భోరుబండ
వట్టిపోయిన జలాశయం
- ఆందోళనలో రైతాంగం
- పాతికేళ్లుగా అధికారుల నిర్లక్ష్యం
- ‘మిషన్ కాకతీయ’లో చేర్చని వైనం
- ప్రవాహానికి నోచుకోని కాల్వలు
గజ్వేల్: బహుళ ప్రయోజన రిజర్వాయర్ ‘బోరబండ’ చుక్కనీరు లేక వెలవెలబోతోంది. చినుకు పడక.. రిజర్వాయర్ నిండక, సాగు సాగక చిన్నబోతోంది. నిర్మాణం పూర్తయి పాతికేళ్లవుతున్నా.. కాల్వలు ప్రవాహానికి నోచుకోవడం లేదు. జలాశయం నిండితే మరెన్నో చెరువులను నీటితో నింపొచ్చు. కానీ, ఆదిశగా అధికారుల చొరవ కరువైంది. నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నందు వల్ల నిధులెన్నైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. మంత్రి హరీష్‌రావు సహకారం ఉన్నా.. అధికారుల్లో స్పందన లేదు.
జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లి-ధర్మారం గ్రామాల మధ్య 1990లో రూ.56 లక్షలతో బోరబండ రిజర్వాయర్ నిర్మించారు. 115 ఎకరాల విస్తీర్ణం.. 36.80 మిలియన్ ఘనపుటడుగుల నీటినిల్వ సామర్థ్యం దీని సొంతం. క్షామంతో తల్లడిల్లుతున్న జగదేవ్‌పూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఆరుతడి పంటలకు కాల్వల ద్వారా సాగునీటిని అందించడం, గజ్వేల్ నియోజకవర్గంలో భూగర్భజలాల పెంపు దీని లక్ష్యం. 2.6 కి.మీ. పొడవున కుడి, 1.94 కి.మీ. పొడవున ఎడమ కాల్వ నిర్మించారు. ప్రాజెక్టు పరిధిలో 832 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో కుడి కాల్వ ద్వారా ధర్మారం, వర్దరాజ్‌పూర్, ఇటిక్యాల, కొత్తపేట, పీర్లపల్లిలోని 568 ఎకరాలకు, ఎడమ కాల్వ ద్వారా ధర్మారం, పీర్లపల్లిలోని మరికొంత భాగంలో వున్న 264 ఎకరాల ఆరుతడి పంటలకు సాగునీరందిం చాలని నిర్ణయించారు. అయితే, రిజర్వాయర్ ప్రారంభం నుంచీ కాల్వలు ప్రవాహానికి నోచుకోలేదు. ఆయకట్టు తడిచింది లేదు.
చుక్క పారని కాలువలు
నాలుగేళ్లుగా తక్కువ వర్షపాతం కారణంగా ఎగువ నుంచి వరద నీరు రాక జలాశయం ఎండుముఖం పట్టింది. కొద్దోగొప్పో వర్షాలతో ప్రాజెక్టు నిండుతున్నా.. కాల్వల ద్వారా నీరందించేందుకు తూములను ఎత్తకపోవడంతో ఆయకట్టుకు ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరలేదు. మరోపక్క కాల్వల నిర్మాణమూ సరిగా లేదు. ప్రస్తుతం ఇలాంటి ప్రాజెక్ట్ నిర్మించాలంటే రూ. 20 కోట్లకు పైగా ఖర్చవుతుందని చెబుతున్న ఇరిగేషన్ శాఖ అధికారులు.. 25 ఏళ్ల క్రితమే తక్కువ ఖర్చుతో అద్భుతంగా నిర్మించిన రిజర్వాయర్‌ను మాత్రం వినియోగంలోకి తేవడం లేదు.
అరకొరగా అభివృద్ధి పనులు
సామూహిక చెరువుల యాజమాన్య పథకం కింద బోరబండ రిజర్వాయర్ అభివృద్ధికి 2008లో రూ.84 లక్షలు మంజూరయ్యాయి. వీటి విడుదల కోసం ప్రణాళికలు తయారు చేసి సాంకేతిక అనుమతి పొందాల్సి ఉండగా అధికారులు చొరవ చూపడం లేదు. ఎట్టకేలకు రెండేళ్ల క్రితం టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి పనులు చేపట్టారు. శిథిలమైన కాల్వల పటిష్టం, తూము ల మరమ్మతు, కట్ట పటిష్టం వంటి పనులు అరకొరగా సాగాయి. ఎతైన ప్రదేశంలో ఉన్న బోరబండ రిజర్వాయర్ నిండితే జగదేవ్‌పూర్ మండలంలోని పలు చెరువులకు ప్రవాహపు నీటిని పంపవచ్చు. అలాగే, జలాశయం నుంచి భారీ గా పూడికతీయాల్సి ఉంది. ‘మిషన్ కాకతీయ’లోనూ దీన్ని చేర్చకపోగా, ప్రాజెక్ట్‌కు రూ.15 లక్షలు పూడికతీత పనుల కింద కేటాయించాలని ప్రతిపాదించి చేతులు దులుపుకున్నారు.
‘ప్రాణహిత’తో అనుసంధానిస్తే మేలు
‘బోరబండ’ను ‘ప్రాణహిత’ ఎత్తిపోతల పథకంతో అనుసంధానించి, నింపగలిగితేనే రైతులకు మేలు జరుగుతుంది. భారీ వర్షాలు కురిస్తే తప్ప ఈ రిజర్వాయర్ నిండదు. కాబట్టి ‘ప్రాణహిత’తో అనుసంధానించడమే మార్గం. దీనిపై సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం ఇస్తామని ధర్మారం గ్రామానికి చెందిన రైతు మల్లేశం ‘సాక్షి’కి తెలిపారు.
‘బోరబండ’ప్రాధాన్యత గుర్తిస్తాం
బోరబండ రిజర్వాయర్ అభివృద్ధికి సిద్ధంగా ఉన్నాం. ‘మిషన్ కాకతీయ’ మొదటి విడత పనుల్లో చేర్చలేకపోయాం. రిజర్వాయర్‌ను సందర్శించి అభివృద్ధికి ఏ చర్యలు తీసుకోవచ్చనే దానిపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తా.
- శ్రీనివాసరావు, ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఈఈ