రూ.46 కోట్ల పనుల్లో నాణ్యత కరువు | Quality of drought in work | Sakshi
Sakshi News home page

రూ.46 కోట్ల పనుల్లో నాణ్యత కరువు

Published Fri, Sep 4 2015 4:18 AM | Last Updated on Thu, Aug 30 2018 4:51 PM

రూ.46 కోట్ల పనుల్లో నాణ్యత కరువు - Sakshi

రూ.46 కోట్ల పనుల్లో నాణ్యత కరువు

అడ్డదిడ్డంగా రోడ్డు వెడల్పు పనులు.. పాత డ్రైనేజీలకు కొత్త పూత.. నాణ్యతకు తిలోదకాలిస్తూ డస్ట్‌తోనే రోడ్ల నిర్మాణం.. రోడ్ల మధ్యలోనే విద్యుత్ స్తంభాలు.. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం.. అధికారుల పర్యవేక్షణాలోపం.. ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో చేపడుతున్న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రోడ్ల వెడల్పు పనులు సాగుతున్న తీరిది.
- డస్ట్‌తోనే రోడ్ల నిర్మాణం
- పాత డ్రెయిన్లకే కొత్త పూతలు
- పగులుతున్న పైపులైన్లు...గొంతెండుతున్న ప్రజలు
- ఎక్సెస్ రేట్లతో ప్రభుత్వ ఖజానాకు గండి
- పట్టించుకోని అధికారులు
- కరీంనగర్‌లో అధ్వానంగా రోడ్డు వెడల్పు పనులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ :
నగరం నలువైపులా ఉన్న రోడ్లను వంద ఫీట్ల వెడల్పుతో సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం అభాసుపాలవుతోంది. సుమారు 14.5 కిలోమీటర్ల మేరకు రోడ్డు వెడల్పు పనులతోపాటు డ్రెయినేజీలు, సెంట్రల్ లైటింగ్, డివైడర్లు నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం రూ.46 కోట్లు విడుదల చేసింది. భారీ ఎత్తున నిధులు మంజూరు కావడంతో కాసులపంట పండిందుకున్న కాంట్రాక్టర్లు, అధికారుల అండదండలతో నిబంధనలను తోసిరాజని అడ్డదిడ్డంగా రోడ్లు వెడల్పు, డ్రైనేజీల నిర్మాణాన్ని కొనసగిస్తున్నారు.
 
డస్ట్‌తోనే రోడ్ల నిర్మాణం
ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో సుమారు రూ.37 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం నుంచి పద్మనగర్ వరకు, తెలంగాణ చౌక్‌నుంచి ఆర్టీసీ వర్క్‌షాప్ వరకు, కోర్టు చౌరస్తా నుంచి ఆపోలో ఆసుపత్రి వరకు, మంచి ర్యాల చౌరస్తా నుంచి పెద్దపల్లి బైపాస్ వరకు ఉన్న రోడ్లును వంద ఫీట్లు వెడల్పు చేసి పునరుద్దరించాల్సి ఉంది. మిగిలిన రూ.9కోట్ల మొత్తాన్ని సెంట్రల్ లైటింగ్‌కు కేటాయించారు. ప్రధానంగా బీటీ రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. 40 ఎంఎం, 20 ఎంఎం కంకర, 10 ఎంఎం చిప్స్‌తో వెట్‌మిక్స్ వేయాల్సిన కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా తవ్వి డస్ట్‌తో నింపేస్తున్నారు. అణగడానికి కనీసం రోలింగ్, క్యూరింగ్ కూడా చేయడం లేదు. ఫలితంగా రోడ్డు పనులన్నీ దుమ్ముకొట్టుకుపోతున్నాయి.  గట్టిగా నాలుగు వానలు పడితే ఎక్కడికక్కడ గుంతలేర్పడే విధంగా కన్పిస్తున్నాయి.
 
పాత డ్రైనేజీలకే కొత్త పూతలు
నిబంధనల ప్రకారం నూతన రోడ్డు నిర్మాణంతోపాటు రోడ్డుకు రెండు వైపులా డ్రైనేజీల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే కాంట్రాక్టర్లు పాత డ్రైనేజీలకే కొత్త పూత పూస్తున్నారు. పాత డ్రెయినేజీలపై అడుగు, అడుగున్నర ఎత్తుతో కొత్త బెడ్‌పోసి పూర్తిగా డ్రైనేజీ నిర్మించినట్లుగా లెక్కలేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. కొన్నిచోట్ల డ్రైనేజీలు అష్టవంకర్లు తిరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల రోడ్డుకు డ్రైనేజీకి సంబంధమే లేకుండా పోతోంది. అవసరం లేని చోట సైతం తవ్వి కొత్త డ్రైనేజీని సృష్టిస్తున్నారు. విద్యుత్ స్తంభాల తొలగింపులోనూ నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తోంది.

రోడ్డు వెడల్పు సందర్భంగా విద్యుత్ స్తంభాలను తొలగించాల్సి ఉన్నప్పటికీ... అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో రోడ్డు మధ్యలోనే విద్యుత్ స్తంభాలుండే పరిస్థితి కన్పిస్తోంది. పనులు ఇంత నిర్లక్ష్యంగా, నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వెట్‌మిక్స్ వేసేటప్పుడు, బీటీ వేసేటప్పుడు, డ్రెయినేజీల నిర్మాణం జరిగేటప్పుడు అధికారులు లేకుండానే పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. నిఘా లేకపోవడంతో కాంట్రాక్టర్ చేసిందే నాణ్యత అన్నట్లు తయారైంది.
 
నో లెస్.. పదేళ్లుగా ఎక్సైస్సే
రోడ్లు, భవనాల శాఖ చేపట్టే అభివృద్ధి పనుల్లో గత పదేళ్లలో ఏ ఒక్క టెండర్ కూడా లెస్‌కు వేయలేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పటి వరకు వేల కోట్ల రూపాయల పనులు చేపట్టినప్పటికీ అందులో ఏ ఒక్క పనీ లేస్‌కు వేయలేదని తెలిసింది. దాదాపు అన్ని పనులకు ఎక్సెస్ టెండర్లు పడుతుండడంతో ప్రభుత్వ ఖజానాకు కోట్లలో గండి పడుతోంది.

మరోవైపు హాట్‌మిక్స్ ప్లాంట్ (హెచ్‌ఎంపీ) ఉన్న కాంట్రాక్టర్లకే సివిల్ పనులు కట్టబెడుతుండటంతో అధికారులు అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సివిల్ పనులను సైతం బీటీ రోడ్డుతో కలిపి హెచ్‌ఎంపీ ఉన్న కాంట్రాక్టర్‌కే అర్హత కల్పిస్తుండడంతో సివిల్ కాంట్రాక్టర్లకు ఒక్క పని కూడా దక్కడం లేదు. పైగా సివిల్ పనులు దక్కించుకున్న కొందరు హెచ్‌ఎంపీ కాంట్రాక్టర్లు ఆయా పనులను మళ్లీ సివిల్ కాంట్రాక్టర్లకే అప్పగిస్తూ... వారి నుంచి కొంత మొత్తాన్ని గుడ్‌విల్ రూపంలో తీసుకుంటున్నారు. సివిల్ పనులను నిబంధనల మేరకు తమకే ఇవ్వాలని కోరుతూ గతంలో చాలాసార్లు సివిల్ కాంట్రాక్టర్లు ఆర్‌అండ్‌బీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించినప్పటికీ అధికారులెవరూ పట్టించుకున్న పాపానపోలేదు.
 
పగులుతున్న మంచినీటి పైపులైన్లు
ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు నిర్లక్ష్యంగా చేస్తుండడంతో నగరవాసులు మంచినీటి సరఫరా జరిగే పైపులైన్లు పగులుతున్నాయి. పనులు నడిచినన్ని రోజులు నీటి కోసం ప్రజలు అల్లాడే పరిస్థితి ఏర్పడుతోంది. పైపులైన్లు ఉన్న ప్రాంతాల్లో మనుషులతో తవ్వించాలనే నిబంధనను కూడా విస్మరించిన కాంట్రాక్టర్లు ప్రొక్టెయిన్‌తో తవ్వడంతో పైపులు పగిలిపోతున్నాయి. మున్సిపల్ అధికారులు ఎంత మొత్తుకున్నా ఆర్‌అండ్‌బీ అధికారులు చెవిక్కెడం లేదు. చివరకు కలెక్టర్ సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి అక్షింతలు వేసినా స్పందించిన దాఖలాలు లేవు.
 
కమీషన్లకే ప్రాధాన్యం!
ఆర్‌అండ్‌బీ అధికారులు అభివృద్ధి పనుల్లో కమీషన్లకే ప్రాధాన్యమిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. బీటీ రోడ్డు పనులను బీటీ కాంట్రాక్టర్లు, సివిల్ పనులను సివిల్ కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సి ఉండగా, రెండింటినీ కలిపి ఒకే టెండర్ కిందకు తెస్తూ హెచ్‌ఎంపీ కాంట్రాక్టర్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 18 మంది ఉన్న హెచ్‌ఎంపీ కాంట్రాక్టర్ల కోసం వందలాది మంది సివిల్ కాంట్రాక్టర్లను బలిచేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కొన్నిచోట్ల చేయని పనులకు కూడా బిల్లులు రాసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత రెండేళ్లలో ఒక్క పనిని కూడా సివిల్ కాంట్రాక్టర్లు దక్కించుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. అధికారులు పట్టించుకోకపోవడంతో కడుపు మండిన సివిల్ కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రికి, ఆర్‌అండ్‌బీ మంత్రికి, చీఫ్ ఇంజనీర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement