పారిశ్రామికవేత్తలకు పవర్
కేసీఆర్ ప్రకటనతో కొత్త ఊపు
♦ 24 గంటలూ ఇక కరెంట్ కోతలుండవని భరోసా
♦ కొడకంచిలో ఆటోమొబైల్ పరిశ్రమ ప్రారంభం
♦ పలుచోట్ల మొక్కలు నాటిన సీఎం
పటాన్‌చెరు : ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన పారిశ్రామికవేత్తల్లో కొత్త జోష్‌ను తెచ్చింది. పారిశ్రామిక రంగానికి 24 గంటలూ కరెంటు సరఫరా ఉంటుందని, ఇక కోతలు ఉండవని ప్రకటించడం వారిలో ఆనందాన్ని నింపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం పటాన్‌చెరు, జిన్నారం మండలాల్లో పర్యటించారు. మొదట పాశమైలారం పారిశ్రామికవాడలో నిర్వహించిన హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. రుద్రారంలోని ఎంఎస్‌ఎన్, తోషిబా పరిశ్రమ ఆవరణలోనూ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయా పారిశ్రామికవేత్తలను కలుసుకున్నారు. ఆయన పర్యటన ఆద్యంతం గోప్యంగా సాగింది.
పర్యటన షెడ్యూల్ ప్రకారం జరగలేదు. ఉదయం 11.45కి పటాన్‌చెరులోని ఈద్గాకు చేరుకుని మొక్కలు నాటి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ తరువాత జిన్నారం మండలం కొడకంచిలో కొత్తగా ఏర్పాటుచేసిన డెక్కన్ ఆటో పరిశ్రమను ప్రారంభించారు. అక్కడ జరిగిన సమావేశంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలోనే నంబర్‌వన్ పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తెచ్చామని, పారిశ్రామికవేత్తలు తెలంగాణలో భారీ ఎత్తున పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. హరితహారం పథకాన్ని ఉద్యమంలా చేపట్టాలన్నారు. తెలంగాణ అంతా పచ్చదనం పరచుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
సమావేశం అనంతరం పాశమైలారం పారిశ్రామికవాడకు వెళ్లారు. ఆ తరువాత రుద్రారంలో భోజనం చేసుకుని 2.15 నిమిషాలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ఆరోగ్యం సరిగ్గా లేదంటూనే ఆయన ఈ పర్యటనను విజయవంతంగా ముగించారు. ఇదిలా ఉండగా పటాన్‌చెరు దర్గా వద్ద స్థానిక ముస్లిం పెద్దలు సీఎంను సన్మానించారు. వివిధ పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు కేసీఆర్‌కు బెలూన్లు పట్టుకొని స్వాగతం పలికారు. మొక్కలు నాటిన తరువాత కేసీఆర్ బెలూన్లను గాల్లోకి వదిలారు.
ఉదయం 10.30 గంటలకే డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు దేశపతిశ్రీనివాస్‌లు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఈద్గా వద్ద ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అయితే కేసీఆర్ నేతలతో కరచాలనం చేసి స్థానిక నాయకులను పలుకరిస్తూ ముందుకు సాగారు.