బాబు మాదిరి విహారానికి వెళ్లలేదు..
- కేసీఆర్ దేశం కోసం చైనా వెళ్లారు
- ఏపీ సీఎం బాబుకు మంత్రి హరీశ్‌రావు చురకలు
రామాయంపేట : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరిగా కుటుంబ సభ్యులతో కాకుండా, దేశ ప్రతిష్ట ఇనుమడింప చేయడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆయన శనివారంరాత్రి రామాయంపేట వచ్చిన సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఏ హోదాతో బాబు కుమారుడు లోకేశ్ పరిశ్రమల శాఖ కార్యదర్శితో కలిసి అమెరికా వెళ్లారని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ పారిశ్రామిక విధానానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వస్తుండటంతో ఓర్వలేక కొందరు తెలంగాణ టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బాబు ప్రత్యేక విమానంలోరూ.20 కోట్ల ప్రజాధనంతో కనీసం 65 సార్లు విదేశీ పర్యటనకు వెళ్లారని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఎప్పటికైనా విడవాల్సిన హైదరాబాద్‌లో సచివాలయం మరమ్మతులకు బాబు రూ.45 కోట్లు ఖర్చు పెట్టాడని ఎద్దేవా చేశారు. బాబు అధికార దాహంతో హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, ఢిల్లీలో రూ. కోట్ల ఖర్చుతో అధికారిక కాన్వాయ్‌లను ఏర్పాటు చేసుకున్నారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌కు చైనాలో జరుగుతున్న ఎకనమిక్ ఫోరం సదస్సుకు రావాలని ఆహ్వానం అందడం గర్వకారణమన్నారు.