కొత్త జిల్లా ఆవిర్భావ ఘడియల కోసం..
- ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్నా..
- సీఎం కేసీఆర్ చొరవ వల్లే మెదక్ జిల్లా ఏర్పాటు
- ప్రజలు, రైతుల సంక్షేమానికి పెద్దపీట
- జిల్లా అభివృద్ధికి ద్విముఖ వ్యూహం
- టూరిజం సర్క్వూట్, ఎడ్యుకేషనల్ హబ్ కోసం ప్రణాళిక
- ‘సాక్షి’తో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి మెదక్:మెదక్ జిల్లా ఆవిర్భావ క్షణాల కోసం ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్నానని స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ‘ప్రజల నాలుగు దశాబ్దాల కల నెరవేరనుంది. సీఎం కేసీఆర్ కృషి ఫలితమే మెదక్ ప్రజల కల సాకారమైంది. విజయదశమి, కొత్త జిల్లా ఆవిర్భావంతో ఒకేరోజు రెండు పండుగలు వచ్చాయి’ అని పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం నుంచి మెదక్ జిల్లా మనుగడలోకి రానున్న నేపథ్యంలో కొత్త జిల్లా ఏర్పాటు, భవిష్యత్తు కార్యాచరణపై పద్మాదేవేందర్‌రెడ్డి సోమవారం ‘సాక్షి’తో ముచ్చటించారు.
మెదక్ జిల్లాకు చారిత్రక నేపథ్యం...
‘మెదక్ జిల్లాకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. కాకతీయలు పాలనలో మెదక్ వెలుగొందింది. నిజాం పాలనలో సుభాగా ఉన్న ఈ ప్రాంతం ఆ తర్వాత మెదక్ పేరుతో జిల్లాగా ఏర్పాటైంది. ప్రత్యేక తెలంగాణతోపాటు మెదక్ ప్రజలు జిల్లా కేంద్రం కోసం ఉద్యమించారు. నేను కూడా ఉద్యమంలో పాల్గొన్నా. ఎన్నికల సమయంలో మెదక్ జిల్లా ఏర్పాటుపై హామీ ఇచ్చాం.
మెదక్ జిల్లాను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ 2014 డిసెంబర్ 17న ప్రకటించారు. ఆ ప్రకటన మేరకు ఇప్పుడు మెదక్ కేంద్రంగా జిల్లాగా మారుతుంది. 20 మండలాలు 8 లక్షల జనాభాతో మెదక్ జిల్లా ఏర్పాటవుతుంది. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం. ఈ వేడుకల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులను భాగస్వాములను చేస్తున్నాం.
చిన్నజిల్లాతో అభివృద్ధి పరుగులు..
చిన్న జిల్లా ఏర్పాటుతో పాలనా సౌలభ్యం పెరుగుతుంది. తద్వారా జిల్లా అభివృద్ధి ఊపందుకుంటుంది. మెదక్ జిల్లా అభివృద్ధికి ద్విముఖ వ్యూహంతో ముందుకుసాగుతాం. వ్యవసాయం, పారిశ్రామికరంగాల అభివృద్ధితోపాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటాం. మెదక్ జిల్లాకు అద్భుతమైన వనరులు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ మెదక్ జిల్లాను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపే ప్రయత్నం చేస్తా. వ్యవసాయం, సాగునీటిరంగ, అటవీ అభివృద్ధి, విద్యా, పర్యాటకరంగాల అభివృద్ధిపై దృష్టి సారిస్తాం. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి అ«ధిక ప్రాధాన్యతనిస్తాం. జిల్లాకు ప్రస్తుతం 44వ నంబరు జాతీయ రహదారి ఉంది. భవిష్యత్తులో నర్సాపూర్-బోధన్, బోధన్-హసన్‌పర్తి రహదారులు హైవేగా మారే అవకాశం ఉంది. జాతీయ రహదారులతో జిల్లా అభివృద్ధి పరుగులు తీస్తుంది. జిల్లా అభివృద్ధి కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేస్తాం.
ఎడ్యుకేషన్ హబ్, టూరిజం సర్క్యూట్‌గా..
మెదక్ జిల్లా పర్యాటకపరంగా అభివృద్ధి చెందే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఏడుపాయల, మెదక్ ఖిల్లా, చర్చి, పోచారం అభయారణ్యం తదితర ప్రాంతాలను కలుపుతూ టూరిజం సర్క్వూట్‌గా మార్చేందుకు ప్రణాళిక రూపొందిస్తాం. మెదక్‌కు త్వరలో కేంద్రీయ విద్యాలయం, పీజీ కళాశాలలు రానున్నాయి. మెదక్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తాం. కొత్త జిల్లా అభివృద్ధి చెందేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యం ముఖ్యం. అందరినీ కలుపుకునిపోతూ జిల్లా అభివృద్ధికి పాటుపడతా’మని పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు.