సిద్దిపేట బహిరంగ సభలో ప్రసంగిస్తున్న కేసీఆర్
సాక్షి, సిద్దిపేట : అధికారంలోకి రాగానే ఐకేపీ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణను పంటల కాలనీలుగా విభజించి, వాటిని కొనుగోలు చేసే బాధ్యతను ఐకేపీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా మహిళా సంఘాలకు అప్పగిస్తామన్నారు. ఇంకా ఈ సభలో గులాభి అధినేత ఏమన్నారంటే..
‘ఇదే గడ్డపై మీ చేతుల్లో పెరిగి మీరందించినటువంటి బలంతోనే తెలంగాణ కోసం ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లో తెలంగాణ అనేక కష్టాలు ఎదుర్కొంటుందని, కరెంట్, నీళ్లుండవని భయపెట్టారు. మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో కలపాలని ఎద్దేవా చేశారు. కానీ వాటన్నిటిని కూడా పటాపంచల్ చేస్తూ దేశంలోనే నెం1 రాష్ట్రంగా ముందుకెళ్తున్నాం. ఇదంతా మీకు తెలిసిందే. ఈ సభలో లక్షల్లో మంది కనబడుతున్నారంటే ఈ ఇద్దరు (హరీష్ రావు, రామలింగారెడ్డి) లక్ష మెజారిటీతో గెలుస్తారు. ఇక్కడ పుట్టినందుకు నేను.. గెలిచినందుకు హరీష్.. దుబ్బాకలో రామలింగా రెడ్డి చెప్పిన మాటలన్నీ నిజం చేశాం. ఇక్కడికి వస్తుంటే మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ కట్టలు, రంగ నాయక ప్రాజెక్ట్ కట్టలు చూస్తుంటే చాలా సంతోషం వేసింది. ఇంకా రైలు రావాలి.. రెండేళ్లలో అదికూడా వస్తది. సిద్దిపేటను జిల్లాను చేసుకున్నాం. మెడికల్ కాలేజీ తెచ్చుకున్నాం. హుషారైన యువ ఎమ్మెల్యేలున్నారు కాబట్టి జోడు గుర్రాల్లా పనులు పరుగెత్తుతున్నాయి. రామలింగా రెడ్డి కూడా అద్భుతంగా ముందుకు పోతున్నారు. ఈ ఇద్దరిని దీవించాలి.
రైతుల అప్పులు తీరాలి..
రాష్ట్రంలో సాగునీటి సమస్య లేకుండా చేశాం. 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకున్నాం. నేను రైతు బిడ్డను, వారి సమస్యలు నాకు తెలుసు. మిషన్ భగీరథతో మంచినీటి సమస్య తీరింది. తెలంగాణ రైతులకు ఉన్న అప్పులన్నీ పోయి ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.5 నుంచి 10 లక్షలు జమకావాలి. ఇప్పటికే రైతు బంధు పథకంతో పెట్టుబడి సహాయం ఇచ్చుకున్నాం. మళ్లీ అధికారంలోకి వస్తే ఆ సాయన్ని రూ.10 వేలకు పెంచుతాం. ప్రాజెక్ట్‌లన్నీ పూర్తి చేసి సాగు నీళ్లు తీసుకొస్తాం.. అప్పటిలాగా ఎలా పడితే అలా పంటలు వేయడానికి వీళ్లేదు. తెలంగాణను పంటల కాలనీలుగా విభిజించాలి. రైతు సమన్వయసమితుల సూచనల మేరకు పంటలు వేయాలి. దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. ఏ ప్రాంతాల్లో ఎక్కువ ఏ పంటలు పండుతాయో అగ్రికల్చర్ యూనివర్సీటీ వాళ్లు లెక్కలేస్తున్నారు. ఆ లెక్కల ప్రకారం పంటలేయాలి. మార్కెట్లో డిమాండ్ రావాలంటే.. గ్రామాల్లో ఉండే ఐకేపీ బృందాలు.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అమ్మాలి. ఈ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగిస్తాం. సిద్దిపేట, దుబ్బాకతో పాటు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తాం.
లిజ్జత్ పాపడ్ ఆదర్శం...
ఈ మహోన్నత ఘట్టంలో కీలకంగా ఉన్న ఐకేపీ ఉద్యోగులను అధికారంలోకి రాగానే పర్మినెంట్ చేస్తాం. ముంబైలోని ధారావి అనే మురికి వాడ నుంచి పుట్టుకొచ్చిన లిజ్జత్ పాపడ్ కంపెనే మనకు ఆదర్శం. అక్కడ ఓ మహిళా.. పేద ఆడవాళ్లందరిని జమ చేసి ఈ పాపడ్ తయారు చేయడం మొదలు పెట్టింది. ఈ లిజ్జత్ పాపడ్ ఇప్పుడు చాలా పాపులర్. ఏడాదికి రూ. 1176 కోట్ల టర్నోవర్ ఉంది. ఈ రోజు మనం తినే ప్రతిదాంట్లో కల్తీ జరుగుతోంది. ఈ కల్తీ మహమ్మారిని తరిమేయాలంటే లిజ్జత్ పాపడ్‌లా మన రైతులు పండించే పంటలను మన మహిళా సంఘాలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా నాణ్యమైన సరకులు తయారు చేయిస్తాం. రేషన్ డీలర్లు కూడా కడుపు నిండటం లేదంటున్నారు. భవిష్యత్తులో అలాంటి సమస్యలుండవు. ఐకేపీ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా తయారయ్యే వస్తువులను రేషన్ డీలర్లు అమ్ముకునేలా చేస్తాం. మన వాతావరణంలో తయారయ్యే పంటలు తింటే అరోగ్యంగా ఉంటాం. ఇది నేను చెబుతోంది కాదు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెప్పింది. రైతులకు గిట్టుబాటు ధరలు రావాలంటే ఐకేపీ ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారానే సాధ్యం. అంతర్జాతీయ మార్కెట్లో అమ్మె విధంగా నాణ్యతతో తయారు చేయిస్తాం.
మా ప్రభుత్వంలో అవినీతి లేదు..
రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కో పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కల్యాణ లక్ష్మీ అనే పథకం భారత్‌లో ఎక్కడా ఉండదు. అత్యధిక వేతనాలు పొందే.. హోంగార్డులు, అంగన్‌వాడీలు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కేవలం తెలంగాణలోనే ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులుకు రిస్క్ అలవెన్స్ ఇచ్చే రాష్ట్రం కూడా తెలంగాణనే. ఎవరితో ఏరువడ్డామో వారే ఆశ్చర్యపోతున్నారు. నోరు కట్టుకోని కడుపు కట్టుకోని పనిచేస్తున్నాం. మా ప్రభుత్వంలో అవినీతి లేదు. కుంభకోణాలు, భూకబ్జాలు, పేకాట క్లబ్బులు, సారాబట్టీలు లేవు. శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయి. సంపద పెరుగుతోంది. రైతు సమన్వయ సమితి మిత్రులకు గౌరవ వేతనం కల్పిస్తాం. హరీష్ రావు, రామలింగారెడ్డిలు పక్కాగెలుస్తారు కానీ వారికి లక్షల్లో మెజార్టీ అందించాలి.’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక ఈ సభలో సీఎం కాంగ్రెస్‌పై ఒక్క విమర్శ చేయకపోవడం గమనార్హం. ఈ సందర్భంగా మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment