ఏమిటీ ఈ నిర్లక్ష్యం?
- మరుగుదొడ్ల నిర్మాణాలపై డిప్యూటీ స్పీకర్ సమీక్ష
- నివేదికల తయారీలో నిర్లక్ష్యంపై ఫైర్
- పది రోజులుగా ఏం చేస్తున్నారంటూ నిలదీత
- ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన కలెక్టర్
మెదక్: వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, అవసరాలు తదితర వివరాలపై నివేదిక తయారీలో అధికారుల నిర్లక్ష్యంపై డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి భగ్గుమన్నారు. శుక్రవారం మెదక్ ఎంపీడీఓ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి అధికారులతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజవకర్గంలోని చాలా గ్రామాల్లో అధికారులు మొక్కుబడిగా నివేదికలు తయారు చేశారని మండిపడ్డారు. మెదక్ మండలం ఖాజిపల్లి, ఫరీద్‌పూర్ గ్రామాల్లో అసలు మరుగుదొడ్లే లేవంటూ నివేదికలు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫరీద్‌పూర్‌లో అసలు మరుగుదొడ్లు నిర్మించుకున్నవారే లేరంటూ తప్పుడు నివేదికలిచ్చిన గ్రామ కమ్యూనిటీ కోఆర్డినేటర్ (వెలుగు సీసీ) శంకర్‌ను, విధులకు హాజరు కానందున చిన్నశంకరంపేట ఈజీఎస్ ఏపీఓ ఈశ్వరమ్మను వెంటనే సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రోనాల్డ్‌రాస్ ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. గ్రామాలకు వెళ్లకుండానే నివేదికలు తయారు చేశారని మండిపడ్డారు. 26 వరకు పూర్తిస్థాయిలో నివేదికలు అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, జేసీ వెంకట్రాంరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, డ్వామా పీడీ ఇంద్రకరణ్, ఆర్డీఓ మెంచు నగేష్, ఎంపీపీ కొత్తపల్లి లక్ష్మికిష్టయ్య, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, నియోజకవర్గంలోని తహశీల్దార్లు, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు.