చెరకు రైతుకు తీపి కబురు...
* టన్ను చెరకుకు రూ.2,600 ఇచ్చేందుకు సీఎం సముఖత
* సర్కార్ తరఫున రూ.340 రైతు ఖాతాల్లో జమ
* డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి వెల్లడి
* ఆనందంలో రైతన్నలు
మెదక్: ధరాఘాతంతో విలవిల్లాడుతున్న చెరకు రైతుకు తీపి కబురు అందింది. చెరకుకు గిట్టుబాటు కల్పించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌ను కలిసిన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డికి బర్త్‌డే గిఫ్ట్ దొరికింది. టన్ను చెరకుకు రూ.2,600 చెల్లించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని, ఈ మేరకు రెండు రోజుల్లో జీఓ వెలువడుతుందని డిప్యూటీ స్పీకర్ తెలిపారు.
నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని చెరకు రైతులకు ఈ సంవత్సరం ఫ్యాక్టరీ యాజమాన్యం టన్నుకు రూ.2,260 లు చెల్లిస్తామని ప్రకటించింది. అయితే గత ఏడాది రూ.2600 చెల్లించిన యాజమాన్యం ఈసారి రూ.360లు తగ్గించడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ క్రమంలో సోమవారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, చెరకు రైతు నాయకులతో సీఎంను కలిసి రైతుల బాధలు వివరించారు.
ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం రాష్ట్ర ప్రభుత్వం తరఫున టన్ను చెరకుకు రూ.340 రైతుల ఖాతాల్లో జమచేస్తామని హామీ ఇచ్చినట్లు పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో జీఓ వెలువడుతుందని ఆమె స్పష్టం చేశారు. అలాగే ఎన్డీఎస్‌ఎల్ పరిధిలోని చెరకు రైతులను చెరకు సాగు అవగాహన నిమిత్తం మహారాష్ట్ర పంపేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం ఆదేశించారు.
మహారాష్ట్రలో చెరకు రైతులు ఎకరాకు 80 నుంచి 100 టన్నుల చెరకును పండిస్తున్నందున వారి వ్యవసాయ విధానాన్ని రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్డీఎస్‌ఎల్ మంభోజిపల్లి పరిధిలో ఈ సంవత్సరం 1.20 లక్షల టన్నుల చెరుకు గానుగ ఆడనుంది. సీఎం తాజా హామీతో సుమారు 2,590 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
నాకిది బర్త్‌డే గిఫ్ట్
చెరకు రైతు కష్టాలు తీర్చాలని సీఎం కలిశాను. మంగళవారం నా జన్మదినం. చెరకు రైతుకు మేలు జరిగేలా హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఒకరోజు ముందుగానే నాకు బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు. తెలంగాణ సర్కార్ రైతుల కోసం ఎంతటి వ్యయ ప్రయాసలైనా భరిస్తుందని ఆ సంఘటనతో మరోసారి తేలిపోయింది. సీఎం నిర్ణయంతో రాష్ట్రంలోని ఎన్డీఎస్‌ఎల్ పరిధిలో గల మూడు ఫ్యాక్టరీల రైతులకు ప్రయోజనం చేకూరనుంది. -పద్మాదేవేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్