Authorities ignored
-
వెలగని ‘దీపం’
♦ పథకానికి లబ్ధిదారులు కావలెను.. ♦ గడువు ముగిసినా పూర్తి కాని ఎంపిక ♦ అధికారుల నిర్లక్ష్యంతో ఎంపిక ఆలస్యం ♦ నియోజకవర్గానికి 5వేల గ్యాస్ కనెక్షన్లు ఖమ్మ జెడ్పీసెంటర్ : దీపం పథకం ద్వారా నిరుపేదలు గ్యాస్ స్టవ్‌పై వంట చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి.. రాయితీపై కనెక్షన్లు మంజూరు చేస్తోంది. అధికారుల నిర్లక్ష్యమో.. లబ్ధిదారుల అవగాహనా లోపమో కనెక్షన్లు పొందేందుకు ముందుకు రావడం లేదు. జూన్ నెలాఖరులోగా గడువు ముగిసినప్పటికీ లబ్ధిదారుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. కనెక్షన్లు తీసుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదనే అధికారుల వాదన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి వెళ్లగా.. ఆయన ఆదేశాల మేరకు జేసీ దివ్య దీపం కనెక్షన్లు పొందే వారి కోసం బంపర్ ఆఫర్ ప్రకటించారు. రూ.1,970లకే గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని సర్క్యులర్ జారీ చేశారు. దీపం పథకం కింద జిల్లాకు 50వేల గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. పది నియోజకవర్గాలకు.. ఒక్కో దానికి 5వేల కనెక్షన్లు జూన్ నాటికి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి.. కనెక్షన్లు పంపిణీ చేయాల్సి ఉంది. 50వేల కనెక్షన్లకు.. 38,588 మందికి ఇచ్చేందుకు నిర్ణయించి.. 28,581 మంది లబ్ధిదారులకు మాత్రమే పంపిణీ చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల లబ్ధిదారుల ఎంపిక నెలల తరబడి సాగుతోంది. అర్హులు వీరే.. నిరుపేద ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, గతంలో గ్యాస్ కనెక్షన్ తీసుకోని వారు దీపం పథకానికి అర్హులు. గ్యాస్ కనెక్షన్లను నగదు చెల్లించి.. కొనుగోలు చేయని వారికి ప్రభుత్వం సబ్సిడీపై సిలిండర్, స్టవ్, పాస్ పుస్తకం అందిస్తోంది. లబ్ధిదారుల ఎంపికకు ఆధార్‌ను ప్రమాణికంగా తీసుకుంటారు. డీలర్‌కు లబ్ధిదారులు రూ.1,970 అందజేస్తే.. కనెక్షన్‌తోపాటు నిండు సిలిండర్, స్టవ్, రెగ్యులేటర్, పైపు ఇస్తారు. ఎంపీడీఓలదే బాధ్యత మండలస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ఎంపీడీఓలదే. నిరుపేదలకు మాత్రమే పథకం వర్తింపజేయాల్సి ఉంటుంది. లబ్ధిదారుల గుర్తింపు పూర్తయిన తరువాత ఆ జాబితాను గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో ప్రదర్శించాల్సి ఉంటుంది. మూడు రోజులు గ్రామసభలు నిర్వహించి.. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తరువాత తుది జాబితా మండల స్థాయిలోనే ఖరారు చేస్తారు. అక్కడ ఖరారు చేసిన తుది జాబితాను ఎంపీడీఓల ద్వారా డీఆర్డీఏ పీడీకి.. అక్కడి నుంచి కలెక్టర్‌కు పంపుతారు. కలెక్టర్ ఆమోదం తరువాత లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, గ్యాస్ కనెక్షన్లు ఇస్తారు. వెనుకబాటు జిల్లాకు మంజూరైన 50వేల గ్యాస్ కనెక్షన్లకు.. 40,837 మంది లబ్ధిదారులను గుర్తించామని.. 38,588 మందికి కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టామని అధికారులు పేర్కొంటున్నారు. అయితే మొత్తం 28,581 కనెక్షన్లు మంజూరు చేసినట్లు నివేదికల్లో పేర్కొంటున్నారు. ఇంకా 10వేల కనెక్షన్లకు లబ్ధిదారులను గుర్తించడం కష్టంగా మారినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కనెక్షన్లు ఇస్తామని చెబుతున్నా లబ్ధిదారులు ముందుకు రావడం లేదని అధికారుల వాదన. జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఉండగా.. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 4,123 దీపం కనెక్షన్లకు.. 1,908 మంది లబ్ధిదారులను గుర్తించగా.. 1,058 మందికి కనెక్షన్లు మంజూరు చేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో 987 కనెక్షన్లకు.. 770 మంజూరు చేశారు. మణుగూరు మున్సిపాలిటీలో 591 కనెక్షన్లకు.. 41 మందికి మాత్రమే పంపిణీ చేశారు. మణుగూరు మండలంలో 859 కనెక్షన్లకు.. 505 మందికి పంపిణీ చేశారు. ఇల్లెందు మున్సిపాలిటీలో 603 కనెక్షన్లకు.. ఒక్కరికి కూడా పంపిణీ చేయలేదు. -
ఏమిటీ ఈ నిర్లక్ష్యం?
- మరుగుదొడ్ల నిర్మాణాలపై డిప్యూటీ స్పీకర్ సమీక్ష - నివేదికల తయారీలో నిర్లక్ష్యంపై ఫైర్ - పది రోజులుగా ఏం చేస్తున్నారంటూ నిలదీత - ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన కలెక్టర్ మెదక్: వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, అవసరాలు తదితర వివరాలపై నివేదిక తయారీలో అధికారుల నిర్లక్ష్యంపై డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి భగ్గుమన్నారు. శుక్రవారం మెదక్ ఎంపీడీఓ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి అధికారులతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజవకర్గంలోని చాలా గ్రామాల్లో అధికారులు మొక్కుబడిగా నివేదికలు తయారు చేశారని మండిపడ్డారు. మెదక్ మండలం ఖాజిపల్లి, ఫరీద్పూర్ గ్రామాల్లో అసలు మరుగుదొడ్లే లేవంటూ నివేదికలు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫరీద్‌పూర్‌లో అసలు మరుగుదొడ్లు నిర్మించుకున్నవారే లేరంటూ తప్పుడు నివేదికలిచ్చిన గ్రామ కమ్యూనిటీ కోఆర్డినేటర్ (వెలుగు సీసీ) శంకర్‌ను, విధులకు హాజరు కానందున చిన్నశంకరంపేట ఈజీఎస్ ఏపీఓ ఈశ్వరమ్మను వెంటనే సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రోనాల్డ్‌రాస్ ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. గ్రామాలకు వెళ్లకుండానే నివేదికలు తయారు చేశారని మండిపడ్డారు. 26 వరకు పూర్తిస్థాయిలో నివేదికలు అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, జేసీ వెంకట్రాంరెడ్డి, డీఆర్డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, డ్వామా పీడీ ఇంద్రకరణ్, ఆర్డీఓ మెంచు నగేష్, ఎంపీపీ కొత్తపల్లి లక్ష్మికిష్టయ్య, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, నియోజకవర్గంలోని తహశీల్దార్లు, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు. -
రూ.46 కోట్ల పనుల్లో నాణ్యత కరువు
అడ్డదిడ్డంగా రోడ్డు వెడల్పు పనులు.. పాత డ్రైనేజీలకు కొత్త పూత.. నాణ్యతకు తిలోదకాలిస్తూ డస్ట్‌తోనే రోడ్ల నిర్మాణం.. రోడ్ల మధ్యలోనే విద్యుత్ స్తంభాలు.. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం.. అధికారుల పర్యవేక్షణాలోపం.. ఆర్అండ్బీ ఆధ్వర్యంలో చేపడుతున్న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రోడ్ల వెడల్పు పనులు సాగుతున్న తీరిది. - డస్ట్‌తోనే రోడ్ల నిర్మాణం - పాత డ్రెయిన్లకే కొత్త పూతలు - పగులుతున్న పైపులైన్లు...గొంతెండుతున్న ప్రజలు - ఎక్సెస్ రేట్లతో ప్రభుత్వ ఖజానాకు గండి - పట్టించుకోని అధికారులు - కరీంనగర్లో అధ్వానంగా రోడ్డు వెడల్పు పనులు సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : నగరం నలువైపులా ఉన్న రోడ్లను వంద ఫీట్ల వెడల్పుతో సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం అభాసుపాలవుతోంది. సుమారు 14.5 కిలోమీటర్ల మేరకు రోడ్డు వెడల్పు పనులతోపాటు డ్రెయినేజీలు, సెంట్రల్ లైటింగ్, డివైడర్లు నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం రూ.46 కోట్లు విడుదల చేసింది. భారీ ఎత్తున నిధులు మంజూరు కావడంతో కాసులపంట పండిందుకున్న కాంట్రాక్టర్లు, అధికారుల అండదండలతో నిబంధనలను తోసిరాజని అడ్డదిడ్డంగా రోడ్లు వెడల్పు, డ్రైనేజీల నిర్మాణాన్ని కొనసగిస్తున్నారు. డస్ట్‌తోనే రోడ్ల నిర్మాణం ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో సుమారు రూ.37 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం నుంచి పద్మనగర్ వరకు, తెలంగాణ చౌక్‌నుంచి ఆర్టీసీ వర్క్‌షాప్ వరకు, కోర్టు చౌరస్తా నుంచి ఆపోలో ఆసుపత్రి వరకు, మంచి ర్యాల చౌరస్తా నుంచి పెద్దపల్లి బైపాస్ వరకు ఉన్న రోడ్లును వంద ఫీట్లు వెడల్పు చేసి పునరుద్దరించాల్సి ఉంది. మిగిలిన రూ.9కోట్ల మొత్తాన్ని సెంట్రల్ లైటింగ్‌కు కేటాయించారు. ప్రధానంగా బీటీ రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. 40 ఎంఎం, 20 ఎంఎం కంకర, 10 ఎంఎం చిప్స్‌తో వెట్‌మిక్స్ వేయాల్సిన కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా తవ్వి డస్ట్‌తో నింపేస్తున్నారు. అణగడానికి కనీసం రోలింగ్, క్యూరింగ్ కూడా చేయడం లేదు. ఫలితంగా రోడ్డు పనులన్నీ దుమ్ముకొట్టుకుపోతున్నాయి. గట్టిగా నాలుగు వానలు పడితే ఎక్కడికక్కడ గుంతలేర్పడే విధంగా కన్పిస్తున్నాయి. పాత డ్రైనేజీలకే కొత్త పూతలు నిబంధనల ప్రకారం నూతన రోడ్డు నిర్మాణంతోపాటు రోడ్డుకు రెండు వైపులా డ్రైనేజీల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే కాంట్రాక్టర్లు పాత డ్రైనేజీలకే కొత్త పూత పూస్తున్నారు. పాత డ్రెయినేజీలపై అడుగు, అడుగున్నర ఎత్తుతో కొత్త బెడ్పోసి పూర్తిగా డ్రైనేజీ నిర్మించినట్లుగా లెక్కలేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. కొన్నిచోట్ల డ్రైనేజీలు అష్టవంకర్లు తిరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల రోడ్డుకు డ్రైనేజీకి సంబంధమే లేకుండా పోతోంది. అవసరం లేని చోట సైతం తవ్వి కొత్త డ్రైనేజీని సృష్టిస్తున్నారు. విద్యుత్ స్తంభాల తొలగింపులోనూ నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తోంది. రోడ్డు వెడల్పు సందర్భంగా విద్యుత్ స్తంభాలను తొలగించాల్సి ఉన్నప్పటికీ... అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో రోడ్డు మధ్యలోనే విద్యుత్ స్తంభాలుండే పరిస్థితి కన్పిస్తోంది. పనులు ఇంత నిర్లక్ష్యంగా, నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వెట్‌మిక్స్ వేసేటప్పుడు, బీటీ వేసేటప్పుడు, డ్రెయినేజీల నిర్మాణం జరిగేటప్పుడు అధికారులు లేకుండానే పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. నిఘా లేకపోవడంతో కాంట్రాక్టర్ చేసిందే నాణ్యత అన్నట్లు తయారైంది. నో లెస్.. పదేళ్లుగా ఎక్సైస్సే రోడ్లు, భవనాల శాఖ చేపట్టే అభివృద్ధి పనుల్లో గత పదేళ్లలో ఏ ఒక్క టెండర్ కూడా లెస్‌కు వేయలేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పటి వరకు వేల కోట్ల రూపాయల పనులు చేపట్టినప్పటికీ అందులో ఏ ఒక్క పనీ లేస్‌కు వేయలేదని తెలిసింది. దాదాపు అన్ని పనులకు ఎక్సెస్ టెండర్లు పడుతుండడంతో ప్రభుత్వ ఖజానాకు కోట్లలో గండి పడుతోంది. మరోవైపు హాట్‌మిక్స్ ప్లాంట్ (హెచ్ఎంపీ) ఉన్న కాంట్రాక్టర్లకే సివిల్ పనులు కట్టబెడుతుండటంతో అధికారులు అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సివిల్ పనులను సైతం బీటీ రోడ్డుతో కలిపి హెచ్ఎంపీ ఉన్న కాంట్రాక్టర్‌కే అర్హత కల్పిస్తుండడంతో సివిల్ కాంట్రాక్టర్లకు ఒక్క పని కూడా దక్కడం లేదు. పైగా సివిల్ పనులు దక్కించుకున్న కొందరు హెచ్ఎంపీ కాంట్రాక్టర్లు ఆయా పనులను మళ్లీ సివిల్ కాంట్రాక్టర్లకే అప్పగిస్తూ... వారి నుంచి కొంత మొత్తాన్ని గుడ్‌విల్ రూపంలో తీసుకుంటున్నారు. సివిల్ పనులను నిబంధనల మేరకు తమకే ఇవ్వాలని కోరుతూ గతంలో చాలాసార్లు సివిల్ కాంట్రాక్టర్లు ఆర్అండ్బీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించినప్పటికీ అధికారులెవరూ పట్టించుకున్న పాపానపోలేదు. పగులుతున్న మంచినీటి పైపులైన్లు ఆర్అండ్బీ రోడ్ల పనులు నిర్లక్ష్యంగా చేస్తుండడంతో నగరవాసులు మంచినీటి సరఫరా జరిగే పైపులైన్లు పగులుతున్నాయి. పనులు నడిచినన్ని రోజులు నీటి కోసం ప్రజలు అల్లాడే పరిస్థితి ఏర్పడుతోంది. పైపులైన్లు ఉన్న ప్రాంతాల్లో మనుషులతో తవ్వించాలనే నిబంధనను కూడా విస్మరించిన కాంట్రాక్టర్లు ప్రొక్టెయిన్తో తవ్వడంతో పైపులు పగిలిపోతున్నాయి. మున్సిపల్ అధికారులు ఎంత మొత్తుకున్నా ఆర్అండ్బీ అధికారులు చెవిక్కెడం లేదు. చివరకు కలెక్టర్ సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి అక్షింతలు వేసినా స్పందించిన దాఖలాలు లేవు. కమీషన్లకే ప్రాధాన్యం! ఆర్అండ్బీ అధికారులు అభివృద్ధి పనుల్లో కమీషన్లకే ప్రాధాన్యమిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. బీటీ రోడ్డు పనులను బీటీ కాంట్రాక్టర్లు, సివిల్ పనులను సివిల్ కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సి ఉండగా, రెండింటినీ కలిపి ఒకే టెండర్ కిందకు తెస్తూ హెచ్ఎంపీ కాంట్రాక్టర్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 18 మంది ఉన్న హెచ్ఎంపీ కాంట్రాక్టర్ల కోసం వందలాది మంది సివిల్ కాంట్రాక్టర్లను బలిచేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కొన్నిచోట్ల చేయని పనులకు కూడా బిల్లులు రాసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత రెండేళ్లలో ఒక్క పనిని కూడా సివిల్ కాంట్రాక్టర్లు దక్కించుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. అధికారులు పట్టించుకోకపోవడంతో కడుపు మండిన సివిల్ కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రికి, ఆర్అండ్బీ మంత్రికి, చీఫ్ ఇంజనీర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
భోరుబండ
వట్టిపోయిన జలాశయం - ఆందోళనలో రైతాంగం - పాతికేళ్లుగా అధికారుల నిర్లక్ష్యం - ‘మిషన్ కాకతీయ’లో చేర్చని వైనం - ప్రవాహానికి నోచుకోని కాల్వలు గజ్వేల్: బహుళ ప్రయోజన రిజర్వాయర్ ‘బోరబండ’ చుక్కనీరు లేక వెలవెలబోతోంది. చినుకు పడక.. రిజర్వాయర్ నిండక, సాగు సాగక చిన్నబోతోంది. నిర్మాణం పూర్తయి పాతికేళ్లవుతున్నా.. కాల్వలు ప్రవాహానికి నోచుకోవడం లేదు. జలాశయం నిండితే మరెన్నో చెరువులను నీటితో నింపొచ్చు. కానీ, ఆదిశగా అధికారుల చొరవ కరువైంది. నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నందు వల్ల నిధులెన్నైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. మంత్రి హరీష్‌రావు సహకారం ఉన్నా.. అధికారుల్లో స్పందన లేదు. జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లి-ధర్మారం గ్రామాల మధ్య 1990లో రూ.56 లక్షలతో బోరబండ రిజర్వాయర్ నిర్మించారు. 115 ఎకరాల విస్తీర్ణం.. 36.80 మిలియన్ ఘనపుటడుగుల నీటినిల్వ సామర్థ్యం దీని సొంతం. క్షామంతో తల్లడిల్లుతున్న జగదేవ్‌పూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఆరుతడి పంటలకు కాల్వల ద్వారా సాగునీటిని అందించడం, గజ్వేల్ నియోజకవర్గంలో భూగర్భజలాల పెంపు దీని లక్ష్యం. 2.6 కి.మీ. పొడవున కుడి, 1.94 కి.మీ. పొడవున ఎడమ కాల్వ నిర్మించారు. ప్రాజెక్టు పరిధిలో 832 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో కుడి కాల్వ ద్వారా ధర్మారం, వర్దరాజ్‌పూర్, ఇటిక్యాల, కొత్తపేట, పీర్లపల్లిలోని 568 ఎకరాలకు, ఎడమ కాల్వ ద్వారా ధర్మారం, పీర్లపల్లిలోని మరికొంత భాగంలో వున్న 264 ఎకరాల ఆరుతడి పంటలకు సాగునీరందిం చాలని నిర్ణయించారు. అయితే, రిజర్వాయర్ ప్రారంభం నుంచీ కాల్వలు ప్రవాహానికి నోచుకోలేదు. ఆయకట్టు తడిచింది లేదు. చుక్క పారని కాలువలు నాలుగేళ్లుగా తక్కువ వర్షపాతం కారణంగా ఎగువ నుంచి వరద నీరు రాక జలాశయం ఎండుముఖం పట్టింది. కొద్దోగొప్పో వర్షాలతో ప్రాజెక్టు నిండుతున్నా.. కాల్వల ద్వారా నీరందించేందుకు తూములను ఎత్తకపోవడంతో ఆయకట్టుకు ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరలేదు. మరోపక్క కాల్వల నిర్మాణమూ సరిగా లేదు. ప్రస్తుతం ఇలాంటి ప్రాజెక్ట్ నిర్మించాలంటే రూ. 20 కోట్లకు పైగా ఖర్చవుతుందని చెబుతున్న ఇరిగేషన్ శాఖ అధికారులు.. 25 ఏళ్ల క్రితమే తక్కువ ఖర్చుతో అద్భుతంగా నిర్మించిన రిజర్వాయర్‌ను మాత్రం వినియోగంలోకి తేవడం లేదు. అరకొరగా అభివృద్ధి పనులు సామూహిక చెరువుల యాజమాన్య పథకం కింద బోరబండ రిజర్వాయర్ అభివృద్ధికి 2008లో రూ.84 లక్షలు మంజూరయ్యాయి. వీటి విడుదల కోసం ప్రణాళికలు తయారు చేసి సాంకేతిక అనుమతి పొందాల్సి ఉండగా అధికారులు చొరవ చూపడం లేదు. ఎట్టకేలకు రెండేళ్ల క్రితం టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి పనులు చేపట్టారు. శిథిలమైన కాల్వల పటిష్టం, తూము ల మరమ్మతు, కట్ట పటిష్టం వంటి పనులు అరకొరగా సాగాయి. ఎతైన ప్రదేశంలో ఉన్న బోరబండ రిజర్వాయర్ నిండితే జగదేవ్‌పూర్ మండలంలోని పలు చెరువులకు ప్రవాహపు నీటిని పంపవచ్చు. అలాగే, జలాశయం నుంచి భారీ గా పూడికతీయాల్సి ఉంది. ‘మిషన్ కాకతీయ’లోనూ దీన్ని చేర్చకపోగా, ప్రాజెక్ట్‌కు రూ.15 లక్షలు పూడికతీత పనుల కింద కేటాయించాలని ప్రతిపాదించి చేతులు దులుపుకున్నారు. ‘ప్రాణహిత’తో అనుసంధానిస్తే మేలు ‘బోరబండ’ను ‘ప్రాణహిత’ ఎత్తిపోతల పథకంతో అనుసంధానించి, నింపగలిగితేనే రైతులకు మేలు జరుగుతుంది. భారీ వర్షాలు కురిస్తే తప్ప ఈ రిజర్వాయర్ నిండదు. కాబట్టి ‘ప్రాణహిత’తో అనుసంధానించడమే మార్గం. దీనిపై సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం ఇస్తామని ధర్మారం గ్రామానికి చెందిన రైతు మల్లేశం ‘సాక్షి’కి తెలిపారు. ‘బోరబండ’ప్రాధాన్యత గుర్తిస్తాం బోరబండ రిజర్వాయర్ అభివృద్ధికి సిద్ధంగా ఉన్నాం. ‘మిషన్ కాకతీయ’ మొదటి విడత పనుల్లో చేర్చలేకపోయాం. రిజర్వాయర్‌ను సందర్శించి అభివృద్ధికి ఏ చర్యలు తీసుకోవచ్చనే దానిపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తా. - శ్రీనివాసరావు, ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఈఈ -
వానొస్తే..బురదే!
- రోడ్లు ఎరుగని 17వ వార్డు - వర్షం కురిస్తే చాలు.. కాలనీ అంతా ఏరులై పారుతున్న మురుగు - కంపువాసన భరించలేకపోతున్న కాలనీవాసులు సంగారెడ్డి మున్సిపాలిటీ: అభివృద్ధి అంటే ఈ వార్డుకు తెలియదు. పాలకులు హామీలిచ్చారు. నిధులు సైతం మంజూరయినా.. అధికారుల నిర్లక్ష్యం పాలకుల పక్షపాతం కారణంగా పనులు ప్రారంభం కాలేకపోతున్నాయి. పట్టణంలోని17వ వార్డులో గల మగ్దూంనగర్, సంతోష్‌నగర్‌తో పాటు మరో రెండు కాలనీలు మురికి కాల్వలు లేక ఎక్కడికక్కడ దుర్గంధం వెదజల్లుతోంది. కనీసం ఈ వార్డులో ఇంత వరకు ఫార్మేషన్ రోడ్లు కూడా నిర్మించలేదు. దీంతో వర్షకాలం వస్తే చాలు.. కాలనీ వాసులు మోకాళ్లలోతు బురదలో నుంచే వెళ్లాల్సిన పరిస్థితి. ఈ వార్డులో వర్షం కురిస్తే చాలు ఆ కాలనీ నుంచి బయటకు వచ్చేందుకే వృద్ధులు భయపడుతున్నారు. ఇక్కడ ఎక్కువగా పోలీసుశాఖలో పని చేసే వారే ఉండటంతో అధికారులకు.. నాయకులకు అడిగే పరిస్థితి లేకపోవడంతో ఈ కాల నీని పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ కాలనీలో ఎటు చూసినా వరద నీటితో పాటు మురుగు చేరుతోంది. ఈ ప్రాంతంలో మురికి కాల్వలున్నా వాటిని శుభ్రం చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరి కొన్ని చోట్ల మురికి కాల్వలు లేకపోవడం తో సొంత డబ్బులతో పైప్‌లైన్ వేసుకొని నీటిని తరలిస్తున్నారు. ప్రధానంగా ఈ కాలనీ లో డ్రైనేజ్ వ్యవస్థ లేని కారణంగా ఎక్కడికక్కడ మురుగు నిల్వఉండటంతో దుర్గంధం వెదజల్లుతుంది. మరోవైపు కాలనీ ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా రోడ్ల నిర్మాణానికి మాత్రం నోచుకోలేదు. ప్రెసిడెంట్ ఫంక్షన్ హాల్, స్టూడెంట్ ఇస్లామిక్ కార్యాలయం, మెదడిస్ట్ చర్చ్ మార్గాలలో రోడ్లు లేక ఆ ప్రాంత వాసు లు బురదలోనుంచే నడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వివిధ అభివృద్ధి పనులు చేశాం.. రూ.34 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేశాం. మరో రూ.25 లక్షలు మంజూరై నిధులు సిద్ధంగా ఉన్నాయి. రూ.4 లక్షలతో సీసీ డ్రైన్, మరో రూ.4 లక్షలతో సీసీ రోడ్డు, రూ.2 లక్షలతో మొరం రోడ్డు వేశాం. రూ.3 లక్షలతో సీసీ రోడ్డు, సీసీ డ్రైన్ కోసం రూ.25 లక్షలు మంజూరయ్యాయి. పనులు ప్రారంభించక జాప్యం జరుగుతోంది. - సమీనా, కౌన్సిలర్ అభివృద్దికి పాటుపడతాం.. పట్టణంలోని అన్ని వార్డులను సమాంతరంగా అభివృద్ధి చేసి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల కంటే తాము ముదంజలో ఉన్నాం. వరద కాల్వ నిర్మాణం చేశాం. 17వ వార్డులో ఇప్పటికే రూ.34 లక్షల పనులు చేశాం. మరో రూ.35 నుంచి రూ.40 లక్షల విలువ చేసే పనులు మంజూరై టెండర్ దశలో ఉన్నాయి. పార్టీలకతీతంగా అభివృద్ధి చేస్తున్నామనడానికి వార్డు అభివృద్ధే నిదర్శనం. - బొంగుల విజయలక్ష్మి, మున్సిపల్‌చైర్ పర్సన్