
పంట కాలనీలపై సదస్సులు
♦ వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి వెల్లడి
♦ తెలంగాణ వ్యవసాయ అధికారులతో సమీక్ష
సాక్షి, హైదరాబాద్: పంట కాలనీపై మండల, జిల్లా, రాష్ట్రస్థాయి సదస్సులు ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విశ్వవిద్యాలయం ప్రత్యేకాధికారి డాక్టర్ వి.ప్రవీణ్‌రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ వ్యవసాయశాఖ అధికారులు, విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, అనుబంధ శాఖల అధికారులతో రాష్ట్రస్థాయిలో ఒక సదస్సు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఆ తర్వాత జిల్లా, మండలస్థాయిలోనూ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రస్థాయి సదస్సులో పంట కాలనీలకు సంబంధించి మండల, జిల్లాస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి ఓ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు.
మండల వ్యవసాయాధికారులను ఆగ్రానమిస్టులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల ప్రణాళికను రూపొందించాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులను ఆదేశించారు. అందుకు సిలబస్ తయారు చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ దండ రాజిరెడ్డి, డాక్టర్ ఎన్.వాసుదేవ్, డాక్టర్ పి.సి.రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం క్యాలెండర్‌ను ఆ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్, వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి శుక్రవారం ఆవిష్కరించారు.