అలక.. ఆగ్రహం
కోమటిరెడ్డి : మేడమ్... నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి
డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి : కుదరదు.. మీ పార్టీ నుంచి ఇప్పటికే ముగ్గురు మాట్లాడారు..
కోమటిరెడ్డి : మేడమ్...నేను డిప్యూటీ లీడర్‌ను...నాకు అవకాశం ఇవ్వండి..
డిప్యూటీ స్పీకర్ : లేదండీ... ఇప్పటికే మీ వాళ్లు మాట్లాడారు...
సీన్‌కట్ చేస్తే సభలో కోమటిరెడ్డి లేరు. ఏమయిందోనని అనుకుంటుంటేనే ఇద్దరు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి దగ్గరకు వెళ్లారు ఏదో చెప్పి వచ్చారు. మళ్లీ కోమటిరెడ్డి సభలోకి ఎంట్రీ
సీఎం : కోమటిరెడ్డి గారు మంత్రిగా పనిచేశారు.. ఆయనంటే మాకు గౌరవం.. ఆయన సభ మీద అలిగివెళ్లిపోతే ఎలా..?
కోమటిరెడ్డి : లేదు సార్... నేను అనవసరంగా మైక్ అడిగేవాడిని కాదు... అయినా నేను అలిగింది సభపై కాదు.. స్పీకర్ మీద.
* అసెంబ్లీలో హాట్‌టాపిక్‌గా మారిన కోమటిరెడ్డి
* మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని సభనుంచి వెళ్లిపోయిన సీఎల్పీ ఉపనేత
* బుజ్జగించిన సీఎం కేసీఆర్
* సభపై కాదు స్పీకర్‌మీద అలిగానన్న మాజీమంత్రి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఇదంతా గురువారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జరిగిన చర్చ... ఈ ఉదంతంతో జిల్లాకు చెందిన సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసెంబ్లీలో హాట్‌టాపిక్‌గా మారిపోయారు. తనకు సభలో మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తూ ఆయన అలక.. ఆగ్రహాన్ని కలగలిపి వ్యవహరించిన తీరు ఆసక్తిని రేకెత్తించింది. స్వయంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవడంతో శాంతించిన ఆయన ఒకదశలో తాను రాజీనామాకు కూడా సిద్ధమయ్యానని ప్రకటించారు.
గురువారం అసెంబ్లీలో జరిగిన ఈ ఆసక్తికర సన్నివేశం వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానంపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోమటిరెడ్డి కోరారు. అప్పుడు అధ్యక్షస్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆయనకు అవకాశం ఇచ్చేందుకు నిరాకరించారు. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే ముగ్గురు మాట్లాడారని, కూర్చోవాలని ఆయనను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే రెండు, మూడుసార్లు స్పీకర్‌ను మైక్ అడిగిన కోమటిరెడ్డి ఉన్నట్టుండి సభ నుంచి వెళ్లిపోయారు.
తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదన్న ఆగ్రహంతో వెళ్లిపోయి లాబీలో కూర్చున్నారు. పరిస్థితిని గమనించిన అధికార పక్ష నేతలు కోమటిరెడ్డి అలిగి వెళ్లిపోయారనుకుని ఇద్దరు దూతలను ఆయన వద్దకు పంపారు. టి.రామ్మోహన్‌రెడ్డి (కాంగ్రెస్), గువ్వల బాలరాజు (టీఆర్‌ఎస్)లు ఆయన వద్దకు వెళ్లి సీఎం సభలోకి రమ్మంటున్నారని కోరారు. దీంతో సభలోకి వచ్చిన కోమటిరెడ్డిని ఉద్దేశించి సీఎం కూడా సరదాగా మాట్లాడారు. కోమటిరెడ్డి సీనియర్ సభ్యుడని, మంత్రిగా పనిచేసిన ఆయన సభమీద అలిగి వెళ్లిపోతే ఎలా అని ప్రశ్నించారు.
అప్పుడు స్పీకర్ కోమటిరెడ్డికి అవకాశం ఇవ్వడంతో తాను అనవసరంగా మైక్ అడిగే వాడిని కాదని, అయినా తాను అలిగింది సభపై కాదని, స్పీకర్‌మీద అలిగానని చెప్పడంతో సభలో నవ్వులు విరిశాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో పరిశ్రమల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. తమ జిల్లాలో అన్నీ సిమెంట్ పరిశ్రమలేనని, వాటి వల్ల వచ్చే దుమ్ము తప్ప జిల్లాకు ఒరిగిందేమీ లేదని, హైదరాబాద్ - నల్లగొండ ఇండస్ట్రీ కారిడార్‌ను మొదటి దశలోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తంమీద గురువారం అసెంబ్లీలో కోమటిరెడ్డి ఎపిసోడ్ సభ్యులకు కొంత ఉల్లాసాన్ని కలిగించింది.