దసరా నాడు సిద్దిపేటకు రానున్న సీఎం
కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న నూతన జిల్లా కార్యకలాపాలు
రాష్ర్టనీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట జోన్ : సీఎం కేసీఆర్ దసరా నాడు సిద్దిపేట జిల్లా ఏర్పాటును లాంఛనంగా ప్రారంభిస్తారని రాష్ర్ట నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం అమర్‌నాధ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఐదు వేల మట్టి వినాయక ప్రతిమలను స్థానిక వెంకటేశ్వర దేవాలయం వద్ద మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సిద్దిపేటలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం సంతోషకరమన్నారు.
ప్రతి యేట పర్యావరణ పరిరక్షణకు అమర్‌నాధ్ సేవా సమితి మట్టి విగ్రహాలను ఉచితంగా అందించడం అభినందనీయన్నారు. పండుగ నాడు రంగు రంగుల, భారీ విగ్రహాలను ఏర్పాటు చేయడం ముఖ్యంకాదని, భక్తి శ్రద్ధలతో పూజ చేయడం ప్రధానమన్నారు. వివిధ రకాల రసాయనాల వల్ల చెరువుల్లో కాలుష్యంతో పాటు జీవరాసులకు నష్టం కలిగే ప్రమాదం ఉందన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా హైదరాబాద్‌లోని ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో మంత్రులందరికి మట్టి వినాయక ప్రతిమలను ఇంటింటికి పంపిణీ చేశారని ఇదే స్ఫూర్తితో రాష్ర్ట ప్రజలు పర్యావరాణాన్ని పరిరక్షించాలన్నారు. పట్టణంలోని చెరువుల అభివృద్ధికోసం కోట్లాది నిధులు ఖర్చుపెడుతున్నామని, కోమటి చెరువు వద్ద రూ. 15కోట్లతో అధునీకరణ పనులు జరుగుతున్నాయన్నారు.
అదే విధంగా రూ. 6.5 కోట్లతో ఓపెన్ అడిటోరియం నిర్మించనున్నట్లు తెలిపారు. త్వరలో సిద్దిపేటలో ఇంటింటికి తాగునీటిని అందిస్తామన్నారు. నీటి వృధాపై ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. ప్రస్తుతం మున్సిపాల్టీ తాగునీటి సరఫరా కోసం రూ. 1.15 కోట్ల విద్యుత్ బిల్లును చెల్లిస్తోందన్నారు. ఇప్పటి వరకు రాష్ర్ట ప్రభుత్వం రూ. 12 కోట్ల విద్యుత్ బిల్లుల భారాన్ని మున్సిపాల్టీపై పడకుండా చూసిందన్నారు.
30 నుంచి 40 శాతం అవుతున్న నీటి వృధాను నియంత్రిస్తే సుమారు రూ. 4 కోట్ల విద్యుత్ బిల్లులు మున్సిపాల్టీకి ఆదా అయ్యే అవకాశం ఉందన్నారు. పట్టణంలోని నాలుగు చెరువుల అభివృద్ధి భాగంగా నర్సాపూర్ చెరువు శివారులో రూ. 14 కోట్లతో మురికి నీటి శుద్ధీకరణ ప్లాంట్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. సిద్దిపేటలో ప్రభుత్వ స్థలాలు సమస్యగా మారిందని నిధులు పుష్కలంగా ఉన్న స్థల సమస్య ఉత్పన్నమవుతుందన్నారు.
రూ. 5 కోట్లతో ఎస్‌ఎంహెచ్ వసతి గృహం, నాలుగు కోట్లతో ఐబీ గెస్ట్ హౌస్ నిర్మాణం, ఎస్పీ కలెక్టర్, జెడ్పి, ఎస్సీ కార్యాలయాలకు భవన నిర్మాణానికి నిధులున్నాయని , స్థల సేకరణ చేస్తున్నామన్నారు. అంతకు ముందు మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ అమర్‌నాథ్ సేవా సమితి స్పూర్తిదాయకమన్నారు. లంగర్ ఏర్పాటుకు కేంద్ర మంత్రితో మాట్లాడి చర్యలు చేపడతానన్నారు. అనంతరం మంత్రి పలువురికి మట్టి వినాయకులను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణాచారి , మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ అక్తర్, కౌన్సిలర్లు బర్ల మల్లికార్జున్, చిప్ప ప్రభాకర్, బ్రహ్మం, చిన్నా, లలితరామన్న, సేవ సమితి ప్రతినిధులు ఇల్లందుల అంజయ్య, చీకోటి మదుసూదన్ తదితరులు పాల్గొన్నారు.