పని చేయకపోతే వెళ్లిపోండి
ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
వైద్యులపై ఆగ్రహం
రామాయంపేట : విధులు సక్రమంగా నిర్వహించకపోతే ఇక్కడి నుంచి బదిలీ చేయించుకొని వెళ్లిపోవాలని, ఇక్కడే పని చేయాలనుకుంటే బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను హెచ్చరించారు. శుక్రవారం ఆమె రామాయంపేట ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రోగులకు అందుతున్న వైద్య సేవలను వాకబు చేశారు. తమకు సరైన వైద్యం అందడంలేదని పలువురు పద్మాదేవేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె వైద్యులపై మండిపడ్డారు.
గురువారం రాత్రి జప్తి శివునూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సకాలంలో వైద్యసేవలు అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కారణంగానే ఒకరు చనిపోయినట్లు తమ వద్ద సమాచారం ఉందని డిప్యూటీ స్పీకర్ కోపోద్రిక్తులయ్యారు. జాతీయ రహదారిపై రాత్రి వేళలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయని డాక్టర్లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇందుకు సిద్ధంగా లేనివారు ఇక్కడి నుంచి బదిలీ చేయించుకొని వెళ్లాలన్నారు. ఆమె వెంట ఎంపీపీ పుట్టి విజయలక్ష్మి, సర్పంచ్ పాతూరి ప్రభావతి, టీఆర్‌ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు పుట్టి యాదగిరి తదితరులు ఉన్నారు.