* మహిళా దినోత్సవంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
* చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్
* మహిళలకు రక్షణ, సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రులు
* విశిష్ట మహిళలకు పురస్కారాలు ప్రదానం
సాక్షి, హైదరాబాద్: ఇన్నాళ్లూ అనుత్పాదక రంగాలకే పరిమితమైన మహిళలు ఇప్పుడిప్పుడే స్వావలంబన సాధిస్తున్నారని... వారు మరింత ముందుకు వచ్చేలా అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలని శాసనసభ ఉపసభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
మంగళవారం హైదరాబాద్‌లోని లలిత కళాతోరణంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ, భాషా సాంస్కృతిక శాఖలు సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని పద్మాదేవేందర్‌రెడ్డి చెప్పారు. ఆ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నా పార్లమెంటులో ఆమోదానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వంలో మంత్రులందరూ సమష్టిగా నిర్వహించే బాధ్యతలను కుటుంబంలో మహిళ ఒంటిచేత్తో నిర్వహిస్తుందని పేర్కొన్నారు. చదువుకున్న స్త్రీ కుటుంబానికి దిక్సూచిలా నిలుస్తుందని, అవకాశాలు ఇస్తే మహిళలు ఐటీలోనే కాదు ఆకాశంలోనూ విహరిస్తారని చెప్పారు. రాష్ట్రంలో మహిళల ఆరోగ్యం, రక్షణ కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపి, ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు.
ఆ కమిటీ సిఫారసుల మేరకే ‘షీ’ టీమ్‌లు, షీ క్యాబ్‌లు, సఖి వంటి పథకాలను ప్రవేశపెట్టామని తెలిపారు. సీఎం కేసీఆర్ దేశంలోనే తొలిసారిగా మహిళల కష్టాలను తీర్చడం కోసం ఇంటింటికీ తాగునీరందించే ‘మిషన్ భగీరథ’ను చేపట్టడం సాహసోపేత నిర్ణయమని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. పోలీసు ఉద్యోగ నియామకాల్లో తొలిసారిగా మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
సాహసం. విజ్ఞానం, ధర్మం, సహనం, ఓపిక తదితరాలకు మహిళలు ప్రతీకగా నిలుస్తారని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వ్యవస్థలో మహిళలదే కీలకపాత్ర అని.. వారి హక్కులు, రక్షణ, గౌరవం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న కార్యక్రమాలను కరీంనగర్ జెడ్పీ చైర్మన్ తుల ఉమ ప్రశంసించారు.
మహిళలకు పురస్కారాలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన 21మంది మహిళలను సత్కరించారు. లక్ష రూపాయల నగదు, జ్ఞాపికలతో వారిని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి సన్మానించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చెన్నబోయిన కమలమ్మ, రమా మెల్కోటే, బాల థెరీసా, ఎల్లవ్వ, లావణ్య, మన్నెం సరితారెడ్డి, కెప్టెన్ దీప్తి, తారాబాయి.
సువర్చల, సురభి వాణీదేవి, సంధ్య, ఆలేరు విజయ, నిఖత్ జరీన్, అఖిలేశ్వరి, ఆవుల సరిత, గోగు శ్యామల, నేనావత్ దేవి, మొగులమ్మ, మంకూబాయి, డాక్టర్ ఫణిశ్రీ సాయి తదితరులు పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గొంగిడి సునీత, కోవ లక్ష్మి, జడ్పీ చైర్‌పర్సన్లు సునీతా మహేందర్‌రెడ్డి, జి.పద్మ, ప్రభుత్వ సలహాదారు రమణాచారి తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు అవకాశాలు ఇవ్వాలి
Published Wed, Mar 9 2016 4:40 AM | Last Updated on Sat, Aug 11 2018 8:09 PM
Advertisement