తగ్గలేదు... పెరగలేదు | no changes in vote on account | Sakshi
Sakshi News home page

తగ్గలేదు... పెరగలేదు

Published Tue, Feb 11 2014 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM

no changes in vote on account

(సాక్షి ప్రతినిధి, ఖమ్మం): అవే అంకెలు.... అదే లెక్క...సంవత్సరం మారింది కానీ.... నిధులు మాత్రం మారలేదు. ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ‘ఓట్ ఆన్ అకౌంట్’ బడ్జెట్‌లో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు జరిపిన కేటాయింపు ఇదీ.  గత ఏడాది (2013-14) బడ్జెట్‌లో కేటాయించిన విధంగానే ఒక్క అంకె కూడా మార్పు లేకుండా అవే నిధులను ఈసారి (2014-15) బడ్జెట్‌లోనూ చూపెట్టారు.

ఆరునెలలకే కదా... మళ్లీ సవరించాల్సిందే అనే ఉద్దేశంతో ఏ ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం అదనపు కేటాయింపు చూపలేదు. జిల్లా ప్రజలకు ప్రధాన అవసరాలైన ఇందిరా సాగర్, రాజీవ్‌సాగర్, దుమ్ముగూడెం టెయిల్‌పాండ్‌తో పాటు సాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు గత ఏడాది తరహాలోనే నిధుల కేటాయింపు చూపారు. ఇక చిన్న పథకాలైన మున్నేరు, పాలెంవాగు, మొడికుంట వాగు, గుండ్ల వాగులకు కూడా అత్తెసరుగానే విదిల్చారు.

 ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లాలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు గాను రూ.25వేల కోట్లకు పైగానే అవసరం కాగా, కేవలం 254 కోట్లను మాత్రమే బడ్జెట్‌లో కేటాయించారు. అంటే అవసరమైన నిధుల్లో ఒక్కశాతం మాత్రమే అంచనాల్లో చూపించారు. ఈ విధంగా అవసరమైన దాంట్లో ఒక్కశాతం బడ్జెట్‌లో పెట్టుకుంటూ పోతే మరో 100 సంవత్సరాలకు కూడా జిల్లా రైతాంగానికి అవసరమైన ఈ ప్రాజెక్టులు పూర్తికావనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 రెండేళ్ల కిందే పూర్తికావాల్సిన ‘ఇందిరాసాగర్’
 వేలేరుపాడు మండలంలోని రుద్రంకోట వద్ద నిర్మిస్తున్న ఇందిరాసాగర్ ఎత్తిపోతల పథకం రెండేళ్ల క్రితమే పూర్తికావాల్సింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూపొందించిన జలయజ్ఞం షెడ్యూల్ ప్రకారం ఇది 2011-12 సంవత్సరంలోనే పూర్తి కావాల్సింది. దీని అంచనా వ్యయం రూ.1,824 కోట్లు కాగా వైఎస్ హయాంలో భారీగానే నిధులు మంజూరు చేశారు.

ఇప్పటివరకు మొత్తం రూ.1,187 కోట్లు ఈ ప్రాజెక్టు కింద కేటాయింపబడ్డాయి. అంటే మరో రూ.700 కోట్లవరకు ఈ ప్రాజెక్టుకు కావాలన్నమాట. ఆ నిధులన్నీ ఇస్తేనే ప్రాజెక్టు లక్ష్యం కింద నిర్దేశించబడిన 1818 క్యూసెక్కుల గోదావరి జలాలు ఖమ్మంతోపాటు వరంగల్, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 2లక్షల ఎకరాలకు చేరుతాయి. కానీ ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు కూడా కేటాయించింది రూ.92 కోట్లే.

 పోయిన ఏడాదే పూర్తి కావాల్సిన ‘రాజీవ్ సాగర్’
 ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్ జిల్లా ప్రజానీకానికి కూడా ఉపయోగపడే రాజీవ్‌సాగర్ ప్రాజెక్టు 2012-13 ఆర్థిక సంవత్సరం నాటికే పూర్తి కావాల్సి ఉంది. రెండు జిల్లాల్లోని 17 మండలాల్లో గల రెండు లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరందించే విధంగా డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,681 కోట్లు కాగా, ఇప్పటివరకు కేటాయించింది 650కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఇంకా మరో రూ.1000 కోట్లు కావాల్సి ఉండగా, ఇప్పుడు విదిల్చింది రూ.82 కోట్లే.

 సాగర్ ఆధునికీకరణా మారలేదు
 ఇక, జిల్లా ప్రజలకు మరో జీవనాధారమైన నాగార్జున సాగర్ ప్రాజెక్టు పనులకు కూడా అవే నిధులు చూపెట్టారు. గత ఏడాది ఇందుకోసం రూ.678 కోట్లు కేటాయించగా, ఇప్పుడు కూడా అవే నిధులు చూపించారు. అయితే, గత ఏడాది (2013-14 సంవత్సరంలో) సాగర్ ఆధునికీకరణ కింద కేటాయించిన నిధుల్లో రూ.174 కోట్లు మాత్రమే టేకులపల్లి సర్కిల్‌కు ఖర్చుపెట్టారు.

 వాగులకు విదిలించారు
 భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల పరిస్థితి అలా ఉంటే.... ఏజెన్సీ ప్రజానీకానికి ప్రయోజనం చేకూర్చే చిన్నతరహా ప్రాజెక్టులకు కూడా చాలా తక్కువ నిధులు బడ్జెట్‌లో చూపెట్టారు. వాజేడు మండలం కృష్ణాపురం గ్రామం వద్ద నిర్మించ తలపెట్టిన మోడికుంట వాగు ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.124 కోట్లు కాగా, గత ఏడాది వరకు కేవలం రూ.60 కోట్లు మాత్రమే కేటాయించారు.

 ఈసారి ఆ ప్రాజెక్టు కింద చూపెట్టింది కేవలం రూ.4.5కోట్లు మాత్రమే. మొదట కేవలం రూ.3కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమయి రూ.27 కోట్ల వ్యయానికి చేరుకున్న గుండ్లవాగు ప్రాజెక్టుకు కేటాయించింది కేవలం రూ.80లక్షలే. ప్రధాన కాల్వ, మరమ్మతులకు కూడా ఈ నిధులు సరిపోని పరిస్థితి. ఇక, వెంకటాపురం మండలంలోని పాలెంవాగు ప్రాజెక్టుకు ఈసారి రూ.25 కోట్లు కేటాయించారు.అయితే, దీని అంచనా వ్యయం రూ.70.99 కోట్ల నుంచి రూ.150కోట్లకు పెరిగింది. ఇంతవరకు గేట్ల నిర్మాణం, కాల్వ పనులే పూర్తికాలేదు. మరి ఈ 4.5కోట్లతో ఏం చేస్తారో పాలకులకే తెలియాలి. కిన్నెరసానికి రూ.4కోట్లు, వైరా రిజర్వాయర్‌కు రూ.40లక్షలు కూడా కేటాయించారు.

 టెయిల్‌పాండ్‌పైనా అదే ‘చూపు’
 ఇక, ఐదు జిల్లాల్లోని 14.12 లక్షల ఎకరాలకు నీరందించాలన్న లక్ష్యంతో తలపెట్టిన దుమ్ముగూడెం టెయిల్‌పాండ్‌కు ఈసారి బడ్జెట్‌లో కేటాయించింది కేవలం రూ.97 కోట్లే. గత ఏడాది కూడా ఇంతే అయినా, ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగానే ఉంది. మొత్తం 19వేల కోట్లకు పైగా అంచనా వ్యయం ఉంటే ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకిచ్చింది కేవలం రూ.650 కోట్లే. అయితే, ఈ ప్రాజెక్టుపై జిల్లా ప్రజల్లో భిన్నాభిప్రాయాలున్నా ఐదారు జిల్లాలకు ఉపయోగపడే ప్రాజెక్టులకు కూడా ప్రాధాన్యత లేకుండా మొక్కుబడి కేటాయింపులు జరపడమేమిటని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

 గిరిజనంపై ఎక్కువ మక్కువేది?
 జిల్లాలో దాదాపు 29 మండలాలు ఏజెన్సీలో ఉండగా, అక్కడ నివసించే లక్షలాది మంది గిరిజనుల అభివృద్ధి కోసం సర్కారు పాత లెక్కలే చూపెట్టింది. గత ఏడాది బడ్జెట్‌లో ఏ పథకానికి ఎంత చూపెట్టారో ఓట్ ఆన్‌అకౌంట్‌లోనూ అవే నిధులు చూపెట్టాల్సి వచ్చింది.

ఇక, మారుమూల ప్రాంతాల సమీకృత అభివృద్ధి (రెయిడ్) కింద గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాల నిర్మాణానికి, ఇతర ఐటీడీఏ అవసరాలకు కూడా 2013-14 బడ్జెట్‌లో కేటాయించిన నిధులనే ఈసారి కూడా పొల్లు పోకుండా బడ్జెట్‌లో చూపెట్టారు. అయితే, ఓట్‌ఆన్ అకౌంట్ కాబట్టి అంచనాలను పెంచి చూపించే అధికారం ఈ ప్రభుత్వానికి ఉండదని, కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వమే వాస్తవిక బడ్జెట్ పెడుతుందని ఆర్థిక నిపుణులంటున్నారు.

 ఇతర పథకాలూ లేవు
 ఇక జిల్లాకు చెందిన బడ్జెట్ లెక్కలను పరిశీలిస్తే సాగునీటి శాఖ మినహా ఎక్కడా ఖమ్మం పేరు కనిపించలేదు. ఒక్క అటవీశాఖలో మాత్రం ఇల్లెందు అటవీ పాఠశాలకు పది లక్షల రూపాయలు చూపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా క్రోడీకరించిన బడ్జెట్ లెక్కలను చూస్తే... అన్ని జిల్లా కలెక్టరేట్‌లలో ప్రత్యేక కాంప్లెక్స్‌ల నిర్మాణానికి నిధులు కేటాయించారు. ఇంటెలిజెన్స్, రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు పురాతన భవనాల్లోని మండలపరిషత్, తహశీల్దార్ కార్యాలయాలకు నూతన భవనాల కోసం నిధులిచ్చారు. తహశీల్దార్ కార్యాలయాల కంప్యూటరీకరణకు నిధులు కేటాయించిన ప్రభుత్వం... ప్రభుత్వ భూముల పరిరక్షణకు మాత్రం ఎలాంటి కేటాయింపులు చూపెట్టకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement