నెలన్నర రోజులుగా కార్మికులకు అందని వేతనాలు
ఆరునెలలుగా బిల్లులకు నోచుకోని రైతులు
ఎన్డీఎస్‌ఎల్ తీరుపై కార్మికులు, కర్షకుల గుర్రు
త్వరలో సమస్యలు తీరుస్తామంటున్న డిప్యూటీ స్పీకర్
మెదక్ రూరల్ : నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్‌డీఎస్‌ఎల్) యాజమాన్యం మొండివైఖరి కారణంగా అటు కార్మికులు, ఇటు కర్షకులు అవస్థలు పడుతున్నారు. నెలన్నర రోజులుగా జీతాలు లేక కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. చెరకును ఫ్యాక్టరీకి తరలించి ఆరు నెలలు కావస్తున్నా బిల్లులు అందక రైతులు సతమతమవుతున్నారు.
ఈ యేడు ఎన్డీస్‌ఎల్ 95 వేల టన్నుల చెరకును గానుగాడించింది. ఆలస్యంగా క్రషింగ్ ప్రారంభించడంతో రైతులు చెరకును ఇతర ఫ్యాక్టరీలకు తరలించారు. ప్రస్తుతం కార్మికుల సంఖ్య కూడా 170కి పడిపోయింది. ఫ్యాక్టరీలో వాటాను కొనుగోలు చేసిన దక్కన్ పేపర్ మిల్లు యజమాని ఇస్టానుసారంగా వ్యవహరిస్తూ అటు కార్మికులను ఇటు కర్షకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కార్మికులకు ప్రతినెలా ఒకటి నుంచి ఏడో తేదీ మధ్య జీతాలు ఇవ్వాల్సి ఉన్నా ప్రస్తుతం నెలన్నర రోజులైనా వేతనాలు అందని పరిస్థితి.
ఫలితంగా కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. క్రషింగ్‌కు సంబంధించిన డబ్బులు రైతులకు రూ.21 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం రూ.7కోట్లు మాత్రమే చెల్లించారు. మరో రూ.14 కోట్లు బకాయిలున్నాయి. ఆరు నెలలు కావస్తున్నా బిల్లులు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ యేడు 75 వేల క్వింటాళ్ల చక్కెరను యాజమాన్యం విక్రయించినట్టు సమాచారం.
ప్రస్తుతం ఫ్యాక్టరీలో నిలువ ఉన్న చక్కెర కేవలం 9 వేల క్వింటాళ్లు మాత్రమేనని తెలిసింది. రైతులకు డబ్బులు చెల్లించడంలో జాప్యం జరిగినందున మిగతా చక్కెరను విక్రయించరాదని కేన్ కమిషనర్ నుంచి ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఆదేశాలు అందినట్లు తెలిసింది. అయినప్పటికీ యాజమాన్యం స్పందించక పోవడంతో అటు కార్మికులు, ఇటు కర్షకులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
రెండుసార్లు వేతన సవరణను ఎగ్గొట్టారు...
నిబంధనల ప్రకారం మూడేళ్లకోసారి వేతన సవరణ జరగాల్సి ఉంది. ఫ్యాక్టరీ యజమాన్యం ఇప్పటికే రెండుసార్లు వేతన సవరణను ఎగ్గొట్టింది. ఈ విషయమై లేబర్ కమిషనర్‌కు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయింది.
- ముక్తార్ హైమద్, టీఎంఎస్ సంఘ్ ప్రధాన కార్యదర్శి
అర్ధాకలితో అలమటిస్తున్నాం...
అసలే అరకొర వేతనాలు. ఆ వేతనాలు కూడా సరిగా రావడం లేదు. నెలన్నరైనా జీతాలు రాకపోవడంతో మా కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. యాజమాన్యం స్పందించి వెంటనే వేతనాలు చెల్లించాలి.
- సత్తయ్య, ఎన్‌డీఎస్‌ఎల్ కార్మికుడు
వారం రోజుల్లో బిల్లులు..
వారం రోజుల్లో చెరకు రైతులకు బిల్లులు చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఫ్యాక్టరీ యాజమాన్యం టన్ను చెరకు ధరను రూ.2,260 కన్నా ఎక్కువగా ఇవ్వనని మొండికేస్తే సీఎం కేసీఆర్ రైతుల బాగుకోరి టన్నుకు రూ.340 చొప్పున ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెల్లించారు. అయినా యాజమాన్యం రైతులకు బిల్లులు చెల్లించ డం లేదు. ప్రభుత్వమే చొరవ తీసుకొని వారం రోజుల్లో రైతులకు డబ్బులు చెల్లించడంతోపాటు కార్మికులకు సైతం వేతనాలు ఇప్పిస్తాం. ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సీఎం ఆశీస్సులతో రైతులు, కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటాం.
- పద్మాదేవేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్
ఇష్టారాజ్యం!
Published Thu, May 21 2015 11:48 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement