కిష్టారెడ్డి హఠాన్మరణంతో నారాయణఖేడ్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించేందుకు సుమారు ఆరునెలల సమయం పట్టింది. ఈలోగా టీఆర్ఎస్ నాయకులు, మంత్రి హరీశ్‌రావు నాలుగైదు నెలల ముందు నుంచే నారాయణఖేడ్‌కు వస్తూ పోతూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆయన పర్యటనలు, పనుల వేగం పెంచారు. ఇక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే ఆయన పూర్తిగా నారాయణఖేడ్‌పైనే దృష్టి సారించారు. వారం రోజులుగా ఆయన నిత్యం 15 గ్రామాల్లో పర్యటిస్తున్నారు. మంత్రితోపాటు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి సైతం ముమ్మర పర్యటనలు చేస్తున్నారు. వీరు నియోజకవర్గంలో సుమారు 30రోజుల నుంచి పర్యటిస్తున్నారు. ఈనెల 10న సీఎం కేసీఆర్ వస్తున్నందున భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ తరఫున ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, చింతా ప్రభాకర్, బాబూమోహన్, జెడ్పీ చైర్మన్ రాజమణి , టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ తదితరులు పర్యటిస్తున్నారు. రంగంలో కాంగ్రెస్, టీడీపీ అగ్రనేతలు.. కాంగ్రెస్ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పలు సభల్లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నాయకుడు జానారెడ్డి పాల్గొన్నారు. వీరితోపాటు డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, జగ్గారెడ్డి, శశిధర్‌రెడ్డి, గంగారాం పర్యటిస్తున్నారు. టీడీపీ తరఫున రేవంత్‌రెడ్డి పర్యటనలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు ఎర్రబెల్లి దయాకర్‌రావు సైతం ప్రచారం నిర్వహించారు. వీరితోపాటు పార్టీకి చెందిన రమరణ, మోత్కుపల్లి నర్సింహులు, వంటేరు ప్రతాపరెడ్డి, శశికళ పర్యటిస్తున్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అన్ని పార్టీల నేతల మాటలు తూటాల్లా పేలుతూ మరింత వేడి పుట్టిస్తున్నాయి. -
'పద్మాదేవేందర్ కృషితో రామాయంపేట అభివృద్ధి'
రామాయంపేట (మెదక్ జిల్లా) : డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి కృషితో రామాయంపేట మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆయన గురువారం రామాయంపేటలోని రైతుబజార్లో రూ.50లక్షలతో అదనపు పనులకు శంకుస్థాపన గావించిన సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవెందర్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. పట్టణంలో రోడ్డు విస్తరణకు రూ.7.80 కోట్లతోపాటు స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీలో అభివృద్ది పనులకు రూ.4 కోట్లు, తహశీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికిగాను రూ. కోటి మంజూరయ్యాయన్నారు. స్థానికంగా ఉన్న మల్లె చెరువును మినీ ట్యాంక్‌బండుగా మారుస్తామని, త్వరలో గెస్ట్ హౌస్ నిర్మాణానికిగాను నిధులు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. రామాయంపేట మండలంలో కరువు పరిస్థితులు నెలకొన్న కారణంగా గోదావరి జలాలు తరలిస్తామన్నారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పనులను అడ్డుకుంటున్నారని హరీష్‌రావు ఆరోపించారు. సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి, స్థానిక ఎంపీపీ పుట్టి విజయలక్ష్మి, జడ్పీటీసీ బిజ్జ విజయలక్ష్మి, ఎంపీపీ ఉపాధ్యక్షుడు జితేందర్‌గౌడ్, స్థానిక సర్పంచ్ పాతూరి ప్రభావతి, మండల సర్పంచులు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు మానెగల్ల రామకిష్టయ్య, పున్న వెంకటస్వామి, మాజీ ఎంపీపీ సంపత్, పార్టీ మండలశాఖ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, జిల్లా నాయకుడు అందె కొండల్‌రెడ్డి, పట్టణశాఖ అధ్యక్షుడు పుట్టి యాదగిరి, మెదక్ ఆర్డీవో మెంచు నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పేదల కల నెరవేరుతుంది
- ఆ సమయం ఆసన్నమైంది - ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం - డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి - హవేళిఘణాపూర్‌లో డబుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపన మెదక్: నిరుపేదల కల నెరవేరే సమయం ఆసన్నమైందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ మండలం హవేళి ఘణాపూర్ గంగిరెద్దుల కాలనీలో డబుల్ బెడ్రూం ఇళ్లకు ఆమె భూమిపూజ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలన్నారు. నిరుపేదల ఆత్మగౌరవం కోసం సీఎం కేసీఆర్ 125 గజాల్లో డబుల్ బెడ్రూమ్ను సకల సౌకర్యాలతో నిర్మించి ఇస్తున్నారన్నారు. ఇందుకోసం ఒక్కో ఇంటికి రూ.5,04,000 చొప్పున మంజూరు చేశారన్నారు. మెదక్ నియోజకవర్గానికి 400 ఇళ్లు మంజూరైనట్టు చెప్పారు. వీటికి సంబంధించి త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. కలెక్టర్ రోనాల్డ్ రాస్ మాట్లాడుతూ హవేళి ఘణాపూర్‌లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక గంగిరెద్దుల వారి కాలనీ హైదరాబాద్‌లా కనిపించాలన్నారు. ఇళ్ల నిర్మాణ పనులు నాణ్యతతో జరిగేలా లబ్ధిదారులు దగ్గరుండి చూసుకోవాలన్నారు. అంతకుముందు మండలంలోని పేరూర్లో నిర్మిస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్లతోపాటు ఇంకుడు గుంతలను డిప్యూటీ స్పీకర్ పరిశీలించారు. పేరూర్ గ్రామం మరో ఎర్రవల్లి కావాలని ఆమె ఆ కాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, జేసీ వెంకట్రాంరెడ్డి, డీఆర్డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, డ్వామా పీడీ ఇంద్రకరణ్, ఆర్డీఓ మెంచు నగేష్, ఎంపీపీ కొత్తపల్లి లక్ష్మికిష్టయ్య, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, తహశీల్దార్ విజయలక్ష్మి, హవేళిఘణాపూర్ సర్పంచ్ సునీ తాసాయిలు, ఎంపీటీసీ శ్రీకాంత్, పేరూ ర్ సర్పంచ్ ర్యావ సుగుణ, నాయకులు కిష్టయ్య, అంజాగౌడ్, జయరాంరెడ్డి, సాయిలు, యాదగిరి, శ్రీనివాస్, రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
ఏమిటీ ఈ నిర్లక్ష్యం?
- మరుగుదొడ్ల నిర్మాణాలపై డిప్యూటీ స్పీకర్ సమీక్ష - నివేదికల తయారీలో నిర్లక్ష్యంపై ఫైర్ - పది రోజులుగా ఏం చేస్తున్నారంటూ నిలదీత - ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన కలెక్టర్ మెదక్: వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, అవసరాలు తదితర వివరాలపై నివేదిక తయారీలో అధికారుల నిర్లక్ష్యంపై డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి భగ్గుమన్నారు. శుక్రవారం మెదక్ ఎంపీడీఓ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి అధికారులతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజవకర్గంలోని చాలా గ్రామాల్లో అధికారులు మొక్కుబడిగా నివేదికలు తయారు చేశారని మండిపడ్డారు. మెదక్ మండలం ఖాజిపల్లి, ఫరీద్పూర్ గ్రామాల్లో అసలు మరుగుదొడ్లే లేవంటూ నివేదికలు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫరీద్‌పూర్‌లో అసలు మరుగుదొడ్లు నిర్మించుకున్నవారే లేరంటూ తప్పుడు నివేదికలిచ్చిన గ్రామ కమ్యూనిటీ కోఆర్డినేటర్ (వెలుగు సీసీ) శంకర్‌ను, విధులకు హాజరు కానందున చిన్నశంకరంపేట ఈజీఎస్ ఏపీఓ ఈశ్వరమ్మను వెంటనే సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రోనాల్డ్‌రాస్ ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. గ్రామాలకు వెళ్లకుండానే నివేదికలు తయారు చేశారని మండిపడ్డారు. 26 వరకు పూర్తిస్థాయిలో నివేదికలు అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, జేసీ వెంకట్రాంరెడ్డి, డీఆర్డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, డ్వామా పీడీ ఇంద్రకరణ్, ఆర్డీఓ మెంచు నగేష్, ఎంపీపీ కొత్తపల్లి లక్ష్మికిష్టయ్య, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, నియోజకవర్గంలోని తహశీల్దార్లు, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు. -
తెలుగు అంటేనే తెలంగాణ భాష
- డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలుగు అంటేనే తెలంగాణ భాష అని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ఉపాధ్యాయ పండిత పరిషత్ (తెలంగాణ) ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన తెలంగాణ భాషా దినోత్సవంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో భాష పరంగా తెలంగాణ వివక్ష ఎదుర్కొందని, భాష, యాసను కాపాడుకోవాల్సిన అవసరం వుందన్నారు. తెలంగాణ భాష, నుడికారానికి కాళోజీ నిలువెత్తు రూపంగా నిలిచారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భాషపై మక్కువ ఎక్కువని సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారి, కవి దేశపతి శ్రీనివాస్ అన్నారు. భాషా పండితులకు పదోన్నతుల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని దేశపతి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. తెలంగాణ భాష శ్వాసగా కాళోజీ సాహితీ సేద్యం చేశారని కవి నందిని సిద్ధారెడ్డి వ్యాఖ్యానించారు. సమావేశంలో టీఎన్జీఓ యూనియన్ గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్, ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్లా పాల్గొన్నారు. -
'తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎనలేనిది'
మెదక్ టౌన్ : తెలంగాణ ఉద్యమంలో పాత్రికేయుల కృషి ఎనలేనిదని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలోని డిప్యూటీ స్పీకర్ క్యాంపు కార్యాలయంలో పాత్రికేయులకు సంబంధించిన హెల్త్‌కార్డుల ధరఖాస్తు ఫారాలను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఉద్యమంలో ఎలా అయితే పని చేశారో బంగారు తెలంగాణ పునర్ నిర్మాణంలోనూ పాత్రికేయులు అలాగే పనిచేయాలన్నారు. సమాజంలోని లోటుపాట్లను ప్రజలకు తెలియజేసేది మీడియానేనన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాత్రికేయుల కృషిని గుర్తించిన సీఎం కేసీఆర్ వారికి హెల్త్‌కార్డులు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి బడ్జెట్లో రూ.10కోట్లు కేటాయించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు దేవయ్య, శ్రీనివాస్‌రెడ్డి, కామాటి కిషన్, శంకర్ దయాల్‌చారి, నాగరాజు, సురెందర్‌రెడ్డి, గోపాల్, సంగమేశ్వర్, రహ్మత్ అలీ తదితరులు ఉన్నారు. -
అలసత్వం వీడండి
పటాన్చెరు : అలసత్వంతో పనిచేస్తే చర్యలు తప్పవని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి వైద్యులను, సిబ్బందిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గురువారం పటాన్చెరులో ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో సహ జిల్లా వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశాఖ పనితీరు మందగమనంతో సాగుతోందన్నారు. కష్టపడి పనిచేయకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. సమీక్షలో మంత్రి హరీశ్‌రావు, పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలను మంత్రికి వివరించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జగన్నాథ్ మాట్లాడుతూ జిల్లాలో 42 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించాలని కోరారు. అలాగే ఐసీయూ కేంద్రాల ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడూతూ పటాన్చెరు, సదాశివపేట, గజ్వేల్‌కు ఐసీయూ కేంద్రాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జోగిపేట, నర్సాపూర్, నారాయణఖేడ్‌లో ఆసుపత్రుల భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ విభాగం ఈఈ ఎం.రఘును ఆదేశించారు. జిల్లాకు 18 మంది వైద్య నిపుణులు కావాలని సూచించారు. ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. పటాన్చెరు ఆసుపత్రి పనితీరుపై అసంతృప్తి పటాన్చెరు ఆసుపత్రిలో వైద్యుల పనితీరుపై మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జహీరాబాద్‌లో ఒకే గైనకాలజిస్టు ఉన్నా నెలకు 400వరకు ప్రసవాలు చేస్తున్నారని అన్నారు. పటాన్చెరులో హైరిస్క్ కేంద్రం ఉన్నా ప్రసవాలు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. పటాన్చెరు ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉన్న రూరల్ హెల్త్ సెంటర్ వైద్యులు వందపడకల ఆసుపత్రిలో పనిచేయాలని మంత్రులు ఆదేశించారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయించాలని మంత్రి లక్ష్మారెడ్డికి విజ్ఞప్తి చేశారు. డీసీహెచ్‌ఎస్‌పై హరీశ్ ఫైర్ ఏపీ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల కోఆర్డినేటర్ నరేందర్బాబుపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సమీక్ష సమావే శానికి ఇలాగేనా వచ్చేది. ఆప్రాన్ ఏది? చేతిలో పెన్ను పుస్తకం ఏది? మేం ముఖ్యమంత్రి సమీక్షకు వెళ్తే పెన్ను పుస్తకాలు తీసుకుని వెళ్తాం. చెప్పింది రాసుకుంటాం’ అని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను వివరించడంలో నరేందర్‌బాబు విఫల్యం చెందడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీ, ఆర్డీవో పాల్గొన్నారు.