జగతి మెచ్చేలా జాతర
ఏడుపాయలకు నిధులు మంజూరు
కోటి రూపాయలతో జాతరకు కొత్తకాంతులు
తీరనున్న భక్తుల కష్టాలు
మెదక్ : వెయ్యేళ్ల చరిత్ర గల ఏడుపాయల జాతరకు మునుపెన్నడూ లేనిరీతిలో రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసి తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పేందుకు సిద్ధమైంది. తెలంగాణలో సమ్మక్క-సారక్క జాతర తర్వాత రెండవ అతిపెద్ద జాతరగా పేరొందిన ఏడుపాయల జాతరకు ఇప్పటి వరకు గత ప్రభుత్వాలు ఎప్పుడు చిల్లిగవ్వ కూడా విదల్చలేదు.
కానీ లక్షలాది భక్తులు తరలివచ్చే జాతరలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతర ప్రాముఖ్యతను, తెలంగాణ సంస్కృతికిని దశదిశలా చాటేందుకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ భారీగా నిధులు విడుదల చేశారు. దీంతో ఈ సారి జాతర కొత్త కాంతులీననుంది. ఈమేరకు జాతర ఏర్పాట్లు ఘనంగా చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు.
నిధులివ్వని గత పాలకులు
దండకారణ్యంలో మంజీరనది ఒడ్డున వెలసిన ఏడుపాయల వనదుర్గ లక్షలాది భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. కాకతీయుల కాలం నుంచి ఏడుపాయల దుర్గా భవాని ప్రాశస్తం పెరిగింది. 2006లో అప్పటి మెదక్ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి కృషి మేరకు టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరి నాగిరెడ్డి ఏడుపాయల జాతరను పర్యాటక ఉత్సవంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏటా మాఘ అమావాస్య, మహాశివరాత్రి జాతర, నవరాత్రుల సందర్భంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతుంటాయి.
మహాశివరాత్రి జాతరకు సుమారు 10 లక్షల మంది భక్తులు తరలివస్తుంటారు. ఏటా సుమారు రూ.2 కోట్ల ఆదాయం ఉంటుంది. అయినప్పటికీ జాతర సందర్భంగా గత ప్రభుత్వాలు ఎప్పుడూ ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయలేదు. జాతరకు దేవాదాయ శాఖ తరఫున సుమారు రూ.27 లక్షలు ఖర్చు చేస్తుంటారు. సుమారు 20 ప్రభుత్వ శాఖల అధికారులు వచ్చే కొద్దిపాటి నిధులతోపాటు దేవాదాయ శాఖ చేసే ఆర్థిక సాయంతో జాతర నిర్వహిస్తుంటారు. దీంతో లక్షలాది భక్తులు తరలివచ్చే జాతర అసౌకర్యాలకు అడ్రస్‌గా మారుతోంది.
సేదదీరేందుకు నీడ కరువు
ఏడుపాయల్లో మొత్తం 42 షెడ్లు ఉండగా, అందులో దేవాదాయ శాఖకు సంబంధించినవి ఆరు, దాతలు నిర్మించినవి 36 షెడ్లు ఉన్నాయి. జాతర సమయంలో దాతలు విడిది చేయడంతో భక్తులకు ఒక్కషెడ్డుకూడా దొరకని పరిస్థితి నెలకొంటోంది. గత సంవత్సరం జాతర సమయంలో వర్షం పడడంతో భక్తులు చెట్టుకొకరు, పుట్టకొకరుగా పరుగులు తీసి బండరాళ్ల మాటున తలదాచుకున్నారు. ఇక సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు కనీసం వేదిక లేక పోవడంతో ఓ భవనం స్లాబ్‌పై ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రదర్శనలిస్తున్నారు.
స్నానఘాట్లు లేక పోవడంతో మంజీరనదిలో స్నానాలు చేస్తూ భక్తులు మృత్యువాత పడ్డ సంఘటనలు కోకొల్లలు. దుస్తులు మార్చుకునేందుకు గదులు లేక...సరిపడ టాయిలెట్లు లేక మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అనేకం. తాగునీరు కరువై..గుంతలుపడ్డ రోడ్లతో భక్తులు అనేక అవస్థలు పడుతుంటారు. పార్కింగ్ స్థలం లేక వాహనదారులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. జాతర నిర్వహణ కోసం వచ్చే మహిళా అధికారులకు కనీస సౌకర్యాలు లేక పడేపాట్లు వర్ణణాతీతం.
రూ.1 కోటి నిధులతో జాతరకు కొత్త కాంతులు
ప్రభుత్వం విడుదల చేసిన కోటి రూపాయలతో జాతరను ధూంధాంగా నిర్వహించేందుకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి నిపుణులైన అధికారులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు గురువారం మెదక్ ఆర్డీఓ మెంచు నగేష్ ఏడుపాయలను సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ముఖ్యంగా తాగునీరు, టాయిలెట్లు, స్నానఘాట్లు, మహిళల ఇబ్బందులు, రోడ్లు, పారిశుద్ధ్యం, అలంకరణ తదితర విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తొలి ఏడుపాయల జాతరను భక్తులకు మరవని జ్ఞాపకంగా మిగిల్చేందుకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అధికార వర్గాలను సమాయత్తం చేస్తున్నారు.
జోరుగా సాగుతున్న బ్రిడ్జి పనులు
వనదుర్గమాత ఆలయం ఎదుట రూ.25 లక్షలతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఆలయం ముందు, మంజీరానది పాయపై ఇరుకైన వంతెన ఉండటంతో జాతర సమయంలో తొక్కిసలాట జరిగేది. దీనిపై ఆలయ అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా, జైకా నిధుల కింద బ్రిడ్జి నిర్మాణం రూ.25 లక్షలు మంజూరయ్యాయి.
దీంతో మహాశివరాత్రి జాతర వరకు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈఓ వెంకట కిషన్‌రావు తెలిపారు. ప్రస్తుతం ఉన్న బ్రిడ్జి పక్కన కూడా మరో బ్రిడ్జి నిర్మించనున్నట్లు ఈఓ తెలిపారు.