సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: టీఆర్‌ఎస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 69 మంది పేర్లు ప్రకటించగా వాటిలో జిల్లాలో ఆరు పేర్లు ఖరారు చేశారు. శుక్రవారం పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్‌లో జాబితా విడుదల చేశారు. అయితే గురువారం రాత్రి ‘సాక్షి’కి అందిన అభ్యర్థుల జాబితాలోంచి దుబ్బాక నియోజకవర్గ అభ్యర్థి పేరు గల్లంతయింది. ‘సాక్షి’కి అందిన పక్కా సమాచారంతో ఏడు నియోజకవర్గాల్లో ఏడు మంది అభ్యర్థుల పేర్లను శుక్రవారం సంచికలో ‘గులాబీ దళం ఖరారు’ శీర్షికన ప్రచురించింది. ముందు చెప్పినట్టుగానే గజ్వేల్ నుంచి కేసీఆర్, సిద్దిపేటకు తన్నీరు హరీశ్వర్‌రావు, ఆందోల్ నుంచి బాబూమోహన్, సంగారెడ్డి నుంచి చింతా ప్రభాకర్, పటాన్‌చెరుకు మహిపాల్‌రెడ్డి, మెదక్ అసెంబ్లీ నుంచి పద్మా దేవేందర్‌రెడ్డి పేర్లనే టీఆర్‌ఎస్ పార్టీ ఖరారు చేసింది.
ఇద్దరిని కూర్చోబెట్టిన తర్వాతే....
తుదిరూపు దిద్దుకున్న తొలి జాబితాలో సోలిపేట రామలింగారెడ్డి పేరు ఖరారైంది. అధికారికంగా విడుదలైన జాబితాలో ఆయన పేరు లేకపోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు ఠమొదటిపేజీ తరువాయి
పోటీ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితోపాటు, కొత్త ప్రభాకర్‌రెడ్డి పోటీ పడుతున్నారు. సోలిపేట ఉద్యమంలో ముందు నడిచి, జైలు పాలయ్యారు. ఉద్యమం నడపటానికి అవసరమైన సమయంలో కొత్త ప్రభాకరరెడ్డి ఆర్థికంగా సహకరించారు. దాదాపు సోలిపేటకు టికెట్ ఖరారు అయినట్టేనని గులాబీ బాస్ సంకేతాలు పంపారు. అయితే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న కొత్త ప్రభాకర్‌రెడ్డిని పిలిచి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాతే టికెట్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. రెండో జాబితాలోనైనా సోలిపేట పేరునే ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
సంగారెడ్డి:
చింతా ప్రభాకర్ స్వస్థలం సదాశివపేట
1988లో టీడీపీతో రాజకీయ ప్రస్థానం మొదలైంది. పీఎస్‌ఎంఎల్ పరిశ్రమలో ట్రేడ్ యూనియన్ కార్యదర్శిగా పనిచేశారు.
1995లో టీడీపీ నుంచి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
2009లో టీడీపీ బీ ఫారం ఇచ్చి మహాకూటమి పొత్తుతో మళ్లీ వెనక్కి తీసుకుంది. టీడీపీ రెబల్‌గా పోటీ చేశారు. జగ్గారెడ్డి చేతిలో 6,772 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
2013లో టీఆర్‌ఎస్ పార్టీలో చేశారు.
చింతా ప్రభాకర్‌కు 34,329 ఒట్లు పడగా... జగ్గారెడ్డికి 41,101 ఓట్లు వచ్చాయి.
సంగారెడ్డి మండలం ఆయన్ను బాగా దెబ్బతీసింది.
గజ్వేల్
కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) స్వగ్రామం సిద్దిపేట మండలం చింతమడక గ్రామం
1983కి ముందు ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
1983లో టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి సిద్దిపేట నుంచి తొలిసారిగా పోటీ చేసి కాంగ్రెస్ నేత అనంతుల మదన్‌మెహన్‌పై ఓటమిపాలయ్యారు.
1985 నుంచి 1999 వరకు అసెంబ్లీ నుంచి వరుసగా గెలిచారు.
టీడీపీ ప్రభుత్వంలో శాసనసభా డిప్యూటీ స్పీకర్‌గా, రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు.
2001 ఏప్రీల్ 27న ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్(తెలంగాణ రాష్ట్ర సమితి)ని స్థాపించారు. టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు అయ్యారు.
2004 ఎన్నికల్లో సిద్దిపేట అసెంబ్లీ, కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి రెండు స్థానాల్లో గెలుపొందారు. ఆ తర్వాత సిద్దిపేట ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశారు.
ఆరు నెలల పోర్ట్‌పోలియో లేని మంత్రిగా కొనసాగి, ఆ తర్వాత కేంద్ర కార్మిక మంత్రిగా ఏడాదిన్నర కాలం పనిచేశారు.
2006లో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి మరోసారి కరీంనగర్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు.
2008లో కరీంనగర్ ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ గెలుపొందారు.
2009 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్ధానం పోటీ చేసి విజయం సాధించారు.
మెదక్:
పద్మా దేవేందర్‌రెడ్డి స్వగ్రామం రామాయంపేట మండలం కోనాపూర్.
2001లో రాజకీయాల్లోకి వచ్చారు. రామాయంపేట జెడ్పీటీసీగా టీఆర్‌ఎస్ నుంచి 12 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జిల్లా పరిషత్‌లో ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు.
2004లో రామాయంపేట నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా పోటీచేసి 32 వేల ఓట్లతో గెలుపొందారు.
2007లో కేసీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
2008లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.
2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్-టీడీపీ పొత్తులో భాగంగా ఆమెకు టికెట్ రాలేదు. అప్పటికే రామాయంపేట పునర్విభజనలో మెదక్ నియోజకవర్గంలోకి వెళ్లింది. టీఆర్‌ఎస్ రెబల్‌గా పోటీ చేశారు. దాదాపు 24 వేల ఓట్లు సాధించారు.
పాపన్నపేట మండలం, మెదక్ పట్టణంలో పద్మకు చాలా తక్కువ ఓట్లు పడ్డాయి.
ఆందోల్:
పల్లి బాబూమోహన్ స్వస్థలం ఖమ్మం జిల్లా , తిరుమలయపాలెం మండలం, బీరోలు గ్రామం,
1974 నుంచి 1988 వరకు రెవెన్యూ శాఖలో ఆర్‌ఐగా పనిచేశారు.
1988 నుంచి సినిమా రంగంలోకి వచ్చారు
1998ఉప ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఆందోల్ నుంచి పోటీచేసి గెలిచారు.
1999లో రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు.
2004లో కాంగ్రెస్ దామోదర రాజనర్సింహ చేతిలో ఓడిపోయారు.
2009లో మరోసారి పోటీ చేసి దామోదర రాజనర్సింహ చేతిలోనే 2,906 ఓట్ల స్వల్ప ఓట్లతో ఓడిపోయారు.
ఆయనకు 75,765 ఓట్లు పడగా రాజనర్సింహకు 78,671 కోట్లు వచ్చాయి.
రాయికోడ్, టేక్మాల్ మండలాలు బాబూమోహన్‌ను దెబ్బతీశాయి.
2014లో టీఆర్‌ఎస్‌లో చేరి మళ్లీ ఆందోల్ బరిలో నిలబడ్డారు.
పటాన్‌చెరు:
గూడెం మహిపాల్‌రెడ్డి స్వస్థలం పటాన్‌చెరు.
1996-99 వరకు పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు
1995లో ఎంపీటీసీగా, 2001లో పటాన్‌చెరు ఎంపీపీగా ఎన్నిక 2009లో కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
2009లో ఎన్నికల తర్వాత టీడీపీలో, 2013లో వైఎస్సార్‌సీపీలో చేరారు.
2014లో టీఆర్‌ఎస్‌లో చేరి, పటాన్‌చెరు టిక్కెట్ పొందారు.
సిద్దిపేట..
తన్నీరు హరీష్‌రావు 1971 జూన్ 3న సిద్దిపేటలో సత్యనారాయణ, లక్ష్మీ దంపతులకు జన్మించారు. స్వగ్రామం.. కరీంనగర్ జిల్లా, బెజ్జింకి మండలం, తోటపల్లి గ్రామం.
టీఆర్‌ఎస్ ఆవిర్భావం కంటే ముందే టీడీపీలో రాజకీయ ప్రయాణం.
టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా పనిచేశారు.
2004 అక్టోబర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా హరీష్‌రావు.. ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డిపై 25 వేల ఓట్ల మెజార్టీతో విజయం
2008 మే ఉప ఎన్నికల్లో హరీష్‌రావు.. సమీప కాంగ్రెస్ అభ్యర్థి భైరి అంజయ్యపై భారీ మెజారిటీతో గెలుపు
2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి భైరి అంజయ్యపై 64.677వేల ఓట్ల మెజార్టీతో హరీష్‌రావు గెలుపు
2010 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తాడూరి శ్రీనివాస్‌గౌడ్‌పై 95.858 ఓట్ల మెజార్టీతో హరీష్‌రావు విజయం. ఈ మెజార్టీ రాష్ట్ర వ్యాప్తంగానే అత్యధిక మెజార్టీ కావడం విశేషం.
గులాబీ దళమిదే..
Published Sat, Apr 5 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 5:35 AM
Advertisement
Advertisement