district formation
-
కొత్త జిల్లా ఆవిర్భావ ఘడియల కోసం..
ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్నా.. సీఎం కేసీఆర్ చొరవ వల్లే మెదక్ జిల్లా ఏర్పాటు ప్రజలు, రైతుల సంక్షేమానికి పెద్దపీట జిల్లా అభివృద్ధికి ద్విముఖ వ్యూహం టూరిజం సర్క్వూట్, ఎడ్యుకేషనల్ హబ్ కోసం ప్రణాళిక ‘సాక్షి’తో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి సాక్షి ప్రతినిధి మెదక్:మెదక్ జిల్లా ఆవిర్భావ క్షణాల కోసం ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్నానని స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ‘ప్రజల నాలుగు దశాబ్దాల కల నెరవేరనుంది. సీఎం కేసీఆర్ కృషి ఫలితమే మెదక్ ప్రజల కల సాకారమైంది. విజయదశమి, కొత్త జిల్లా ఆవిర్భావంతో ఒకేరోజు రెండు పండుగలు వచ్చాయి’ అని పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం నుంచి మెదక్ జిల్లా మనుగడలోకి రానున్న నేపథ్యంలో కొత్త జిల్లా ఏర్పాటు, భవిష్యత్తు కార్యాచరణపై పద్మాదేవేందర్‌రెడ్డి సోమవారం ‘సాక్షి’తో ముచ్చటించారు. మెదక్ జిల్లాకు చారిత్రక నేపథ్యం... ‘మెదక్ జిల్లాకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. కాకతీయలు పాలనలో మెదక్ వెలుగొందింది. నిజాం పాలనలో సుభాగా ఉన్న ఈ ప్రాంతం ఆ తర్వాత మెదక్ పేరుతో జిల్లాగా ఏర్పాటైంది. ప్రత్యేక తెలంగాణతోపాటు మెదక్ ప్రజలు జిల్లా కేంద్రం కోసం ఉద్యమించారు. నేను కూడా ఉద్యమంలో పాల్గొన్నా. ఎన్నికల సమయంలో మెదక్ జిల్లా ఏర్పాటుపై హామీ ఇచ్చాం. మెదక్ జిల్లాను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ 2014 డిసెంబర్ 17న ప్రకటించారు. ఆ ప్రకటన మేరకు ఇప్పుడు మెదక్ కేంద్రంగా జిల్లాగా మారుతుంది. 20 మండలాలు 8 లక్షల జనాభాతో మెదక్ జిల్లా ఏర్పాటవుతుంది. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం. ఈ వేడుకల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులను భాగస్వాములను చేస్తున్నాం. చిన్నజిల్లాతో అభివృద్ధి పరుగులు.. చిన్న జిల్లా ఏర్పాటుతో పాలనా సౌలభ్యం పెరుగుతుంది. తద్వారా జిల్లా అభివృద్ధి ఊపందుకుంటుంది. మెదక్ జిల్లా అభివృద్ధికి ద్విముఖ వ్యూహంతో ముందుకుసాగుతాం. వ్యవసాయం, పారిశ్రామికరంగాల అభివృద్ధితోపాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటాం. మెదక్ జిల్లాకు అద్భుతమైన వనరులు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ మెదక్ జిల్లాను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపే ప్రయత్నం చేస్తా. వ్యవసాయం, సాగునీటిరంగ, అటవీ అభివృద్ధి, విద్యా, పర్యాటకరంగాల అభివృద్ధిపై దృష్టి సారిస్తాం. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి అ«ధిక ప్రాధాన్యతనిస్తాం. జిల్లాకు ప్రస్తుతం 44వ నంబరు జాతీయ రహదారి ఉంది. భవిష్యత్తులో నర్సాపూర్-బోధన్, బోధన్-హసన్‌పర్తి రహదారులు హైవేగా మారే అవకాశం ఉంది. జాతీయ రహదారులతో జిల్లా అభివృద్ధి పరుగులు తీస్తుంది. జిల్లా అభివృద్ధి కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేస్తాం. ఎడ్యుకేషన్ హబ్, టూరిజం సర్క్యూట్‌గా.. మెదక్ జిల్లా పర్యాటకపరంగా అభివృద్ధి చెందే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఏడుపాయల, మెదక్ ఖిల్లా, చర్చి, పోచారం అభయారణ్యం తదితర ప్రాంతాలను కలుపుతూ టూరిజం సర్క్వూట్గా మార్చేందుకు ప్రణాళిక రూపొందిస్తాం. మెదక్‌కు త్వరలో కేంద్రీయ విద్యాలయం, పీజీ కళాశాలలు రానున్నాయి. మెదక్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తాం. కొత్త జిల్లా అభివృద్ధి చెందేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యం ముఖ్యం. అందరినీ కలుపుకునిపోతూ జిల్లా అభివృద్ధికి పాటుపడతా’మని పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. -
మానుకోటలో భూ మాఫియా
జిల్లా కేంద్రం ఏర్పాటుతో పెరుగుతున్న సమస్యలు రెచ్చిపోతున్న కబ్జాదారులు సామాన్యులకు ఇబ్బందులు కలెక్టర్‌కు, ఎస్పీకి వినతుల వెల్లువ సాక్షి, హన్మకొండ : జిల్లాల పునర్విభజనతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడుతోంది. ఈ విషయంలో మహబూబాబాద్‌లోని అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అధికారులు, సిబ్బంది, వ్యాపార, వాణిజ్య వర్గాలతోపాటు సామాన్యులు సంతోషపడుతున్నారు. పరిపాలన తమకు దగ్గరగా ఉండబోతుందని అనుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో భూములు ఉన్న వారు తమ ఆస్తుల విలువ పెరిగిందని భావిస్తున్నారు. కొత్త జిల్లా ఏర్పడుతున్న విషయంలో ఇది ఓ వైపు అంశం. దీనికి విరుద్ధంగా మరొకటి జరుగుతోంది. భూముల విలువ పెరుగుతుండడంతో భూమాఫియా విజృంభిస్తోంది. పలుకుబడి కలిగిన కొందరు వ్యక్తులు కబ్జాలకు పాల్పడుతున్నారు. సామాన్యుల భూములను లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోతున్నారు. ఏళ్లుగా ఆధీనంలో ఉన్న, సాగు చేసుకుంటున్న భూముల్లో పట్టపగలే రాళ్లు నాటి కబ్జా చేస్తున్నారు. ఈ భూములు తమవే... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని బెదిరిస్తున్నారు. బాధితులు భయంతో మిన్నకుండిపోతున్నారు. కొందరు ధైర్యం చేసి రెవెన్యూ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. విషయం తమది కాదంటే... తమది కాదని చెబుతూ ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేస్తోంది. విధిలేని పరిస్థితుల్లో కొందరు న్యాయం కోసం జిల్లా కలెక్టరును, పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్నారు. కష్టపడి కొనుకున్న తమ భూములను కాపాడాలంటూ విన్నవించుకుంటున్నారు. మహబూబాబాద్ పట్టణానికి చెందిన వారు ప్రతీరోజు జిల్లా కేంద్రానికి వచ్చి ఉన్నతాధికారులకు వినతులు ఇస్తున్నారు. జిల్లా కేంద్రం ఏర్పాటు ఏమోగానీ.. కష్టపడి కొనుకున్న తమ భూములు పరాధీనమవుతున్న తీరుపై ఆందోళనకు గురువుతున్నారు. మహబూబాబాద్‌కు చెందిన 50 మంది బుధవారం వరంగల్‌కు వచ్చారు. జిల్లా కలెక్టరు, వరంగల్ రూరల్ పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ‘పదేళ్ల క్రితం 300 మంది కలిసి భూములు కొనుకున్నాము. భూక్యా శ్రీను, కాలేరు మురళీ, వీరమల్ల మురళి, జానీ మరికొందరు కలిసి మా భూములు ఆక్రమించుకున్నారు. మేం మా ప్లాట్ల వద్దకు వెళితే అనుచరులతో దాడిచేయిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తున్నారు. మా భూముల విషయంలో గతంలో మహబూబాబాద్ ఎంఆర్ఓగా పనిచేసిన భాగ్యమ్మ విచారణ జరిపారు. భూములు కొన్న వారు రెవెన్యూ రికార్డులలో పేర్లు నమోదు చేసుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ధ్రువీకరించారు. మీరు జోక్యం చేసుకుని మాకు న్యాయం చేయండి’ అని వినతి పత్రంలో కోరారు. మహబూబాబాద్ ఆర్డీఓ, తహసీల్దారు కార్యాలయాల్లో ప్రతి రోజు ఇలాంటి వినతులు వందల సంఖ్యలో ఉంటున్నాయి. ఉన్నతాధికారులు పట్టించుకుని న్యాయం చేస్తారని సామాన్యులు ఆశిస్తున్నారు. -
రూపురేఖలు ఇవే
అధికారికంగా వెల్లడించిన ప్రభుత్వం కొత్త జిల్లాల కేంద్రాల గుర్తింపు సాక్షిప్రతినిధి, వరంగల్ : జిల్లాల పునర్విభజన అంశాల్లో నెలకొన్న సందేహాలకు కొంత స్పష్టత వచ్చింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న జయశంకర్ జిల్లాకు భూపాలపల్లి పరిపాలన కేంద్రం కానుంది. వరంగల్ జిల్లాకు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని వరంగల్ మండల ప్రాంతం కేంద్రం అవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై ఇప్పటికే ముసాయిదాను జారీ చేసి అభ్యంతరాలు స్వీకరిస్తున్న ప్రభుత్వం తాజాగా ప్రతిపాదిత జిల్లాల మ్యాప్‌లను విడుదల చేసింది. మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లా కేంద్రాలను అందులో పేర్కొన్నారు. రైల్వేలు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా సరిహద్దు, మండలాల సరిహద్దు, అసెంబ్లీ నియోజయవర్గం పరిధి, నదులు వంటిని ఈ మ్యాపులలో పొందుపరిచారు. కొత్తగా విడుదల చేసిన మ్యాప్‌లలో జిల్లా కేంద్రాలను పేర్కొన్నారు. జిల్లా కేంద్రంగా ఉండే ప్రాంతాన్ని నక్షత్రం గుర్తుతో పేర్కొన్నారు. ఇలా జయశంకర్ జిల్లాకు భూపాలపల్లిని, వరంగల్ జిల్లాకు వరంగల్ మండలంలోని ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా పేర్కొన్నారు. -
జిల్లా ఏర్పాటు కోరుతూ చేవెళ్ల బంద్
చేవెళ్ల: తెలంగాణ ప్రభుత్వం నూతన జిల్లాల ఏర్పాటుకు కసరత్తులు చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల తమ పట్టణ కేంద్రంగానే జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. శనివారం రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో పట్టణంలో బంద్ నిర్వహించారు. ఇందులో భాగంగా సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, టీడీపీ నాయకులు పట్టణంలో అన్ని దుకాణాలను బంద్ చేయించారు. రహదారిపై బైఠాయించి చేవెళ్ల జిల్లాను ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు.