పోచారం అభయారణ్యానికి పూర్వవైభవం
నాగిరెడ్డిపేట :నిజామాబాద్-మెదక్ జిల్లాల సరిహద్దులో గల పోచా రం అభయారణ్యంతోపాటు, పోచారం ప్రాజెక్టుకు పూర్వవైభవం తీసుకొస్తామని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామ న్న అన్నారు. అభయారణ్యం వద్ద పర్యావరణ విద్యాకేంద్రా న్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రెండు జిల్లా సరిహద్దులో ఉన్న పోచారం అభయారణ్యాన్ని శనివారం శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. అభయారణ్యంలో తిరుగుతూ జింకలను, నెమళ్లను, దుప్పిలను, మనుబోతులను వారు తిలకించారు. చాలా దూరం కాలినడకన తిరిగారు. అభయారణ్యం లోని జంతువుల గురించి ఫారెస్ట్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోచారం ప్రాజెక్టును వారు సందర్శిం చారు. ప్రాజెక్టు వద్ద ఉన్న నిజామాబాద్, మెదక్ జిల్లా అతి థిగృహాలను పరిశీలించారు. వాటికి మరమ్మతులు చేపడతామన్నారు. ఏడుపాయల, మెదక్ చర్చి, పోచారం అభయారణ్యం, పోచారం ప్రాజెక్టులను కలిపి పర్యాటక ప్రాంతాలుగా మారుస్తామని చెప్పారు.
పర్యావరణ విద్య కేంద్రం
పోచారం అభయారణ్యం వద్ద పర్యావరణవిద్య కేంద్రాన్ని(ఎన్విరాల్‌మెంట్ ఎడ్యూకేషన్ సెంటర్) ఏర్పాటు చే స్తామని అటవీశాఖ, వెనుకబడిన తరగతుల మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. అభయారణ్యాన్ని సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అటవీశాఖలో ఖాళీగా ఉన్న 2,600 పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9 వన్యప్రాణికేంద్రాలు ఉన్నాయన్నారు. పోచారం అభయారణ్యంలో స్థాయికి మించి జంతువుల సంఖ్య పెరిగిందని, ఎక్కువగా ఉన్న జంతువులను ఇతర వన్యప్రాణి కేంద్రాలకు తరలిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి సహకారంతో అడవులను, వన్యప్రాణులను సంరక్షించుకునేలా చర్యలు చేపడతామన్నారు. అభయారణ్యంతోపాటు ప్రాజెక్టును తిలకించేందుకు వచ్చే పర్యాటకులకు ఇబ్బందులు కలుగకుండా హరిత హోటల్‌ను ఏర్పాటు చేయిస్తామని ఆయన చెప్పారు. వారి వెంట మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌బొజ్జా, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జనార్ధన్‌గౌడ్ తదితరులు ఉన్నారు.