Dalit Basti scheme
-
లక్ష్యం చేరని దళితబస్తీ
∙ గుర్తించిన కుటుంబాలు 33,640 ∙ లబ్ధిదారులు 617 ∙1657 ఎకరాలు పంపిణీ ∙ నేడు మరో 190 మందికి భూ పట్టాలు ఆదిలాబాద్‌రూరల్: జిల్లాలో దళితబస్తీ పథకం అమలు నత్తనడకన సాగుతోంది. సాగు భూమి లేని అర్హులైన ఎస్సీ నిరుపేదలకు భూమి పంపిణీ చేసి వారు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తోంది. ఈ పథకం కింద మూడెకరాల భూమి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలో 33,640 మంది భూమిలేని దళిత కుటుంబాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు జిల్లాలో 617 మంది లబ్ధిదారులకు 1,657 ఎకరాల భూమి పంపిణీ చేశారు. ఇందుకు రూ.67.18 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. సాగుకు యోగ్యమైన భూములను అధికారులు పరిశీలించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నేడు మంత్రి చేతుల మీదుగా పట్టాల పంపిణీ.. జిల్లా వ్యాప్తంగా దళితబస్తీ పథకంలో ఎంపిక చేసిన 190 మంది లబ్ధిదారులకు స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల సందర్భంగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న చేతుల మీదుగా భూ పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఇదివరకు కూలీలుగా ఉన్న నిరుపేద ఎస్సీ లబ్ధిదారులు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంతో రైతులుగా మారనున్నారు. లబ్ధిదారులకు ప్రభత్వం పెట్టుబడులను సైతం అందజేసి ఆదుకుంటోంది. ప్రైవేటు భూముల ధరలకు రెక్కలు.. దళితబస్తీ పథకం కింద ఎకరం, అర ఎకరం భూమి ఉన్న దళితులకు మొదటి ప్రాధాన్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాగుకు యోగ్యమైన ప్రభుత్వ భూములు లేకపోవడం, ప్రైవేట్ భూములకు రెక్కలు రావడంతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. అయినప్పటికీ దళితబస్తీ భూ పంపిణీలో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. భూములు విక్రయించాలనుకునే రైతులు దరఖాస్తు చేసుకున్న అనంతరం అధికారులు ఆ భూములను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తున్నారు. ఆ భూములు కొనుగోలు చేసిన తర్వాత అర్హులైన లబ్ధిదారులను మూడెకరాల చొప్పున పంపిణీ చేస్తున్నారు. దళారుల దందా.. దళితబస్తీ పథకంలో వ్యవసాయ భూమిని విక్రయించేందుకు దరఖాస్తు చేసుకున్న రైతుతోపాటు ఎంపికైన ఎస్సీ నిరుపేద లబ్ధిదారులకు మధ్య కొందరు దళారులుగా వ్యవహరిస్తున్నారు. గ్రామాల్లో స్థానికంగా ఉన్న కొందరు ప్రజాప్రతినిధులు దళారుల అవతారమెత్తి పర్సంటేజీలు మాట్లాడుకుంటున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. అలా చేయని పక్షంలో లబ్ధిదారుల పేర్లను జాబితాలో నుంచి తొలగిస్తామని వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో చేసేదేమీ లేక వారి మాటలను విని లబ్ధిదారులు భూమి పట్టా చేతికందక ముందే వారి డిమాండ్లకు తలొగ్గి అప్పు వారి పర్సంటేజీలను అందజేస్తున్నట్లు సమాచారం. ఓ వైపు ప్రభుత్వం నిరుపేదలైన ఎస్సీ లబ్ధిదారులను ఆర్థికంగా ఆదుకునేందుకు భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతుంటే, కొందరు దళారులు లబ్ధిదారులతోపాటు భూమి విక్రయిస్తున్న వారి నుంచీ పర్సంటేజీలు తీసుకోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
భూముల అభివృద్ధికి రూ. 50 వేలు
► దళిత బస్తీ భూములకు అందజేత ► మూడు ఎకరాల్లో సాగు చేస్తున్న పంటలపై ఆరా పూర్తి ► సబ్సిడీపై కూరగాయల విత్తనాలు ► కలెక్టర్ జగన్మోహన్ ఆదిలాబాద్ అర్బన్ : నిరుపేద కుటుంబాల మహిళలకు దళిత బస్తీ పథకం ద్వారా అందజేసిన భూముల అభివృద్ధికి ఒక్కో లబ్ధిదారుడికి ప్రభుత్వం ద్వారా రూ. 50 వేలు అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ తెలిపారు. పథకం అమలు, ఇప్పటి వరకు కొన్న భూములు, గతేడాది పంపిణీ చేసిన భూముల్లో సాగు వివరాలు, సాగుకోసం లబ్ధిదారులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ఆరా తీశారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీవోలు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులతో దళిత బస్తీ, మిషన్ కాకతీయ పథకాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులను సమష్టి వ్యవసాయం వైపు మళ్లించాలన్నారు. భూముల అభివృద్దికి ఒక్కొక్కరికి రూ. 50 వేలు ఇచ్చేందుకు నిధులు ఉన్నాయని తెలిపారు. మూడెకరాల్లో కందులు, కూరగాయలు, సోయా పంటలు వేసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మూడెకరాల భూమి లబ్ధిదారులకు ఒక ఫౌల్ట్రీ యూనిట్, సేంద్రియ ఎరువు యూనిట్, డైరీ యూనిట్, ఎడ్లబండ్లు కొనిస్తామన్నారు. లబ్ధిదారులకు పంట రుణాలు బ్యాంకుల ద్వారా ఇప్పించాలని అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు. ఈ నెలాఖరులోగా పట్టాలు ఇవ్వాలి : జేసీ దళిత బస్తీ పథకం కింద 2014-15, 2015-16లో కొనుగోలు చేసిన భూములకు పట్టాలు, టైటిల్ డీడ్లు అందించాలని, ఇప్పటి వరకు లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వని వారు ఈ నెల 30లో వారికి అందించేలా చర్యలు తీసుకోవాలని జేసీ సుందర్ అబ్నార్ తహసీల్దార్లను, ఆర్డీవోలను ఆదేశించారు. సబ్ డివిజన్ రికార్డ్స్ పూర్తి చేయాలని ఆన్లైన్లో నమోదు చేయాలని, వివరాలను వెబ్‌ల్యాండ్‌లో ఉంచేలా చూడాలన్నారు. మిషన్ కాకతీయపై... మిషన్ కాకతీయపై కలెక్టర్ సమీక్షిస్తూ మొదటి విడతలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 558 చెరువు పనులు చేపట్టగా, ఇప్పటి వరకు 500 చెరువు పనులు పూర్తయ్యాయని, తహసీల్దార్లు ఈ పది రోజుల్లో దృష్టి సారిస్తే మిగతా 58 చెరువుల పూడీకతీత పనులు పూర్తవుతాయని కలెక్టర్ వివరించారు. పని చేయని కాంట్రాక్టర్ల వివరాలు తెలిపితే బ్లాక్‌లిస్టులో పెడతామని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో సబ్ కలెక్టర్ అధ్వైత్ కుమార్ సింగ్, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ జేమ్స్ కల్వల, ఆర్డీవోలు సుధాకర్‌రెడ్డి, ఐలయ్య, శివలింగయ్య, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. శాంతి కమిటీ సమావేశం రంజాన్ పండుగను శాంతియుతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ ముస్లిం నాయకులు, మత పెద్దలు, పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన రంజాన్ పండుగ సందర్భంగా శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. శాంతియుతంగా, విజయవంతంగా జరిపేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కమిటీ సభ్యులను కోరారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ పట్టణంతో పాటు మావల పంచాయతీ వరకు నీటి సౌకర్యం కల్పించాలని, పట్టణంలో విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయని వాటిని సరి చేయాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూక్ అహ్మద్, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, సీపీవో కేశవరావు, వక్ఫ్ అధికారి ఇబ్రహీమ్, సభ్యులు సిరాజ్‌ఖాద్రి, సాజిద్‌ఖాన్, యూనిస్ అక్భానీ, శాంతి కమిటీ సభ్యులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
అభాసుపాలవుతున్న దళిత బస్తీ పథకం
-
దళిత బస్తీలోజిల్లా నం.1
సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ : దళిత బస్తీ పథకం అమలులో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో ఉందని కలెక్టర్ ఎం. జగన్మోహన్ అన్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 792 ఎకరాల భూమిని నిరుపేద దళితులకు పంపిణీ చేశామని చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో హైదరాబాద్‌లో జరిగిన కలెక్టర్ల సమీక్షా సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను కలెక్టర్ ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘మిషన్ కాకతీయ పథకంలో భాగంగా జిల్లాలో మొదటి విడతలో 800 చెరవుల ఎంపిక జరిగింది. వీటి మరమ్మత్తు పనులను చేపట్టాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించాం. సామాజిక వన విభాగం ఆధ్వర్యంలో ఆయా చెరువుల ఫోర్షో భూముల్లో తంగేడు చెట్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని పెంచడం ద్వారా ఆయా చెరువుల్లోని నీరు కొంత మేరకు శుద్ధి అవుతుంది. చెరువుల అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఉండేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆయా గ్రామస్తులతో ఒకరోజు, పాఠశాల, కళాశాల విద్యార్థులతో ఒకరోజు చెరువు పనుల్లో శ్రమదానం కార్యక్రమం నిర్వహిస్తాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాం. ఈ పనుల్లో భాగంగా ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు, ఫిల్టర్బెడ్లు ఇతర కట్టడాలను వీలైన మట్టుకు ప్రభుత్వ భూముల్లోనే నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే రేషన్‌కార్డుల పంపిణీ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం. లబ్ధిదారుల ఎంపిక కోసం ఆయా గ్రామాల్లో వీఆర్ఓ, వీఆర్ఏలు, పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించాం. ఈ నెలాఖరులోగా రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ పూర్తవుతుంది. హరిత హారంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 3.72 కోట్ల మొక్కలు పెంచేందుకు ప్రణాళిక రూపొందించాం. అర్హులైన నిరుపేదలందరికీ పింఛన్లు మంజూరు చేస్తాం. లబ్ధిదారులు ఈ విషయంలో ఎలాంటి అపోహలు, ఆందోళనకు గురికావద్దు. సాఫ్ట్వేర్లతో సంబంధం లేకుండా పించన్లు మంజూరు చేస్తున్నాం. తమకు పింఛన్ మంజూరు కావడం లేదంటూ ఇంకా అక్కడక్కడ కొందరు లబ్ధిదారులు కార్యాలయాలకు వస్తున్నారు. అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేస్తాం..’’ అని వివరించారు.