దేశం దారితప్పి పోతోంది.. దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తోంది: సీఎం కేసీఆర్‌ | CM KCR Key Points At Mallanna Sagar Inauguration Program Siddipet | Sakshi
Sakshi News home page

దేశం దారితప్పి పోతోంది.. దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తోంది: సీఎం కేసీఆర్‌

Published Wed, Feb 23 2022 2:41 PM | Last Updated on Thu, Feb 24 2022 8:10 AM

CM KCR Key Points At Mallanna Sagar Inauguration Program Siddipet - Sakshi

కొమురవెల్లి మల్లన్న అభిషేకానికి గోదావరి జలాలు తీసుకొస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో హరీశ్‌రావు 

సాక్షి, సిద్దిపేట: ‘దేశం దారి తప్పి పోతోంది, చాలా దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తోంది. తప్పకుండా, ఆరునూరైనా సరే వందకు వంద శాతం ఈ దేశాన్ని రుజుమార్గంలో పెట్టేందుకు దేవుడు నాకిచ్చిన సర్వశక్తులు, సకల మేథో సంపత్తిని ఉపయోగిస్తా. చివరి రక్తపు బొట్టు వరకు ధారపోసి అయినా సరే ఈ దేశాన్ని చక్కదిద్దుతా..’అని సీఎం  కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ‘మత కల్లోలాలను సహించకూడదు. అవి కేన్సర్‌లా విసర్తించకుండా చర్యలు చేపట్టాలి. ఈ దేశం నుంచి ఎక్కడికక్కడే తరిమికొట్టాలి. పిల్లలు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు వెళ్లి చదువుకోవాలంటేనే భయపడుతున్నారు..’అని చెప్పారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్‌ వద్ద శ్రీ కొమురవెల్లి మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను సీఎం బుధవారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.



తెలంగాణ జల హృదయ సాగరం
‘నూతన తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన అతి భారీ జలాశయం మల్లన్న సాగర్‌ ప్రాజెక్టును ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక మల్లన్నసాగర్‌ కాదు.. తెలంగాణ జల హృదయ సాగరం.. తెలంగాణ జీవనాడి.. తెలంగాణ మొత్తాన్ని జలాలతో అభిషేకించే సాగరం. సింగూరు ప్రాజెక్టును తలదన్నేలా ఈ ప్రాజెక్టును నిర్మించారు. సిద్దిపేటకే కాకుండా హైదరాబాద్‌ నగరానికి శాశ్వతంగా దాహార్తిని తీర్చే ప్రాజెక్టు. 20 లక్షల ఎకరాలను తన కడుపులో పెట్టుకుని కాపాడుకునే ప్రాజెక్టు. ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ «శిరస్సు వంచి సెల్యూట్‌ చేస్తున్నా.

గోదావరి నదిలో 50 డిగ్రీల ఎండలో ఇంజనీర్లు పడ్డ కష్టం వృథా కాలేదు. భయంకరమైన కరువు నేలలో ప్రజలకు న్యాయం చేసేందుకు పోరాడాం. ప్రాజెక్టు నిర్వాసితులకు ఆసియాలో ఎక్కడా లేని విధంగా పునరావాసం కల్పించాం. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే అధికారులు వెంటనే వారికి న్యాయం చేయాలి. మంత్రి హరీశ్‌రావు నిర్వాసితులకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలి. కొందరు దుర్మార్గమైన పద్ధతుల్లో ప్రగతి నిరోధక శక్తులుగా మారారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంలో ఒక రోజు 58 వేల మంది కార్మికులు 14 రాష్ట్రాల నుంచి వచ్చి పని చేస్తున్న సమయంలో దుర్మార్గులు కోర్టుల్లో కేసులు వేశారు. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా. అక్కడి నుంచే మన రాష్ట్ర చీఫ్‌ జస్టిస్‌కు ఫోన్‌ చేసి.. ఇది తెలంగాణ జీవనాడి.. ఉన్నతంగా ఆలోచించి ఈ ప్రాజెక్టును కాపాడాలని కోరా. దాదాపు 600 పైచిలుకు కేసులు వేయగా అన్నీ కొట్టేశారు. ప్రాజెక్టు గురించి కనీస అవగాహన లేనివారు, కొన్ని రాజకీయాల పార్టీల వారు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు...’అని కేసీఆర్‌ అన్నారు.

కరువు నుంచి కాపాడే కాళేశ్వరం
‘తెలంగాణలో పంటలు పండించే, కరువు రాకుండా కాపాడే అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం. గోదావరి నది పారే జిల్లాల్లో కరువు ఎలా ఉంటది? అని ఉద్యమ సమయంలో నేను ప్రశ్నించా. ఉద్యమ వేడిని చల్లార్చడానికి చంద్రబాబు దేవాదుల ప్రాజెక్టును తీసుకొచ్చారు. ప్రస్తుతం ఖమ్మం సీతారామ ప్రాజెక్టు ప్రాణం పోసుకుంటోంది. పాలమూరు జిల్లాలో కూడా ఇలాంటి ప్రాజెక్టులు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే పంజాబ్‌ కంటే ఎక్కువ ధాన్యాన్ని పండిస్తున్నాం. ఏప్రిల్‌ నెలలో కూడా చెరువులు నీటితో తొణికిసలాడుతున్నాయి. ఆషామాషీగా, తెలివి లేక ఉచిత కరెంట్‌ ఇవ్వడం లేదు. ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాం. రైతులు ఆత్మహత్యలు ఆగిపోవాలని రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నాం. ఇప్పటికైనా ప్రతిపక్షాలు విమర్శలు మానుకోవాలి..’అని కోరారు. 



కేంద్రం సహకరించకున్నా అభివృద్ధి
‘హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగం చేసేవారు కూడా గ్రామాలకు వస్తున్నారు. అద్భుతమైన గ్రామీణ తెలంగాణ ఆవిష్కృతమవుతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతోంది. కుక్కలు మొరుగుతున్నాయని మన పనిని ఆపొద్దు. కేంద్రం సహకరించకపోయినప్పటికీ బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నాం. తెలంగాణలో ఎక్కడకు పోయినా ఎకరా భూమి రూ.20 లక్షలకు పైగానే ఉండడంతో మన రైతులు ధనికులయ్యే పరిస్థితి ఉంది. రాష్ట్రానికి అద్భుతమైన పరిశ్రమలు వస్తున్నాయి. ఐటీ రంగంతో పాటు ఇతర రంగాల్లో ఉద్యోగ కల్పన జరుగుతోంది. భారతదేశంలో అతి తక్కువ నిరుద్యోగిత ఉన్న రాష్ట్రం తెలంగాణ. బెంగళూరు సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియాగా మారితే మన హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్‌ నుంచి 1.50 లక్షల కోట్ల సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు జరుగుతున్నాయి. అంతర్జాతీయ విమానాలు 580 వరకు శంషాబాద్‌లో దిగుతున్నాయి..’అని ముఖ్యమంత్రి తెలిపారు. 

దేశానికే మార్గదర్శకంగా తెలంగాణ
‘దేశానికే మార్గదర్శకంగా, గొప్ప రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుసుకుంది. ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ నీళ్లు వస్తున్నాయి. దీంతో ఆదిలాబాద్‌లోని మారుమూల పల్లెల్లో అంటు రోగాలు మాయం అయ్యాయి. రాష్ట్రంలో మాతాశిశు మరణాలు తగ్గిపోయాయి. పేదింటి ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేశాం. కేసీఆర్‌ కిట్లు 10 లక్షల కుటుంబాలకు మించి పంపిణీ అయ్యాయి. ఆరోగ్య తెలంగాణ ఆవిష్కృతం అవుతోంది. అనేక రంగాల్లో బ్రహ్మాండమైన పురోగతితో ముందుకు పోతున్నాం..’అని చెప్పారు.



రూ.1,500 కోట్లతో పర్యాటకాభివృద్ధి
 ‘అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్‌ రిజర్వాయర్, ఏడుపాయల వనదుర్గామాత వద్ద టూరిజం అభివృద్ధికి రూ.1,500 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నా. ఈ ఐదు ప్రాంతాల్లో అద్భుతమైన టూరిజం అభివృద్ధి చేయాలి. ఇందుకు మంత్రి హరీశ్, శ్రీనివాస్‌గౌడ్‌లు ప్రత్యేక చొరవ తీసుకుని ఏడాదిన్నరలో పూర్తి చేయాలి. హాలీవుడ్, హిందీ సినిమాల షూటింగ్‌లు ఇక్కడ జరిగేలా పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు మధ్యలో దీవులు ఉన్నాయి. 7,500 ఎకరాల అటవీ సంపద ఉంది. ఔషధ మొక్కలు పెంచాలి. రిజర్వాయర్‌ వద్ద 100 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇరిగేషన్‌ కాంప్లెక్స్‌ నిర్మించాలి..’అని కేసీఆర్‌ ఆదేశించారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు కూడా రాబోతోంది కాబట్టి రెండు నాలుగు వరసల రోడ్లు ఈ ప్రాజెక్టు వరకు వేయాలని సీఎం సూచించారు.

మంత్రి హరీశ్‌ డైనమిక్‌ లీడర్‌
‘రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు డైనమిక్‌ లీడర్‌. చురుకైన మంత్రి. ఆయనకు మంచి శక్తియుక్తులు ఉన్నాయి. మొదటి టర్మ్‌లో నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు. ఎంతో క్రమశిక్షణతో, కడుపు మోపు కట్టుకుని, 100కు 100 శాతం పూర్తి అవినీతి రహితంగా ఎప్పటికప్పుడు అడ్మినిస్ట్రేషన్‌తో ముందుకు సాగుతూ పనిచేస్తే అది ఈవేళ సాకారం అయింది..’అంటూ కేసీఆర్‌ అభినందించారు. ఐదు రిజర్వాయర్ల వద్ద పర్యాటకాభివృద్ధి పనులను ఏడాదిన్నరలో పూర్తి చేయాలని ఈ సందర్భంగా హరీశ్‌ను అదేశించారు.

మల్లన్న జలాలతో అభిషేకం
ప్రాజెక్టు ప్రారంభోత్సవం, సభ అనంతరం సీఎం మల్లన్నసాగర్‌ నీటిని ఐదు బిందెల్లో తీసుకుని కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి దేవాలయానికి వెళ్లారు. మల్లిఖార్జున స్వామికి మల్లన్న జలాలతో అభిషేకం నిర్వహించి మొక్కు తీర్చుకున్నారు. స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. 
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement