సభలో కంటతడి పెట్టిన డిప్యూటీ స్పీకర్
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కంటతడి పెట్టారు. సంస్కారం లేనివారు సభను నిర్వహిస్తున్నారంటూ మంగళవారం సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకె అరుణ వ్యాఖ్యలు చేశారు. దీంతో మనస్తాపం చెందిన పద్మా దేవేందర్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు జోక్యం చేసుకుని 'మహిళ పట్ల అనుచిత వ్యాఖ్యలు తగవు.సభాపతిని డిక్టేట్ చేయడం సరికాదని, డీకే అరుణ వెంటనే క్షమాపణ చెప్పాలని' డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే సస్పెండ్ చేయడానికి వెనుకాడేది లేదని హరీశ్ రావు స్పష్టం చేశారు.
ఏపీ శాసనసభలో ఏం జరిగిందో అందరికీ తెలుసు అని, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ మహిళ ఎమ్మెల్యేను ఏడాదిపాటు సభనుంచి సస్పెండ్ చేశారని, అయితే తాము అలాంటి చర్యకు పోదలచుకోలేదని అన్నారు. గతంలో తాము సభలో మాట జారితే తమ నాయకుడు...మంత్రులతో క్షమాపణ చెప్పించారని హరీశ్ రావు గుర్తు చేశారు. అది తమ సంస్కారమని, క్షమాపణ చెబితే కిరీటమేమీ పడిపోదని ఆయన అన్నారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తనపై చేసిన వ్యాఖ్యలకు సభ్యుల విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ సభలో అందరూ హుందాగా వ్యవహరించాలని సూచించారు. సభాపతిపై ప్రతిపక్షానికి గౌరవముందని, సభ్యులు ఆవేశపడినా గతంలో తాము సర్ధుబాటు చేసిన ఘటనలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిపై వాదాపవాదాలు వద్దని అందరూ సమన్వయం పాటించాలని జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై డీకే అరుణ మాట్లాడుతూ... తాను ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.