ఉద్యమంలా.. చెరువుల అభివృద్ధి
⇒ మిషన్ కాకతీయతో నీటి వనరులకు మహర్దశ
⇒ పూడికతీత మట్టితో పొలాలకు భూసారం
⇒ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
⇒ రాయినిపల్లి పాత చెరువులో పూడికతీత ప్రారంభం
⇒ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
మెదక్రూరల్: చెరువుల అభివృద్ధిని ఉద్యమంలా చేపట్టాల్సిన అవసరం ఉందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు.
గ్రామ ఉమ్మడి ఆస్తి అయిన చెరువు, కుంటలను కాపాడుకుంటేనే భవిష్యత్తు అంతా బాగుంటుందన్నారు. ఆదివారం ఆమె మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మిషన్ కాకతీయలో భాగంగా రాయినిపల్లి పాత చెరువులో పూడిక తీత పనులను ఆమె ప్రారంభించారు. స్వయంగా పలుగు పట్టి మట్టితవ్వారు. తట్టలతో మట్టిని ట్రాక్టర్‌లో పోశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడారు.
చెరువు అనేది తల్లిలాంటిదన్నారు. చెరువుల్లో పూడిక తీసి ఆ మట్టిని రైతుల పొలాలకు కొట్టేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నార న్నారు. చెరువుల మట్టిని పొలంలో వేస్తే భూసారం గణనీయంగా పెరిగి రసాయన ఎరువుల వాడకం తగ్గుతుందన్నారు. కట్టల బలోపేతం, తూములు, అలుగులు, పంట కాలువలు, గైడ్‌వాల్స్ తదితర వాటి మరమ్మతుల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంజూరు చేసిందన్నారు. చెరువులు నిండితే ఆయకట్టు భూములన్నీ సస్యశ్యామలంగా మారుతాయన్నారు.
తెలంగాణలో 45 వేల చెరువులున్నాయని, వీటిని ఏడాదికి 20 శాతం చొప్పున ఐదేళ్లలో మరమ్మతులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మొదటి విడతలో భాగంగా ప్రతి నియోజక వర్గానికి ప్రాతినిధ్యం లభించేలా 9 వేల చెరువుల మరమ్మతులకు శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు. ఒకప్పుడు చెరువు, కుంటల ఆధారంగా 18 లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తే చెరువు, కుంటలు పూడుకుపోవడంతో నేడు కేవలం 2 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగవుతున్నాయన్నారు.
ఇప్పుడైతే స్వచ్ఛమైన కల్లు దొరకడం లేదు..
చెరువు కట్టలు బలోపేతమైతే వాటిపై ఈత చెట్లు పెట్టుకునే వీలుంటుందని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. దీంతో స్వచ్ఛమైన కల్లు దొరుకుతుందని.. అదే సమయంలో గౌడ కులస్తులకు జీవనోపాధి లభిస్తుందని చెప్పారు. ప్రస్తుతం స్వచ్ఛమైన కల్లు లేదని అంతా మందు కల్లే దొరుకుతుందన్నారు. చెరువులు నిండితే మత్స్యకారులకు సైతం చేపలు పెంచుకునే వీలుంటుందని, వారికీ జీవనోపాధి లభిస్తుందని తెలిపారు.
వర్షాలు పుష్కలంగా కురిసేందుకు వీలుగా చెట్లను పరిరక్షించడంతోపాటు మొక్కలను విరివిగా పెంచేందుకు సీఎం ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు. ఇందులో భాగంగా జిల్లాలో 3.50 కోట్ల మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ పొలం గట్లు, బీడు భూములు, ఇంటిపరిసరాల్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం రాయినిపల్లి పాతచెరువులోనే కార్యకర్తలు, ప్రజలతో ఆమె సహపంక్షి భోజనం చేశారు.
రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన..
మెదక్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో రోడ్ల నిర్మాణం కోసం రూ.3.37 కోట్లు మంజూరయ్యాయి. వీటికోసం డిప్యూటీ స్పీకర్ శంకు స్థాపనలు చేశారు. బాలానగర్, తిమ్మక్కపల్లి, పిల్లికొట్టాల్, శివ్వాయిపల్లి, వెంకటాపూర్ రోడ్లకు ఆమె శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, ఎంపీపీ లక్ష్మి కిష్టయ్య, జెడ్పీటీసీ సభ్యురాలు లావణ్యరెడ్డి, నాయకులు కిష్టయ్య, అంజాగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, సాయిలు, శ్రీనివాస్, యాదగిరి, సిద్ధిరాములు, నాగులు, సాంబశివరావుతోపాటు ఇరిగేషన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.