శాశ్వత పనులకు సీఎం పెద్దపీట
డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
పాపన్నపేట: సీఎం కేసీఆర్ శాశ్వత ప్రాతిపదికన ఉపయోగపడే పనులకే పెద్దపీట వేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు గురువారం పాపన్నపేట మండలంలోని నార్సింగిలో మిషన్ కాకతీయ కింద చెరువుల పూడిక తీత పనులను ఆమె ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 45వేల చెరువులు ఉండేవన్నారు. 18లక్షల ఎకరాల పంటలుసాగు అయ్యేవన్నారు. ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యం మూలంగా బంగారంలా ఉన్న చెరువులు సాసర్ల మాదిరిగా తయారయ్యాయన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.20వేల కోట్ల రూపాయలతో మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టారన్నారు.
నియోజకవర్గంలో 86 చెరువుల మరమ్మతులకు రూ.15కోట్లు మంజూరైనట్లు చెప్పారు. పనులు కూడా ప్రారంభించామన్నారు మరో విడతగా వంద గ్రామాల్లో 176 చెరువుల పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం చేపట్టిన నార్సింగి గ్రామ చెరువుకు 68 ఎకరాల ఆయకట్టు ఉందని, 25ఎకరాల శిఖం భూమి ఉన్నట్లు తెలిపారు. ఈ పనులకు గ్రామ రైతులు సహకరించి, చెరువు మట్టి పంట పొలాల్లోకి తరలించుకోవాలన్నారు. తద్వారా సారవంతమైన భూమిగా మారుతుందన్నారు. దీంతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. గతంలో రైతులు చెరువు మట్టిని వినియోగించి 30 శాతం అధిగ దిగుబడులు సాధించేవారన్నారు. ప్రస్తుతం రసాయన ఎరువులు వాడకం పెరగడంతో 50యేళ్లకే వృద్ధులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపడుచులు నీటికోసం తిప్పలు పడకుండా సీఎం కేసీఆర్ వాటర్‌గ్రిడ్ పథకం చేపడుతున్నట్లు చెప్పారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
పాపన్నపేట మండల కేంద్రంతోపాటు యూసుఫ్‌పేట, కొత్తపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం పాపన్నపేటలో అర్ధంతరంగా ఆగిన పలు ప్రభుత్వ భవనాలను ఆమె పరిశీలించారు. ఆమె వెంట మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి, ఎంపీపీ పవిత్ర దుర్గయ్య, జెడ్పీటీసీ స్వప్నబాలగౌడ్, వైస్‌ఎంపీపీ విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు బాపూరావు, నార్సింగి సర్పంచ్ కిష్టయ్య, ఎంపీటీసీ చంద్రకళ, డీసీసీబీ డెరైక్టర్ మోహన్‌రెడ్డి, కొత్తపల్లి ఎఫ్‌ఏసీఎస్ చైర్మన్ దేశ్యనాయక్, ఆర్డీఓ మెంచు నగేష్, తహశీల్దార్ రాములు తదితరులు పాల్గొన్నారు. .