Vote on account
-
వా‘ఢీ’.. వే‘ఢీ’!
సాక్షి, హైదరాబాద్: ఎనిమిది రోజులపాటు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నడుమ తీవ్ర వాగ్యుద్ధాల నడుమ సాగిన రాష్ట్ర అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024–25 సమావేశాలు శనివారం ముగిశాయి. చివరి రోజు జరిగిన భేటీలో ‘తెలంగాణ సాగునీటి రంగంపై శ్వేతపత్రం’పై జరిగిన స్వల్పకాలిక చర్చ అనంతరం అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ఈ నెల 8న ప్రారంభమైన సమావేశాలు 8 రోజులపాటు సాగాయి. 8 రోజుల్లో 45 గంటల 32 నిమిషాలపాటు సభ జరగ్గా, 59 మంది సభ్యులు ప్రసంగించగా, జీరో అవర్‌లో 64 మందికి మాట్లాడే అవకాశం దక్కింది. రెండు ప్రభుత్వ తీర్మానాలు, మూడు బిల్లులను పెట్టగా, ఒక స్వల్పకాలిక చర్చ జరిగింది. తొలిసారిగా సభకు ఎన్నికైన సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం కల్పించడంతోపాటు వారి నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించేందుకు ఈ నెల 15, 16 తేదీల్లో సుదీర్ఘంగా జీరో అవర్ నిర్వహించారు. మేడిగడ్డ సందర్శన.. చలో నల్లగొండ ఈ నెల 8న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. 9న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. 10న రూ.2.75లక్షల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మండలిలో ప్రవేశ పెట్టారు. 11న విరామం ప్రకటించి.. 12న తిరిగి సమావేశమైన అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగాల్సి ఉండగా, ఎజెండాను వాయిదా వేసి ‘కృష్ణా నదీ యాజమాన్య బోర్డు’కు తాము విధించే షరతులను ఆమోదిస్తేనే నాగార్జునసాగర్, శ్రీశైలం ఉమ్మడి ప్రాజెక్టులు అప్పగిస్తామంటూ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నడుమ తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. నీటిపారుదల శాఖ శ్వేతపత్రంపై జరిగిన స్వల్పకాలిక చర్చ కూడా విమర్శలు, ప్రత్యారోపణలకు దారి తీసింది. 13న మేడిగడ్డ సందర్శనకు రావాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని పక్షాలను ఆహ్వానించారు. 13న ఉదయం 10 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ ఎలాంటి ఎజెండాను చేపట్టకుండానే వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా అధికార కాంగ్రెస్‌తో పాటు ఎంఐఎం, సీపీఐ సభ్యులు మేడిగడ్డ సందర్శనకు వెళ్లారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతను నిరసిస్తూ అదే రోజు బీఆర్ఎస్ నిర్వహించిన ‘చలో నల్లగొండ’సభకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. 14న బడ్జెట్ ఆమోదం ఈ నెల 14న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై అసెంబ్లీ చర్చించగా, 15న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానంతో ఆమోదం పొందింది. అదే రోజు ద్రవ్య వినిమయ బిల్లుపైనా చర్చించి ఆమోదించారు. 16న కులగణన బిల్లుపై చర్చించి సభ ఆమోదించింది. 17న సాగునీటి రంగం శ్వేతపత్రంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. అసెంబ్లీ బీఏసీ సమావేశానికి మాజీ మంత్రి హరీశ్‌రావును అనుమతించకపోవడాన్ని బీఆర్ఎస్ తప్పు పట్టింది. ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు ఇరుకైన గదిని కేటాయించడంపై బీఆర్ఎస్ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. మరోవైపు పొగాకు ఉత్పత్తుల సవరణ బిల్లును సభ ఆమోదించింది. బీఆర్ఎస్, బీజేపీ ఇచ్చిన పలు వాయిదా తీర్మానాలను స్పీకర్ నిరాకరించారు. అసెంబ్లీ సమావేశాల్లో పైచేయి సాధించేందుకు ఉభయ పక్షాలు పోటాపోటీగా చేసిన ప్రసంగాలు హోరాహోరీగా సాగగా.. పలుమార్లు రగడకు దారితీశాయి. విపక్ష బీజేపీ, ఎంఐఎం కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్పై సున్నిత విమర్శలు చేస్తూ ఉనికిని చాటుకున్నాయి. సీపీఐ ఏకైక సభ్యు డు కూనంనేని సాంబశివరావు అధికార కాంగ్రెస్‌ను సమర్థిస్తూనే ఉభయ పక్షాల వైఖరిని ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో మాజీ సీఎం కేసీఆర్ సభకు గైర్హాజరు కావడాన్ని కాంగ్రెస్ పదేపదే ప్రస్తావించింది. -
రూ.3 లక్షల కోట్ల బడ్జెట్!?
సాక్షి, హైదరాబాద్: ఆరుగ్యారంటీల అమలుకు ప్రాధాన్యతనిస్తూ, సంక్షేమ పథకాల అమలు కోసం గ్రీన్‌చానెల్ ఆసరా కల్పిస్తూ, సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులను ప్రాధాన్యతల వారీగా చూపిస్తూ 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఈ తొలి బడ్జెట్ పద్దు రూ.2.95లక్షల కోట్ల నుంచి రూ.3లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బడ్జెట్ సమర్పించనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ పద్దు కింద మూడు నెలల కాలానికి అసెంబ్లీ అనుమతి తీసుకుని జూన్‌లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ఓటాన్ అకౌంట్‌కు శనివారం ఉదయం 9 గంటలకు భేటీ కానున్న రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. పెద్ద పద్దులు తగ్గించకుండానే...! గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2,90,296 కోట్లుగా సభ ఆమోదం కోసం పెట్టిన విషయం విదితమే. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రతిపాదనల కోసం ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలతో సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాల కంటే ముందే ఆన్లైన్లో ప్రతిపాదనలు కోరింది. ఈ మేరకు ఆయా ప్రభుత్వ శాఖలు తమ ప్రతిపాదనలు పంపాయి. విద్యుత్ శాఖ రూ.18 వేల కోట్లు, సాగునీటి శాఖ రూ.25వేల కోట్లు, సంక్షేమ శాఖలన్నీ కలిపి రూ.40వేల కోట్ల పైచిలుకు, గృహనిర్మాణశాఖ రూ.25వేల కోట్లు, ఆర్టీసీ రూ.7వేల కోట్లు, వైద్యారోగ్య శాఖ రూ.13వేల కోట్లు, అన్ని రకాల విద్యాశాఖలు కలిపి రూ.21వేల కోట్లు, వ్యవసాయ శాఖ రూ.30వేల కోట్లు, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.40వేల కోట్ల పైచిలుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి. కీలకమైన ఈ ఐదారు శాఖల బడ్జెట్ పద్దు రూ.2లక్షల కోట్ల వరకు చేరాయి. వీటికి తోడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, అప్పులకు వడ్డీల చెల్లింపుల కింద మరో రూ.65వేల కోట్లు అవసరమవుతాయి. నాలుగు గ్యారంటీలకే నిధులు? ఆరు గ్యారంటీల అమలు కోసం రూ.65వేల కోట్ల వరకు అవసరమవుతాయనే అంచనాలున్నా ప్రస్తుత ఏడాది బడ్జెట్లో కేవలం నాలుగు గ్యారంటీల (మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిధి రూ.10లక్షలకు పెంపు, రూ.500కే గ్యాస్ సిలెండర్, 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్)లకు నిధులు ప్రతిపాదించనున్నారు. వీటిని ఆయా శాఖల పద్దుల్లో సర్దుబాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటికి తోడు రైతుభరోసా, రైతు రుణమాఫీ, పింఛన్లు, కొత్త ఉద్యోగాల కల్పనలకు అవసరమైన నిధులను కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆయాశాఖల్లో సర్దుబాటు చేయనున్న ట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం అమలు చేసిన వా టిలో రైతుబంధు (రైతు భరోసా) మినహా ఇతర ప థకాలకు నిధుల కేటాయింపు లేదని సమాచారం. వీటికి తోడు రెవెన్యూ పద్దు, మూల ధన వ్యయం, ద్రవ్యలోటు అంచనాలు కలిపి బడ్జెట్ పద్దు ఈసారి రూ.2.95 లక్షల కోట్ల నుంచి రూ.3లక్షల కోట్ల వరకు వెళుతుందని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. కేంద్రంపై పెద్దగా ఆశలు పెట్టుకోకుండానే.. గత కొన్నేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్ను వాటాలు, ఇవ్వాల్సిన గ్రాంట్ఇన్ ఎయిడ్లు ఆశించిన మేర రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పద్దులో చూపించిన మొత్తానికి, సవరణల బడ్జెట్‌కు చాలా తేడా కనిపించింది. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరానికి గాను పన్నుల్లో వాటా కింద రూ. 21,471 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ. 41,259 కోట్లను ప్రతిపాదించింది. అయితే, వాస్తవ రూపంలోకి వచ్చేసరికి డిసెంబర్ నాటికి రూ. 10,253 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద కేవలం రూ. 4978 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నుంచి తమకు ఏ మేరకు సహకారం ఉంటుందన్న దానిపై ఆచితూచి అంచనాలతో రాష్ట్రం బడ్జెట్ కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రంపై పెద్దగా ఆశలు పెట్టుకోకుండానే వాస్తవిక అంచనాలకు అనుగుణంగా ప్రతిపాదనలు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంచనాల్లో తగ్గుదల! ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర పన్నుల్లో వాటాను తెలంగాణకు 2.102 శాతంగా ప్రతిపాదించింది. ఇందులో కార్పొరేషన్ ట్యాక్స్ కింద రూ.8051.77 కోట్లు, ఆదాయపన్ను కింద రూ. 8872.10 కోట్లు, సీజీఎస్టీ కింద రూ. 7838.82 కోట్లు, కస్టమ్స్ డ్యూటీ కింద రూ. 523.20 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ కింద రూ. 312.84 కోట్లు, సరీ్వసు టాక్స్, ఇతర పన్నులు కలిపి మొత్తం రూ. 25639.84 కోట్లు తెలంగాణకు వచ్చే అవకాశముందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో గత ఏడాది కంటే పన్నుల్లో వాటా ప్రతిపాదనలు పెరిగి, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంచనాల్లో తగ్గుదల ఉండే అవకాశముందని ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలిసింది. అప్పులు.. భూముల అమ్మకాలు ఎలా? రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల పాలు చేసిందని మొదటి సమావేశాల్లోనే శ్వేతపత్రం విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తన తొలి బడ్జెట్ పత్రంలో ఏ మేరకు రుణ సమీకరణను ప్రతిపాదిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. గతేడాది రుణాల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.40,615 కోట్లను ప్రతిపాదించింది. ఇందులో రూ.36వేల కోట్లకు పైగా డిసెంబర్ నాటికే సమీకరణ జరిగింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరి నెల చివరకు మరో రూ.5,400 కోట్లు తీసుకోనుంది. విధానాలు, ప్రభుత్వ ఆలోచనలు ఎలా ఉన్నా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మనుగడకు బహిరంగ మార్కెట్లో రుణ సేకరణ అనివార్యం కానుంది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా అప్పుల పద్దు రూ.40వేల కోట్లు దాటుతుందని తెలుస్తోంది. ఇక, రాజీవ్ స్వగృహ, దిల్ భూముల అమ్మకాలకు ప్రభుత్వం మొగ్గు చూపుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో పన్నేతర ఆదాయం పద్దు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
బడ్జెట్‌పై అరుణ్ జైట్లీ కీలక హింట్
సాక్షి, ముంబై: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్‌పై హింట్ ఇచ్చారు. సీఎన్‌బీసీ ఇండియన్ బిజినెస్ లీడర్ అవార్డుల కార్యక్రమంలో అమెరికాలోని న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న అరుణ్ జైట్లీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం పాత సాంప్రదాయాన్ని బ్రేక్ చేయవచ్చంటూ హింట్ ఇచ్చారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ కాకపోవ్చని పేర్కొన్నారు. కేవలం ఓట్ ఆన్ అకౌంట్‌గా మాత్రమే కాక అంతకుమించి ఉండొచ్చని అన్నారు. దేశం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని, ముఖ్యంగా వ్యవసాయం రంగం సంక్షోభంలో ఉందని జైట్లీ అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కేవలం ఓట్ ఆన్ అకౌంట్‌కే పరిమితం కావాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి అన్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు బడ్జెట్లో పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు ఈ బడ్జెట్లో రైతులకు భారీ ఉపశమనాన్ని ఇవ్వనుందని పేర్కొన్నారు. వ్యవసాయం రంగం అనేక సవాళ్లు ను ఎదుర్కొంటోందని ఒప్పుకున్న ఆయన, రైతు సహాయక చర్యలను ప్రజాకర్షక చర్యగా పరిగణించరాదని అన్నారు. నరేంద్ర మోదీ సర్కారు చిన్న,మధ్య తరహా రైతులకు రూ.3లక్షలు దాకా వడ్డీ లేని రుణాలను ఇవ్వనుందని ఇటీవల వార్తలు వెలువడిన నేపథ్యంలో అరుణ్‌జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మరోవైపు వడ్డీరేటు పెంపుపై ఎలాంటి నిర్దిష్ట వ్యాఖ్యలు చేయనప్పటికి ..2019 మార్చిలో ఆర్బీఐ 50 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు పెంపు ఉంటుందన్న మాజీ బ్యాంకు అధికారి ఉదయ కోటక్ వ్యాఖ్యలకు ప్రతిగా దేశీయ వాస్తవ వడ్డీరేట్లు ప్రపంచంలోనే అధిక స్థాయిలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. కాగా సాధారణంగా ఎన్నికల ఏడాదిలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను మాత్రమే ప్రవేశపెడుతుంది. -
నేడే చిదంబరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్
-
తగ్గలేదు... పెరగలేదు
(సాక్షి ప్రతినిధి, ఖమ్మం): అవే అంకెలు.... అదే లెక్క...సంవత్సరం మారింది కానీ.... నిధులు మాత్రం మారలేదు. ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ‘ఓట్ ఆన్ అకౌంట్’ బడ్జెట్లో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు జరిపిన కేటాయింపు ఇదీ. గత ఏడాది (2013-14) బడ్జెట్లో కేటాయించిన విధంగానే ఒక్క అంకె కూడా మార్పు లేకుండా అవే నిధులను ఈసారి (2014-15) బడ్జెట్లోనూ చూపెట్టారు. ఆరునెలలకే కదా... మళ్లీ సవరించాల్సిందే అనే ఉద్దేశంతో ఏ ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం అదనపు కేటాయింపు చూపలేదు. జిల్లా ప్రజలకు ప్రధాన అవసరాలైన ఇందిరా సాగర్, రాజీవ్‌సాగర్, దుమ్ముగూడెం టెయిల్‌పాండ్‌తో పాటు సాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు గత ఏడాది తరహాలోనే నిధుల కేటాయింపు చూపారు. ఇక చిన్న పథకాలైన మున్నేరు, పాలెంవాగు, మొడికుంట వాగు, గుండ్ల వాగులకు కూడా అత్తెసరుగానే విదిల్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లాలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు గాను రూ.25వేల కోట్లకు పైగానే అవసరం కాగా, కేవలం 254 కోట్లను మాత్రమే బడ్జెట్లో కేటాయించారు. అంటే అవసరమైన నిధుల్లో ఒక్కశాతం మాత్రమే అంచనాల్లో చూపించారు. ఈ విధంగా అవసరమైన దాంట్లో ఒక్కశాతం బడ్జెట్లో పెట్టుకుంటూ పోతే మరో 100 సంవత్సరాలకు కూడా జిల్లా రైతాంగానికి అవసరమైన ఈ ప్రాజెక్టులు పూర్తికావనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండేళ్ల కిందే పూర్తికావాల్సిన ‘ఇందిరాసాగర్’ వేలేరుపాడు మండలంలోని రుద్రంకోట వద్ద నిర్మిస్తున్న ఇందిరాసాగర్ ఎత్తిపోతల పథకం రెండేళ్ల క్రితమే పూర్తికావాల్సింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూపొందించిన జలయజ్ఞం షెడ్యూల్ ప్రకారం ఇది 2011-12 సంవత్సరంలోనే పూర్తి కావాల్సింది. దీని అంచనా వ్యయం రూ.1,824 కోట్లు కాగా వైఎస్ హయాంలో భారీగానే నిధులు మంజూరు చేశారు. ఇప్పటివరకు మొత్తం రూ.1,187 కోట్లు ఈ ప్రాజెక్టు కింద కేటాయింపబడ్డాయి. అంటే మరో రూ.700 కోట్లవరకు ఈ ప్రాజెక్టుకు కావాలన్నమాట. ఆ నిధులన్నీ ఇస్తేనే ప్రాజెక్టు లక్ష్యం కింద నిర్దేశించబడిన 1818 క్యూసెక్కుల గోదావరి జలాలు ఖమ్మంతోపాటు వరంగల్, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 2లక్షల ఎకరాలకు చేరుతాయి. కానీ ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు కూడా కేటాయించింది రూ.92 కోట్లే. పోయిన ఏడాదే పూర్తి కావాల్సిన ‘రాజీవ్ సాగర్’ ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్ జిల్లా ప్రజానీకానికి కూడా ఉపయోగపడే రాజీవ్‌సాగర్ ప్రాజెక్టు 2012-13 ఆర్థిక సంవత్సరం నాటికే పూర్తి కావాల్సి ఉంది. రెండు జిల్లాల్లోని 17 మండలాల్లో గల రెండు లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరందించే విధంగా డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,681 కోట్లు కాగా, ఇప్పటివరకు కేటాయించింది 650కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఇంకా మరో రూ.1000 కోట్లు కావాల్సి ఉండగా, ఇప్పుడు విదిల్చింది రూ.82 కోట్లే. సాగర్ ఆధునికీకరణా మారలేదు ఇక, జిల్లా ప్రజలకు మరో జీవనాధారమైన నాగార్జున సాగర్ ప్రాజెక్టు పనులకు కూడా అవే నిధులు చూపెట్టారు. గత ఏడాది ఇందుకోసం రూ.678 కోట్లు కేటాయించగా, ఇప్పుడు కూడా అవే నిధులు చూపించారు. అయితే, గత ఏడాది (2013-14 సంవత్సరంలో) సాగర్ ఆధునికీకరణ కింద కేటాయించిన నిధుల్లో రూ.174 కోట్లు మాత్రమే టేకులపల్లి సర్కిల్‌కు ఖర్చుపెట్టారు. వాగులకు విదిలించారు భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల పరిస్థితి అలా ఉంటే.... ఏజెన్సీ ప్రజానీకానికి ప్రయోజనం చేకూర్చే చిన్నతరహా ప్రాజెక్టులకు కూడా చాలా తక్కువ నిధులు బడ్జెట్లో చూపెట్టారు. వాజేడు మండలం కృష్ణాపురం గ్రామం వద్ద నిర్మించ తలపెట్టిన మోడికుంట వాగు ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.124 కోట్లు కాగా, గత ఏడాది వరకు కేవలం రూ.60 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈసారి ఆ ప్రాజెక్టు కింద చూపెట్టింది కేవలం రూ.4.5కోట్లు మాత్రమే. మొదట కేవలం రూ.3కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమయి రూ.27 కోట్ల వ్యయానికి చేరుకున్న గుండ్లవాగు ప్రాజెక్టుకు కేటాయించింది కేవలం రూ.80లక్షలే. ప్రధాన కాల్వ, మరమ్మతులకు కూడా ఈ నిధులు సరిపోని పరిస్థితి. ఇక, వెంకటాపురం మండలంలోని పాలెంవాగు ప్రాజెక్టుకు ఈసారి రూ.25 కోట్లు కేటాయించారు.అయితే, దీని అంచనా వ్యయం రూ.70.99 కోట్ల నుంచి రూ.150కోట్లకు పెరిగింది. ఇంతవరకు గేట్ల నిర్మాణం, కాల్వ పనులే పూర్తికాలేదు. మరి ఈ 4.5కోట్లతో ఏం చేస్తారో పాలకులకే తెలియాలి. కిన్నెరసానికి రూ.4కోట్లు, వైరా రిజర్వాయర్‌కు రూ.40లక్షలు కూడా కేటాయించారు. టెయిల్పాండ్పైనా అదే ‘చూపు’ ఇక, ఐదు జిల్లాల్లోని 14.12 లక్షల ఎకరాలకు నీరందించాలన్న లక్ష్యంతో తలపెట్టిన దుమ్ముగూడెం టెయిల్‌పాండ్‌కు ఈసారి బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.97 కోట్లే. గత ఏడాది కూడా ఇంతే అయినా, ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగానే ఉంది. మొత్తం 19వేల కోట్లకు పైగా అంచనా వ్యయం ఉంటే ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకిచ్చింది కేవలం రూ.650 కోట్లే. అయితే, ఈ ప్రాజెక్టుపై జిల్లా ప్రజల్లో భిన్నాభిప్రాయాలున్నా ఐదారు జిల్లాలకు ఉపయోగపడే ప్రాజెక్టులకు కూడా ప్రాధాన్యత లేకుండా మొక్కుబడి కేటాయింపులు జరపడమేమిటని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. గిరిజనంపై ఎక్కువ మక్కువేది? జిల్లాలో దాదాపు 29 మండలాలు ఏజెన్సీలో ఉండగా, అక్కడ నివసించే లక్షలాది మంది గిరిజనుల అభివృద్ధి కోసం సర్కారు పాత లెక్కలే చూపెట్టింది. గత ఏడాది బడ్జెట్లో ఏ పథకానికి ఎంత చూపెట్టారో ఓట్ ఆన్అకౌంట్లోనూ అవే నిధులు చూపెట్టాల్సి వచ్చింది. ఇక, మారుమూల ప్రాంతాల సమీకృత అభివృద్ధి (రెయిడ్) కింద గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాల నిర్మాణానికి, ఇతర ఐటీడీఏ అవసరాలకు కూడా 2013-14 బడ్జెట్లో కేటాయించిన నిధులనే ఈసారి కూడా పొల్లు పోకుండా బడ్జెట్లో చూపెట్టారు. అయితే, ఓట్‌ఆన్ అకౌంట్ కాబట్టి అంచనాలను పెంచి చూపించే అధికారం ఈ ప్రభుత్వానికి ఉండదని, కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వమే వాస్తవిక బడ్జెట్ పెడుతుందని ఆర్థిక నిపుణులంటున్నారు. ఇతర పథకాలూ లేవు ఇక జిల్లాకు చెందిన బడ్జెట్ లెక్కలను పరిశీలిస్తే సాగునీటి శాఖ మినహా ఎక్కడా ఖమ్మం పేరు కనిపించలేదు. ఒక్క అటవీశాఖలో మాత్రం ఇల్లెందు అటవీ పాఠశాలకు పది లక్షల రూపాయలు చూపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా క్రోడీకరించిన బడ్జెట్ లెక్కలను చూస్తే... అన్ని జిల్లా కలెక్టరేట్లలో ప్రత్యేక కాంప్లెక్స్‌ల నిర్మాణానికి నిధులు కేటాయించారు. ఇంటెలిజెన్స్, రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు పురాతన భవనాల్లోని మండలపరిషత్, తహశీల్దార్ కార్యాలయాలకు నూతన భవనాల కోసం నిధులిచ్చారు. తహశీల్దార్ కార్యాలయాల కంప్యూటరీకరణకు నిధులు కేటాయించిన ప్రభుత్వం... ప్రభుత్వ భూముల పరిరక్షణకు మాత్రం ఎలాంటి కేటాయింపులు చూపెట్టకపోవడం గమనార్హం. -
కీలక బిల్లుల ఆమోదం అనుమానమే: చిదంబరం
న్యూఢిల్లీ: ఈ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బిల్లు మినహా మరే కీలక బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం అనుమానమేనని కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం బుధవారం వ్యాఖ్యానించారు. స్థానిక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న చిదంబరం.. ‘రోజూ పార్లమెంటుకెళ్లడం.. ఉత్త చేతులతో తిరిగిరావడం సాధారణమైపోయింది’ అన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఆర్థిక బిల్లు, ఓటాన్ అకౌంట్, ద్రవ్య వినిమయ బిల్లులు ఆమోదం పొందుతాయి. ఒకవేళ చర్చ జరగకుండా అవి ఆమోదం పొందితే మాత్రం నేను సంతోషించను. చర్చ జరిగిన తరువాతే అవి పాస్ కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ)ల తగ్గింపు నిర్ణయం రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసింది కాదన్నారు. తెలంగాణపై సభలో నిరసనలు తాత్కాలికమేనన్న ప్రధాని ఇదిలా ఉండగా, తెలంగాణ అంశంపై సభను అడ్డుకునే సంఘటనలు తాత్కాలిక అవాంతరాలేనని ప్రధాని మన్మోహన్ అభివర్ణించారు. వ్యక్తిగత వ్యతిరేకాభిప్రాయాలను పక్కనబెట్టి సభ సజావుగా నడిచేలా వ్యవహరించాలన్న జ్ఞానం అన్నివర్గాలకు ఉందని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. పార్లమెంటు భవనం వెలుపల బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాగా పార్లమెంటు చివరి సమావేశాల్లో 39 బిల్లులను ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. వాటిలో తెలంగాణ బిల్లు, పలు అవినీతి వ్యతిరేక బిల్లులు ఉన్నాయి. -
ఫిబ్రవరి తొలి వారంలోనే ఓటాన్ అకౌంట్!
సాక్షి, హైదరాబాద్: ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి తొలి వారంలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చకు గడువును పొడిగించని పక్షంలో గురువారమే అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. అయితే ఫిబ్రవరి 7న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ఉన్నందున అప్పటిదాకా సభను కొనసాగించనున్నారు. ఆ లోగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను కూడా ఆమోదించనున్నారు. బిల్లుపై చర్చకు గడువు గురువారంతో ముగిసిన తరువాత ప్రభుత్వం పేర్కొన్న తేదీకి సభను వాయిదా వేయనున్నారు. ఫిబ్రవరి 3 లేదా 5వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై గురువారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.