ఏడుపాయలకు పోటెత్తిన భక్తజనం
జాతరను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్
అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ
చలిగంగ స్నానాలు..
శివసత్తుల సిగాలు
జనసంద్రంగా.. మంజీర తీరం
దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు
పాపన్నపేట : ఏడుపాయలకు జనం పోటెత్తారు.. ఎటు చూసినా జనమే జనం.. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పర్యాటక ఉత్సవమైన ఏడుపాయల జాతర మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిలు దుర్గమ్మ తల్లికి పట్టువస్త్రాలు సమర్పించి, జాతర ప్రారంభించారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల దుర్గా భవానీ జాతర మంగళవారం వైభవంగా మొదలైంది. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జెడ్పీచైర్‌పర్సన్ రాజమణి ఉదయం 10గంటలకు ఏడుపాయలకు చేరుకున్నారు. పాలక మండలి చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఈఓ వెంకట కిషన్‌రావులు ఆలయ మర్యాదల ప్రకారం వారికి స్వాగతం పలి కారు. అనంతరం కార్యనిర్వహణ అధికారి కార్యాలయం నుంచి పట్టువస్త్రాలను తీసుకెళ్లి దుర్గమ్మ తల్లికి సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల వేదిక వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి జాతర ప్రారంభమైనట్లు ప్రకటించారు. మూడు రోజులపాటు జరిగే ఈ జాతర కోసం కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ జిల్లాల నుంచి అశేష ప్రజానీకం తరలివచ్చింది.
విశేష అలంకరణ.. అశేష జనవాహిని...
ఎరుపురంగు పట్టు చీర, భారీ పూలదండలతో అమ్మవారిని ఆకర్షణీయంగా అలంకరించారు. జాతర కోసం వివిధ ప్రాంతాల నుంచి వేలాది భక్తులు తెల్లవారు జామునే లారీలు, బస్సులు,ట్రాక్టర్లు, ఆటోలు, ఎడ్లబళ్లపై ఏడుపాయలకు చేరుకున్నారు. మంజీరనదిలో చలిగంగా స్నానాలు చేసిన భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఘనపురం ఆనకట్ట తీరం, చెక్‌డ్యాం, ఆలయం ముందు బ్రిడ్జి ప్రాంతాలు, ఫౌంటెన్ల వద్ద స్నానాలు చేసే భక్తులతో మంజీర తీరం కిటకిటలాడింది. అనంతరం భక్తులు శివదీక్షలు చేపట్టారు.
హోరెత్తిన సందడి..
కొంతమంది మహిళలు సిగాలు ఊగుతూ దుర్గామాతకు జై అంటూ డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగింపుగా వచ్చి దుర్గమ్మతల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొంతమంది బోనాల ఊరేగింపు నిర్వహించగా, ఇంకొంతమంది తలనీలాలు, ఒడిబియ్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం పూట భక్తు ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ రానురాను సాయంత్రానికి జనం తాకిడి ఎక్కువైంది. చెక్‌డ్యాం, ఘనపురం ఆనకట్ట, నాగ్సాన్‌పల్లి దారులన్నీ ఏడుపాయలకే అన్నట్లు జనంతో కిటకిట లాడాయి. భక్తులకు ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా మెదక్ డీఎస్పీ రాజారత్నం ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
వాహనాలన్నింటిని చెలిమల కుంటలోని మైదానంలోనే పార్కింగ్ చేయిస్తున్నారు. దీంతో జాతరలో ఎలాంటి ట్రాఫిక్ అం తరాయం ఏర్పడటం లేదు. అమ్మవారి ఆల యం ముందు కూడా రెండు బ్రిడ్జిలను భక్తుల రాకపోకలకనుగుణంగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు. దీంతో ఎలాంటి ఇబ్బం దులు కలగడం లేదు. స్నానఘట్టాల వద్ద గజ ఈతగాళ్లు నిరంతరం పహారా కాస్తూ.. భక్తులు లోతైన ప్రదేశంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ముఖ్యంగా పంచాయతీ సిబ్బంది జాతరలో కనీసం కాగితం కూడా కనిపించకుండా నిరంతరం శుభ్రం చేస్తున్నారు. తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా చర్యలు చేపట్టారు. ఇరిగేషన్ అధికారులు జాతరలో మకాంవేసి ఘనపురం నీటిని క్రమబద్ధం గా వదులుతున్నారు. వైద్యులు తమ సేవలందిస్తున్నారు. ఏడుపాయల పాలక వర్గ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఈఓ వెంకటకిషన్‌రావు, ధర్మకర్తలు జాతరలో నిరంతర సేవలందిస్తున్నారు.
జాతరలో మరింత భద్రత చర్యలు
ఏడుపాయల జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. అలాగే అమ్మవారి ఆలయం వద్ద మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శరత్, మెదక్ ఆర్డీఓ మెంచు నగేష్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు ఏడుపాయల్లో మకాం వేసి భక్తులకు సేవలందిస్తున్నారు.
భారతీ సిమెంట్ ఆధ్వర్యంలో వాటర్ ప్యాకెట్ల పంపిణీ
పాపన్నపేట:ఏడుపాయల జాతరకు తరలివచ్చిన భక్తుల కోసం భారతి సిమెంట్ ఆధ్వర్యంలో లక్ష వాటర్ ప్యాకెట్లను ఉచితంగా అందజేశారు. జాతరలోని అమ్మవారి ఆలయం ముందు, స్థానిక బస్టాండ్ ఆవరణలో రెండు క్యాంపులు ఏర్పాటు చేసి భక్తులకు ఉచితంగా వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ముఖ్యంగా దుర్గమ్మ తల్లి దర్శనార్థం క్యూలైన్లలో నిలబడ్డ భక్తులు ఈ వాటర్ ప్యాకెట్లతో సేదదీరారు. మూడేళ్లుగా భారతి సిమెంట్ ఆధ్వర్యంలో ఏడుపాయలో ఉచితంగా వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భారతి సిమెంట్ మార్కెటింగ్ మేనేజర్ పి.ఎస్. కరునాకరణ్, టెక్నికల్ మేనేజర్ ఓబుల్‌రెడ్డి, సతీష్‌కుమార్, లీడర్లు రాలింగేశ్వర ట్రేడర్స్ లింగమూర్తి, శ్రీసాయి ట్రెడర్స్ నర్సింలు, బాలాజిసాయిరాం ట్రెడర్స్ సంగారెడ్డి, కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.
జనారణ్యమే..
Published Wed, Feb 18 2015 12:26 AM | Last Updated on Mon, Oct 8 2018 4:35 PM
Advertisement
Advertisement