ఆగస్టు 15న భూ పంపిణీ: డిప్యూటీ స్పీకర్
మెదక్ రూరల్: మెదక్ నియెజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని మెదక్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆమె మండలంలోని పలుగ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
అనంతరం ముత్తాయికోటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఘణపూర్ ప్రాజెక్టు పరిధిలోని కాల్వలకు సిమెంట్ లైనింగ్ చేపట్టేందుకు గతంలో రూ.25 కోట్లు జైకా నిధులు మంజూరైనా అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా పనులు చేపట్టలేదన్నారు. తమ ప్రభుత్వం వెంటనే ఆ నిధులను వెనకి ్క రప్పించి పనులు ప్రారంభించిందన్నారు. జైకా నిధులతో కాల్వల మరమ్మతు పనులు చేపట్టి ఆయకట్టు చివరి వరకు సాగునీరందించడమే లక్ష్యమన్నారు. సీఎం కేసీఆర్ రూపొందించిన ‘మన ఊరు-మన ప్రణాళిక’ ద్వారా గ్రామాల్లోని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.
గామాభివృద్ధి కోసం స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు స్థానిక నాయకులు ప్రజలతో మమేకమై ముఖ్యమైన మూడు సమస్యలను గుర్తించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తే క్రమపద్ధతిలో పరిష్కరిస్తామన్నారు. గ్రామాల్లోని సమస్యలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తే పల్లెల సమస్యలను తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణతో సమస్యలను గుర్తించి గ్రామ ఎడాప్షన్ అధికారికి సూచించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి కిష్టయ్య, జెడ్పీటీసీ సభ్యరాలు లావణ్యరెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షురాలు లలిత, ఎంపీటీసీ భిక్షపతి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, విశ్వం, జయరాంరెడ్డి, కిషన్‌గౌడ్, పద్మారావు, కొంపల్లి సుభాష్‌రెడ్డి సాయిలు, ప్రభాకర్, పాల్గొన్నారు.
అబివృద్ధి పనులకు శంకుస్థాపన
ముత్తాయికోటలో వాటర్ ట్యాంకు నిర్మాణం కోసం రూ.18 లక్షలతో శంకుస్థాపన చేసిన అనంతరం దేవుని కూచన్‌పల్లిలో రూ. 14 లక్షలతో చేపట్టనున్న ట్యాంకు నిర్మాణ పనులకు శంకుస్థాపన, రాయినిపల్లి రూ. 5 లక్షలతో సీసీరోడ్డుకు శంకుస్థాపన, తిమ్మనగర్‌లో రూ. 5 లక్షలతో సీసీరోడ్డుకు శంకుస్థాపనతో పాటు రూ. 6 లక్షలతో అదనపు తరగతి గదికి శంకుస్థాపన, తిమ్మనగర్‌లో రూ. 9 లక్షలతో మెటల్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన, రూ. 6 లక్షలతో నిర్మించిన పాఠశాల అదనపు గదికి డిప్యూటీ స్పీకర్ ప్రారంభోత్సవం చేశారు.
దళితులకు ఆగస్టు 15న భూ పంపిణీ
మెదక్ మున్సిపాలిటీ: ఎంపిక చేసిన నిరుపేద దళితులకు ఆగస్టు 15న భూ పంపిణీ చేస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆమె మెదక్ పట్టణంలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అంతకు ముందు ఆమె స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ దళితుల భూ పంపిణీకి సంబంధించి మండలంలోని రాయిన్‌పల్లిలో 29 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. వీరిలో ముగ్గురు భూమి లేని నిరుపేదలని, మిగతా వారు గుంటల భూమి కలిగి ఉన్నారని తెలిపారు. పాపన్నపేట మండలం నార్సింగి గ్రామంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. ప్రతి సమస్యను ప్రజల ద్వారా తెలుసుకొని ప్రభుత్వ ప్రణాళికలో పొందుపర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘మన ఊరు-మన పట్టణం-మన ప్రణాళిక’ అనే కార్యక్రమం ప్రారంభించిందన్నారు.
పునర్నిర్మాణం అవసరం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకంటే పునర్నిర్మాణమే ఎంతో కీలకమని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అధికారులు సమన్వయంతో కృషి చేసి రాష్ట్ర పునర్నిర్మాణానికి కృషి చేయాలన్నారు. పునర్నిర్మాణం జరుగకుంటే ప్రత్యేక రాష్ట్రం సాధించి ప్రయోజనం ఉండదన్నారు.అనంతరం క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తేవాలన్నారు. అంతేకాకుండా ప్రతి వినతి పత్రాన్ని పూర్తి సమాచారంతో రిజిస్టర్ చేయాలని సూచించారు. సమస్య పరిష్కరించిన అనంతరం లబ్ధిదారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాలన్నారు. ప్రజలు ఏమైనా సమస్యలుంటే క్యాంపు కార్యాలయ సిబ్బంది దృష్టికి తేవాలన్నారు.
అనంతరం ఆమె పట్టణంలోని మెదక్ నర్సింగ్‌హోమ్ వద్ద నారాయణ హృదయాలయ ఆస్పత్రి వారు రోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్సును ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, తహశీల్దార్ విజయలక్ష్మి, ఎంపీపీ లక్ష్మి, పీఆర్‌ఓ జీవన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
అన్ని సమస్యలు పరిష్కరిస్తాం
మెదక్ మున్సిపాలిటీ: రేషన్ నుంచి పింఛన్ దాకా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆమె మెదక్ పట్టణంలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 12వ వార్డులో సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసి, 5వ వార్డులో జరుగుతున్న ‘‘మనవార్డు-మన ప్రణాళిక’’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెట్లునాటే కార్యక్రమం నుంచి నీటి సమస్య, పింఛన్, శ్మశాన వాటిక, విద్యావకాశాలు, యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. వార్డుల్లో చెత్త పేరుకు పోవడం, డ్రైనేజీలు శుభ్రం చేయక పోవడం వంటి సమస్యలు తమ దృష్టికి వస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా డ్రెయినేజీలు నిండితే మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాలన్నారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హాల్, అంగన్‌వాడీ భవనం, సీఆర్సీ భవనం, లోవోల్టేజీ, మంచినీటి సమస్యలను వార్డు ప్రజలకు ఆమె దృష్టికి తెచ్చారు. వీటిపై ఆమె స్పందిస్తూ త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీఇచ్చారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు విజయలక్ష్మి, రాధ, చంద్రకళ, గాయత్రి, సలాం, రాంగిరిశ్రీనివాస్, సోహైల్, కమిషనర్ వెంకటేశం, మేనేజర్ శ్రీనివాస్, ఆర్డీఐ రాములు, సిబ్బంది శ్యామ్, చిత్తారిశ్రీను, ఆబేద్, టీఆర్‌ఎస్ నాయకులు లింగారెడ్డి, కృష్ణారెడ్డి, గంగాధర్, జీవన్‌రావు,గోవింద్, అంకంరవి తదితరులు పాల్గొన్నారు.