Crop colony
-
పండిద్దాం.. తినేద్దాం..
సాక్షి, ఖమ్మం: జిల్లాలోనే కూరగాయలు పండించి.. అమ్ముకునే విధంగా ప్రభుత్వం కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. బయటి మార్కెట్లో ప్రస్తుతం కూరగాయల ధరలు మండిపోతుండడం.. సామాన్యుడు కొని.. తినలేని పరిస్థితులు నెలకొనడంతో ప్రభుత్వం ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో కూరగాయల కాలనీల ఏర్పాటుకు పూనుకుంది. అన్ని రకాల కూరగాయలు పండించేలా చర్యలు చేపట్టింది. వీటితోపాటు పండ్ల తోటల పెంపకం కోసం రైతులకు రాయితీలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇవన్నీ అమలులోకి వస్తే బహిరంగ మార్కెట్లో అన్ని రకాల కూరగాయలు అందుబాటులో ఉండడంతోపాటు చౌక ధరలకు లభ్యమవుతాయి. క్రాప్ కాలనీలను ఏర్పాటు చేయడంలో భాగంగా ఉద్యానవన శాఖ ద్వారా ప్రతిపాదనలు రూపొందించి.. అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ఆ శాఖ జిల్లాలోని 8 మండలాలను క్రాప్ కాలనీల కోసం ఎంపిక చేసింది. ప్రస్తుతం ఖమ్మం నగరానికి రోజుకు 15 నుంచి 20 టన్నుల కూరగాయలు అవసరం కాగా.. ఇందులో అత్యధిక భాగం ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంది. జిల్లాలో పండించే కూరగాయలు.. నగర ప్రజల అవసరాలతోపాటు జిల్లా ప్రజల అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చలేకపోతున్నాయి. దీంతో ఖమ్మం నగరానికి కూరగాయలను తాజాగా.. తెల్లవారుజాము వరకు తెచ్చే రవాణా సౌకర్యం ఉండే ప్రాంతాలను, నగరానికి అత్యంత సమీపంలో ఉండే ప్రాంతాల్లో కూరగాయల కాలనీలు ఏర్పాటు చేసి అక్కడ అన్ని రకాల కూరగాయలను ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. 1,700 ఎకరాల్లో సాగు.. జిల్లాలోని 1,700 ఎకరాల్లో కూరగాయల కాలనీలు ఏర్పాటు చేసి.. అందులో సాగు చేపట్టేందుకు ఉద్యానవన శాఖ సమాయత్తమవుతోంది. కూరగాయల కాలనీలను ఏర్పాటు చేసేందుకు మొత్తం 8 మండలాలను ఎంపిక చేశారు. ఇక్కడ పండించిన పంటలను ఖమ్మం కార్పొరేషన్‌తోపాటు రైతుబజార్లో.. ఇతర ప్రాంతాల్లో విక్రయించుకునే వీలుంటుంది. అయితే క్రాప్ కాలనీల ఏర్పాటు కోసం రూ.4కోట్ల నిధులు అవసరం ఉంటాయని ప్రతిపాదనలు పంపించింది. పంట సాగు, విత్తనాలు, ఎరువులు, సూక్ష్మసేద్యం, మల్చింగ్, పందిళ్లు, పండించిన కూరగాయలను నిల్వ చేసుకునేందుకు గదుల నిర్మాణం తదితర వాటి కోసం ఈ నిధులు అవసరం ఉంటాయని ఉద్యానవన శాఖ ప్రతిపాదనల్లో పేర్కొంది. ఇక కూరగాయల కాలనీల్లో 1,705 మెట్రిక్ టన్నులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పండ్ల తోటల సాగుకు రాయితీ.. కూరగాయల కాలనీతోపాటు తాజా పండ్లను తక్కువ ధరకు ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సమగ్ర ఉద్యాన మిషన్ పేరుతో పండ్ల తోటలను సాగు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా జిల్లాలో పండ్ల తోటలను సాగు చేసేందుకు ముందుకొచ్చే రైతులకు రాయితీ అందించాలని నిర్ణయించారు. మూడేళ్ల కాలంలో మొక్కలకు, ఎరువులకు, సాగుకు సంబంధించి రాయితీలు ఉంటాయి. ఇందులో భాగంగా మామిడిని 47 ఎకరాల్లో, నిమ్మ 16, జామ 43, దానిమ్మను 14 ఎకరాల్లో పండించాలని ఉద్యానవన శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అధిక ధరలతో.. కూరగాయలు బహిరంగ మార్కెట్లో అధిక ధర పలుకుతున్నాయి. సీజన్లో కొన్ని కూరగాయలు ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉండడంతో వాటి ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదు. వర్షాకాలంలో కొంత తక్కువగా ఉండే ధరలు.. వేసవిలో మాత్రం చుక్కలను అంటుతున్నాయి. వేసవిలో సామాన్యులు కూరగాయలు కొనుగోలు చేయలేని పరిస్థితి. కిలో రూ.80 నుంచి రూ.100 కూడా పలికిన సందర్భాలు ఉంటున్నాయి. కొంతకాలంగా జిల్లాలో కూరగాయ పంటల సాగు గణనీయంగా తగ్గింది. దీంతో వీటి ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో జిల్లా ప్రజల అవసరాలను తీర్చేందుకు పెద్ద ఎత్తున కూరగాయల సాగు చేపట్టాలని ఉద్యానవన శాఖ నిర్ణయించింది. కూరగాయల కాలనీలు అందుబాటులోకి వస్తే వేసవి కాలంలోనూ కూరగాయల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ప్రయోజనకరం.. క్రాప్ కాలనీల కోసం ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత కార్యాచరణ ప్రారంభిస్తాం. తక్కువ విస్తీర్ణంలో కూరగాయల పంట సాగు చేసుకుని విక్రయించుకోవడం ద్వారా రైతులకు ప్రయోజనం ఉంటుంది. నగర పరిసరాల్లోని మండలాల్లో కూరగాయల పంటలు సాగు చేసుకోవడం ద్వారా ఆయా రైతులు నగరంలో పంటను విక్రయించుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్రాప్ కాలనీలకు తగిన చర్యలు తీసుకుంటాం. – జి.అనసూయ, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమాభివృద్ధి శాఖ అధికారి -
క్రాప్ కాలనీలఏర్పాటు
పాపన్నపేట(మెదక్): రైతు ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ క్రాప్ కాలనీలు ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. ఏడుపాయల్లో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. దేశంలోని అన్ని వృత్తులు, ఉద్యోగస్తులకు సంఘాలున్నప్పటికీ రైతులకు మాత్రం ఎలాంటి సంఘాలు లేవని తెలిపారు. దీంతో వారు పండించిన పంటలకు దళారులు ధరలను నిర్ణయించే పరిస్థితి ఉందన్నారు. ఈ విషయాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం క్రాప్ కాలనీలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. దీని ద్వారా రైతులు ఎలాంటి పంటలు వేయాలి ? ఏ పంటకు డిమాండ్ ఉంది ? ఎంత పంట పండించాలి ? గిట్టుబాటు ధర ఎంత ఉండాలి ? ఈ విషయాలను క్రాప్ కాలనీల ద్వారా రైతు సమన్వయ సంఘాలు నిర్ణయిస్తాయని తెలిపారు. తెలంగాణలో రైతుల కోసం 24గంటల కరెంట్, సాగునీరు, ఎరువులు, విత్తనాలు ప్రభుత్వమే అందజేస్తుందన్నారు. అనుకున్న ప్రాజెక్టులు పూర్తయితే కోటి ఎకరాల భూమికి సాగునీరు అందుతుందన్నారు. ఈ ఏడాది మే నెల నుంచి పంటల పెట్టుబడికోసం ఎకరాకు రూ.4వేల చొప్పున ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. ఇప్పటికే 2,400 ఏఈఓలను నియమించామన్నారు. 5వేల రైతులకు ఒక ఏఈఓ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏడుపాయల పాలకవర్గ చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి, ఎంపీపీ పవిత్ర, రైతు సమన్వయ సమితి జిల్లా అద్యక్షుడు టి. సోములు, ఏడుపాయల డైరెక్టర్లు దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి నిధులు చిన్నశంకరంపేట(మెదక్): శ్రీ సోమేశ్వర ఆలయ అభివృద్ధికి నిధులు అందించనున్నట్లు డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని మడూర్ మధిర గ్రామమైన వెంకట్రావుపల్లి–కుర్మపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీసోమేశ్వర ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆలయల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. శ్రీసోమేశ్వర ఆలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణం కోసం నిధులు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నరేందర్, లక్ష్మారెడ్డి, రాజు, కుమార్‌గౌడ్, సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు సుధాకర్‌రావు, నాగరాజు, భూపాల్, వెంకటేశం, సత్యనారాయణ, పాల్గొన్నారు. కాగా ఈ ఈ కార్యక్రమాలు శ్రీఅష్టకాల నరసింహరామశర్మ ఆధ్వర్యంలో వేద బ్రాహ్మోణోత్తములచేత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
మనకు తగ్గ పంటలు వేయాలి
► అధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్ ► క్రాప్ కాలనీలపై అధ్యయనానికి ఆదేశం సాక్షి, హైదరాబాద్: సాగును లాభసాటి చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పాటు, పంటకు మంచి ధర రావడానికి వినూత్న పద్ధతులు అవలంభించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఇందుకు అధికారులు కార్యాచరణ రూపొందించాలని, రైతులకు ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేయాలని కోరారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, సీనియర్ అధికారులతో సీఎం గురువారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ‘‘మన అవసరాలకు తగ్గట్లు పంటలు పండించాలి. కోళ్లు, పశువులు, చేపల దాణా తదితరాలనూ అధ్యయనం చేయాలి. తెలంగాణలో ఏ ఆహారం ఎంత అవసరమో కచ్చితమైన అవగాహనకు రావాలి. దాన్ని బట్టే పంటలు పండించాలి. ఇక్కడ పండించడానికి అనువుగా ఉండి, ఎగుమతి చేయగలిగే పంటలను గుర్తించాలి. వాటిని సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలి. సాస్, గంజి, పల్ప్, తయావైన్ రీ తదితర ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పే విషయంలో రైతులకు సూచనలివ్వాలి. పండ్లు, కూరగాయలు తెలంగాణకు ఎన్ని కావాలి, ఎన్ని పండిస్తున్నాం, వేటికి మార్కెట్ ఉందనే విషయాలను అధ్యయనం చేసి పండించాలి. దశేరి, హిమాయత్ వంటి మంచి డిమాండున్న మామిడి రకాలను పండించాలి. ఊరూరా రైతులు తమ భూములను క్రాప్ కాలనీలుగా మార్చుకోవాలి. కొందరు కూరగాయలు వేసుకోవాలి. ఆ ఊళ్లో వాటినే తినాలి’’ అని సూచించారు. -
ఎన్ని వేల కోట్లయినా ఖర్చు చేస్తాం!
-
ఎన్ని వేల కోట్లయినా ఖర్చు చేస్తాం!
రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేస్తాం: కేసీఆర్ ► క్రాప్ కాలనీలుగా తెలంగాణ భూములు ► 25న హెచ్ఐసీసీలో వ్యవసాయాధికారులతో సమావేశానికి నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా మార్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణలోని రైతులందరికీ పంటల సాగుకు అవసరమైన పరిజ్ఞానం, పెట్టుబడికి కావాల్సిన సహాయం, మార్కె టింగ్ సౌకర్యం వంటివన్నీ ప్రభుత్వం తరఫున అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగాలని, తెలంగాణలో వ్యవసాయం దేశానికే ఆదర్శం కావాలని, అన్నం పెట్టే రైతులకు సమాజంలో గౌరవం పెరగాలని పేర్కొన్నారు. రైతుల కోసం ఎన్ని వేల కోట్లయినా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. గురువారం ఎరువుల కొనుగోలు కోసం రైతులకు ఆర్థిక సాయం అందించే పథకం, రైతు సంఘాల ఏర్పాటుకు అవలంబించాల్సిన విధానాలపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్షించారు. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్ రావు, ఉద్యానవన శాఖ కమిషనర్ వెంకట్రాంరెడ్డి, సీఎంవో ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, స్మితా సబర్వాల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇజ్రాయెల్‌కు వెళ్లి అధ్యయనం వ్యవసాయంలో పెరుగుతున్న పెట్టుబడి భారాన్ని పంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయిం చిందని, అందులోభాగంగా ఎరువుల కొనుగోలు కోసం ఎకరాకు రూ.4వేల చొప్పు న ప్రభుత్వం భరిస్తుందని కేసీఆర్ ఈ సంద ర్భంగా పేర్కొన్నారు. మార్కెటింగ్ సౌకర్యా లు మెరుగు పరుస్తున్నామని, మద్దతు ధర ఇప్పించే ఏర్పాట్లు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 20.5లక్షల టన్నుల సామర్థ్యం కలిగి న గోదాములను సిద్ధం చేశామని, వ్యవసాయ శాఖను బలోపేతం చేస్తామని చెప్పారు. కొత్తగా నియామకమైన వారితో కలిపి తెలం గాణలో ఇప్పుడు 2,112 మంది వ్యవసా యాధికారులు అందుబాటులో ఉన్నారని, ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక అధికారిని నియమిస్తామని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖలో వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని, ఖాళీ లన్నింటినీ భర్తీ చేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం లో పరిశోధనలు పెరగాలని, సాగులో నూతన పద్ధతులపై అధ్యయనానికి అధికారులను ఇజ్రాయెల్ పంపాలని చెప్పారు. గ్రామ గ్రామాన రైతు సంఘాలు రాష్ట్రంలోని వ్యవసాయ భూములను క్రాప్ కాలనీలుగా మారుస్తామని... భూసారం, వర్షపాతం, ఉష్ణోగ్రతలను అనుసరించి ఏ ప్రాంత రైతులు ఏ రకం పంట వేయాలో తగిన సూచనలివ్వాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. గ్రామాల్లో రైతు సంఘాలు ఏర్పాటు చేస్తామని.. వ్యవసాయ కార్యక్రమాలన్నింటినీ గ్రామ రైతు సంఘాలు సమన్వయం చేస్తాయని చెప్పారు. గ్రామాల్లో వ్యవసాయ భూములు ఎవరి వద్ద ఉన్నాయి, వాటి స్థితి ఎలా ఉందనే విషయాలపై రికార్డులు నిర్వహించాలని సూచించారు. క్రయ విక్రయాలు జరిగినప్పుడు వెంటనే గ్రామస్థాయి రికార్డులు మార్చాలని, దీనిపై రిజిస్ట్రేషన్ శాఖకు తగిన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. కల్తీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్.. రాష్ట్రంలో ఏయే ఆహార ధాన్యాల డిమాండ్ ఎంత ఉంది, ఏ పంటకు ఎక్కువ డిమాండ్ ఉంది, ఏ పంటకు మార్కెట్ ఉందనే వాటిని గుర్తించి పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయాధికారులకు కేసీఆర్ సూచించారు. కూరగాయలు, పండ్లు, పూలు వేరే రాష్ట్రాల నుంచి తెలంగాణకు దిగుమతి కావద్దని, మనకు కావాల్సినవి మనమే ఉత్పత్తి చేసుకోవాలని పేర్కొన్నారు. ఇక రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు తీసుకుంటామని.. కల్తీ విత్తనాలు అమ్మే వారిపై íపీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపుతామని, ఇందుకోసం అవసరమైతే కొత్త చట్టం తెస్తామని చెప్పారు. భూసార పరీక్షల నిర్వహణకు మినీ ల్యాబ్‌ల ‡సంఖ్యను పెంచుతామన్నారు. కాగా ఈ నెల 25న హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో వ్యవసాయాధికారుల సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని స్థాయిల వ్యవసాయాధికారులను ఆ సమావేశానికి ఆహ్వానించారు. -
పంట కాలనీలపై సదస్సులు
♦ వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి వెల్లడి ♦ తెలంగాణ వ్యవసాయ అధికారులతో సమీక్ష సాక్షి, హైదరాబాద్: పంట కాలనీపై మండల, జిల్లా, రాష్ట్రస్థాయి సదస్సులు ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విశ్వవిద్యాలయం ప్రత్యేకాధికారి డాక్టర్ వి.ప్రవీణ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ వ్యవసాయశాఖ అధికారులు, విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, అనుబంధ శాఖల అధికారులతో రాష్ట్రస్థాయిలో ఒక సదస్సు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఆ తర్వాత జిల్లా, మండలస్థాయిలోనూ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రస్థాయి సదస్సులో పంట కాలనీలకు సంబంధించి మండల, జిల్లాస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి ఓ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. మండల వ్యవసాయాధికారులను ఆగ్రానమిస్టులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల ప్రణాళికను రూపొందించాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులను ఆదేశించారు. అందుకు సిలబస్ తయారు చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ దండ రాజిరెడ్డి, డాక్టర్ ఎన్.వాసుదేవ్, డాక్టర్ పి.సి.రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం క్యాలెండర్‌ను ఆ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్, వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి శుక్రవారం ఆవిష్కరించారు. -
సాగు.. సమూల మార్పు
* ఉత్పాదకత, ఆదాయం, రైతు అభివృద్ధికి కసరత్తు * వ్యవసాయ, ఉద్యాన పంటల కోసం ‘పంట కాలనీ’లు * సంప్రదాయ పంటల విధానానికి స్వస్తి * ఐదేళ్ల కోసం ‘వ్యవసాయశాఖ విజన్ డాక్యుమెంట్’ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని సమూలంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. వాతావరణం, వర్షాభావ పరిస్థితులను అంచనా వేసి వ్యవసాయ, ఉద్యాన రంగంలోని బలాలు, బలహీనతలు, అవకాశాలను అధ్యయనం చేసి ఐదేళ్ల కోసం ‘విజన్ డాక్యుమెంట్’ను వ్యవసాయశాఖ రూపొందించింది. శాఖ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు కలసి రూపొందించిన డాక్యుమెంటుపై బుధవారం వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. ‘ఉత్పాదకత, ఆదాయం తద్వారా రైతు ఆర్థికాభివృద్ధి’ లక్ష్యంగా దీన్ని రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. సంప్రదాయ పంటలకు స్వస్తి: వాతావరణం, నేల స్వభావం, భూసారం తదితర అంశాలను ఆధారం చేసుకొని ఏ ప్రాంతాలు ఏ పంటలకు అనువైనవో గుర్తించి వాటినే సాగు చేసేలా చూసేందుకు ‘పంట కాలనీ’లను ఏర్పాటుచేయాలని విజన్ డాక్యుమెంట్ స్పష్టం చేస్తోంది. రైతులు సంప్రదాయంగా పంటలు వేసుకునే పద్ధతికి పంట కాలనీల ద్వారా స్వస్తిపలుకుతారు. పంట కాలనీలుగా విభజించాక ఏ కాలనీలో ఏ పంటలు వేయాలన్న అంశాన్ని అధికారులు గుర్తించి రైతులకు సలహాలు ఇస్తారు. రైతులు ఆ పంటలే వేయాల్సి ఉంటుంది. దానివల్ల అధిక ఉత్పత్తి, రైతుకు అధిక ఆదాయం లభిస్తాయన్నది సర్కారు ఉద్దేశం. ఇప్పటికే జిల్లాల వారీగా పంటల కాలనీలను గుర్తించారు. రసాయన, పురుగు మందులను కూడా గణనీయంగా తగ్గించాలని నిర్ణయించారు. అలాగే వ్యవసాయ విస్తరణ వ్యవస్థను పెద్ద ఎత్తున పెంచాలని కూడా నిర్ణయించినట్లు తెలిసింది. పంట కాలనీలను ఏర్పాటు చేస్తే వ్యవసాయాధికారుల సంఖ్యను కూడా పెద్దఎత్తున పెంచాల్సి ఉంటుంది. ఉద్యానశాఖ బలోపేతం ఉద్యానశాఖను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని విజన్ డాక్యుమెంట్ స్పష్టంచేస్తోంది. వర్షాభావ పరిస్థితులున్న తెలంగాణలో ఉద్యాన పంటల సాగును పెంచాలనేది దీని ప్రధాన ఉద్దేశం. పళ్లు, పూలు, ఆయిల్‌ఫాం, స్పైస్ వంటి ఉద్యాన పంటల సాగుపై దృష్టిపెట్టాలని నిర్ణయించారు. ఏ ప్రాంతంలో ఎటువంటి ఉద్యాన పంటల సాగు చేయవచ్చో ఖరారు చేసి, ఆ ప్రకారం 90 పంట కాలనీలుగా విభజించారు. ప్రస్తుతం ఉన్న 20 లక్షల ఎకరాల్లోని ఉద్యాన సాగును ఐదేళ్లలో 30 లక్షల ఎకరాలకు విస్తరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉద్యానశాఖలో 200 మంది ఉండగా... ఆ సంఖ్యను 3 వేల వరకు పెంచాలని నిర్ణయించారు. 7,500 ఎకరాలకు ఒక ఉద్యాన అధికారిని, 2,500 ఎకరాలకు ఒక ఉద్యాన విస్తరణ అధికారిని, 25 వేల ఎకరాలకు ఒక అసిస్టెంట్ డెరైక్టర్‌ను ఏర్పాటు చేయాలని డాక్యుమెంటులో సూచించారు. ఈ విధంగా ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు ఐదేళ్లకు రూ. 5,700 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. విజన్ డాక్యుమెంటుకు తుది రూపు ఇచ్చాక దీని అమలు ప్రారంభం అవుతుంది.