Development of ponds
-
చెరువుల్లో 265 టీఎంసీల నీళ్లు
తుంగతుర్తి: మిషన్ కాకతీయ పథకం కింద రాష్ట్రంలో 46 వేల చెరువులు అభివృద్ధి చెందాయని, వీటి ద్వారా 265 టీఎంసీల నీళ్లను ఒడిసి పట్టామని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో సీనియర్ జర్నలిస్టు, రచయిత వర్ధెల్లి వెంకటేశ్వర్లు రచించిన ‘పిట్టవాలిన చెట్టు’పుస్తకాన్ని ఆదివారం విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్‌రెడ్డి, తుంగతుర్తి, దుబ్బాక ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌కుమార్, సోలిపేట రామలింగారెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికతో కలసి ఆవిష్కరించారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులకు పిట్టవాలిన చెట్టు పుస్తకం అద్దం పడుతుందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా జరిగిన అభివృద్ధి, గత, ప్రస్తుత పరిస్థితులను ఈ పుస్తకంలో కళ్లకు కట్టినట్లు వివరించారని కొనియాడారు. చెరువుల అభివృద్ధి పూర్తయిందని, ప్రస్తుతం చిట్టచివరి ఎకరాకు నీళ్లందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వం వ్యవసాయం దండగంటే సీఎం కేసీఆర్ పండుగలా చేసి చూపించారని పేర్కొన్నారు. కరువనేదే ఉండదు.. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఇక కరువనేదే ఉండదని, ఆ పదానికి డిక్షనరీలో అర్థం వెతుక్కోవాల్సి వస్తుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. పాలమూరు జిల్లాలో బతుకదెరువు కోసం వలసలు వెళ్లిన ప్రజలు నేడు తిరిగి సొంతూళ్లకు వచ్చారని తెలిపారు. కాగా, కేసీఆర్ సీఎం కాకపోతే మరో వెయ్యి జన్మలెత్తినా కాళేశ్వరం జలాలు వచ్చేవి కావని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ ఇంజనీర్ అవతారమెత్తి భగీరథుడిగా మారారని పేర్కొన్నారు. చెరువుల పునరుద్ధరణపై కళ్లకు కట్టినట్లు పిట్టవాలిన చెట్టు పుస్తకంలో రాసిన రచయిత వర్ధెల్లి వెంకటేశ్వర్లును ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు గోరెటి వెంకన్న, తెంజు రాష్ట్ర అధ్యక్షుడు ఇస్మాయిల్, పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ మనోజ, జేసీ సంజీవరెడ్డి, వివిధ జిల్లాల జర్నలిస్టులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
మట్టి.. లూటీ
సాక్షి, కడప సిటీ : అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదాయం కోసం తొక్కని అడ్డదారి లేదు. అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా అధికారాన్ని ఉపయోగించి అక్రమార్జనకు తెరలేపుతున్నారు. పాతకడప చెరువులో మట్టి దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. పేరుకేమో అధికారుల వద్ద అనుమతులు తీసుకున్నామన్న సాకుతో మట్టిని వ్యాపార వనరుగా మార్చుకున్నారు. క్యూబిక్ మీటరు ప్రభుత్వ జీఓ ప్రకారం రూపాయి లెక్కన చెల్లిస్తున్నారు. మూడు క్యూబిక్ మీటర్లయితే ఒక ట్రాక్టర్ మట్టి అవుతుంది. ఈ నేపథ్యంలో పాతకడపకు చెందిన టీడీపీ నాయకుడు, ఆ చెరువు సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి మూడు క్యూబిక్ మీటర్లకు రూ. 3 చెల్లించి.. ఒక్కొక్క ట్రాక్టర్ మట్టికి రూ. రూ.300–రూ.400 అక్రమార్జనకు శ్రీకారం చుట్టారు. ఇలా ఇంతవరకు దాదాపు రూ. కోటి రూపాయల వరకు సంపాదించినట్లు తెలుస్తోంది. రెండున్నరేళ్లుగా ఈ తంతు కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. భూములకు మట్టిని తరలించేందుకు అనుమతులు తీసుకుని వ్యాపార ధోరణిలో తతంగం కొనసాగుతోంది. ప్రైవేటు వ్యక్తుల పునాదులకు, టవర్ల చదునుకు, ఇతర అవసరాలకు ఒప్పందం కుదుర్చుకుని కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చెరువును అభివృద్ది చేస్తారని అక్కడి ప్రజలు ఆశతో అధ్యక్షుడిని చేస్తే ఆ నాయకుడు ఆ చెరువును ఆదాయ వనరుగా మార్చుకుని ముందుకు సాగడంపై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన సొంత పొక్లెయిన్ పెట్టుకుని కొన్ని ట్రాక్టర్లు బాడుగకు సమకూర్చుకుని ఈ అవసరాలకు మట్టిని తరలిస్తూ కొనసాగుతున్నారు. కేసీ కెనాల్ కింద అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. పొలాలకు మట్టిని తోలుకోవాలని అనుమతులు ఇచ్చామని, మేమేం చేయలేమని అధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మరి అధికార పార్టీ నాయకులని భయపడుతున్నారా? లేక చేయి తడిపినందువల్ల మిన్నకున్నారా? అనేది ప్రశ్నార్థకంగా ఉంది. అనుమతులు ఇచ్చిన అధికారులు మట్టిని పొలాలకు తరలిస్తున్నారా? లేక ఇతర ప్రాంతాలకు తరలించి వ్యాపారం చేస్తున్నారా? అనే విషయాన్ని తనిఖీ చేయకుండా తమకేం సంబంధం లేనట్లుగా మాట్లాడటం పలు విమర్శలకు తావిస్తోంది. చెరువును కాపాడేవారే చెరబట్టారు మామూలుగా నీటి సంఘాలు చెరువుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినవే. ఈ నీటి సంఘాల వల్ల ఆ చెరువులకు మరమ్మతులుగానీ, పూడికతీత పనులుగానీ నిబంధనల ప్రకారం చేపట్టాల్సి ఉంటుంది. అలాంటిది ‘కంచె చేను మేస్తే కాపు ఏమి చేయగలడు?’ అన్న చందంగా పాతకడప చెరువు నీటి సంఘం అధ్యక్షుడిగా పాతకడపకు చెందిన కృష్ణారెడ్డి కొనసాగుతున్నారు. ఈయన చెరువు అభివృద్ధి పనులను తుంగలో తొక్కి చెరువును చెరబట్టే విధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మట్టి తరలింపునకు అనుమతులు ఇచ్చాం పాతకడప చెరువు నుంచి పొలాలకు మట్టి తోలుకునేందుకు అనుమతులు ఇచ్చాం. జల వనరులశాఖ ఇందుకు సంబంధించిన జీఓ ఎంఎస్ నంబర్. 40ని జారీ చేసింది. క్యూబిక్ మీటరుకు రూపాయి చొప్పున చెల్లిస్తే ఎవరికైనా అనుమతులు ఇస్తాం. అలాంటి అనుమతులను కృష్ణారెడ్డి తీసుకున్నారు. నిబంధనల ప్రకారం మట్టిని తరలించాలి. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – జిలానీబాషా, డీఈ, కేసీ కెనాల్, కడప -
చెరువుల రక్షణే లక్ష్యం
- రూ.3 కోట్లతో పెద్దచెరువు అభివృద్ధి - పర్యాటక కేంద్రంగా మారుస్తాం - మంత్రి హరీశ్‌రావు వెల్లడి పటాన్చెరు: చెరువుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చెప్పారు. చెరువుల రక్షణే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా పటాన్చెరు మండలంలోని అమీన్పూర్ పెద్దచెరువు అభివృద్ధికి రూ.2 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. బయోలాజికల్ హెరిటేజ్ సైట్‌గా దీన్ని మారుస్తామన్నారు. పెద్దచెరువును ఆదివారం మంత్రి సందర్శించారు. అమీన్పూర్ చెరువును దత్తత తీసుకుని, దాని అభివృద్ధికి కృషి చేస్తున్న ఎస్పీఎఫ్ డీజీ తేజ్‌దీప్‌కౌర్, ఇతర అధికారులను ఆయన అభినందించారు. చెరువు వద్ద రెండు గంటలు గడిపిన హరీష్ మాట్లాడుతూ... చెరువులో కూకట్పల్లి మొదలుకుని ఇతర ఆవాస ప్రాంతాల నుంచి వస్తున్న మురుగు నీటి శుద్ధి కోసం ప్రత్యేక ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. అందుకు మరో కోటి రూపాయల జీహెచ్ఎంసీ నిధులు వెచ్చిస్తామన్నారు. పర్యాటక కేంద్రంగా మారుస్తామన్నారు. చెరువు విశిష్టతను కాపాడుతూ, ఎఫ్టీఎల్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. అనంతరం చెరువు వద్ద మొక్క నాటారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జేసీ వెంకట్రామ్రెడ్డి, జిల్లా ఎస్పీ సుమతి, ఆర్డీఓ మధుకర్‌రెడ్డి, తహాశీల్దార్ ఫర్హీన్ షేక్, ఇరిగేషన్ శాఖా ఎస్ఈ సురేందర్, రాష్ట్ర పీసీబీ అధికారి అనిల్‌కుమార్ పాల్గొన్నారు. 41 రకాల సీతాకోకచిలుకలు అమీన్పూర్ పెద్ద చెరువు పరిసరాల్లో 171 పక్షిజాతులు జీవిస్తున్నాయని చెరువును దత్తత తీసుకున్న తేజ్‌దీప్‌కౌర్ మంత్రికి వివరించారు. ఇందులో విదేశీ వలస పక్షులు, 41 రకాల సీతాకోక చిలుక లు, 9 రకాల వన్యప్రాణులు, 250 రకాల అరుదైన, ఔషధ మొక్కలు ఉన్నాయన్నారు. చెరువులో కలుషితాల వల్ల మొత్తం జీవ వైవిధ్యానికి ప్రమాదం ఏర్పడిందన్నారు. దీన్ని పరిర క్షించాలన్నారు. బ్లాస్టింగ్లు ఆపాలన్నారు. అక్రమ నీటి చౌర్యం, బోరు నీటి వ్యాపార క్షేత్రాలను స్థానిక రెవెన్యూ శాఖ నియంత్రించలేకపోతుందని తేజ్‌దీప్ తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి, స్థానిక టీఆర్ఎస్ నేత గాలి అనిల్‌కుమార్ ఇంట్లో తేనీటీ విందుకు హరీష్ హాజరయ్యారు. -
ఉద్యమంలా.. చెరువుల అభివృద్ధి
⇒ మిషన్ కాకతీయతో నీటి వనరులకు మహర్దశ ⇒ పూడికతీత మట్టితో పొలాలకు భూసారం ⇒ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ⇒ రాయినిపల్లి పాత చెరువులో పూడికతీత ప్రారంభం ⇒ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మెదక్‌రూరల్: చెరువుల అభివృద్ధిని ఉద్యమంలా చేపట్టాల్సిన అవసరం ఉందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. గ్రామ ఉమ్మడి ఆస్తి అయిన చెరువు, కుంటలను కాపాడుకుంటేనే భవిష్యత్తు అంతా బాగుంటుందన్నారు. ఆదివారం ఆమె మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మిషన్ కాకతీయలో భాగంగా రాయినిపల్లి పాత చెరువులో పూడిక తీత పనులను ఆమె ప్రారంభించారు. స్వయంగా పలుగు పట్టి మట్టితవ్వారు. తట్టలతో మట్టిని ట్రాక్టర్లో పోశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడారు. చెరువు అనేది తల్లిలాంటిదన్నారు. చెరువుల్లో పూడిక తీసి ఆ మట్టిని రైతుల పొలాలకు కొట్టేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నార న్నారు. చెరువుల మట్టిని పొలంలో వేస్తే భూసారం గణనీయంగా పెరిగి రసాయన ఎరువుల వాడకం తగ్గుతుందన్నారు. కట్టల బలోపేతం, తూములు, అలుగులు, పంట కాలువలు, గైడ్‌వాల్స్ తదితర వాటి మరమ్మతుల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంజూరు చేసిందన్నారు. చెరువులు నిండితే ఆయకట్టు భూములన్నీ సస్యశ్యామలంగా మారుతాయన్నారు. తెలంగాణలో 45 వేల చెరువులున్నాయని, వీటిని ఏడాదికి 20 శాతం చొప్పున ఐదేళ్లలో మరమ్మతులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మొదటి విడతలో భాగంగా ప్రతి నియోజక వర్గానికి ప్రాతినిధ్యం లభించేలా 9 వేల చెరువుల మరమ్మతులకు శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు. ఒకప్పుడు చెరువు, కుంటల ఆధారంగా 18 లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తే చెరువు, కుంటలు పూడుకుపోవడంతో నేడు కేవలం 2 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగవుతున్నాయన్నారు. ఇప్పుడైతే స్వచ్ఛమైన కల్లు దొరకడం లేదు.. చెరువు కట్టలు బలోపేతమైతే వాటిపై ఈత చెట్లు పెట్టుకునే వీలుంటుందని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. దీంతో స్వచ్ఛమైన కల్లు దొరుకుతుందని.. అదే సమయంలో గౌడ కులస్తులకు జీవనోపాధి లభిస్తుందని చెప్పారు. ప్రస్తుతం స్వచ్ఛమైన కల్లు లేదని అంతా మందు కల్లే దొరుకుతుందన్నారు. చెరువులు నిండితే మత్స్యకారులకు సైతం చేపలు పెంచుకునే వీలుంటుందని, వారికీ జీవనోపాధి లభిస్తుందని తెలిపారు. వర్షాలు పుష్కలంగా కురిసేందుకు వీలుగా చెట్లను పరిరక్షించడంతోపాటు మొక్కలను విరివిగా పెంచేందుకు సీఎం ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు. ఇందులో భాగంగా జిల్లాలో 3.50 కోట్ల మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ పొలం గట్లు, బీడు భూములు, ఇంటిపరిసరాల్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం రాయినిపల్లి పాతచెరువులోనే కార్యకర్తలు, ప్రజలతో ఆమె సహపంక్షి భోజనం చేశారు. రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన.. మెదక్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో రోడ్ల నిర్మాణం కోసం రూ.3.37 కోట్లు మంజూరయ్యాయి. వీటికోసం డిప్యూటీ స్పీకర్ శంకు స్థాపనలు చేశారు. బాలానగర్, తిమ్మక్కపల్లి, పిల్లికొట్టాల్, శివ్వాయిపల్లి, వెంకటాపూర్ రోడ్లకు ఆమె శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎంపీపీ లక్ష్మి కిష్టయ్య, జెడ్పీటీసీ సభ్యురాలు లావణ్యరెడ్డి, నాయకులు కిష్టయ్య, అంజాగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, సాయిలు, శ్రీనివాస్, యాదగిరి, సిద్ధిరాములు, నాగులు, సాంబశివరావుతోపాటు ఇరిగేషన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
దళిత బస్తీలోజిల్లా నం.1
సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ : దళిత బస్తీ పథకం అమలులో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో ఉందని కలెక్టర్ ఎం. జగన్మోహన్ అన్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 792 ఎకరాల భూమిని నిరుపేద దళితులకు పంపిణీ చేశామని చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో హైదరాబాద్‌లో జరిగిన కలెక్టర్ల సమీక్షా సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను కలెక్టర్ ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘మిషన్ కాకతీయ పథకంలో భాగంగా జిల్లాలో మొదటి విడతలో 800 చెరవుల ఎంపిక జరిగింది. వీటి మరమ్మత్తు పనులను చేపట్టాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించాం. సామాజిక వన విభాగం ఆధ్వర్యంలో ఆయా చెరువుల ఫోర్షో భూముల్లో తంగేడు చెట్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని పెంచడం ద్వారా ఆయా చెరువుల్లోని నీరు కొంత మేరకు శుద్ధి అవుతుంది. చెరువుల అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఉండేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆయా గ్రామస్తులతో ఒకరోజు, పాఠశాల, కళాశాల విద్యార్థులతో ఒకరోజు చెరువు పనుల్లో శ్రమదానం కార్యక్రమం నిర్వహిస్తాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాం. ఈ పనుల్లో భాగంగా ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు, ఫిల్టర్బెడ్లు ఇతర కట్టడాలను వీలైన మట్టుకు ప్రభుత్వ భూముల్లోనే నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే రేషన్‌కార్డుల పంపిణీ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం. లబ్ధిదారుల ఎంపిక కోసం ఆయా గ్రామాల్లో వీఆర్ఓ, వీఆర్ఏలు, పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించాం. ఈ నెలాఖరులోగా రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ పూర్తవుతుంది. హరిత హారంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 3.72 కోట్ల మొక్కలు పెంచేందుకు ప్రణాళిక రూపొందించాం. అర్హులైన నిరుపేదలందరికీ పింఛన్లు మంజూరు చేస్తాం. లబ్ధిదారులు ఈ విషయంలో ఎలాంటి అపోహలు, ఆందోళనకు గురికావద్దు. సాఫ్ట్వేర్లతో సంబంధం లేకుండా పించన్లు మంజూరు చేస్తున్నాం. తమకు పింఛన్ మంజూరు కావడం లేదంటూ ఇంకా అక్కడక్కడ కొందరు లబ్ధిదారులు కార్యాలయాలకు వస్తున్నారు. అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేస్తాం..’’ అని వివరించారు.