
ఇదేం ఆస్పత్రి..!
పాపన్నపేట : అటెండెన్స్ రిజిష్టర్ లేదు.. డాక్టర్లులేరు.. 11 మంది సిబ్బందికి ముగ్గురే ఉన్నారు. ఇలాంటి ఆస్పత్రిలో నిరుపేదలకు ైవైద్యసేవలు ఎలా అందజేస్తారంటూ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. బుధవారం ఆమె పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహం రెండు గంటలకి కూడా డాక్టర్ రాకపోవడంపై ఆమె మండి పడ్డారు. ఆస్పత్రిలో 11 మంది సిబ్బంది ఉండగా, ఒక నేత్రవైద్యుడు, నర్స్, మరో ఉద్యోగి మాత్రమే విధులకు హాజరు కావడంపై ఆమె విస్తుపోయారు. అటెండెన్స్ రిజిష్టర్ తీసుకరమ్మని సిబ్బందిని ఆదేశించగా, వారు అరగంటకు పైగా వెతికి ఖాళీ చేతులతో తిరిగివచ్చారు.
దీంతో పద్మాదేవెందర్‌రెడ్డి తమాషా చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు అందుతున్న సేవలను ఆమె అడిగి తెలుసుకున్నారు. తమకు సరైన సేవలందడంలేదంటూ బాధితుల వాపోయారు. దీంతో ఆమె జిల్లా వైద్యాధికారికి ఫోన్‌చేసి గైర్హాజరైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతుకుముందు నార్సింగి వద్ద మార్కెట్ కమిటీ నిర్మాణం కోసం భూమిని చదును చేస్తున్న ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు. ఆమె వెంట టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు దేవెందర్‌రెడ్డి, ఎంపీపీ పవిత్ర, వైస్ ఎంపీపీ విష్ణువర్దన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.