సాక్షి, మెదక్: అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న టీఆర్‌ఎస్ నియోజకవర్గ నేతలు పోటాపోటీ కార్యక్రమాలకు తెరలేపారు. బహిరంగంగా ఎక్కడా విభేదాలు కనబడకున్నా.. అంతర్గతంగా ఎవరికి వారు ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నట్లు చర్చసాగుతోంది. స్థానికంగా జరిగే కార్యక్రమాలకు హాజరవుతూ జనం మధ్యలో ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పటికే మెదక్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరిసుభాష్‌రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునితాలక్ష్మారెడ్డి మధ్య వర్గ విభేదాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.
ప్రజల మద్దతుకై ఆరాటం
► అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల గడువున్నా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నేతలు ఇప్పటి నుంచే ప్రజల మద్దతును కూడగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.
► మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు టికెట్ ఆశిస్తు న్న ముఖ్య నాయకులు ఆయా నియోజకవర్గాల్లో ముమ్మరంగా పర్యటిస్తూ, ఏ చిన్న అవ కాశం ఉన్నా వదులుకోకుండా హాజరవుతున్నారు.
► ఎవరి వర్గాన్ని వారు కాపాడుకుంటూ పోటీపోటీగా అధికార, ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటుండడంతో రాజకీయవర్గాల్లో విస్తృతంగా చర్చ మొదలైంది.
మెదక్ నియోజకవర్గంలో..
► మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి ఇప్పటికే జిల్లా పార్టీ పగ్గాలను సీఎం కేసీఆర్ అప్పగించటంతో నియోజకవర్గంతో పాటు ఇతర ముఖ్య పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ బీజీగా గడుపుతున్నారు.
► ప్రతీ మంగళవారం క్యాంపు కార్యాలయంలో మీ కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పద్మాదేవేందర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదానం, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు.
► అవకాశం దొరికినప్పుడల్లా మెదక్ జిల్లాకు రైలు, మెడికల్ కళాశాల మంజూరు తదితర పనులపై ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
► సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి జన్మదినం సందర్భంగా గతేడాది ఆగస్టులో ఆయన వర్గీయులు నియోజకవర్గంలో భారీ ర్యాలీ, కటౌట్లతో హంగామా చేశారు.
► తమ వర్గీయులతో కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందిస్తూ ప్రజల మెప్పు పొందుతున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ సమస్యలపై దృష్టి పెడుతున్నారు.
నర్సాపూర్ నియోజకవర్గంలో...
► సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునితా లక్ష్మారెడ్డి పోటాపోటీగా పర్యటనలు చేస్తూ, స్థానికంగా ఎక్కువ సమయం ఉండేలా చూసుకుంటున్నారు.
► నర్సాపూర్‌లో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సు నితా లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలను ఆమె వర్గీయులు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు.
► మరోవైపు మదన్‌రెడ్డి అనుయాయులు ఆయన పుట్టిన రోజున ఆలయాల్లో పూజలు చేశారు. నర్సాపూర్ నుంచి చాకరిమెట్ల వరకు కాలినడకన వెళ్లి పూజలు నిర్వహించారు.
► మెదక్‌లో పద్మాదేవేందర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డిలు, నర్సాపూర్‌లో మదన్‌రెడ్డి, సునితా లక్ష్మారెడ్డి ఎవరికి వారు ప్రజల్లో ఉంటూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
► ఈ క్రమంలో అధికార పక్షానికి చెందిన ఇద్దరు నేతలు రెండు వర్గాలుగా ఏర్పడడంతో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు.
ఆ రెండు నియోజకవర్గాలు..
► జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజక వర్గాలు ఉన్నా, మెదక్ మాత్రమే పూర్తిస్థాయి నియోజకవర్గంగా కొనసాగుతోంది.
► మెదక్ నియోజకవర్గంలోని హవేళిఘనాపూర్, రామాయంపేట, పాపన్నపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట మండలాలతో పాటు మెదక్, నర్సాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి.
► నర్సాపూర్ నియోజక వర్గంలో నర్సాపూర్, శివ్వంపేట, వెల్దూర్తి, కొల్చారం, కౌడిపల్లి, చిలిపిచెడ్, నర్సాపూర్ మున్సిపాలితో పాటు హత్నూర మండలం ఉన్నా, పాలనా సౌలభ్యం కోసం దానిని సంగారెడ్డి జిల్లాలో కలిపారు.
► గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్, మనోహరబాద్‌లను, దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట, నార్సింగ్ మండలాలను, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పెద్దశంకరంపేట మండలాన్ని, అందోల్ నియోజకవర్గంలోని టేక్మాల్, రేగోడు, అల్లాదుర్గ్, మండలాలను మెదక్ జిల్లాలో కలిపారు.
► ఇటీవల ఏర్పడిన మాసాయిపేట మండలంతో కలిపి జిల్లాలో 21 మండలాలు, 4 మున్సిపాలిటీలు మెదక్ జిల్లాలో కొనసాగుతున్నాయి. (క్లిక్: అధికార పార్టీలో ధిక్కార స్వరం.. ‘కారు’కు ఏమైంది?)
Comments
Please login to add a commentAdd a comment