సాక్షి, హైదరాబాద్: ఆరుగ్యారంటీల అమలుకు ప్రాధాన్యతనిస్తూ, సంక్షేమ పథకాల అమలు కోసం గ్రీన్‌చానెల్ ఆసరా కల్పిస్తూ, సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులను ప్రాధాన్యతల వారీగా చూపిస్తూ 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఈ తొలి బడ్జెట్ పద్దు రూ.2.95లక్షల కోట్ల నుంచి రూ.3లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బడ్జెట్ సమర్పించనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ పద్దు కింద మూడు నెలల కాలానికి అసెంబ్లీ అనుమతి తీసుకుని జూన్‌లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ఓటాన్ అకౌంట్‌కు శనివారం ఉదయం 9 గంటలకు భేటీ కానున్న రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలపనుంది.
పెద్ద పద్దులు తగ్గించకుండానే...!
గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2,90,296 కోట్లుగా సభ ఆమోదం కోసం పెట్టిన విషయం విదితమే. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రతిపాదనల కోసం ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలతో సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాల కంటే ముందే ఆన్‌లైన్‌లో ప్రతిపాదనలు కోరింది. ఈ మేరకు ఆయా ప్రభుత్వ శాఖలు తమ ప్రతిపాదనలు పంపాయి.
విద్యుత్ శాఖ రూ.18 వేల కోట్లు, సాగునీటి శాఖ రూ.25వేల కోట్లు, సంక్షేమ శాఖలన్నీ కలిపి రూ.40వేల కోట్ల పైచిలుకు, గృహనిర్మాణశాఖ రూ.25వేల కోట్లు, ఆర్టీసీ రూ.7వేల కోట్లు, వైద్యారోగ్య శాఖ రూ.13వేల కోట్లు, అన్ని రకాల విద్యాశాఖలు కలిపి రూ.21వేల కోట్లు, వ్యవసాయ శాఖ రూ.30వేల కోట్లు, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.40వేల కోట్ల పైచిలుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి. కీలకమైన ఈ ఐదారు శాఖల బడ్జెట్ పద్దు రూ.2లక్షల కోట్ల వరకు చేరాయి. వీటికి తోడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, అప్పులకు వడ్డీల చెల్లింపుల కింద మరో రూ.65వేల కోట్లు అవసరమవుతాయి.
నాలుగు గ్యారంటీలకే నిధులు?
ఆరు గ్యారంటీల అమలు కోసం రూ.65వేల కోట్ల వరకు అవసరమవుతాయనే అంచనాలున్నా ప్రస్తుత ఏడాది బడ్జెట్‌లో కేవలం నాలుగు గ్యారంటీల (మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిధి రూ.10లక్షలకు పెంపు, రూ.500కే గ్యాస్ సిలెండర్, 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్)లకు నిధులు ప్రతిపాదించనున్నారు. వీటిని ఆయా శాఖల పద్దుల్లో సర్దుబాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వీటికి తోడు రైతుభరోసా, రైతు రుణమాఫీ, పింఛన్లు, కొత్త ఉద్యోగాల కల్పనలకు అవసరమైన నిధులను కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆయాశాఖల్లో సర్దుబాటు చేయనున్న ట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం అమలు చేసిన వా టిలో రైతుబంధు (రైతు భరోసా) మినహా ఇతర ప థకాలకు నిధుల కేటాయింపు లేదని సమాచారం. వీటికి తోడు రెవెన్యూ పద్దు, మూల ధన వ్యయం, ద్రవ్యలోటు అంచనాలు కలిపి బడ్జెట్ పద్దు ఈసారి రూ.2.95 లక్షల కోట్ల నుంచి రూ.3లక్షల కోట్ల వరకు వెళుతుందని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి.
కేంద్రంపై పెద్దగా ఆశలు పెట్టుకోకుండానే..
గత కొన్నేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్ను వాటాలు, ఇవ్వాల్సిన గ్రాంట్‌ఇన్ ఎయిడ్‌లు ఆశించిన మేర రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పద్దులో చూపించిన మొత్తానికి, సవరణల బడ్జెట్‌కు చాలా తేడా కనిపించింది. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరానికి గాను పన్నుల్లో వాటా కింద రూ. 21,471 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ. 41,259 కోట్లను ప్రతిపాదించింది.
అయితే, వాస్తవ రూపంలోకి వచ్చేసరికి డిసెంబర్ నాటికి రూ. 10,253 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద కేవలం రూ. 4978 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నుంచి తమకు ఏ మేరకు సహకారం ఉంటుందన్న దానిపై ఆచితూచి అంచనాలతో రాష్ట్రం బడ్జెట్ కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రంపై పెద్దగా ఆశలు పెట్టుకోకుండానే వాస్తవిక అంచనాలకు అనుగుణంగా ప్రతిపాదనలు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంచనాల్లో తగ్గుదల!
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్ర పన్నుల్లో వాటాను తెలంగాణకు 2.102 శాతంగా ప్రతిపాదించింది. ఇందులో కార్పొరేషన్ ట్యాక్స్ కింద రూ.8051.77 కోట్లు, ఆదాయపన్ను కింద రూ. 8872.10 కోట్లు, సీజీఎస్టీ కింద రూ. 7838.82 కోట్లు, కస్టమ్స్ డ్యూటీ కింద రూ. 523.20 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ కింద రూ. 312.84 కోట్లు, సరీ్వసు టాక్స్, ఇతర పన్నులు కలిపి మొత్తం రూ. 25639.84 కోట్లు తెలంగాణకు వచ్చే అవకాశముందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో గత ఏడాది కంటే పన్నుల్లో వాటా ప్రతిపాదనలు పెరిగి, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంచనాల్లో తగ్గుదల ఉండే అవకాశముందని ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలిసింది.
అప్పులు.. భూముల అమ్మకాలు ఎలా?
రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ అప్పుల పాలు చేసిందని మొదటి సమావేశాల్లోనే శ్వేతపత్రం విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తన తొలి బడ్జెట్ పత్రంలో ఏ మేరకు రుణ సమీకరణను ప్రతిపాదిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. గతేడాది రుణాల కింద బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.40,615 కోట్లను ప్రతిపాదించింది. ఇందులో రూ.36వేల కోట్లకు పైగా డిసెంబర్ నాటికే సమీకరణ జరిగింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరి నెల చివరకు మరో రూ.5,400 కోట్లు తీసుకోనుంది.
విధానాలు, ప్రభుత్వ ఆలోచనలు ఎలా ఉన్నా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మనుగడకు బహిరంగ మార్కెట్‌లో రుణ సేకరణ అనివార్యం కానుంది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా అప్పుల పద్దు రూ.40వేల కోట్లు దాటుతుందని తెలుస్తోంది. ఇక, రాజీవ్ స్వగృహ, దిల్ భూముల అమ్మకాలకు ప్రభుత్వం మొగ్గు చూపుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో పన్నేతర ఆదాయం పద్దు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment