'ప్రతిపక్షాలతో సంప్రదించి ఒక నిర్ణయానికి వస్తాం'
హైదరాబాద్ : డిప్యూటీ స్పీకర్ ఎన్నిక విషయంలో ప్రతిపక్ష సభ్యులు తర్జన భర్జన పడుతున్నారు. స్పీకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందున డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వటం సంప్రదాయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గీతారెడ్డి అన్నారు. అయితే అధికార టీఆర్ఎస్ డిప్యూటీ స్పీకర్ పదవికి అభ్యర్థిని ప్రకటించిందని ఆమె పేర్కొన్నారు.
ఈ అంశంపై ఇతర ప్రతిపక్షాలతో సంప్రదించి ఒక నిర్ణయానికి వస్తామని గీతారెడ్డి తెలిపారు. డిప్యూటీ స్పీకర్ను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవటం, లేదంటే ప్రతిపక్షాలు నుంచి అభ్యర్థిని పోటీకి పెట్టడం, కాదంటే ఎన్నికకు దూరంగా ఉండటం ఈ మూడు ప్రత్యామ్నాయాలు తమ ముందు ఉన్నాయని ఆమె చెప్పారు.
మరోవైపు తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టడానికి ఎం.పద్మా దేవేందర్‌రెడ్డి సుముఖత వ్యక్తం చేయడంలేదు. డిప్యూటీ స్పీకర్‌గా ఉంటే రాజకీయంగా నష్టపోతానని, దానికన్నా ఎమ్మెల్యేగా ఉంటేనే మంచిదని పేర్కొంటున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టాలంటూ ఆమెకు శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్‌రావు ద్వారా కేసీఆర్ ఆదేశాలిచ్చారు. ఇందుకు పద్మ అంగీకరించలేదు.