మనకు తగ్గ పంటలు వేయాలి
► అధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్
► క్రాప్ కాలనీలపై అధ్యయనానికి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: సాగును లాభసాటి చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పాటు, పంటకు మంచి ధర రావడానికి వినూత్న పద్ధతులు అవలంభించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఇందుకు అధికారులు కార్యాచరణ రూపొందించాలని, రైతులకు ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేయాలని కోరారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, సీనియర్ అధికారులతో సీఎం గురువారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ‘‘మన అవసరాలకు తగ్గట్లు పంటలు పండించాలి. కోళ్లు, పశువులు, చేపల దాణా తదితరాలనూ అధ్యయనం చేయాలి.
తెలంగాణలో ఏ ఆహారం ఎంత అవసరమో కచ్చితమైన అవగాహనకు రావాలి. దాన్ని బట్టే పంటలు పండించాలి. ఇక్కడ పండించడానికి అనువుగా ఉండి, ఎగుమతి చేయగలిగే పంటలను గుర్తించాలి. వాటిని సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలి. సాస్, గంజి, పల్ప్, తయావైన్ రీ తదితర ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పే విషయంలో రైతులకు సూచనలివ్వాలి. పండ్లు, కూరగాయలు తెలంగాణకు ఎన్ని కావాలి, ఎన్ని పండిస్తున్నాం, వేటికి మార్కెట్ ఉందనే విషయాలను అధ్యయనం చేసి పండించాలి. దశేరి, హిమాయత్ వంటి మంచి డిమాండున్న మామిడి రకాలను పండించాలి. ఊరూరా రైతులు తమ భూములను క్రాప్ కాలనీలుగా మార్చుకోవాలి. కొందరు కూరగాయలు వేసుకోవాలి. ఆ ఊళ్లో వాటినే తినాలి’’ అని సూచించారు.