సాక్షి, హైదరాబాద్: ఎనిమిది రోజులపాటు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ నడుమ తీవ్ర వాగ్యుద్ధాల నడుమ సాగిన రాష్ట్ర అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024–25 సమావేశాలు శనివారం ముగిశాయి. చివరి రోజు జరిగిన భేటీలో ‘తెలంగాణ సాగునీటి రంగంపై శ్వేతపత్రం’పై జరిగిన స్వల్పకాలిక చర్చ అనంతరం అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ఈ నెల 8న ప్రారంభమైన సమావేశాలు 8 రోజులపాటు సాగాయి.
8 రోజుల్లో 45 గంటల 32 నిమిషాలపాటు సభ జరగ్గా, 59 మంది సభ్యులు ప్రసంగించగా, జీరో అవర్‌లో 64 మందికి మాట్లాడే అవకాశం దక్కింది. రెండు ప్రభుత్వ తీర్మానాలు, మూడు బిల్లులను పెట్టగా, ఒక స్వల్పకాలిక చర్చ జరిగింది. తొలిసారిగా సభకు ఎన్నికైన సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం కల్పించడంతోపాటు వారి నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించేందుకు ఈ నెల 15, 16 తేదీల్లో సుదీర్ఘంగా జీరో అవర్ నిర్వహించారు.
మేడిగడ్డ సందర్శన.. చలో నల్లగొండ
ఈ నెల 8న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. 9న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. 10న రూ.2.75లక్షల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మండలిలో ప్రవేశ పెట్టారు. 11న విరామం ప్రకటించి.. 12న తిరిగి సమావేశమైన అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగాల్సి ఉండగా, ఎజెండాను వాయిదా వేసి ‘కృష్ణా నదీ యాజమాన్య బోర్డు’కు తాము విధించే షరతులను ఆమోదిస్తేనే నాగార్జునసాగర్, శ్రీశైలం ఉమ్మడి ప్రాజెక్టులు అప్పగిస్తామంటూ తీర్మానం చేసింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నడుమ తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. నీటిపారుదల శాఖ శ్వేతపత్రంపై జరిగిన స్వల్పకాలిక చర్చ కూడా విమర్శలు, ప్రత్యారోపణలకు దారి తీసింది. 13న మేడిగడ్డ సందర్శనకు రావాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని పక్షాలను ఆహ్వానించారు.
13న ఉదయం 10 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ ఎలాంటి ఎజెండాను చేపట్టకుండానే వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా అధికార కాంగ్రెస్‌తో పాటు ఎంఐఎం, సీపీఐ సభ్యులు మేడిగడ్డ సందర్శనకు వెళ్లారు. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతను నిరసిస్తూ అదే రోజు బీఆర్‌ఎస్ నిర్వహించిన ‘చలో నల్లగొండ’సభకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు.
14న బడ్జెట్ ఆమోదం
ఈ నెల 14న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై అసెంబ్లీ చర్చించగా, 15న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానంతో ఆమోదం పొందింది. అదే రోజు ద్రవ్య వినిమయ బిల్లుపైనా చర్చించి ఆమోదించారు. 16న కులగణన బిల్లుపై చర్చించి సభ ఆమోదించింది. 17న సాగునీటి రంగం శ్వేతపత్రంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. అసెంబ్లీ బీఏసీ సమావేశానికి మాజీ మంత్రి హరీశ్‌రావును అనుమతించకపోవడాన్ని బీఆర్‌ఎస్ తప్పు పట్టింది. ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు ఇరుకైన గదిని కేటాయించడంపై బీఆర్‌ఎస్ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది.
మరోవైపు పొగాకు ఉత్పత్తుల సవరణ బిల్లును సభ ఆమోదించింది. బీఆర్‌ఎస్, బీజేపీ ఇచ్చిన పలు వాయిదా తీర్మానాలను స్పీకర్ నిరాకరించారు. అసెంబ్లీ సమావేశాల్లో పైచేయి సాధించేందుకు ఉభయ పక్షాలు పోటాపోటీగా చేసిన ప్రసంగాలు హోరాహోరీగా సాగగా.. పలుమార్లు రగడకు దారితీశాయి. విపక్ష బీజేపీ, ఎంఐఎం కూడా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై సున్నిత విమర్శలు చేస్తూ ఉనికిని చాటుకున్నాయి.
సీపీఐ ఏకైక సభ్యు డు కూనంనేని సాంబశివరావు అధికార కాంగ్రెస్‌ను సమర్థిస్తూనే ఉభయ పక్షాల వైఖరిని ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో మాజీ సీఎం కేసీఆర్ సభకు గైర్హాజరు కావడాన్ని కాంగ్రెస్ పదేపదే ప్రస్తావించింది.
Comments
Please login to add a commentAdd a comment