దళిత బస్తీలోజిల్లా నం.1
సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ : దళిత బస్తీ పథకం అమలులో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో ఉందని కలెక్టర్ ఎం. జగన్మోహన్ అన్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 792 ఎకరాల భూమిని నిరుపేద దళితులకు పంపిణీ చేశామని చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో హైదరాబాద్‌లో జరిగిన కలెక్టర్ల సమీక్షా సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను కలెక్టర్ ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘మిషన్ కాకతీయ పథకంలో భాగంగా జిల్లాలో మొదటి విడతలో 800 చెరవుల ఎంపిక జరిగింది. వీటి మరమ్మత్తు పనులను చేపట్టాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించాం. సామాజిక వన విభాగం ఆధ్వర్యంలో ఆయా చెరువుల ఫోర్‌షో భూముల్లో తంగేడు చెట్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వీటిని పెంచడం ద్వారా ఆయా చెరువుల్లోని నీరు కొంత మేరకు శుద్ధి అవుతుంది. చెరువుల అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఉండేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆయా గ్రామస్తులతో ఒకరోజు, పాఠశాల, కళాశాల విద్యార్థులతో ఒకరోజు చెరువు పనుల్లో శ్రమదానం కార్యక్రమం నిర్వహిస్తాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాం. ఈ పనుల్లో భాగంగా ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకులు, ఫిల్టర్‌బెడ్‌లు ఇతర కట్టడాలను వీలైన మట్టుకు ప్రభుత్వ భూముల్లోనే నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే రేషన్‌కార్డుల పంపిణీ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం. లబ్ధిదారుల ఎంపిక కోసం ఆయా గ్రామాల్లో వీఆర్‌ఓ, వీఆర్‌ఏలు, పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించాం. ఈ నెలాఖరులోగా రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ పూర్తవుతుంది.
హరిత హారంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 3.72 కోట్ల మొక్కలు పెంచేందుకు ప్రణాళిక రూపొందించాం. అర్హులైన నిరుపేదలందరికీ పింఛన్లు మంజూరు చేస్తాం. లబ్ధిదారులు ఈ విషయంలో ఎలాంటి అపోహలు, ఆందోళనకు గురికావద్దు. సాఫ్ట్‌వేర్‌లతో సంబంధం లేకుండా పించన్లు మంజూరు చేస్తున్నాం. తమకు పింఛన్ మంజూరు కావడం లేదంటూ ఇంకా అక్కడక్కడ కొందరు లబ్ధిదారులు కార్యాలయాలకు వస్తున్నారు. అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేస్తాం..’’ అని వివరించారు.