ఎన్ని వేల కోట్లయినా ఖర్చు చేస్తాం!
రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేస్తాం: కేసీఆర్
► క్రాప్ కాలనీలుగా తెలంగాణ భూములు
► 25న హెచ్‌ఐసీసీలో వ్యవసాయాధికారులతో సమావేశానికి నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా మార్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణలోని రైతులందరికీ పంటల సాగుకు అవసరమైన పరిజ్ఞానం, పెట్టుబడికి కావాల్సిన సహాయం, మార్కె టింగ్ సౌకర్యం వంటివన్నీ ప్రభుత్వం తరఫున అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగాలని, తెలంగాణలో వ్యవసాయం దేశానికే ఆదర్శం కావాలని, అన్నం పెట్టే రైతులకు సమాజంలో గౌరవం పెరగాలని పేర్కొన్నారు.
రైతుల కోసం ఎన్ని వేల కోట్లయినా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. గురువారం ఎరువుల కొనుగోలు కోసం రైతులకు ఆర్థిక సాయం అందించే పథకం, రైతు సంఘాల ఏర్పాటుకు అవలంబించాల్సిన విధానాలపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్షించారు. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్ రావు, ఉద్యానవన శాఖ కమిషనర్ వెంకట్రాంరెడ్డి, సీఎంవో ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, స్మితా సబర్వాల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇజ్రాయెల్‌కు వెళ్లి అధ్యయనం
వ్యవసాయంలో పెరుగుతున్న పెట్టుబడి భారాన్ని పంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయిం చిందని, అందులోభాగంగా ఎరువుల కొనుగోలు కోసం ఎకరాకు రూ.4వేల చొప్పు న ప్రభుత్వం భరిస్తుందని కేసీఆర్ ఈ సంద ర్భంగా పేర్కొన్నారు. మార్కెటింగ్ సౌకర్యా లు మెరుగు పరుస్తున్నామని, మద్దతు ధర ఇప్పించే ఏర్పాట్లు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 20.5లక్షల టన్నుల సామర్థ్యం కలిగి న గోదాములను సిద్ధం చేశామని, వ్యవసాయ శాఖను బలోపేతం చేస్తామని చెప్పారు.
కొత్తగా నియామకమైన వారితో కలిపి తెలం గాణలో ఇప్పుడు 2,112 మంది వ్యవసా యాధికారులు అందుబాటులో ఉన్నారని, ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక అధికారిని నియమిస్తామని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖలో వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని, ఖాళీ లన్నింటినీ భర్తీ చేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం లో పరిశోధనలు పెరగాలని, సాగులో నూతన పద్ధతులపై అధ్యయనానికి అధికారులను ఇజ్రాయెల్ పంపాలని చెప్పారు.
గ్రామ గ్రామాన రైతు సంఘాలు
రాష్ట్రంలోని వ్యవసాయ భూములను క్రాప్ కాలనీలుగా మారుస్తామని... భూసారం, వర్షపాతం, ఉష్ణోగ్రతలను అనుసరించి ఏ ప్రాంత రైతులు ఏ రకం పంట వేయాలో తగిన సూచనలివ్వాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. గ్రామాల్లో రైతు సంఘాలు ఏర్పాటు చేస్తామని.. వ్యవసాయ కార్యక్రమాలన్నింటినీ గ్రామ రైతు సంఘాలు సమన్వయం చేస్తాయని చెప్పారు. గ్రామాల్లో వ్యవసాయ భూములు ఎవరి వద్ద ఉన్నాయి, వాటి స్థితి ఎలా ఉందనే విషయాలపై రికార్డులు నిర్వహించాలని సూచించారు. క్రయ విక్రయాలు జరిగినప్పుడు వెంటనే గ్రామస్థాయి రికార్డులు మార్చాలని, దీనిపై రిజిస్ట్రేషన్ శాఖకు తగిన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు.
కల్తీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్..
రాష్ట్రంలో ఏయే ఆహార ధాన్యాల డిమాండ్ ఎంత ఉంది, ఏ పంటకు ఎక్కువ డిమాండ్ ఉంది, ఏ పంటకు మార్కెట్ ఉందనే వాటిని గుర్తించి పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయాధికారులకు కేసీఆర్ సూచించారు. కూరగాయలు, పండ్లు, పూలు వేరే రాష్ట్రాల నుంచి తెలంగాణకు దిగుమతి కావద్దని, మనకు కావాల్సినవి మనమే ఉత్పత్తి చేసుకోవాలని పేర్కొన్నారు.
ఇక రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు తీసుకుంటామని.. కల్తీ విత్తనాలు అమ్మే వారిపై íపీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపుతామని, ఇందుకోసం అవసరమైతే కొత్త చట్టం తెస్తామని చెప్పారు. భూసార పరీక్షల నిర్వహణకు మినీ ల్యాబ్‌ల ‡సంఖ్యను పెంచుతామన్నారు. కాగా ఈ నెల 25న హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో వ్యవసాయాధికారుల సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని స్థాయిల వ్యవసాయాధికారులను ఆ సమావేశానికి ఆహ్వానించారు.