మానుకోటలో భూ మాఫియా
-
జిల్లా కేంద్రం ఏర్పాటుతో పెరుగుతున్న సమస్యలు
-
రెచ్చిపోతున్న కబ్జాదారులు
-
సామాన్యులకు ఇబ్బందులు
-
కలెక్టర్‌కు, ఎస్పీకి వినతుల వెల్లువ
సాక్షి, హన్మకొండ : జిల్లాల పునర్విభజనతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడుతోంది. ఈ విషయంలో మహబూబాబాద్‌లోని అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అధికారులు, సిబ్బంది, వ్యాపార, వాణిజ్య వర్గాలతోపాటు సామాన్యులు సంతోషపడుతున్నారు. పరిపాలన తమకు దగ్గరగా ఉండబోతుందని అనుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో భూములు ఉన్న వారు తమ ఆస్తుల విలువ పెరిగిందని భావిస్తున్నారు. కొత్త జిల్లా ఏర్పడుతున్న విషయంలో ఇది ఓ వైపు అంశం. దీనికి విరుద్ధంగా మరొకటి జరుగుతోంది.
భూముల విలువ పెరుగుతుండడంతో భూమాఫియా విజృంభిస్తోంది. పలుకుబడి కలిగిన కొందరు వ్యక్తులు కబ్జాలకు పాల్పడుతున్నారు. సామాన్యుల భూములను లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోతున్నారు. ఏళ్లుగా ఆధీనంలో ఉన్న, సాగు చేసుకుంటున్న భూముల్లో పట్టపగలే రాళ్లు నాటి కబ్జా చేస్తున్నారు. ఈ భూములు తమవే... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని బెదిరిస్తున్నారు. బాధితులు భయంతో మిన్నకుండిపోతున్నారు. కొందరు ధైర్యం చేసి రెవెన్యూ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. విషయం తమది కాదంటే... తమది కాదని చెబుతూ ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేస్తోంది. విధిలేని పరిస్థితుల్లో కొందరు న్యాయం కోసం జిల్లా కలెక్టరును, పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్నారు.
కష్టపడి కొనుకున్న తమ భూములను కాపాడాలంటూ విన్నవించుకుంటున్నారు. మహబూబాబాద్ పట్టణానికి చెందిన వారు ప్రతీరోజు జిల్లా కేంద్రానికి వచ్చి ఉన్నతాధికారులకు వినతులు ఇస్తున్నారు. జిల్లా కేంద్రం ఏర్పాటు ఏమోగానీ.. కష్టపడి కొనుకున్న తమ భూములు పరాధీనమవుతున్న తీరుపై ఆందోళనకు గురువుతున్నారు.
మహబూబాబాద్‌కు చెందిన 50 మంది బుధవారం వరంగల్‌కు వచ్చారు. జిల్లా కలెక్టరు, వరంగల్ రూరల్ పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ‘పదేళ్ల క్రితం 300 మంది కలిసి భూములు కొనుకున్నాము. భూక్యా శ్రీను, కాలేరు మురళీ, వీరమల్ల మురళి, జానీ మరికొందరు కలిసి మా భూములు ఆక్రమించుకున్నారు. మేం మా ప్లాట్ల వద్దకు వెళితే అనుచరులతో దాడిచేయిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తున్నారు. మా భూముల విషయంలో గతంలో మహబూబాబాద్ ఎంఆర్‌ఓగా పనిచేసిన భాగ్యమ్మ విచారణ జరిపారు. భూములు కొన్న వారు రెవెన్యూ రికార్డులలో పేర్లు నమోదు చేసుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ధ్రువీకరించారు. మీరు జోక్యం చేసుకుని మాకు న్యాయం చేయండి’ అని వినతి పత్రంలో కోరారు. మహబూబాబాద్ ఆర్డీఓ, తహసీల్దారు కార్యాలయాల్లో ప్రతి రోజు ఇలాంటి వినతులు వందల సంఖ్యలో ఉంటున్నాయి. ఉన్నతాధికారులు పట్టించుకుని న్యాయం చేస్తారని సామాన్యులు ఆశిస్తున్నారు.