ఏడుపాయల్లో పర్యటిస్తున్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి
పాపన్నపేట(మెదక్): రైతు ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ క్రాప్ కాలనీలు ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. ఏడుపాయల్లో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. దేశంలోని అన్ని వృత్తులు, ఉద్యోగస్తులకు సంఘాలున్నప్పటికీ రైతులకు మాత్రం ఎలాంటి సంఘాలు లేవని తెలిపారు. దీంతో వారు పండించిన పంటలకు దళారులు ధరలను నిర్ణయించే పరిస్థితి ఉందన్నారు. ఈ విషయాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం క్రాప్ కాలనీలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. దీని ద్వారా రైతులు ఎలాంటి పంటలు వేయాలి ? ఏ పంటకు డిమాండ్ ఉంది ? ఎంత పంట పండించాలి ? గిట్టుబాటు ధర ఎంత ఉండాలి ? ఈ విషయాలను క్రాప్ కాలనీల ద్వారా రైతు సమన్వయ సంఘాలు నిర్ణయిస్తాయని తెలిపారు.
తెలంగాణలో రైతుల కోసం 24గంటల కరెంట్, సాగునీరు, ఎరువులు, విత్తనాలు ప్రభుత్వమే అందజేస్తుందన్నారు. అనుకున్న ప్రాజెక్టులు పూర్తయితే కోటి ఎకరాల భూమికి సాగునీరు అందుతుందన్నారు. ఈ ఏడాది మే నెల నుంచి పంటల పెట్టుబడికోసం ఎకరాకు రూ.4వేల చొప్పున ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. ఇప్పటికే 2,400 ఏఈఓలను నియమించామన్నారు. 5వేల రైతులకు ఒక ఏఈఓ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏడుపాయల పాలకవర్గ చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి, ఎంపీపీ పవిత్ర, రైతు సమన్వయ సమితి జిల్లా అద్యక్షుడు టి. సోములు, ఏడుపాయల డైరెక్టర్లు దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆలయ అభివృద్ధికి నిధులు
చిన్నశంకరంపేట(మెదక్): శ్రీ సోమేశ్వర ఆలయ అభివృద్ధికి నిధులు అందించనున్నట్లు డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని మడూర్ మధిర గ్రామమైన వెంకట్రావుపల్లి–కుర్మపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీసోమేశ్వర ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆలయల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. శ్రీసోమేశ్వర ఆలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణం కోసం నిధులు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నరేందర్, లక్ష్మారెడ్డి, రాజు, కుమార్‌గౌడ్, సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు సుధాకర్‌రావు, నాగరాజు, భూపాల్, వెంకటేశం, సత్యనారాయణ, పాల్గొన్నారు. కాగా ఈ ఈ కార్యక్రమాలు శ్రీఅష్టకాల నరసింహరామశర్మ ఆధ్వర్యంలో వేద బ్రాహ్మోణోత్తములచేత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment