సాక్షి, నిర్మల్ : హామీలు, మానిఫెస్టోలు, ఇతర పార్టీలపై బురద జల్లడాలు, తమ పార్టీ గొప్పలు చెప్పుకోవడాలు ఎన్నికల ప్రచారం అనగానే సాధారణంగా మనకు గుర్తొచ్చే అంశాలు ఇవే. అయితే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిర్మల్ ప్రజా ఆశీర్వాద సభలో మాత్రం ప్రచారానికి కాసేపు విరామం ఇచ్చి ఓ ఆసక్తికరమైన కథ చెప్పారు. తన సమయం కాస్త వృథా అయినా సరే పర్లేదు అంటూ ముస్లిం సోదరులు కట్టే దట్టికి ఉన్న ప్రత్యేకతను వివరించిన తీరు ప్రజల్ని ఆకర్షించింది.
‘అది దట్టి కాదు పట్టీ... దానిని ఇమామే జామీన్ అంటారు. కేసీఆర్ కట్టుడు మొదలుపెట్టినంక ప్రతోడు కట్టుడే. అసలు ఇమామే జామీన్ అంటే చాలా మందికి తెల్వనే తెల్వదు. ఏదో దట్టి అట అనుకుంట కట్టుకుంటరు’ అంటూ కేసీఆర్ ఉపన్యాసం ప్రారంభించగానే ప్రజలు ఆసక్తిగా వినడం మొదలు పెట్టారు. (టీఆర్‌ఎస్ ఓడిపోతే నాకేమి నష్టం లేదు: కేసీఆర్)
వాపసీ గ్యారెంటీ అన్నట్లు!
‘మక్కాలో మహ్మద్ ప్రవక్త మనుమడు ఉండేవాడు. ఆయన ఓరోజు దారి గుండా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో ఓ కసాయి తనకు దొరికిన జింకను చంపేందుకు సిద్ధమవుతున్నాడు. ఇది చూసిన ప్రవక్త మనుమడు.. ఆ కసాయితో.. ‘చూశావా.. ఆ జింక ఎలా ఏడుస్తుందో. అసలు అది అలా ఎందుకు ఏడుస్తుందో నీకు తెలుసా అని ప్రశ్నించాడు. దానికి ఆ కసాయి.. ‘ఏమో నాకు తెలీదు’ అని సమాధానమిచ్చాడు. కసాయి మాటలు విన్న ఆయన.. చచ్చిపోయే ముందు తన బిడ్డకు పాలు ఇవ్వాలని ఆ జింక ఆరాటపడుతోంది. నువ్వు దానిని కాసేపు వదిలిపెడితే పాలిచ్చేసి తిరిగి వస్తుంది అని చెప్పాడు. అమ్మో చాలా హుషారుగా ఉన్నావే.. ఆ జింక మళ్లా తిరిగి వస్తదా. అది కుదరని పని అన్నాడు. అప్పుడా ఆ మహానుభావుడు.. నేను చెప్పినట్టు జరగకపోతే ఆ జింకకు బదులు నన్ను చంపు అని చెప్పాడు. ఆయన మాటలు నమ్మిన ఆ కసాయి.. జింకను విడిచిపెట్టేందుకు ఒప్పుకొన్నాడు. దీంతో సంతోషించిన ప్రవక్త మనుమడు తన జేబులో ఉన్న రుమాలు తీసి.. ప్రార్థన చేశాడు. తర్వాత ఆ రుమాలును జింక కాలికి కట్టాడు. ఆయన చెప్పినట్లుగానే ఆ జింక కాసేపటి తర్వాత తిరిగి రావడంతో ఆ కసాయి ఆశ్చర్యపోయాడు. తిరిగి వచ్చిన ఆ జింకను విడిచిపెట్టాడు.
ఇదీ ఇమామే జామీన్ వెనుక ఉన్న కథ. ఇమామే జామీన్ అంటే వాపసీ గ్యారెంటీ అన్నట్లు. క్షేమంగా వెళ్లి లాభంగా రా అని దీవిస్తూ ముస్లిం సోదరులు ఆప్యాయంగా కడతారు. నేనెక్కడికి వెళ్లినా సరే ముస్లిం సోదరులు నన్ను విడిచిపెట్టరు. ఇమామే జామీనే కట్టి దీవిస్తరు. ఉద్యమకాలంలో ఓరోజు ఉట్నూరు పోయిన. అప్పుడు చేతికి ఇమామే జామీనే లేదు. వెంటనే ఓ ముస్లిం సోదరుడు పరిగెత్తుకు వచ్చి కేసీఆర్ సాబ్ ఏంది. మీతో హైదరాబాద్ నుంచి ముస్లింలు ఎవరూ రాలేదా అంటూ తన జేబులో ఉన్న రుమాలు తీసి నా చేతికి కట్టిండు’ అని ‘దట్టి’కి ఉన్న పవిత్రతను కేసీఆర్ వివరించారు.
చంద్రబాబు.. ఊద్ ముబారక్ అన్నడు..!
ఇమామే జామీన్ పవిత్రతను చెప్పడంతో పాటు... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో రంజాన్ శుభాకాంక్షలు చెప్పిన తీరును కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ‘ఆనాడు నిజమాబాద్‌ల ఉన్నం. అప్పుడు చంద్రబాబు సీఎం. నేను మంత్రిని. అది పవిత్ర రంజాన్ మాసం కావడంతో ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ చెప్పమన్న. ఆయన మాత్రం ఊద్ ముబారక్ అన్నడు’ అని కేసీఆర్ చెప్పగానే సభలో నవ్వులు పూశాయి.
Comments
Please login to add a commentAdd a comment