సాక్షి, హైదరాబాద్ : రేషన్ డీలర్లు సమ్మె విరమించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించడంతో సమ్మె విరమిస్తున్నట్లు రేషన్ డీలర్స్ సంఘం నేత రమేష్ ప్రకటించారు. హైదరాబాద్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఆర్థిక, పౌర సరఫరాల శాఖల మంత్రి ఈటల రాజేందర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపారు. పెండింగ్ బకాయిల విడుదల, కనీస వేతనంపై హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు.
తమ సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ సమ్మెకు వెళతామని రమేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు మాట్లాడుతూ.. మాకు ముఖ్యమంత్రి న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వాజీర్ ఖాన్ కుటుంబాన్ని అదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. డిప్యూటీ స్పీకర్, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. డీలర్ల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. కాగా సమస్య పరిష్కారానికి కృషి చేసిన డిప్యూటీ స్పీకర్, మంత్రులకు డీలర్లు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment