ప్ర‘జల’ సాక్షి | Sakshi water distribution | Sakshi
Sakshi News home page

ప్ర‘జల’ సాక్షి

Published Wed, Apr 27 2016 3:50 AM | Last Updated on Sat, Aug 11 2018 8:09 PM

ప్ర‘జల’ సాక్షి - Sakshi

ప్ర‘జల’ సాక్షి

♦ జనం గొంతు తడుపుతున్న ‘సాక్షి’ చలివేంద్రాలు
♦ మారుమూల పల్లెలకు ట్యాంకర్లతో నీటి సరఫరాకు శ్రీకారం
 
 (సాక్షి, నెట్‌వర్క్)
 ఎక్కడికక్కడ వట్టిపోయిన బోర్లు, నెర్రెలు విచ్చుకున్న నీటి వనరులు, గుక్కెడు నీళ్ల కోసం మైళ్లదూరం వెళ్తున్న జనం.. ప్రస్తుతం తెలంగాణ పల్లె చిత్రమిది. ఇలాంటి ఆపత్కాలంలో సామాజిక బాధ్యతగా, తమ వంతుగా ‘సాక్షి’ ప్రజల కోసం కదిలింది. ఎర్రటి ఎండలో బయటకు వచ్చిన జనం గొంతు తడిపేందుకు నడుంకట్టింది. పట్టణాల్లో చలివేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న కొన్ని పల్లెలు, గిరిజన గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించే సంకల్పంతో ముందుకు సాగుతోంది.

 అన్ని జిల్లాల్లోనూ చలివేంద్రాలు..
 తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న మెదక్ జిల్లా హత్నూర మండలం గుండ్ల మాచనూరుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో నీటి సరఫరాకు రెండు ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. వీటిద్వారా రోజూ లక్ష లీటర్ల నీటిని సరఫరా చేయనున్నారు. ఈ ట్యాంకర్లను కలెక్టర్ రోనాల్డ్ రాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఇటీవల మెదక్‌లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి ప్రారంభించి..ప్రజల దాహార్తిని తీర్చేందుకు ‘సాక్షి’ చూపుతున్న చొరవను కొనియాడారు. మహబూబ్‌నగర్‌లోని తెలంగాణ చౌరస్తాలో మంగళవారం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ రాంకిషన్, డీఎస్పీ కృష్ణమూర్తి, జేపీఎన్‌సీఈ చైర్మన్ రవికుమార్ ప్రారంభించారు.

సోమ, మంగళవారాల్లో జిల్లాలోని షాద్‌నగర్, వనపర్తి, కల్వకుర్తి, అచ్చంపేట, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గ కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటయ్యాయి. అలాగే, నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్, బాన్సువాడ, బోధన్, ఆర్మూరు, ఎల్లారెడ్డి పట్టణాల్లో ‘సాక్షి’ ఏర్పాటు చేసిన చలివేంద్రాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. వరంగల్ జిల్లా మహబూబాబాద్ పట్టణంలో మంగళవారం ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ట్యాంకర్లను ప్రారంభించారు. పట్టణంలో కూరగాయల మార్కెట్‌లో చలివేంద్రాన్ని మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ ప్రారంభించారు. బచ్చన్నపేటతోపాటు కొడవటూరు, కొన్నె గ్రామాలలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది.
 
 నృత్యాలతో ‘సాక్షి’ ట్యాంకర్లకు స్వాగతం
 నీటిని పొదుపు చేస్తామని ప్రతిజ్ఞ
 కొండలమాటున నీటి కోసం అల్లాడుతున్న గిరిజనం దప్పిక తీరుస్తోంది ‘సాక్షి’. నల్లగొండ జిల్లా అనుముల మండలం ఎల్లాపురం పరిధిలోని చక్కోలం తండాకు మంగళవారం నుంచి ట్యాంకర్ ద్వారా తాగునీరు సరఫరా చేస్తోంది సాక్షి. అనుముల మండల కేంద్రానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తండాకు ట్యాంకర్‌తో ‘సాక్షి’ వెళ్లడంతో గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో ఎదురొచ్చి స్వాగతం పలికారు. తాగునీటిని పొదుపుగా వాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.

కరీంనగర్ జిల్లాలోనూ అనేక ప్రాంతాల్లో చలివేంద్రాలు ప్రారంభమయ్యాయి. గోదావరిఖని ఎన్టీపీసీ మేడిపెల్లి సెంటర్‌లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రామగుండం మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లాలోని పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటయ్యూరుు. ఆదిలాబాద్ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని అటవీశాఖ మంత్రి జోగు రామన్న ప్రారంభించారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్‌రావు, బెల్లంపల్లి కొత్తబస్టాండ్‌లో మునిసిపల్ మాజీ చైర్మన్ మత్తమారి సూరిబాబు ప్రారంభించారు. ఖమ్మం జిల్లాలోనూ చలివేంద్రాలు కొనసాగుతున్నాయి. జిల్లా పరిషత్ ఆఫీసు వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ కవిత ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement